underworld don Dawood Ibrahim
-
ఆస్పత్రిలో దావూద్!
మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్, 1993 ముంబై పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దాంతో అతన్ని రెండు రోజుల క్రితం పాకిస్తాన్‌లోని కరాచీలో హుటాహుటిన ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఒక ఫ్లోర్ మొత్తాన్నీ ఖాళీ చేయించి అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ చికిత్స అందిస్తున్నట్టు చెబుతున్నారు. ఆస్పత్రి వర్గాలు, కుటుంబీకులకు తప్ప మరెవరికీ ప్రవేశం లేకుండా పోలీసులు భారీ సంఖ్యలో పహారా కాస్తున్నారట. విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పలు మీడియా సంస్థలు ఈ మేరకు వార్తా కథనాలు ప్రసారం చేశాయి. అంతేగాక 67 ఏళ్ల దావూద్‌కు విషప్రయోగం జరిగిందని, అందుకే ఉన్నపళాన ఆస్పత్రికి తరలించారని సోమవారమంతా జోరుగా పుకార్లు షికారు చేశాయి. చికిత్స పొందుతూ ఆదివారమే అతను మరణించినట్టు కూడా వార్తలొచ్చాయి! అయితే దావూద్‌పై విషప్రయోగం, అతని మృతి వార్తలు పూర్తిగా అవాస్తవమని నిఘా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రి పాలవడం మాత్రం నిజమేనని నిర్ధారణ అయినట్టు తెలుస్తోంది. దావూద్ చాలా ఏళ్లుగా కుటుంబంతో పాటుగా పాకిస్తాన్‌లోనే నివసిస్తున్నట్టు ఇప్పటికే తేలింది. అతను కరాచీలోనే ఉంటున్నట్టు పక్కా ఆధారాలున్నాయని భారత్ వెల్లడించింది కూడా. భారత్‌తో పాటు ఐరాస భద్రతా మండలి కూడా 2003లోనే దావూద్‌ను మోస్ట్ వాంటెడ్ అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడం తెలిసిందే. అతని తలపై ఏకంగా 2.5 కోట్ల డాలర్ల రివార్డు ఉంది! రోజంతా కలకలం దావూద్‌పై విషప్రయోగం, మృతి వార్తలు సోమవారం ఉదయం నుంచే కలకలం రేపాయి. ఆదివారం అర్ధరాత్రి దాటాక ఓ యూట్యూబర్ వీటిని తొలుత బయట పెట్టాడు. పలు సోషల్ మీడియా వార్తలను ఉటంకిస్తూ ఈ మేరకు కథనం ప్రసారం చేసి దుమారం రేపాడు. ఆది, సోమవారాల్లో పాకిస్థాన్ అంతటా గంటల తరబడి ఇంటర్నెట్ మూగబోవడానికి, దావూద్ మృతికి లింకుందని చెప్పుకొచ్చాడు. ‘‘దేశంలో ఏదో పెద్ద ఉదంతమే జరిగింది. దాన్ని దాచేందుకే నెట్‌పై ఆంక్షలు విధించారు’’ అంటూ ప్రముఖ పాక్ జర్నలిస్టులు ఎక్స్ పోస్టుల్లో అనుమానాలు వెలిబుచ్చడంతో మరింత అలజడి రేగింది. దావూద్ విషమ పరిస్థితుల్లో కరాచీ ఆస్పత్రిలో చేరినట్టు పాక్ జర్నలిస్టు అర్జూ కాజ్మీ ఎక్స్ పోస్టులో నిర్ధారించారు. తొలిసారేమీ కాదు... దావూద్‌పై విషప్రయోగం జరిగిందని, అతను మరణించాడని వార్తలు రావడం ఇది తొలిసారేమీ కాదు. ఏటా కనీసం ఒకట్రెండుసార్లు ఇలాంటి వార్తలు రావడం, అవన్నీ పుకార్లేనని తేలడం పరిపాటిగా మారింది. కరాచీలోనే దావూద్: అల్లుడు పాక్ ఖండిస్తున్నా, దావూద్ కరాచీలో ఉండటం వాస్తవమేనని అతని అల్లుడు అలీ షా పార్కర్ గత జనవరిలో ధ్రువీకరించాడు. కరాచీలోని అబ్దుల్లా గాజీ బాబా దర్గా వెనక రహీం ఫకీ సమీపంలోని డిఫెన్స్ ఏరియాలో దుర్భేద్యమైన ఇంట్లో కొన్నేళ్లుగా దావూద్ నివాసముంటున్నట్టు తెలిపాడు. దావూద్ చెల్లెలు హసీనా పార్కర్ కొడుకైన అలీ షా జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకు ఇచి్చన స్టేట్మెంట్లో ఇంకా పలు విషయాలు వెల్లడించాడు. ‘‘దావూద్ ఓ పాక్ పఠాన్ స్త్రీని రెండో పెళ్లి చేసుకున్నాడు. దావూద్‌కు ముగ్గురు సోదరులు, నలుగురు అక్కచెల్లెళ్లు, ఒక కొడుకు, ముగ్గురు కూతుళ్లున్నారు. ఒక కూతురును పాక్ మాజీ క్రికెటర్ జావెద్ మియాందాద్ కుమారునికిచ్చి పెళ్లి చేశాడు’’ అని అలీ షా తెలిపాడు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
దావూద్‌కు బ్రిటన్‌లో ఆస్తులు
లండన్: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు బ్రిటన్‌లో ఆస్తులున్నట్లు తెలిసింది. భారత్‌లో 1993 బాంబు పేలుళ్లు తదితర నేరాల్లో నిందితుడిగా ఉన్న దావూద్.. యూకేతో పాటు ఇండియా, యూఏఈ, స్పెయిన్, మొరాకో, టర్కీ, సైప్రస్, ఆస్ట్రేలియాల్లో అక్రమంగా ఆస్తులు సంపాదించినట్లు ‘ది టైమ్స్’శనివారం కథనం ప్రచురించింది. యూకే కంపెనీస్ హౌస్, ల్యాండ్ రిజిస్ట్రీకి భారత్ సమర్పించిన సమాచారం, పనామా పత్రాల వివరాలను సరిపోల్చిన తరువాతే ఈ నిర్ధారణకు వచ్చింది. దావూద్ కోసం ఆయన అనుచరుడు ముహమ్మద్ ఇక్బాల్ ‘మిర్చి’మెమెన్ బ్రిటన్‌లో హోటళ్లు, వాణిజ్య సముదాయాలు, భవంతులు నిర్మించినట్లు పేర్కొంది. మెమెన్ లండన్‌లో తలదాచుకుని నిర్మాణ రంగంలో 11 కంపెనీల్లో డైరెక్టర్‌గా వ్యవహరించాడు. 2013లో గుండెపోటుతో మృతిచెందాడు. ఆర్థిక నేరాలకు పాల్పడి దావూద్ బ్రిటన్ను ఒక స్వర్గధామంగా మార్చుకున్నారని, ఆయనకు ఎసెక్స్, కెంట్ కౌంటీల్లో ఆస్తులున్నాయని మిషా గ్లెనీ అనే రచయిత్రి పేర్కొన్నారు. -
42 వేల కోట్ల దావూద్ ఆస్తుల జప్తు
► 1993 ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారికి బ్రిటన్ షాక్ ► లండన్‌తో పాటు పలు చోట్ల ఇళ్లు, హోటల్స్ ► 2015లోనే దావూద్ ఆస్తుల వివరాల్నిబ్రిటన్కు అందచేసిన భారత్ న్యూఢిల్లీ: అండర్ వరల్డ్ డాన్, 1993 ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి దావూద్ ఇబ్రహీంకు బ్రిటన్ ప్రభుత్వం గట్టి షాకిచ్చింది. దాదాపు 6.7 బిలియన్ డాలర్ల(రూ.42 వేల కోట్లు) విలువైన దావూద్ ఆస్తుల్ని బ్రిటన్ సీజ్ చేసిందని ఆ దేశానికి చెందిన మిర్రర్ పత్రికను ఉటంకిస్తూ భారత్ మీడియా పేర్కొంది. బ్రిటన్ కోశాధికార విభాగం గత నెల విడుదల చేసిన ‘ఆర్థిక ఆంక్షలు ఎదుర్కొంటున్న కంపెనీల, వ్యక్తుల జాబితా’లో దావూద్ పేరు ఉందని ఆ పత్రిక తెలిపింది. జాబితాలో మాఫియా డాన్‌కు సంబంధించిన 21 మారుపేర్లతో పాటు, పాకిస్తాన్ పేరిట మూడు చిరునామాలు కూడా ఉన్నట్లు సమాచారం. యూకేకు చెందిన బర్మింగ్‌హామ్ మెయిల్ కథనం ప్రకారం దావూద్‌కు వార్విక్షైర్లో ఒక హోటల్, బ్రిటన్ మిడ్‌లాండ్ ప్రాంతంలో నివాస సముదాయాలున్నాయి. 2015లో ప్రధాని మోదీ బ్రిటన్ పర్యటన సందర్భంగా దావూద్ ఆస్తుల వివరాల జాబితాను అప్ప టి బ్రిటన్ ప్రధాని డేవిడ్ కెమెరాన్‌కు అందచేశారు. అతన్ని ఆస్తుల్ని ఫ్రీజ్ చేయాలని భారత్ విజ్ఞప్తి చేసింది. ఆ జాబితాలో లండన్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో దావూద్, అతని సన్నిహితుల పేరిట ఇళ్లు, ఫ్లాట్స్, హోటల్స్ వివరాలు ఉన్నాయి. అదే సంవత్సరం బ్రిటన్ మిడ్‌ల్యాండ్స్‌లో (మధ్యప్రాంతంలో) ఈడీ అధికారులు పర్యటించి డార్ట్‌ఫోర్డ్, కెంట్, ఎసెక్స్‌తో పాటు సెంట్రల్ లండన్‌లో దావూద్ పేరిట హోటళ్లు ఉన్నట్లు గుర్తించారు. ఎస్కోబార్ తర్వాత దావూద్! కొలంబియా డ్రగ్ మాఫియా డాన్ పాబ్లో ఎస్కోబార్ అనంతరం ప్రపంచంలో అత్యంత ధనవంతుడు దావూదే. ఫోర్బ్స్ లెక్కల ప్రకారం.. 2015లో అతని ఆస్తుల నికర విలువ 6.7 బిలియన్ డాలర్లపైనే.. యూరప్, ఆఫ్రికా, దక్షిణాసియాలోని దాదాపు 12 దేశాల్లో అతని వ్యాపార సామ్రాజ్యం విస్తరించింది. వివిధ దేశాల్లో 50కి పైగా ఆస్తులపై ఈ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ పెట్టుబడులు పెట్టాడు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నేతృత్వంలోని ‘ఐఎస్, అల్కాయిదాపై ఆంక్షల కమిటీ’ దావూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా పేర్కొంది. యూఎన్ ఉగ్రవాదుల జాబితా లో అతని 15 మారుపేర్లను ప్రస్తావించారు. 1993 ముంబై వరుస పేలుళ్ల అనంతరం దావూద్ దేశం విడిచి పారిపోయాడు. పాకిస్తాన్ కరాచీలోని క్లిఫ్టన్ ప్రాంతంలో తన నేర సామ్రాజ్యాన్ని ఏర్పా టు చేసుకున్నాడు. దావూద్ ఆచూకీ వివరాల్ని భారత్ పలుమార్లు పాక్‌కు అందచేసినా ఆ దేశం మాత్రం వాటిని తోసిపుచ్చింది.