42 వేల కోట్ల దావూద్ ఆస్తుల జప్తు
► 1993 ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారికి బ్రిటన్ షాక్
► లండన్‌తో పాటు పలు చోట్ల ఇళ్లు, హోటల్స్
► 2015లోనే దావూద్ ఆస్తుల వివరాల్నిబ్రిటన్‌కు అందచేసిన భారత్
న్యూఢిల్లీ: అండర్ వరల్డ్ డాన్, 1993 ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి దావూద్ ఇబ్రహీంకు బ్రిటన్ ప్రభుత్వం గట్టి షాకిచ్చింది. దాదాపు 6.7 బిలియన్ డాలర్ల(రూ.42 వేల కోట్లు) విలువైన దావూద్ ఆస్తుల్ని బ్రిటన్ సీజ్ చేసిందని ఆ దేశానికి చెందిన మిర్రర్ పత్రికను ఉటంకిస్తూ భారత్ మీడియా పేర్కొంది. బ్రిటన్ కోశాధికార విభాగం గత నెల విడుదల చేసిన ‘ఆర్థిక ఆంక్షలు ఎదుర్కొంటున్న కంపెనీల, వ్యక్తుల జాబితా’లో దావూద్ పేరు ఉందని ఆ పత్రిక తెలిపింది. జాబితాలో మాఫియా డాన్‌కు సంబంధించిన 21 మారుపేర్లతో పాటు, పాకిస్తాన్ పేరిట మూడు చిరునామాలు కూడా ఉన్నట్లు సమాచారం.
యూకేకు చెందిన బర్మింగ్‌హామ్ మెయిల్ కథనం ప్రకారం దావూద్‌కు వార్విక్‌షైర్‌లో ఒక హోటల్, బ్రిటన్ మిడ్‌లాండ్ ప్రాంతంలో నివాస సముదాయాలున్నాయి. 2015లో ప్రధాని మోదీ బ్రిటన్ పర్యటన సందర్భంగా దావూద్ ఆస్తుల వివరాల జాబితాను అప్ప టి బ్రిటన్ ప్రధాని డేవిడ్ కెమెరాన్‌కు అందచేశారు. అతన్ని ఆస్తుల్ని ఫ్రీజ్ చేయాలని భారత్ విజ్ఞప్తి చేసింది. ఆ జాబితాలో లండన్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో దావూద్, అతని సన్నిహితుల పేరిట ఇళ్లు, ఫ్లాట్స్, హోటల్స్ వివరాలు ఉన్నాయి. అదే సంవత్సరం బ్రిటన్ మిడ్‌ల్యాండ్స్‌లో (మధ్యప్రాంతంలో) ఈడీ అధికారులు పర్యటించి డార్ట్‌ఫోర్డ్, కెంట్, ఎసెక్స్‌తో పాటు సెంట్రల్ లండన్‌లో దావూద్ పేరిట హోటళ్లు ఉన్నట్లు గుర్తించారు.
ఎస్కోబార్ తర్వాత దావూద్!
కొలంబియా డ్రగ్ మాఫియా డాన్ పాబ్లో ఎస్కోబార్ అనంతరం ప్రపంచంలో అత్యంత ధనవంతుడు దావూదే. ఫోర్బ్స్ లెక్కల ప్రకారం.. 2015లో అతని ఆస్తుల నికర విలువ 6.7 బిలియన్ డాలర్లపైనే.. యూరప్, ఆఫ్రికా, దక్షిణాసియాలోని దాదాపు 12 దేశాల్లో అతని వ్యాపార సామ్రాజ్యం విస్తరించింది. వివిధ దేశాల్లో 50కి పైగా ఆస్తులపై ఈ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ పెట్టుబడులు పెట్టాడు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నేతృత్వంలోని ‘ఐఎస్, అల్‌కాయిదాపై ఆంక్షల కమిటీ’ దావూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా పేర్కొంది. యూఎన్ ఉగ్రవాదుల జాబితా లో అతని 15 మారుపేర్లను ప్రస్తావించారు. 1993 ముంబై వరుస పేలుళ్ల అనంతరం దావూద్ దేశం విడిచి పారిపోయాడు. పాకిస్తాన్ కరాచీలోని క్లిఫ్టన్ ప్రాంతంలో తన నేర సామ్రాజ్యాన్ని ఏర్పా టు చేసుకున్నాడు. దావూద్ ఆచూకీ వివరాల్ని భారత్ పలుమార్లు పాక్‌కు అందచేసినా ఆ దేశం మాత్రం వాటిని తోసిపుచ్చింది.