
లండన్: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు బ్రిటన్‌లో ఆస్తులున్నట్లు తెలిసింది. భారత్‌లో 1993 బాంబు పేలుళ్లు తదితర నేరాల్లో నిందితుడిగా ఉన్న దావూద్.. యూకేతో పాటు ఇండియా, యూఏఈ, స్పెయిన్, మొరాకో, టర్కీ, సైప్రస్, ఆస్ట్రేలియాల్లో అక్రమంగా ఆస్తులు సంపాదించినట్లు ‘ది టైమ్స్’శనివారం కథనం ప్రచురించింది. యూకే కంపెనీస్ హౌస్, ల్యాండ్ రిజిస్ట్రీకి భారత్ సమర్పించిన సమాచారం, పనామా పత్రాల వివరాలను సరిపోల్చిన తరువాతే ఈ నిర్ధారణకు వచ్చింది.
దావూద్ కోసం ఆయన అనుచరుడు ముహమ్మద్ ఇక్బాల్ ‘మిర్చి’మెమెన్ బ్రిటన్‌లో హోటళ్లు, వాణిజ్య సముదాయాలు, భవంతులు నిర్మించినట్లు పేర్కొంది. మెమెన్ లండన్‌లో తలదాచుకుని నిర్మాణ రంగంలో 11 కంపెనీల్లో డైరెక్టర్‌గా వ్యవహరించాడు. 2013లో గుండెపోటుతో మృతిచెందాడు. ఆర్థిక నేరాలకు పాల్పడి దావూద్ బ్రిటన్‌ను ఒక స్వర్గధామంగా మార్చుకున్నారని, ఆయనకు ఎసెక్స్, కెంట్ కౌంటీల్లో ఆస్తులున్నాయని మిషా గ్లెనీ అనే రచయిత్రి పేర్కొన్నారు.