vivek phansalkar
-
ముంబైను పేల్చేస్తాం.. పోలీసులకు హెచ్చరిక
ముంబై: భారత వాణిజ్య రాజధాని ముంబైని పేల్చేస్తామంటూ అందిన హెచ్చరికలతో యంత్రాంగం అప్రమత్తమైంది. మరోసారి 26/11 తరహా దాడులకు పాల్పడతామన్న హెచ్చరిక మెసేజీలపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ మెసేజీలు పాకిస్తాన్ కోడ్‌తో ఉన్న ఫోన్ నంబర్ నుంచే వచ్చినట్లు తేలిందని ముంబై పోలీస్ కమిషనర్ వివేక్ ఫన్సాల్కర్ శనివారం మీడియాకు తెలిపారు. ఇందుకు సంబంధించి పోలీసులు శనివారం విరార్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. వర్లిలోని ముంబై ట్రాఫిక్ పోలీస్ కంట్రోల్ రూంలోని హెల్ప్‌లైన్ వాట్సాప్ నంబర్‌కు శుక్రవారం రాత్రి 11.30 గంటల సమయంలో పలు మెసేజీలు అందాయి. ‘ముంబైని పేల్చేస్తాం. 26/11 తరహా దాడులను మరోసారి గుర్తుకుతెచ్చేలా చేస్తాం. భారత్‌లోని మా సహచరులు ఆరుగురు రంగంలోకి దిగారు. ఇందుకోసం ఏర్పాట్లు సాగుతున్నాయి’అని అందులో ఉంది. 26/11 దాడుల్లో పట్టుబడిన ఉగ్రవాది అజ్మల్ కసబ్, అల్ ఖైదా నేత అయ్మన్ అల్ జవహిరి పేర్లను కూడా ప్రస్తావించారు. చదవండి: భారత్‌తో శాంతినే కోరుకుంటున్నాం కానీ.. కశ్మీర్‌తో ముడిపెట్టిన పాకిస్తాన్ ప్రధాని ఈ మేసేజీలు పాక్ కోడ్‌తో ఉన్న ఫోన్ నంబర్ నుంచే వచ్చినట్లు గుర్తించారు. ముంబై పోలీసులను, తీర ప్రాంత రక్షణ దళాలను అలెర్ట్ చేసి, ఆపరేషన్ కవచ్‌ను ప్రారంభించామని కమిషనర్ వివేక్ పేర్కొన్నారు. ‘మెసేజ్‌లలో పేర్కొన్న నంబర్లు, వ్యక్తులపై కూడా దర్యాప్తు జరుగుతోంది. ఈ నంబర్లు భారతీయులవిని తేలింది. అయితే, మెసేజీలు ఉర్దూలో కాకుండా హిందీలో ఉన్నాయి. పాకిస్తానీ నంబర్ నుంచి ఈ మెసేజీలు వచ్చినట్లు కనిపించేలా నకిలీ ఐపీని సృష్టించే ప్రయత్నం జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం. లాహోర్‌కు చెందిన తోటమాలి ఫోన్ నంబర్ హ్యాకైందన్న అక్కడి మీడియా కథనాలను కూడా పరిశీలిస్తున్నాం’ అని కమిషనర్ చెప్పారు. ముంబై సమీపంలోని రాయగడ్ వద్ద ఏకే–47 తుపాకులు, మందుగుండు సామగ్రితో కూడిన పడవను బలగాలు స్వాధీనం చేసుకున్న మరునాడే ఈ హెచ్చరికలు రావడంతో యంత్రాంగం సీరియస్‌గా తీసుకుంది. 2008 నవంబర్ 26వ తేదీన పాకిస్తాన్‌కు చెందిన 10 మంది ఉగ్రవాదులు ముంబైలో జరిపిన దాడుల్లో 166 మంది చనిపోగా 300 మందికిపైగా గాయపడిన విషయం తెలిసిందే. -
94 వెబ్ సైట్లు బ్లాక్
-
94 వెబ్ సైట్లు బ్లాక్
ముంబయి: ఉగ్రవాదుల కార్యక్రమాలకు మద్దతు తెలుపుతున్న దాదాపు వంద వెబ్ సైట్లను మహారాష్ట్ర అధికారులు బ్లాక్ చేశారు. గణతంత్ర దినోత్సవ వేడుకలు సమీపించడంతోపాటు ఈ వేడుకలు లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు పలుచోట్ల బాంబు పేలుళ్లకు కుట్రలు చేస్తున్నారని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేయడంతో ఇప్పటికే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఇందులో భాగంగా, మహారాష్ట్ర ఏటీఎస్ అధికారులు 94 ఆన్ లైన్ వెబ్ సైట్లను బ్లాక్ చేశారు. ఈ సైట్లు ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ కార్యకలాపాలకు ప్రోత్సాహాన్నిచ్చేలా పనిచేస్తున్నాయని, అందుకే వాటిని నిషేధించినట్లు ఏటీఎస్ చీఫ్ వివేక ఫన్సాల్కర్ తెలిపారు. -
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం
సాక్షి, ముంబై: నూతన సంవత్సర వేడుకలు సమీపిస్తున్న నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను ముమ్మరం చేశారు. తాగి వాహనాలు నడుపుతున్నవారిని గుర్తించి జరిమానా లేదా జైలుశిక్ష విధిస్తున్నారు. ఈ నెల 25వ తేదీన నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక డ్రైవ్‌లో దాదాపు 182 మందిని అరెస్టు చేశారు. ఇందులో 31 మంది లెసైన్సులు లేకుండా వాహనాలను నడిపినట్లు కొలాబా ట్రాఫిక్ విభాగం అధికారి ఒకరు వెల్లడించారు. జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) వివేక్ పాన్సాల్కర్ పర్యవేక్షణలో ఈ డ్రైవ్‌ను నిర్వహించినట్లు చెప్పారు. ఈ డ్రైవ్‌లో 24 ఏళ్ల యువతిపై కూడా కేసు నమోదు చేశారు. సదరు మహిళను కొలాబాలోని రీగల్ సినిమా వద్ద అర్ధరాత్రి 12.30 గంటలకు గుర్తించినట్లు వారు చెప్పారు. పశ్చిమ ముంబైలో 48 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు కాగా దక్షిణ ముంబైలో 18, మధ్య ముంబైలో 20, తూర్పు ముంబైలో 51, ఉత్తర ముంబైలో 45 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది క్రిస్మస్ వరకు మద్యం తాగి వాహనాలు నడిపిన వారి నుంచి జరిమానా రూపంలో రూ. ఒక్క కోటి వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని ప్రతి వీధిలో పోలీసులను మోహరించినట్లు రవాణా నిపుణుడు అశోక్ దాతర్ తెలిపారు. కాగా, ప్రతి ఏడాది డిసెంబర్ 31వ తేదీన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు అధికంగా నమోదవుతాయి. గత ఏడాది ఇదే సమయంలో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 840 వాహన చోదకులపై కేసులు నమోదు చేశారు. అదేవిధంగా 2011లో 739 మందిని అరెస్టు చేసినట్లు ట్రాఫిక్ విభాగం పోలీసులు తెలిపారు. ఇదిలా వుండగా నగర వాసులు కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే నిమిత్తం చేసుకునే వేడుకల్లో ఒక్క ప్రమాదం కూడా జరగకుండా పోలీసులను మోహరింపజేశామని పాన్సాల్కర్ తెలిపారు. 2006 డిసెంబర్ 31న దాదాపు 10 భారీ ప్రమాదాలు జరగడంతో డ్రంక్ అండ్ డ్రైవ్‌ను అరికట్టేందుకు ట్రాఫిక్ విభాగం జూన్ 20, 2007లో ఈ ప్రత్యేక డ్రైవ్‌ను ప్రారంభించినట్లు పాన్సాల్కర్ తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో మొదటిసారిగా పట్టుబడ్డవారికి ఆరు నెలల శిక్ష, లేదా రూ.2,000 జరిమానా లేదా రెండూ విధించనున్నారు. మరోసారి పట్టుబడితే రెండేళ్ల జైలు శిక్ష, రూ.3,000 జరిమానా లేదా రెండూ విధిస్తారని అధికారి తెలిపారు.