సాక్షి, ముంబై: నూతన సంవత్సర వేడుకలు సమీపిస్తున్న నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను ముమ్మరం చేశారు. తాగి వాహనాలు నడుపుతున్నవారిని గుర్తించి జరిమానా లేదా జైలుశిక్ష విధిస్తున్నారు. ఈ నెల 25వ తేదీన నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక డ్రైవ్‌లో దాదాపు 182 మందిని అరెస్టు చేశారు. ఇందులో 31 మంది లెసైన్సులు లేకుండా వాహనాలను నడిపినట్లు కొలాబా ట్రాఫిక్ విభాగం అధికారి ఒకరు వెల్లడించారు.
జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) వివేక్ పాన్సాల్కర్ పర్యవేక్షణలో ఈ డ్రైవ్‌ను నిర్వహించినట్లు చెప్పారు. ఈ డ్రైవ్‌లో 24 ఏళ్ల యువతిపై కూడా కేసు నమోదు చేశారు. సదరు మహిళను కొలాబాలోని రీగల్ సినిమా వద్ద అర్ధరాత్రి 12.30 గంటలకు గుర్తించినట్లు వారు చెప్పారు. పశ్చిమ ముంబైలో 48 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు కాగా దక్షిణ ముంబైలో 18, మధ్య ముంబైలో 20, తూర్పు ముంబైలో 51, ఉత్తర ముంబైలో 45 కేసులు నమోదయ్యాయి.
ఈ ఏడాది క్రిస్మస్ వరకు మద్యం తాగి వాహనాలు నడిపిన వారి నుంచి జరిమానా రూపంలో రూ. ఒక్క కోటి వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని ప్రతి వీధిలో పోలీసులను మోహరించినట్లు రవాణా నిపుణుడు అశోక్ దాతర్ తెలిపారు. కాగా, ప్రతి ఏడాది డిసెంబర్ 31వ తేదీన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు అధికంగా నమోదవుతాయి. గత ఏడాది ఇదే సమయంలో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 840 వాహన చోదకులపై కేసులు నమోదు చేశారు. అదేవిధంగా 2011లో 739 మందిని అరెస్టు చేసినట్లు ట్రాఫిక్ విభాగం పోలీసులు తెలిపారు.
ఇదిలా వుండగా నగర వాసులు కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే నిమిత్తం చేసుకునే వేడుకల్లో ఒక్క ప్రమాదం కూడా జరగకుండా పోలీసులను మోహరింపజేశామని పాన్సాల్కర్ తెలిపారు. 2006 డిసెంబర్ 31న దాదాపు 10 భారీ ప్రమాదాలు జరగడంతో డ్రంక్ అండ్ డ్రైవ్‌ను అరికట్టేందుకు ట్రాఫిక్ విభాగం జూన్ 20, 2007లో ఈ ప్రత్యేక డ్రైవ్‌ను ప్రారంభించినట్లు పాన్సాల్కర్ తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో మొదటిసారిగా పట్టుబడ్డవారికి ఆరు నెలల శిక్ష, లేదా రూ.2,000 జరిమానా లేదా రెండూ విధించనున్నారు. మరోసారి పట్టుబడితే రెండేళ్ల జైలు శిక్ష, రూ.3,000 జరిమానా లేదా రెండూ విధిస్తారని అధికారి తెలిపారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం
Published Sun, Dec 29 2013 1:58 AM | Last Updated on Fri, May 25 2018 2:06 PM
Advertisement