సాక్షి, ముంబై: మద్యం సేవించి వాహనం నడుపుతూ ట్రాఫిక్ పోలీసుల ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ కేసులో పట్టుబడితే జరిమానా చెల్లించి బయటపడవచ్చనే భ్రమలో ఉంటే మీరు తప్పులే కాలేసినట్లే. ఎందుకంటే ట్రాఫిక్ నియమాలను ఇక నుంచి కచ్చితంగా అమలు చేస్తున్నారు. తాగి పట్టుబడితే జరిమానా ఊసే ఉండదు. ఏకంగా మూడేళ్లపాటు జైలు శిక్ష అనుభవించాల్సిందే. మోటారు వాహనాల చట్టం 185 ప్రకారం మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై చర్యలు తీసుకునే అధికారం ట్రాఫిక్ పోలీసులకు ఉంటుంది. ప్రస్తుతం తాగి డ్రైవింగ్ చేసిన వారికి ఆరు నెలల శిక్ష విధించడం లేదా రూ.2,000 జరిమానా వసూలు చేస్తున్నారు. లేదంటే వారి డ్రైవింగ్ లెసైన్స్ రద్దు చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు ఇక నుంచి ఇంతటితో ఆగకుండా వారికి మద్యం సేవించే లెసైన్స్ ఉందా అనేది కూడా తనిఖీ చేయనున్నారు.
ఒకవేళ అదిలేని పక్షంలో ముంబై మద్యం నిరోధక చట్టం ప్రకారం వారిపై కేసు నమోదు చేసి మూడేళ్లు జైలుకు పంపిస్తే అవకాశముంటుంది. ఈ చట్ట ప్రకారం మద్యం సేవించాలనుకునే వాళ్లు ప్రత్యేకంగా పర్మిట్ పొందాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఇలాంటి పర్మిట్లకు ఎవరూ దరఖాస్తు చేయడం లేదని ఎక్సైజ్ అధికారులే అంటున్నారు. ఈ నియమాన్ని మంగళవారం (డిసెంబరు 31) నుంచి అమలు చేయాలని ట్రాఫిక్ పోలీసులను ఆదేశించినట్లు ఓ సీనియర్ పోలీసు అధికారి చెప్పారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నావారిపై చర్యలు తీసుకోవడం 2007 జూలై నుంచి ప్రారంభించారు. అయినప్పటికీ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఏటా పెరుగుతూనే ఉన్నాయి. శిక్షలు కఠినంగా లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని తేలింది. వీటిని అరికట్టాలంటే నియమాలు కఠినంగా అమలు చేయడమే ఉత్తమమని పోలీసులు భావించారు. జరిమానాలు విధించడానికి బదులు మూడేళ్లు జైలుకే పంపాలని నిర్ణయించారు. చట్టాన్ని పక డ్బందీగా అమలు చేయడానికి అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయని కొందరు ట్రాఫిక్ పోలీసులు అంటున్నారు. కేసు నమోదు చేయడం, తరువాత వైద్యపరీక్షలు నిర్వహించి వాంగ్మూలం నమోదు చేయడం, సాక్షులను పిలవడం వంటి పనులకు చాలా సమయం పడుతోంది. ఇందుకు అదనపు సిబ్బంది అవసరముంటుందని పోలీసు అధికారులు అంటున్నారు.
అనుమతి ఐదింటి దాకా
కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడానికి ‘31’ రాత్రి ప్రారంభించే వేడుకలను బుధవారం తెల్లవారుజామున ఐదు గంటల వరకు కొనసాగించవచ్చు. తెల్లవారి దాకా హోటళ్లు, రెస్టారెంట్లు తెరచి ఉంచడానికి ముంబై హైకోర్టు మంగళవారం అనుమతి తెలిపింది. నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ వేడుకలు చేసుకోవడానికి చాలా మంది ముంబైకర్లు హోటళ్లు, రెస్టారెంట్లను బుక్ చేసుకుంటారు. అయితే హోటళ్లు, రెస్టారెంట్లను కేవలం రాత్రి 1.30 గంటల వరకు మాత్రమే తెరచి ఉంచవచ్చని ముంబై పోలీసు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. వీటిని సవాల్ చేస్తూ ‘ద ఇండియన్ హోటల్స్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్’ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఫైవ్‌స్టార్ హోటళ్లు, పబ్స్‌కు తెల్లవారుజామున వరకు అనుమతి కల్పించినప్పుడు, ఇతర హోటళ్లకు రాత్రి 1.30 గంటల వరకు మాత్రమే అనుమతి ఎందుకు ఉందని అసోసియేషన్ పిటిషన్‌లో ప్రశ్నించింది. దీంతో సదరు పిటిషన్‌పై కోర్టు అసోసియేషన్‌కు అనుకూలంగా తీర్పు చెప్పింది.
తాగి నడిపితే తంటాలే!
Published Tue, Dec 31 2013 11:21 PM | Last Updated on Fri, May 25 2018 2:06 PM
Advertisement