ముంబై: నగరంలో డిసెంబర్ 31న తాగి వాహనాలు నడిపే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. 2006 డిసెంబర్ 31న సుమారు 10 భారీప్రమాదాలు జరిగి ప్రాణనష్టం సంభవించిన నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు డిసెంబర్ 31 రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేవారిపై కఠినంగా వ్యవహరించడం మొదలుపెట్టారు. వారికి జరిమానాలు విధించడమే కాక, కేసులు పెట్టి జైళ్లకు పంపడం ప్రారంభించారు. దాంతో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నానాటికీ తగ్గుతూ వస్తున్నాయి. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా మంగళవారం రాత్రి తాగి వాహనాలు నడిపిన 568 వాహనదారులపై కేసులు నమోదు చే శామని బుధవారం నగర ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
2012తో పోలిస్తే 270 కేసులు తక్కువ నమోదయ్యాయని వారు వివరించారు. నిర్లక్ష్యంగా వాహనం నడుపుతున్న 62 మందిపై కేసులు నమోదు చేశామని, హెల్మెట్ లేకుండా అతివేగంగా ద్విచక్ర వాహనాన్ని నడుపుతున్న 1,540 మందికి, అలాగే సిగ్నల్ జంప్ చేసిన, సీటు బెల్ట్ పెట్టుకోకుండా వాహనం నడుపుతున్న మరో 570 మందికి జరిమానా విధించామని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా జాయింట్ పోలీస్ కమిషనర్ వివేక్ ఫంసాల్కర్ మాట్లాడుతూ నగరవ్యాప్తంగా గత క్రిస్మస్ నుంచి 31 రాత్రి వరకు తాము భద్రతా అవగాహన కార్యక్రమాలు చేపట్టామన్నారు. డిసెంబర్ 31 రాత్రే అత్యధికంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయన్నారు. కాగా, 2012లో ఇదే రోజు 840 కేసులు, 2011లో 739 కేసులు నమోదయ్యాయని వివేక్ తెలిపారు.
2012 డిసెంబర్ 31 కంటే గత డిసెంబర్ 31న 272 కేసులు తక్కువ నమోదయ్యాయని ఆయన విశ్లేషించారు. తాగి వాహనాలు నడిపిన వారిలో ఎక్కువమంది 21 నుంచి 30 లోపు వయస్సు వారే ఉన్నారన్నారు. మంగళవారం రాత్రి నగరవ్యాప్తంగా 80 ప్రాంతాల్లో బ్రీత్ ఎనలైజర్లతో నాకాబందీ నిర్వహించామని, 150 మంది అధికారులు, 600 మంది పోలీస్ సిబ్బందిని దీని కోసం నియమించామని ఫంసాల్కర్ తెలిపారు. తమ అవగాహన శిబిరాల్లో పలు స్వచ్ఛంద సంస్థల సాయం కూడా తీసుకున్నామన్నారు. అలాగే 31వ తేదీ రాత్రి ఆటోలను నడపాలని ఆటో యూనియన్లకు సూచించామన్నారు. ఒకవేళ ఎవరైనా తాగి తమ సొంత వాహనాలపై వెళ్లేందుకు అవస్థ పడుతుంటే, ఆ సమయంలో ఆటోలు అందుబాటులో ఉండేలా చూశామన్నారు. కాగా, ఆటో డ్రైవర్లు ఎవరూ రాత్రి తాగి బండి నడిపినట్లు ఎక్కడా కేసులు నమోదు కాలేదని, ఇది ఆహ్వానించదగ్గ పరిణామమని ఆయన అభినందించారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు తగ్గాయ్..
Published Wed, Jan 1 2014 11:26 PM | Last Updated on Fri, May 25 2018 2:06 PM
Advertisement