breath analyzers
-
చుక్కేసి రోడ్డెక్కితే జైలుకే..!
ఆదిలాబాద్ : మందు చుక్కేసి వాహనాలు నడిపిస్తూ మందుబాబులో చిక్కుల్లో పడుతున్నారు. గత రెండేళ్లుగా జైలుకు క్యూ కడుతున్నారు. పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్(మద్యం సేవించి వాహనాలు నడపడం) కింద కేసులు నమోదు చేసి కోర్టుకు పంపిస్తుండగా.. న్యాయమూర్తి నిర్ణయం మేరకు అందులో సగం మందికి మూడు నుంచి ఏడు రోజుల వరకు జైలు శిక్షలు పడుతున్నాయి. దొంగతనాలు, దోపిడీలు వంటి ఇతర రకాల కేసుల కంటే నిత్యం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు అధికం అవుతుండడం గమనార్హం. మద్యం సేవించి వాహనాలు నడపడంతోనే ఈ పరిస్థితి ఏర్పడుతోంది. 70 శాతం ప్రమాదాలు మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల జరుగుతున్నాయనేది నమ్మలేని వాస్తవం. మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రమాదాలు జరగడం వల్ల ఏటా వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో యువత ఎక్కువ పోలీసులకు పట్టుబడి జైలుకు వెళ్తుండడం గమనార్హం. దీంతో జైలులో సాధారణ ఖైదీల కంటే మందుబాబులతోనే నిండిపోతున్నాయి. యువతనే అధికం.. సరదా.. వ్యసనం.. వ్యక్తిగత సమస్యలు.. మానసిక ఒత్తిడి.. కారణమేదైనా ఉపశమనం పొందేందుకు మద్యం తాగడం పరిపాటిగా మారింది. రిలాక్స్ అయ్యేందుకు బార్లకు వెళ్లే మద్యంప్రియులకు మత్తు ఎక్కువైనా వాహనాలు నడుపుతున్నారు. యువత మద్యం సేవించి వాహనాలు నడపడం, ట్రిపుల్ రైడింగ్ చేయడం, అతివేగంతో వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలకు కారణం అవుతున్నారు. దీంతో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో ఎక్కువ మంది యువతే పట్టుబడుతున్నారు. 80 శాతం మంది యువకులు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఇటీవల మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారి సంఖ్య అధికమవుతోంది. పోలీసు కేసులు కూడా ఎక్కువగానే నమోదు అవుతున్నాయి. మద్యం సేవించి వాహనాలు నడుపడం వల్ల జరిగే రోడ్డు ప్రమాదాలు ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని మిగుల్చుతున్నాయి. ఇందులో ముఖ్యంగా యువత రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నట్లు తెలుస్తోంది. మద్యం సేవించడం, అతివేగంగా వాహనాలు నడపడం ద్వారా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రాత్రి సమయంలో మద్యం సేవించి అతివేగంగా వాహనాలు నడపడం ద్వారా రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. తన ప్రాణాలతోపాటు అమాయకులు సైతం ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. 18 ఏళ్లలోపు పిల్లలు కూడా లైసెన్సు లేకుండా వాహనాలు నడపడం వల్ల ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. మద్యం సేవించి ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు నడిపేవారిని బ్రీత్ ఎనలైజర్ యంత్రంతో గుర్తిస్తున్నారు. ఇలా గుర్తించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించే అవకాశం ఉంటుంది. పోలీసుల తనిఖీలు జిల్లాలో మందుబాబుల ఆగడాలను అరికట్టి, రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా రాత్రి సమయంల్లోనే రోడ్డు ప్రమాదాలు జరగడానికి కారణం మద్యం సేవించడమేనని పోలీసులు చెబుతున్నారు. జిల్లా కేంద్రం ఆదిలాబాద్‌లో రాత్రి 12 గంటల వరకు ట్రాఫిక్ పోలీసులతోపాటు వన్‌టౌన్, టూటౌన్, మావల పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. బ్రీత్ ఎనలైజర్‌ను వాహన చోదకుడి నోటి ముందు పెట్టి శ్వాస వదలమంటారు. శ్వాస ఊదిన వ్యక్తి మద్యం సేవించి ఉన్నట్లయితే ఆ యంత్రంలో ఆల్కహాల్ శాతం నమోదవుతుంది. శ్వాస ఊదినప్పుడు యంత్రంలో కనీసం 30 శాతం ఆల్కాహాలు సేవించినట్లు నమోదైతే అతనిపై కేసులు నమోదు చేస్తారు. ఎక్కువ మోతాదులో మద్యం సేవించినట్లయితే 60 నుంచి 120 శాతం వరకు యంత్రంలో చూపిస్తుంది. ఇలాంటి వారికి పెద్ద మొత్తంలో జరిమానాతోపాటు కోర్టులో జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. శ్వాస పరీక్షల సమయం, ఎంత శాతం ఆల్కాహాలు సేవించారనే వివరాలన్నీ శ్వాస యంత్రం నుంచి రశీదు బయటకు వస్తుంది. ఈ మేరకు కేసు నమోదు చేసిన తర్వాత వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుంటారు. వాహనదారుడిని మరుసటి రోజు న్యాయస్థానంలో హాజరుపరుస్తారు. న్యాయమూర్తి ఇచ్చే తీర్పును బట్టి జరిమానా, జైలు శిక్ష ఉంటుంది. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ మరింతగా బలోపేతం చేసి మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపేతే చర్యలు మద్యం సేవించి వాహనాలు నడిపై వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే డ్రంక్ అండ్ డ్రైవ్ ద్వారా కేసులు నమోదు చేస్తున్నాం. రాత్రి సమయంలో ప్రతి కూడళ్లలో పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ వాడాలి. మద్యం సేవించడమే కాకుండా హెల్మెట్ లేకపోవడం వల్ల కూడా ప్రమాదం జరిగినప్పుడు ప్రాణాలు కోల్పోతున్నారు. – నర్సింహారెడ్డి, ఆదిలాబాద్ డీఎస్పీ -
బ్రీత్ ఎనలైజర్లతో కష్టాలు
ఆత్మకూరు: ఆర్టీసీ బస్సుల్లో కార్మికులకు బ్రీత్ ఎనలైజర్‌తో కష్టాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కడుపు మండిన ఆర్టీసీ కార్మికులు ఆదివారం తెల్లవారుజాము నుంచి ఆత్మకూరు డిపో ఎదుట ధర్నా చేపట్టారు. డిపోలో పనిచేస్తున్న డ్రైవర్ చల్లా రవిరెడ్డి ఆదివారం తెల్లవారుజామున విధులకు హాజరయ్యే ముందు బ్రీత్ ఎనలైజర్ పరీక్ష చేయించుకున్నారు. ఈ క్రమంలో ఆయన మద్యం సేవించినట్లు 10 పాయింట్లు ఆ మిషన్‌లో కనబడడంతో సెక్యూరిటీ రిపోర్టు మేరకు అతడ్ని విధులకు హాజరుకాకుండా చేసేందుకు ఆర్టీసీ అధికారులు సిద్ధమయ్యారు. అదే సమయంలో విధులకు హాజరైన కార్మికులందరూ అసలు మద్యమే ముట్టని రవిని బ్రీత్ ఎనలైజర్ ద్వారా మద్యం సేవించాడంటూ నిర్ణయించడం సరికాదని వాదులాడారు. అనంతరం అన్ని కార్మిక యూనియన్ల నాయకులు ఘటనా స్థలానికి చేరుకుని రవికి ప్రభుత్వాస్పపత్రిలో పరీక్షలు నిర్వహించాలని పట్టుబట్టారు. అందుకు యాజమాన్యం ఒప్పుకోకపోవడంతో కార్మిక జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. సమాచారమందుకున్న డిపో మేనేజర్ త్రినా«థ్‌రావు అక్కడికి చేరుకుని, విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపారు. దీంతో దాదాపు మూడు గంటలకు పైగా బస్సులు డిపోలో నిలిచిపోయాయి. మీడియాపై రుసరుస విషయం తెలుసుకున్న మీడియా ఘటన స్థలానికి చేరుకోవడంతో డిపో మేనేజర్ త్రినా«థ్‌రావు వారిపై రుసరుసలాడారు. ఈ క్రమంలో కార్మికులు తామే మీడియాకు సమాచారమిచ్చామని చెప్పడంతో విధిలేక ఆయన ఉన్నతా«ధికారులను మరోసారి సంప్రదించారు. అనంతరం రెండోసారి బ్రీత్ ఎనలైజర్ ద్వారా రవిరెడ్డికి అందరి ఎదుట పరీక్ష నిర్వహించారు. ఆ సమయంలో సున్నా పాయింట్లు నమోదయ్యాయి. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ మిషీన్లో పొరపాటు పెట్టుకుని కార్మికులను మానసిక క్షోభకు గురిచేయడం సరికాదని, గతంలోనూ ఇలానే ఓ కార్మికుడిని సస్పెన్షన్‌కు గురిచేశారని తెలిపారు. చివరికి కార్మికులు విధులకు హాజరవడంతో వ్యవహారం సర్దుమణిగింది. నీరు తాగితే నమోదు కాదు కాగా మంచినీరు ఎక్కువగా తాగితే మద్యం తాగినట్లు బ్రీత్ ఎనలైజర్ గుర్తించలేదని డిపో మేనేజర్ సెలవిచ్చారు. బ్రీత్ ఎనలైజర్ అలా ఎందుకు రెండు విధాలుగా నమోదు చేసిందని త్రినాథ్‌రావును ప్రశ్నించగా రెండోసారి కార్మికుడు అధికంగా నీళ్లు తాగి పరీక్షలు చేయించుకోవడంతో అలా నమోదైందని వ్యాఖ్యానించారు. -
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు తగ్గాయ్..
ముంబై: నగరంలో డిసెంబర్ 31న తాగి వాహనాలు నడిపే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. 2006 డిసెంబర్ 31న సుమారు 10 భారీప్రమాదాలు జరిగి ప్రాణనష్టం సంభవించిన నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు డిసెంబర్ 31 రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేవారిపై కఠినంగా వ్యవహరించడం మొదలుపెట్టారు. వారికి జరిమానాలు విధించడమే కాక, కేసులు పెట్టి జైళ్లకు పంపడం ప్రారంభించారు. దాంతో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నానాటికీ తగ్గుతూ వస్తున్నాయి. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా మంగళవారం రాత్రి తాగి వాహనాలు నడిపిన 568 వాహనదారులపై కేసులు నమోదు చే శామని బుధవారం నగర ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. 2012తో పోలిస్తే 270 కేసులు తక్కువ నమోదయ్యాయని వారు వివరించారు. నిర్లక్ష్యంగా వాహనం నడుపుతున్న 62 మందిపై కేసులు నమోదు చేశామని, హెల్మెట్ లేకుండా అతివేగంగా ద్విచక్ర వాహనాన్ని నడుపుతున్న 1,540 మందికి, అలాగే సిగ్నల్ జంప్ చేసిన, సీటు బెల్ట్ పెట్టుకోకుండా వాహనం నడుపుతున్న మరో 570 మందికి జరిమానా విధించామని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా జాయింట్ పోలీస్ కమిషనర్ వివేక్ ఫంసాల్కర్ మాట్లాడుతూ నగరవ్యాప్తంగా గత క్రిస్మస్ నుంచి 31 రాత్రి వరకు తాము భద్రతా అవగాహన కార్యక్రమాలు చేపట్టామన్నారు. డిసెంబర్ 31 రాత్రే అత్యధికంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయన్నారు. కాగా, 2012లో ఇదే రోజు 840 కేసులు, 2011లో 739 కేసులు నమోదయ్యాయని వివేక్ తెలిపారు. 2012 డిసెంబర్ 31 కంటే గత డిసెంబర్ 31న 272 కేసులు తక్కువ నమోదయ్యాయని ఆయన విశ్లేషించారు. తాగి వాహనాలు నడిపిన వారిలో ఎక్కువమంది 21 నుంచి 30 లోపు వయస్సు వారే ఉన్నారన్నారు. మంగళవారం రాత్రి నగరవ్యాప్తంగా 80 ప్రాంతాల్లో బ్రీత్ ఎనలైజర్లతో నాకాబందీ నిర్వహించామని, 150 మంది అధికారులు, 600 మంది పోలీస్ సిబ్బందిని దీని కోసం నియమించామని ఫంసాల్కర్ తెలిపారు. తమ అవగాహన శిబిరాల్లో పలు స్వచ్ఛంద సంస్థల సాయం కూడా తీసుకున్నామన్నారు. అలాగే 31వ తేదీ రాత్రి ఆటోలను నడపాలని ఆటో యూనియన్లకు సూచించామన్నారు. ఒకవేళ ఎవరైనా తాగి తమ సొంత వాహనాలపై వెళ్లేందుకు అవస్థ పడుతుంటే, ఆ సమయంలో ఆటోలు అందుబాటులో ఉండేలా చూశామన్నారు. కాగా, ఆటో డ్రైవర్లు ఎవరూ రాత్రి తాగి బండి నడిపినట్లు ఎక్కడా కేసులు నమోదు కాలేదని, ఇది ఆహ్వానించదగ్గ పరిణామమని ఆయన అభినందించారు.