
ఇస్లామాబాద్: ప్రధాని పదవి నుంచి దిగిపోవాలని తనపై ఒత్తిడి తెస్తే తాను మరింత ప్రమాదకారిగా మారతానని పాకిస్తాన్ ప్రతిపక్షాలను ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హెచ్చరించారు. ఇమ్రాన్ దిగిపోవాలని కోరుతూ పాకిస్తాన్ ప్రతిపక్ష కూటమి పీడీఎం మార్చిలో చేపట్టదలిచిన లాంగ్‌మార్చ్‌పై ఆయన స్పందించారు. ఈ యాత్ర విఫలమవుతుందని ఆయన జోస్యం చెప్పారు. ‘‘నేను వీధుల్లోకి వస్తే మీకు (ప్రతిపక్షాలు) దాక్కునేందుకు చోటు దక్కదు’’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇమ్రాన్‌కు వ్యతిరేకంగా దాదాపు డజను పార్టీలు పీడీఎంగా కూటమి కట్టాయి. ఆర్మీ చేతిలో ఇమ్రాన్ కీలుబొమ్మని, ఆర్మీ సహకారంతో అక్రమంగా ఇమ్రాన్ గద్దెనెక్కారని పీడీఎం విమర్శిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేత షెబాజ్ షరీఫ్ జాతిద్రోహిగా తనకు కనిపిస్తున్నారని ఇమ్రాన్ నిప్పులు చెరిగారు. షరీఫ్ కుటుంబం మొత్తం మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ బాటలో లండన్ పారిపోకతప్పదన్నారు. మాజీ మిలటరీ అధ్యక్షుడు పర్వేజ్ ముషరాఫ్‌పై కూడా ఇమ్రాన్ విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని బ్లాక్‌మెయిల్ చేయాలనుకుంటున్నాయని, కానీ తాను అందుకు అవకాశమివ్వనని చెప్పారు.
ఇమ్రాన్ బెదిరింపులు తాటాకు చప్పుళ్లని ప్రతిపక్ష నేతలు దుయ్యబట్టారు. ఆయన ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందన్నారు. ఆయన తాజా వ్యాఖ్యలన్నీ ఆయన ఓటమికి సంకేతంగా అభివర్ణించారు. దేశంలో పెరుగుతున్న ధరలు మాత్రమే తనకు అశాంతిని కలిగిస్తున్నాయని అంతకుముందు ఇమ్రాన్ వ్యాఖ్యానించారు. అయితే ఇది ప్రపంచవ్యాప్త పరిణామమని, తామొక్కరి సమస్య కాదని వివరించారు. సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందన్నారు. కరోనా, అఫ్గాన్ యుద్ధం తదితరాలు పాక్ రూపీపై నెగిటివ్ ప్రభావం చూపాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment