mumbai attack
-
ముంబయి 26/11 దాడులకు 15 ఏళ్లు.. ఇజ్రాయెల్ కీలక నిర్ణయం
ఢిల్లీ: ముంబయిలో 26/11 ఉగ్రదాడి జరిగి 15 ఏళ్లు గడుస్తున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ దాడులకు కారణమైన లష్కర్-ఈ తోయిబాను ఉగ్రసంస్థగా గుర్తించింది. ఢిల్లీలోని ఇజ్రాయెల్ ఎంబసీ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ రకమైన అభ్యర్థనను భారత్ కోరనప్పటికీ తాము స్వతహాగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ముంబయిలో నవంబర్ 11, 2008న ఉగ్రవాదులు వరుసదాడులకు పాల్పడ్డారు. పదిమంది ఉగ్రవాదులు సముద్రమార్గం గుండా ముంబయిలోకి చొరబడ్డారు. ఆ తర్వాత బృందాలుగా విడిపోయి ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్ రైల్వే స్టేషన్, తాజ్ హోటల్, నారిమన్ లైట్ హౌస్ సహా ఇలా 12 చోట్ల కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడుల్లో ఉగ్రవాదులతో కలిపి మొత్తం 175 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో భారతీయులతో పాటు మరో 14 దేశాలకు చెందిన పౌరులు ఉన్నారు. ఇందులో నలుగురు ఇజ్రాయెల్ దేశస్థులున్నారు. ప్రస్తుతం ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. అక్టోబర్ 7న హమాస్ బృందం ఇజ్రాయెల్‌లోకి చొరబడి కాల్పులకు తెగబడ్డారు. అనంతరం ఇజ్రాయెల్ యుద్ధానికి దిగింది. ఈ యుద్ధంలో ఇప్పటివరకు ఇజ్రాయెల్ వైపు 1200 మంది మరణించారు. పాలస్తీనా వైపు 12,700 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదీ చదవండి: టీకాతో యువతలో అకాల మరణాలు ముప్పుపై.. వెలుగులోకి కీలకాంశాలు -
ముంబైను పేల్చేస్తాం.. పోలీసులకు హెచ్చరిక
ముంబై: భారత వాణిజ్య రాజధాని ముంబైని పేల్చేస్తామంటూ అందిన హెచ్చరికలతో యంత్రాంగం అప్రమత్తమైంది. మరోసారి 26/11 తరహా దాడులకు పాల్పడతామన్న హెచ్చరిక మెసేజీలపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ మెసేజీలు పాకిస్తాన్ కోడ్‌తో ఉన్న ఫోన్ నంబర్ నుంచే వచ్చినట్లు తేలిందని ముంబై పోలీస్ కమిషనర్ వివేక్ ఫన్సాల్కర్ శనివారం మీడియాకు తెలిపారు. ఇందుకు సంబంధించి పోలీసులు శనివారం విరార్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. వర్లిలోని ముంబై ట్రాఫిక్ పోలీస్ కంట్రోల్ రూంలోని హెల్ప్‌లైన్ వాట్సాప్ నంబర్‌కు శుక్రవారం రాత్రి 11.30 గంటల సమయంలో పలు మెసేజీలు అందాయి. ‘ముంబైని పేల్చేస్తాం. 26/11 తరహా దాడులను మరోసారి గుర్తుకుతెచ్చేలా చేస్తాం. భారత్‌లోని మా సహచరులు ఆరుగురు రంగంలోకి దిగారు. ఇందుకోసం ఏర్పాట్లు సాగుతున్నాయి’అని అందులో ఉంది. 26/11 దాడుల్లో పట్టుబడిన ఉగ్రవాది అజ్మల్ కసబ్, అల్ ఖైదా నేత అయ్మన్ అల్ జవహిరి పేర్లను కూడా ప్రస్తావించారు. చదవండి: భారత్‌తో శాంతినే కోరుకుంటున్నాం కానీ.. కశ్మీర్‌తో ముడిపెట్టిన పాకిస్తాన్ ప్రధాని ఈ మేసేజీలు పాక్ కోడ్‌తో ఉన్న ఫోన్ నంబర్ నుంచే వచ్చినట్లు గుర్తించారు. ముంబై పోలీసులను, తీర ప్రాంత రక్షణ దళాలను అలెర్ట్ చేసి, ఆపరేషన్ కవచ్‌ను ప్రారంభించామని కమిషనర్ వివేక్ పేర్కొన్నారు. ‘మెసేజ్‌లలో పేర్కొన్న నంబర్లు, వ్యక్తులపై కూడా దర్యాప్తు జరుగుతోంది. ఈ నంబర్లు భారతీయులవిని తేలింది. అయితే, మెసేజీలు ఉర్దూలో కాకుండా హిందీలో ఉన్నాయి. పాకిస్తానీ నంబర్ నుంచి ఈ మెసేజీలు వచ్చినట్లు కనిపించేలా నకిలీ ఐపీని సృష్టించే ప్రయత్నం జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం. లాహోర్‌కు చెందిన తోటమాలి ఫోన్ నంబర్ హ్యాకైందన్న అక్కడి మీడియా కథనాలను కూడా పరిశీలిస్తున్నాం’ అని కమిషనర్ చెప్పారు. ముంబై సమీపంలోని రాయగడ్ వద్ద ఏకే–47 తుపాకులు, మందుగుండు సామగ్రితో కూడిన పడవను బలగాలు స్వాధీనం చేసుకున్న మరునాడే ఈ హెచ్చరికలు రావడంతో యంత్రాంగం సీరియస్‌గా తీసుకుంది. 2008 నవంబర్ 26వ తేదీన పాకిస్తాన్‌కు చెందిన 10 మంది ఉగ్రవాదులు ముంబైలో జరిపిన దాడుల్లో 166 మంది చనిపోగా 300 మందికిపైగా గాయపడిన విషయం తెలిసిందే. -
ముంబై ఉగ్రదాడి సూత్రధారి లఖ్వీ అరెస్టు
సాక్షి, న్యూఢిల్లీ: ముంబై దాడుల సూత్రధారి, లష్కరే తోయిబా ఆపరేషన్స్ కమాండర్ జకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీ (61) ని అరెస్ట్ చేశామంటూ శనివారం పాక్ పోలీసులు సంచలన ప్రకటన చేశారు. 2008లో ముంబై ఉగ్ర దాడుల మాస్టర్ మైండ్ లఖ్వీని తమ కౌంటర్ టెర్రరిజం విభాగం (సీటీడీ) అరెస్టు చేసిందని పాక్ ప్రకటించింది. అయితే లఖ్వీని అరెస్టు చేసిన స్థలాన్ని అధికారులు ప్రస్తావించలేదు. ముంబై దాడుల మైస్టర్ మైండ్ లఖ్వీని అదుపులోకి తీసుకున్నామని పాక్ పోలీసు అధికారులు ప్రకటించారు. ఉగ్రవాద సంస్థలకు నిధులను సమకూరుస్తున్నాడన్న ప్రధాన కారణంతోఅతడిని అరెస్ట్ చేసినట్టు సీటీడీ తెలిపింది. లఖ్వీ ఒక డిస్పెన్సరీని నడుపుతూ, ఉగ్రవాద చర్యలకు, ఆ నిధులను ఉపయోగిస్తున్నాడని ఆరోపించారు. ఈనిధులను ఉగ్రవాద ఫైనాన్సింగ్‌తో పాటు వ్యక్తిగత ఖర్చులకు కూడా ఉపయోగించాడని పేర్కొంది. ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల విషయమై లాహోర్‌లో నమోదైన కేసు ఆధారంగా స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి, ఆ సంస్థకు ఆర్థికంగా సాయం చేస్తున్న లఖ్వీని పట్టుకున్నామని పాక్ పోలీసులు వెల్లడించారు. అయితే లఖ్వీని ఎప్పుడు, ఎలా అరెస్ట్ చేశారన్న వివరాలను మాత్రం పాక్ వెల్లడించక పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. కాగా ముంబై దాడుల కేసుల్లో లఖ్వీయే ప్రధాన సూత్రధారి. 2008 నవంబర్ 26 నుంచి నవంబర్ 29 వరకు ముంబైలోని ఎనిమిది ప్రాంతాల్లో వరుస బాంబు దాడులు చేసిన ఘటనలో ఏకంగా 173 మంది ప్రాణాలు కోల్పోయారు. 308 మంది తీవ్రంగా గాయపడ్డారు. ముంబై ఉగ్రదాడి కేసులో అరెస్టయిన లఖ్వీ 2015 నుంచి బెయిల్‌పై ఉన్నాడు. -
కసబ్ కాదు.. దినేశ్ చౌధరి!
ముంబై: భారత్‌పై అనుక్షణం విషం చిమ్మే పాకిస్తాన్ ప్రేరేపిత ముంబై ఉగ్రదాడులు గుర్తున్నాయా? 2008లో నవంబర్ 26న 10 మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులు ముంబైలోకి చొరబడి జరిపిన విచక్షణారహిత కాల్పుల్లో 166 మంది చనిపోయారు. ఆ టెర్రరిస్ట్ల్లో ప్రాణాలతో పట్టుబడింది అబ్జల్ కసబ్ మాత్రమే. కసబ్ ప్రాణాలతో పట్టుబడటం వల్ల ఈ దాడుల వెనుకనున్న పాక్ హస్తం బట్టబయలైంది. కసబ్‌ను హిందూత్వ ఉగ్రవాదిగా చిత్రీకరించి, ఆ దాడులు హిందూత్వ ఉగ్రదాడులుగా చిత్రించాలని కుట్ర పన్నడం, పోలీసులకు చిక్కిన కసబ్‌ను పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ, లష్కరే సంస్థలు చంపాలనుకోవడం తదితర ఆసక్తికర అంశాలను ఆ కేసును విచారించిన ముంబై మాజీ సీనియర్ పోలీస్ అధికారి రాకేశ్ మారియా తన పుస్తకం ‘లెట్ మి సే ఇట్ నౌ’లో కళ్లకు కట్టారు. కేసులో భాగంగా ఆనాడు కసబ్‌ను మారియా విచారించారు. సోమవారం మార్కెట్లోకి విడుదలైన ఆ పుస్తకంలోని పలు ఆసక్తికర అంశాలివి.. ►నిజానికి ఐఎస్ఐ, లష్కరే ఆ దాడులను 2008లో నవంబర్ 26న కాకుండా, సెప్టెంబర్ 27వ తేదీన జరపాలనుకున్నాయి. ఆ తేదీ అప్పటి రంజాన్ ఉపవాస రోజుల్లో 27వది. ►కసబ్‌ను హిందూ ఉగ్రవాదిగా చిత్రించాలనుకున్నాయి. అందుకే, కసబ్ కుడి చేతికి ఎర్రని దారం కట్టింది. సమీర్ దినేశ్ చౌధరి అని, బెంగళూరు వాసి అని ఒక నకిలీ ఐడీ కార్డును సృష్టించాయి. భారత భద్రతాదళాల చేతిలో కసబ్ చనిపోతాడని, ఆ ఐడీ కార్డు ద్వారా అతడు హిందూ ఉగ్రవాదిగా ముద్రపడ్తాడని, మీడియా కూడా అదే విషయాన్ని ప్రచారం చేస్తుందని, మీడియా సంస్థలన్నీ బెంగళూరుకు వెళ్తాయని భావించాయి. కానీ, వారి ప్లాన్ ఫ్లాప్ అయింది. కసబ్ ప్రాణాలతో చిక్కాడు. ఆ విషయంలో కసబ్‌ను ప్రాణాలను పణంగా పెట్టి పట్టుకున్న కాన్స్టేబుల్ తుకారాం ఓంబ్లే సాహసం అనన్యసామాన్యం. కసబ్ ఐడెంటిటీని వెంటనే బయటపెట్టకుండా పోలీసులు సంయమనం పాటించారు. దాంతో ఆయన అసలు ఐడెంటిటీ బయటపడింది. అతడు పాకిస్తాన్‌లోని ఫరీద్కోట్కు చెందిన అజ్మల్ అమిర్ కసబ్‌గా ప్రపంచానికి వెల్లడి చేయగలిగాం. హైదరాబాద్‌కు చెందిన అరుణోదయ కాలేజ్ నకిలీ ఐడీ కార్డులు ఇతర ఉగ్రవాదుల వద్ద లభించాయి. ►తమ ప్రమేయం బయటపడుతుందని ఐఎస్ఐ, లష్కరే భావించాయి. అందుకే భారత్‌లో జైళ్లో ఉన్న కసబ్‌ను హతమార్చాలని నిర్ణయించి ఆ బాధ్యతను మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం గ్యాంగ్‌కు అప్పగించాయి. ►నిజానికి దోపిడీలు చేసి డబ్బులు సంపాదించే ఉద్దేశంతో కసబ్ లష్కరే ఉగ్రసంస్థలో చేరాడు. అతడికి జిహాద్ అంటే ఏంటో కూడా తెలియదు. అయితే, కసబ్‌ను భారత్‌లో ఉగ్రదాడుల కోసం పంపాలని నిర్ణయించుకున్న తరువాత.. అతడికి భారత వ్యతిరేకత నూరిపోశారు. భారత్‌లో ముస్లింలను నమాజ్ చేయనివ్వరని అబద్ధాలు చెప్పారు. మేం ఒకసారి ముంబైలో అతడిని మసీదుకు తీసుకువెళ్లాం. అక్కడ జరుగుతున్న నమాజ్‌ను చూసి కసబ్ ఆశ్చర్యపోయాడు. ►భారత్ పంపేముందు కసబ్‌కు వారం పాటు సెలవు ఇచ్చి, రూ. 1.25 లక్షలు ఇచ్చి ఇంటికి పంపించారు. ఆ డబ్బును సోదరి వివాహానికి ఖర్చు చేయమని కుటుంబానికి ఇచ్చాడు. ►నవంబర్ 21, 2012న కసబ్‌ను పుణెలోని ఎరవాడ సెంట్రల్ జైళ్లో ఉరి తీశారు -
‘నేను ఉగ్రవాదిని కాను’
న్యూఢిల్లీ : ముంబై దాడుల ప్రధాన సూత్రధారి, జమాత్ ఉద్ దవా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్.. తాను ఉగ్రవాదిని కాదని ప్రకటించుకున్నారు. అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితా నుంచి తన పేరును తొలగించాలని హఫీజ్ సయీద్ ఐక్యరాజ్యసమితిలో పిటీషన్ దాఖలు చేశారు. ప్రముఖ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా సహవ్యవస్థాపకుడిగా పేరొందిన హఫీజ్ సయీద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితా నుంచి తొలగించాలని కోరుతూ పాకిస్తాన్‌లోని ఒక న్యాయవాద సంస్థ ఐక్యరాజ్య సంస్థలో పిటీషన్ దాఖలు చేసింది. ముంబైదాడుల కేసులో కొన్ని నెలలుగా గృహనిర్భంధంలో ఉన్న హఫీజ్ సయీద్‌కు పాకిస్తాన్ కోర్టు ఈ మధ్యే స్వేచ్చను ప్రసాదించింది. ముంబై దాడులు అనంతరం ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సెల్ రిజుల్యూషన్ 1267 మేరకు హఫీజ్ సయీద్ అంతర్జాతీయ ఉగ్రవాదిగా సమితి ప్రకటించింది. -
భారత్ డిమాండ్‌ను తిరస్కరించిన పాక్
లాహోర్: ముంబై ఉగ్రవాద దాడిపై మళ్లీ విచారణ జరపాలన్న భారత్ డిమాండ్‌ను పాకిస్థాన్ తిరస్కరించింది. ఈ దాడికి సూత్రధారిగా భావిస్తున్న జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ పాత్రపై వాస్తవమైన ఆధారాలుంటే ఇవ్వాలని పాక్ డిమాండ్ చేసింది. విచారణ ముగింపు దశకు వచ్చిందని, పునర్విచారణ చేయడం సాధ్యంకాదని పాక్ అంతర్గత వ్యవహారాల శాఖ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. 2008 నవంబర్ 26న ముంబైలో జరిగిన ఉగ్రవాదదాడిపై మళ్లీ విచారణ జరపాలని, సయీద్ పాత్రపై దర్యాప్తు చేయాలని భారత్ డిమాండ్ చేసింది. కాగా 24 మంది భారత సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేయడం మినహా, కేసు విచారణ పూర్తయ్యిందని పాక్ వెల్లడించింది. ముంబై ఉగ్రవాద దాడిలో 166 మంది మరణించారు. పాకిస్థాన్ భూభాగం నుంచి వచ్చిన ముష్కరులు ఈ దాడికి పాల్పడ్డారు. సయీద్ ఈ దాడికి పథకం పన్నాడని భారత్ ఆరోపిస్తోంది. సయీద్‌ను, ఆయన అనుచరులు నలుగురిని లాహోర్‌లో హౌస్ అరెస్ట్ చేశారు. -
‘ఉగ్రవాదులు వచ్చిందే మీ దేశం నుంచి..’
న్యూఢిల్లీ: ఉగ్రవాది, జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ నేర చరిత్రకు సంబంధించిన ఆదారాలన్నీ కూడా పాకిస్థాన్‌కు అందుబాటులో ఉన్నాయని భారత్ స్పష్టం చేసింది. 2008లో ముంబయిలో పేలుళ్లకు సంబంధించి కీలక సూత్రదారి అయిన హఫీజ్‌ను ఇప్పటికే పాక్ ప్రభుత్వం గృహనిర్బంధం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పాక్ స్పందిస్తూ ముంబయి పేలుళ్లకు సంబంధించి స్పష్టమైన పకడ్బంధీ ఆధారాలు తమకు అందించాలని భారత్‌ను కోరింది. దీనికి భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ స్పందిస్తూ ముంబయి దాడికి సంబంధించిన ప్రణాళిక మొత్తం పాక్‌లోనే జరిగిందని స్పష్టం చేశారు. ఉగ్రవాదులు కూడా పాక్ నుంచే వచ్చారని, అందుకే ఆధారాలు కూడా పాక్‌లోనే ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని ఆయన బదులిచ్చారు. -
రెండో కసబ్!
బుద్ధి మారని పాకిస్థాన్‌కు ఇది రెండో షాక్. 2008లో ముంబై దాడిలో ఉగ్రవాది కసబ్ పట్టుబడిన విధంగానే బుధవారం జమ్మూ-కశ్మీర్‌లోని ఉధంపూర్ ప్రాంతంలో మరో ఉగ్రవాది దొరికిపోయాడు. దాంతో ఆ దేశం అనుసరిస్తున్న ద్వంద్వ ప్రమాణాలు మరోసారి ప్రపంచానికి వెల్లడయ్యాయి. ఇలా ఉగ్రవాదుల్ని పంపడం అక్కడి సైన్యం పనా... దాని నేతృత్వంలో పనిచేస్తున్న గూఢచార సంస్థ ఐఎస్ఐ పన్నాగమా... పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబా చేసిందా లేక ఈ ముగ్గురి సమన్వయంతో అమలైన పథకమా అన్నది ఇంకా తేలాల్సి ఉంది. పంపింది ఎవరైనా... మరో పక్షం రోజుల్లో జరగబోయే ఇరు దేశాల జాతీయ భద్రతా సలహాదారుల సమావేశాన్ని భగ్నం చేయడం కోసమేనని కేంద్ర ప్రభుత్వం విశ్వసిస్తోంది. చంపడానికీ, చావడానికీ సిద్ధపడి వచ్చే ఉగ్రవాదుల్ని పట్టుకోవడం అంత సులభం కాదు. అందుకు సమయస్ఫూర్తి, గుండె ధైర్యం దండిగా ఉండాలి. ఎంతో చాకచక్యంగా వ్యవహరించగలగాలి. ఆ పని ఉధంపూర్ సమీప గ్రామస్తులు చేయగలిగారు. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై వెళ్తున్న బీఎస్ఎఫ్ జవాన్ల వాహనంపై దాడి చేసి ఇద్దరిని పొట్టన బెట్టుకున్న ఉగ్రవాదుల్లో ఒకడు ఎదురు కాల్పుల్లో అక్కడికక్కడే మరణించగా మరొకడు గ్రామంలోకొచ్చి ఏకే-47 చూపి బెదిరించి అయిదుగురు పౌరుల్ని తీసుకెళ్లి ఒక స్కూల్ భవనంలో బంధించగా ఇద్దరు యువకులు ప్రాణాలకు తెగించి అతన్ని పట్టుకున్నారు. ఆ యువకుడు తన పేరును ఖాసిమ్ అని కాసేపు...ఉస్మాన్ అని కాసేపు... నవేద్ అని కాసేపు చెప్పాడు. అందులో ఏది నిజమో, అతని పుట్టుపూర్వోత్తరాలేమిటో, ఎవరు పంపగా వచ్చాడో, ఎక్కడ శిక్షణ పొందాడో నిఘా సంస్థల ఇంటరాగేషన్‌లో వెల్లడికావలసి ఉన్నా...పట్టుబడిన వెంటనే అతని హావభావాలూ, ఇచ్చిన జవాబులూ గమనిస్తే ఏ స్థాయి వ్యక్తుల్ని ఉగ్రవాదులుగా మార్చి ఇక్కడకు పంపుతున్నారో అర్ధమవుతుంది. మనుషుల్ని చంపడం వినోదమని... ఈ క్రమంలో చనిపోవడం అల్లా ఆజ్ఞగా భావిస్తానని అతను చెబుతున్నాడు. అతనిలో అపరాధభావంగానీ, ఇకపై ఏమవుతుందోనన్న బెదురుగానీ కనబడలేదు. ఏమాత్రం మానసిక పరిణతి సాధించని యువకుల్ని ఎంచుకుని వారికి మతోన్మాదాన్ని నూరిపోసి, మనుషుల ప్రాణాలు తీయడం ఘన కార్యమని చిత్రించి మారణాయుధాలు చేతికిచ్చి పంపుతున్నారని అతని మాటల్ని వింటే తెలుస్తుంది. ఉధంపూర్‌లో దాడికి వచ్చిన ఈ ఇద్దరూ గత నెల 27న పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలో ఏడుగుర్ని కాల్చిచంపిన ముఠాలోని వారేనన్న అనుమానాలున్నాయి. పాకి స్థాన్లోని ఫైసలాబాద్ నుంచి తామిద్దరమే 12 రోజులక్రితం ఇటు వచ్చామంటున్న ఉగ్రవాది మాటల్లో ఎంతవరకూ నిజం ఉన్నదో ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. ఒక దేశంగా మనుగడ సాగిస్తున్న పాకిస్థాన్‌లో వ్యవస్థలు పరస్పరం తలపడటం గమనిస్తాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడే పౌర ప్రభుత్వాలను అక్కడి సైన్యం పెద్దగా లెక్కచేయదు. అన్నిటా తమ ప్రమేయం ఉండాలని కోరుకుంటుంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను అమలు చేయడం నామర్దాగా భావిస్తుంది. అంతర్గత వ్యవహారాల్లో ఇందువల్ల తలెత్తే సమస్యలేమిటన్నది పక్కనబెడితే అంతర్జాతీ యంగా... మరీ ముఖ్యంగా భారత్‌తో సంబంధాల విషయంలో పాక్ ప్రభుత్వానికి ఇబ్బందులు ఏర్పడుతున్నా, తలెత్తుకోలేని పరిస్థితులు ఎదురవుతున్నా సైన్యానికి పట్టదు. ఇరు దేశాలమధ్యా సామరస్యపూర్వక వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్న ప్రతిసారీ దాన్ని భగ్నం చేయడం పాక్ సైన్యానికి అలవాటుగా మారింది. అందువల్లే తాజా ఘటన వెనక త్వరలో జరగబోయే ఇరు దేశాల ఎన్ఎస్ఏల సమావేశానికి అడ్డంకులు కల్పించే దురుద్దేశం ఉండొచ్చునని కేంద్రం అంచనా వేస్తున్నది. రెండేళ్లక్రితం పాకిస్థాన్‌లో అధికారం స్వీకరించినప్పుడు ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రపంచానికి స్పష్టమైన హామీ ఇచ్చారు. తమ భూభాగం ఉగ్రవాదుల అడ్డా కానీయబోమని చెప్పారు. సరిహద్దుల్ని ప్రశాంతంగా ఉంచడానికి తమవైపుగా కృషి చేస్తామని అన్నారు. కానీ ఆచరణలో ఇవన్నీ ఎటో కొట్టుకుపోయాయి. అధీన రేఖ వద్ద తరచు కాల్పుల విరమణ ఉల్లంఘనలు చోటు చేసుకుంటుండగా ఉగ్రవాదుల చొరబాట్లూ ఆగలేదు. ఈమధ్యే పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలో ఉగ్రవాదులు హింసాకాండ సృష్టించారు. పాకిస్థాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ చీఫ్‌గా పనిచేసి రిటైరైన తారిక్ ఖోసా రెండు రోజులక్రితమే పాకిస్థాన్ ద్వంద్వ ప్రమాణాలను అక్కడి ‘డాన్’ పత్రికకు రాసిన వ్యాసంలో నిశితంగా విమర్శించారు. ముంబై దాడితో ప్రమేయం ఉన్న నిందితులను విచారించడంలో జరుగుతున్న జాప్యాన్ని తప్పుబట్టారు. ఈ కేసు విషయంలో సక్రమంగా వ్యవహరించాలని ఆయన హితవు చెప్పిన రెండ్రోజులకే ఇక్కడ మరో కసబ్ దొరికిపోయాడు. ఉగ్రవాది పట్టుబడిన ఉధంపూర్ ప్రాంతం ఇటీవలికాలంలో ప్రశాంతంగా ఉంటున్నది. మిలిటెన్సీ జాడ దాదాపు కనుమరుగైంది. అక్కడ నిఘా సరిగా లేకపోవడంవల్లే ఉగ్రవాదుల కదలికలు సాధ్యమైందనిపిస్తుంది. అమర్నాథ్ యాత్రీకులు ఆ ప్రాంతంనుంచే వెళ్తున్నారు గనుక అదనపు భద్రత, నిఘా అవసరం ఉండగా ఏకే-47తో ఉగ్రవాదులు ఎలా రాగలిగారో అంతుబట్టదు. పాక్ నుంచి ఇంకెంతమంది సరిహద్దులు దాటివచ్చారో ఊహకందదు. తమ ఎఫ్ఐఏ మాజీ చీఫ్ చెప్పాడని మాత్రమే కాదు...తాజా ఘటనతోనైనా పాకిస్థాన్ ప్రభుత్వం కళ్లు తెరవాలి. ద్వైపాక్షికంగా సమస్యలుంటే వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకునే ప్రయత్నాలు చేయాలి తప్ప ఇలా ఉగ్రవాదాన్ని ఎగుమతి చేసి పొరుగు దేశంలో సమస్యలు సృష్టించాలనుకోవడం తెలివితక్కువతనం. దీన్ని సరిదిద్దాల్సిన బాధ్యత అక్కడి ప్రభుత్వంపై ఉంది. ఇరు దేశాల సంబంధాలనూ ఎవరో కొందరు వ్యక్తులు లేదా ముఠాలు నిర్దేశించడానికి ప్రయత్నిస్తుంటే చేతగానితనాన్ని ప్రదర్శించడం ఆత్మహత్యాసదృశమవుతుందని తెలుసుకోవాలి. -
ముంబయి దాడులతో గిలానీ లింకేమిటి?
న్యూఢిల్లీ: ముంబయిలో 26..11 దాడులకు సంబంధించి వేర్పాటువాద నేత సయ్యద్ అలీషా గిలానీకి చెందిన హురియత్ కాన్ఫరెన్స్ సభ్యుడు ఫిరదౌస్ అహ్మద్ షాకు, దాడులకు ఆర్థిక సాయం చేసిన వారికి మధ్య సంబంధాలపై నివేదిక ఇవ్వాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్(ఈడీ)ని ఆదేశించింది. డెమొక్రాటిక్ పొలిటికల్ మూవ్మెంట్ చైర్మన్ అయిన షా 2007-2010 మధ్యలో ఇటలీకి చెందిన ‘మదీనా ట్రేడింగ్ కంపెనీ నుంచి 3కోట్ల రూపాయలను పొందినట్లు కశ్మీర్ లోయలో ఇటీవల ఈడీ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ముంబయి దాడుల సమయంలో కూడా 8364307716-0 నెంబర్‌కు వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటొకాల్ యాక్టివేట్ కోసం 229 అమెరికన్ డాలర్ల పేమెంట్ మదీనా ట్రేడింగ్ ద్వారానే జరిగింది. దీంతో.. వీరి సంబంధాలపై నివేదికను హోంశాఖ కోరింది. -
ఉగ్రవాదంపై పోరు కొనసాగించాల్సిందే: మోదీ
కఠ్మాండ్ : నవంబర్ 26 ముంబయి దాడులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యలు చేశారు. ఆరేళ్ల క్రితం ముంబయిపై జరిగిన ఉగ్రవాదుల భీకర దాడిని మర్చిపోలేమని ఆయన అన్నారు. నాటి ఘటనలో బలైన అమాయకులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నామని మోదీ తెలిపారు. ఉగ్రవాదంపై పోరు కొనసాగించాల్సిందేనని 26/11 ఘటన గుర్తు చేస్తోందని ఆయన అన్నారు. సార్క్ దేశాల సదస్సులో పాల్గొనేందుకు మోదీ మంగళవారం కఠ్మాండు చేరుకున్న విషయం తెలిసిందే. కాగా దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో ముష్కర మూకలు మారణహోమం సాగించి ఆరేళ్లు గడిచింది. 2008, నవంబర్ 26న పది మంది పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మూడు రోజుల పాటు సృష్టించిన నరమేధంలో విదేశీయులతో సహా 166 మంది బలైపోయారు. 300 మంది క్షతగాత్రులయ్యారు. -
ఆరేళ్లైనా మానని గాయం!
దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో ముష్కర మూకలు మారణహోమం సాగించి ఆరేళ్లు గడిచింది. పది మంది పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మూడు రోజుల పాటు సృష్టించిన నరమేధంలో విదేశీయులతో సహా 166 మంది బలైపోయారు. 300 మంది క్షతగాత్రులయ్యారు. అరేబియా మహాసముద్రం మీదుగా ముంబైలోకి చొచ్చుకొచ్చిన నరరూప రాక్షసులు విధ్వంస రచనకు పాల్పడ్డారు. వాణిజ్య రాజధానిని వాల్లకాడులా మార్చారు. లియోపోల్డ్ కేఫ్, తాజ్‌మహల్ ప్యాలెస్ హోటల్, ట్రైడెంట్ ఒబెరాయ్, నారిమాన్ హౌస్, ఛత్రపతి శివాజీ టెర్మినస్, కామా ఆస్పత్రుల్లో మారణకాండ సాగించారు. 50 గంటల సుదీర్ఘ పోరాటం తర్వాత ఉగ్రవాదులను భారత భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. సజీవంగా పట్టుబడిన ఉగ్రవాది అజ్మల్ కసబ్ ను దాదాపు నాలుగేళ్ల పాటు విచారించి 2012 నవంబర్ 21న ఉరితీశారు. ముంబై ముట్టడి జరిగి ఆరేళ్లు గడిచినప్పటికీ ఆ భయానక దృశ్యాలు జాతిజనులకు ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. దాడుల క్రమం * 2008, నవంబర్ 26వ తేదీ సాయంత్రం అరేబియా మహాసముద్రం మీదుగా ముంబైలోకి కొలాబా తీరంలో చేరుకున్న ఉగ్రవాదులు * తర్వాత మూడు బృందాలుగా విడిపోయి తమ తమ లక్ష్యాల దిశగా అడుగులు వేశారు. * ఉగ్రవాదులు అబ్దుల్ రెహమాన్, అబూ అలీ, అబూ సోహెబ్‌లు కొలాబాలోని లియోపోల్డ్ కేఫ్ వైపు వెళ్లారు. * అబ్దుల్ రెహమాన్ చోటా, ఫహదుల్లాలు ట్రైడెంట్ ఒబెరాయ్ వైపు వెళ్లారు. * నాసిర్ అబూ ఉమర్, బాబర్ ఇమ్రాన్ అలియాస్ అబూ ఆకాశలు నారిమాన్ హౌస్ వైపు వెళ్లారు. * స్మాయిల్ ఖాన్, అబూ ఇస్మాయిల్, అజ్మల్ ఆమిర్ కసబ్‌లు ఛత్రపతి శివాజీ టెర్మినస్, కామా ఆస్పత్రి దిశగా ముందుకుసాగారు. * ఛత్రపతి శివాజీ టెర్మినస్, హోటల్ తాజ్‌మహల్ ప్యాలెస్, హోటల్ ట్రైడెంట్, నారిమాన్ హౌస్, లియోపోల్డ్ కేఫ్, కామా ఆస్పత్రి, వాడిబందర్ తదితర ప్రాంతాల్లో నరమేధం సృష్టించిన ఉగ్రవాదులు * ఉగ్రవాదుల కాల్పుల్లో మహారాష్ట్ర ఏటీఎస్ చీఫ్ హేమంత్ కర్కరే సహా పలువురు పోలీసులు, పౌరులు మృతి * 50 గంటల సుదీర్ఘ పోరాటం తర్వాత భారత భద్రతా బలగాల చేతిలో 9 మంది ఉగ్రవాదుల హతం * నవంబర్ 27వ తేదీ తెల్లవారుజామున గిర్గావ్ చౌపాటీ వద్ద అజ్మల్ కసబ్ అరెస్ట్ * ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ తో కలిసి సంఘటనా స్థలాన్ని సందర్శించిన దర్శకుడు రాంగోపాల్ వర్మ * ముంబై ముట్టడికి వహిస్తూ ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్, హోంమంత్రి ఆర్ఆర్ పాటిల్ రాజీనామా * నాలుగేళ్ల న్యాయవిచారణ తర్వాత 2012 నవంబర్ 21న పూణెలోని ఎరవాడ జైల్లో అజ్మల్ కసబ్ కు ఉరిశిక్ష అమలు ముంబై ముట్టడి ఫోటోలు కోసం ఇక్కడ చూడండి