రెండో కసబ్!
బుద్ధి మారని పాకిస్థాన్‌కు ఇది రెండో షాక్. 2008లో ముంబై దాడిలో ఉగ్రవాది కసబ్ పట్టుబడిన విధంగానే బుధవారం జమ్మూ-కశ్మీర్‌లోని ఉధంపూర్ ప్రాంతంలో మరో ఉగ్రవాది దొరికిపోయాడు. దాంతో ఆ దేశం అనుసరిస్తున్న ద్వంద్వ ప్రమాణాలు మరోసారి ప్రపంచానికి వెల్లడయ్యాయి. ఇలా ఉగ్రవాదుల్ని పంపడం అక్కడి సైన్యం పనా... దాని నేతృత్వంలో పనిచేస్తున్న గూఢచార సంస్థ ఐఎస్‌ఐ పన్నాగమా... పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబా చేసిందా లేక ఈ ముగ్గురి సమన్వయంతో అమలైన పథకమా అన్నది ఇంకా తేలాల్సి ఉంది. పంపింది ఎవరైనా... మరో పక్షం రోజుల్లో జరగబోయే ఇరు దేశాల జాతీయ భద్రతా సలహాదారుల సమావేశాన్ని భగ్నం చేయడం కోసమేనని కేంద్ర ప్రభుత్వం విశ్వసిస్తోంది.
చంపడానికీ, చావడానికీ సిద్ధపడి వచ్చే ఉగ్రవాదుల్ని పట్టుకోవడం అంత సులభం కాదు. అందుకు సమయస్ఫూర్తి, గుండె ధైర్యం దండిగా ఉండాలి. ఎంతో చాకచక్యంగా వ్యవహరించగలగాలి. ఆ పని ఉధంపూర్ సమీప గ్రామస్తులు చేయగలిగారు. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై వెళ్తున్న బీఎస్‌ఎఫ్ జవాన్ల వాహనంపై దాడి చేసి ఇద్దరిని పొట్టన బెట్టుకున్న ఉగ్రవాదుల్లో ఒకడు ఎదురు కాల్పుల్లో అక్కడికక్కడే మరణించగా మరొకడు గ్రామంలోకొచ్చి ఏకే-47 చూపి బెదిరించి అయిదుగురు పౌరుల్ని తీసుకెళ్లి ఒక స్కూల్ భవనంలో బంధించగా ఇద్దరు యువకులు ప్రాణాలకు తెగించి అతన్ని పట్టుకున్నారు.
ఆ యువకుడు తన పేరును ఖాసిమ్ అని కాసేపు...ఉస్మాన్ అని కాసేపు... నవేద్ అని కాసేపు చెప్పాడు. అందులో ఏది నిజమో, అతని పుట్టుపూర్వోత్తరాలేమిటో, ఎవరు పంపగా వచ్చాడో, ఎక్కడ శిక్షణ పొందాడో నిఘా సంస్థల ఇంటరాగేషన్‌లో వెల్లడికావలసి ఉన్నా...పట్టుబడిన వెంటనే అతని హావభావాలూ, ఇచ్చిన జవాబులూ గమనిస్తే ఏ స్థాయి వ్యక్తుల్ని ఉగ్రవాదులుగా మార్చి ఇక్కడకు పంపుతున్నారో అర్ధమవుతుంది. మనుషుల్ని చంపడం వినోదమని... ఈ క్రమంలో చనిపోవడం అల్లా ఆజ్ఞగా భావిస్తానని అతను చెబుతున్నాడు. అతనిలో అపరాధభావంగానీ, ఇకపై ఏమవుతుందోనన్న బెదురుగానీ కనబడలేదు.
ఏమాత్రం మానసిక పరిణతి సాధించని యువకుల్ని ఎంచుకుని వారికి మతోన్మాదాన్ని నూరిపోసి, మనుషుల ప్రాణాలు తీయడం ఘన కార్యమని చిత్రించి మారణాయుధాలు చేతికిచ్చి పంపుతున్నారని అతని మాటల్ని వింటే తెలుస్తుంది. ఉధంపూర్‌లో దాడికి వచ్చిన ఈ ఇద్దరూ గత నెల 27న పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలో ఏడుగుర్ని కాల్చిచంపిన ముఠాలోని వారేనన్న అనుమానాలున్నాయి. పాకి స్థాన్‌లోని ఫైసలాబాద్ నుంచి తామిద్దరమే 12 రోజులక్రితం ఇటు వచ్చామంటున్న ఉగ్రవాది మాటల్లో ఎంతవరకూ నిజం ఉన్నదో ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది.
ఒక దేశంగా మనుగడ సాగిస్తున్న పాకిస్థాన్‌లో వ్యవస్థలు పరస్పరం తలపడటం గమనిస్తాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడే పౌర ప్రభుత్వాలను అక్కడి సైన్యం పెద్దగా లెక్కచేయదు. అన్నిటా తమ ప్రమేయం ఉండాలని కోరుకుంటుంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను అమలు చేయడం నామర్దాగా భావిస్తుంది. అంతర్గత వ్యవహారాల్లో ఇందువల్ల తలెత్తే సమస్యలేమిటన్నది పక్కనబెడితే అంతర్జాతీ యంగా... మరీ ముఖ్యంగా భారత్‌తో సంబంధాల విషయంలో పాక్ ప్రభుత్వానికి ఇబ్బందులు ఏర్పడుతున్నా, తలెత్తుకోలేని పరిస్థితులు ఎదురవుతున్నా సైన్యానికి పట్టదు.
ఇరు దేశాలమధ్యా సామరస్యపూర్వక వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్న ప్రతిసారీ దాన్ని భగ్నం చేయడం పాక్ సైన్యానికి అలవాటుగా మారింది. అందువల్లే తాజా ఘటన వెనక త్వరలో జరగబోయే ఇరు దేశాల ఎన్‌ఎస్‌ఏల సమావేశానికి అడ్డంకులు కల్పించే దురుద్దేశం ఉండొచ్చునని కేంద్రం అంచనా వేస్తున్నది. రెండేళ్లక్రితం పాకిస్థాన్‌లో అధికారం స్వీకరించినప్పుడు ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రపంచానికి స్పష్టమైన హామీ ఇచ్చారు. తమ భూభాగం ఉగ్రవాదుల అడ్డా కానీయబోమని చెప్పారు. సరిహద్దుల్ని ప్రశాంతంగా ఉంచడానికి తమవైపుగా కృషి చేస్తామని అన్నారు. కానీ ఆచరణలో ఇవన్నీ ఎటో కొట్టుకుపోయాయి. అధీన రేఖ వద్ద తరచు కాల్పుల విరమణ ఉల్లంఘనలు చోటు చేసుకుంటుండగా ఉగ్రవాదుల చొరబాట్లూ ఆగలేదు. ఈమధ్యే పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలో ఉగ్రవాదులు హింసాకాండ సృష్టించారు.
పాకిస్థాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ చీఫ్‌గా పనిచేసి రిటైరైన తారిక్ ఖోసా రెండు రోజులక్రితమే పాకిస్థాన్ ద్వంద్వ ప్రమాణాలను అక్కడి ‘డాన్’ పత్రికకు రాసిన వ్యాసంలో నిశితంగా విమర్శించారు. ముంబై దాడితో ప్రమేయం ఉన్న నిందితులను విచారించడంలో జరుగుతున్న జాప్యాన్ని తప్పుబట్టారు. ఈ కేసు విషయంలో సక్రమంగా వ్యవహరించాలని ఆయన హితవు చెప్పిన రెండ్రోజులకే ఇక్కడ మరో కసబ్ దొరికిపోయాడు. ఉగ్రవాది పట్టుబడిన ఉధంపూర్ ప్రాంతం ఇటీవలికాలంలో ప్రశాంతంగా ఉంటున్నది. మిలిటెన్సీ జాడ దాదాపు కనుమరుగైంది. అక్కడ నిఘా సరిగా లేకపోవడంవల్లే ఉగ్రవాదుల కదలికలు సాధ్యమైందనిపిస్తుంది. అమర్‌నాథ్ యాత్రీకులు ఆ ప్రాంతంనుంచే వెళ్తున్నారు గనుక అదనపు భద్రత, నిఘా అవసరం ఉండగా ఏకే-47తో ఉగ్రవాదులు ఎలా రాగలిగారో అంతుబట్టదు.
పాక్ నుంచి ఇంకెంతమంది సరిహద్దులు దాటివచ్చారో ఊహకందదు. తమ ఎఫ్‌ఐఏ మాజీ చీఫ్ చెప్పాడని మాత్రమే కాదు...తాజా ఘటనతోనైనా పాకిస్థాన్ ప్రభుత్వం కళ్లు తెరవాలి. ద్వైపాక్షికంగా సమస్యలుంటే వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకునే ప్రయత్నాలు చేయాలి తప్ప ఇలా ఉగ్రవాదాన్ని ఎగుమతి చేసి పొరుగు దేశంలో సమస్యలు సృష్టించాలనుకోవడం తెలివితక్కువతనం. దీన్ని సరిదిద్దాల్సిన బాధ్యత అక్కడి ప్రభుత్వంపై ఉంది. ఇరు దేశాల సంబంధాలనూ ఎవరో కొందరు వ్యక్తులు లేదా ముఠాలు నిర్దేశించడానికి ప్రయత్నిస్తుంటే చేతగానితనాన్ని ప్రదర్శించడం ఆత్మహత్యాసదృశమవుతుందని తెలుసుకోవాలి.