kasab
-
కసబ్‌ని గుర్తుపట్టిన దేవిక!
దేవికకు ఇరవై ఏళ్లు వచ్చాయి. పదేళ్లుగా.. అదే పేదరికం.. అవే బెదిరింపులు. కసబ్‌ని గుర్తుపట్టిన అమ్మాయి దేవిక! కాలేజ్‌కి కూడా వచ్చేసింది. ‘కసబ్ కీ బేటీ’ అనేవాళ్లు స్కూల్లో. దేశమాత బిడ్డ ఎప్పటికౌతుంది? ముంబై సెంట్రల్‌లోని ఆర్థర్ జైల్లో ఉన్నాడు కసబ్. అక్కడికి తీసుకొచ్చారు దేవికను. తొమ్మిదేళ్ల అమ్మాయి. చేతికర్రల మీద నడుస్తూ వచ్చింది. పక్కన తండ్రి ఉన్నాడు. జైల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కోర్టులో జడ్జి కూర్చొని ఉన్నారు. దేవిక కుడి కాలుకు ఆపరేషన్ జరిగి అప్పటికి ఆర్నెల్లు కావస్తోంది. ఆ చిన్నారి కాలి నుంచి బులెట్‌ను తీశారు డాక్టర్లు. ఆ బులెట్ కసబ్ పేల్చిందే! అయితే పేల్చింది కసబేనా? అది గుర్తించడానికి దేవికను కోర్టుకు పిలిపించారు. కసబ్‌ను, మరో ఇద్దర్ని పక్కపక్కన ఓ మూల కూర్చోబెట్టారు. దేవిక ను బోనులోకి రప్పించారు. భగవద్గీతను ఆమె చేతిలో పెట్టారు. ఆమె చేత హిందీలో ప్రమాణం చేయించారు. ‘‘నువ్వు చెప్పిన మాటలకు నీకు అర్థం తెలుసా?’’.. అడిగారు జడ్జి. ‘‘తెలుసు. అబద్ధం చెప్పకూడదు. దేవుడి మీద ఒట్టు వేశాను’’ అంది దేవిక. ‘‘మంచిది. ఆ ముగ్గురిలో నీపై తుపాకీతో కాల్చినవారెవరైనా ఉన్నారా?’’.. జడ్జి. వాళ్లను నిశితంగా చూసింది దేవిక. కసబ్ వైపు వేలెత్తి చూపింది. ఆ కొద్దిసేపటికే టీవీలలో బ్రేకింగ్ న్యూస్. కసబ్ ఫొటో, పక్కనే చేతికర్రలతో ఉన్న దేవిక ఫొటో. ‘కసబ్‌ను గుర్తుపట్టిన చిన్నారి’. ‘కసబ్‌కు బిగిసిన ఉచ్చు’. మర్నాడు ముంబైలోని పేపర్లన్నీ దేవిక గురించి రాశాయి. ఆమె జ్ఞాపకశక్తిని, ధైర్యాన్ని ముంబై పౌరులు ప్రశంసించారు. కసబ్, అతడి సహచరుడు కలిసి ఛత్రపతి శివాజీ టెర్మినస్‌లో విచక్షణారహితంగా జరిపిన కాల్పులలో 58 మంది చనిపోగా, బులెట్ దెబ్బ తిని కూడా అదృష్టవశాత్తూ బతికిన ఒక ప్రత్యక్ష సాక్షి దేవిక. ఇప్పుడు ఆ అమ్మాయికి ఇరవై ఏళ్లు! అయితే పదకొండేళ్ల క్రితం దేవిక కుటుంబం ఎలా ఉందో ఇప్పుడూ అలానే ఉంది. అదే వెస్ట్ బాంద్రాలోని మురికివాడలో, అదే పేదరికంలో, అదే బెదిరింపులతో ఆమె జీవితం నడుస్తోంది. అసలు.. సాక్ష్యం కోసం ఆనాడు తన కూతుర్ని కోర్టుకు పంపననే అన్నాడు నట్వర్లాల్. లాయర్ ఆయన్ని ఒప్పించాడు. ప్రభుత్వం నుంచి సహాయం అందుతుందని, ప్రభుత్వం రక్షణ కల్పిస్తుందనీ చెప్పాడు. దేవిక సాక్ష్యం చెప్పింది కానీ, ఆయన చెప్పినవేవీ జరగలేదు. కుటుంబ పోషణ కోసం రోజులో నాలుగు పనులు చేస్తాడు నట్వార్లాల్. అన్నీ ఏ రోజుకు ఆ రోజు ఇంత సంపాదించుకునే పనులే. అతడి భార్య ఏనాడో చనిపోయింది. పెద్ద కొడుకు భరత్ పుణెలో ఉంటాడు. చిన్న కొడుకు జయేష్, అతడికన్నా చిన్నదైన దేవిక ఉంటారు ఇంట్లో. భరత్‌ను చూడ్డానికి పుణె వెళుతున్నప్పుడే.. ఛత్రపతి శివాజీ టెర్మినస్ (రైల్వేస్టేషన్) లో 2008 నవంబర్ 26 రాత్రి ఉగ్రదాడి జరిగింది. ఆ సమయం లో జయేష్ బాత్రూమ్లో ఉన్నాడు. నట్వర్లాల్, దేవిక ప్లాట్‌ఫారమ్ మీద ఉన్నారు. హటాత్తుగా పేలుడు చప్పుళ్లు మొదలయ్యాయి. దేవిక అటు వైపు చూసింది. తుపాకీ బులెట్ వచ్చి ఆమెకు తగిలింది. స్పృహలోకి వచ్చి కళ్లు తెరిచేటప్పటికి ఆసుపత్రిలో ఉంది. కసబ్‌ను ఉరి తీసేనాటికి దేవికకు పదమూడేళ్లు. ‘‘పెద్దయ్యాక ఐపీఎస్ ఆఫీసర్‌ను అయి ఉగ్రవాదుల పని పడతా..’’ అంటుండేది దేవిక. అయితే కసబ్‌ను ఆమె గుర్తు పట్టిందని తెలిశాక ఒక్క స్కూలు కూడా ఆమెకు సీటు ఇవ్వలేదు! భయం. ఆ పిల్ల వల్ల తమకేదైనా ముప్పు వస్తుందేమోనని. దేవిక ఇప్పుడు డిగ్రీలోకి వచ్చింది. పుణె నుంచి పెద్దన్న ముంబైకి ఏనాడో తిరిగి వచ్చేశాడు. చిన్నన్న, తండ్రి అంతా ఒక చిన్న గది లాంటి ఇంట్లో నెట్టుకొస్తున్నారు. దేవిక అన్నలిద్దరికీ తండ్రి లాంటి సంపాదనే. ఏ రోజుకు ఆ రోజు పని వెతుక్కోవడం. దేవిక సాక్ష్యం చెప్పిన రోజు నుంచే బంధువులు వీరిని చేరదీయడం మానేశారు. అప్పుడప్పుడూ ఆ ఇంటికి కసబ్ ఆత్మ మాట్లాడినట్లుగా ఆగంతకులెవరో ఫోన్ చేసి బెదిరిస్తుంటారు. కాలేజ్‌కి వెళ్లి వచ్చే దారిలో కొన్నిసార్లు దేవిక ఛత్రపతి శివాజీ టెర్మినస్‌లో తనకు బులెట్ దెబ్బ తగిలి పడిపోయిన చోట కాసేపు నిలబడి వస్తుంటుంది. బతికే ఉన్నానని తనకు తాను సమాధానం చెప్పుకోడానికేమో! మొన్న సోమవారం కాంగ్రెస్ ఎమ్మెల్యే జీషన్ బాబా సిద్ధిక్ దేవిక ఇంటికి వెళ్లి ఆర్థిక సహాయం అందించారు. చెక్కు చేతికి ఇచ్చారు. ఆ కుటుంబానికి సొంత గూడును, భద్రతను కల్పించమని మహారాష్ట్ర ముఖ్యమంత్రికి విజ్ఞప్తి కూడా చేశారు. కాలికి ఆపరేషన్ అయ్యి, దేవిక తిరిగి స్కూల్‌కి వెళ్లినప్పుడు ఆమె పక్కన ఎవ్వరూ కూర్చోలేదు. టీచర్లు కూడా ముభావంగా ఉన్నారు. పిల్లలంతా ఆమెను ‘కసబ్ కీ బేటీ’ అనడంతో ఆమెను ఆ స్కూలు మాన్పించి వేరే స్కూళ్లు వెతికాడు ఆమె తండ్రి. పిల్లలు వాళ్లు. ఏమైనా అంటారు. ప్రభుత్వంలో ఉన్న పెద్దవాళ్లకు ఏమైంది? భరతమాత పుత్రికగా దేవికను ఎందుకు గుర్తించలేక పోతున్నారు?! దేవిక : తొమ్మిదేళ్ల వయసులో కసబ్‌ని గుర్తుపట్టడానికి కోర్టుకు వెళుతున్నప్పటి చిత్రం. -
ముంబై దాడికి హిందూ రంగు
-
కసబ్ కాదు.. దినేశ్ చౌధరి!
ముంబై: భారత్‌పై అనుక్షణం విషం చిమ్మే పాకిస్తాన్ ప్రేరేపిత ముంబై ఉగ్రదాడులు గుర్తున్నాయా? 2008లో నవంబర్ 26న 10 మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులు ముంబైలోకి చొరబడి జరిపిన విచక్షణారహిత కాల్పుల్లో 166 మంది చనిపోయారు. ఆ టెర్రరిస్ట్ల్లో ప్రాణాలతో పట్టుబడింది అబ్జల్ కసబ్ మాత్రమే. కసబ్ ప్రాణాలతో పట్టుబడటం వల్ల ఈ దాడుల వెనుకనున్న పాక్ హస్తం బట్టబయలైంది. కసబ్‌ను హిందూత్వ ఉగ్రవాదిగా చిత్రీకరించి, ఆ దాడులు హిందూత్వ ఉగ్రదాడులుగా చిత్రించాలని కుట్ర పన్నడం, పోలీసులకు చిక్కిన కసబ్‌ను పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ, లష్కరే సంస్థలు చంపాలనుకోవడం తదితర ఆసక్తికర అంశాలను ఆ కేసును విచారించిన ముంబై మాజీ సీనియర్ పోలీస్ అధికారి రాకేశ్ మారియా తన పుస్తకం ‘లెట్ మి సే ఇట్ నౌ’లో కళ్లకు కట్టారు. కేసులో భాగంగా ఆనాడు కసబ్‌ను మారియా విచారించారు. సోమవారం మార్కెట్లోకి విడుదలైన ఆ పుస్తకంలోని పలు ఆసక్తికర అంశాలివి.. ►నిజానికి ఐఎస్ఐ, లష్కరే ఆ దాడులను 2008లో నవంబర్ 26న కాకుండా, సెప్టెంబర్ 27వ తేదీన జరపాలనుకున్నాయి. ఆ తేదీ అప్పటి రంజాన్ ఉపవాస రోజుల్లో 27వది. ►కసబ్‌ను హిందూ ఉగ్రవాదిగా చిత్రించాలనుకున్నాయి. అందుకే, కసబ్ కుడి చేతికి ఎర్రని దారం కట్టింది. సమీర్ దినేశ్ చౌధరి అని, బెంగళూరు వాసి అని ఒక నకిలీ ఐడీ కార్డును సృష్టించాయి. భారత భద్రతాదళాల చేతిలో కసబ్ చనిపోతాడని, ఆ ఐడీ కార్డు ద్వారా అతడు హిందూ ఉగ్రవాదిగా ముద్రపడ్తాడని, మీడియా కూడా అదే విషయాన్ని ప్రచారం చేస్తుందని, మీడియా సంస్థలన్నీ బెంగళూరుకు వెళ్తాయని భావించాయి. కానీ, వారి ప్లాన్ ఫ్లాప్ అయింది. కసబ్ ప్రాణాలతో చిక్కాడు. ఆ విషయంలో కసబ్‌ను ప్రాణాలను పణంగా పెట్టి పట్టుకున్న కాన్స్టేబుల్ తుకారాం ఓంబ్లే సాహసం అనన్యసామాన్యం. కసబ్ ఐడెంటిటీని వెంటనే బయటపెట్టకుండా పోలీసులు సంయమనం పాటించారు. దాంతో ఆయన అసలు ఐడెంటిటీ బయటపడింది. అతడు పాకిస్తాన్‌లోని ఫరీద్కోట్కు చెందిన అజ్మల్ అమిర్ కసబ్‌గా ప్రపంచానికి వెల్లడి చేయగలిగాం. హైదరాబాద్‌కు చెందిన అరుణోదయ కాలేజ్ నకిలీ ఐడీ కార్డులు ఇతర ఉగ్రవాదుల వద్ద లభించాయి. ►తమ ప్రమేయం బయటపడుతుందని ఐఎస్ఐ, లష్కరే భావించాయి. అందుకే భారత్‌లో జైళ్లో ఉన్న కసబ్‌ను హతమార్చాలని నిర్ణయించి ఆ బాధ్యతను మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం గ్యాంగ్‌కు అప్పగించాయి. ►నిజానికి దోపిడీలు చేసి డబ్బులు సంపాదించే ఉద్దేశంతో కసబ్ లష్కరే ఉగ్రసంస్థలో చేరాడు. అతడికి జిహాద్ అంటే ఏంటో కూడా తెలియదు. అయితే, కసబ్‌ను భారత్‌లో ఉగ్రదాడుల కోసం పంపాలని నిర్ణయించుకున్న తరువాత.. అతడికి భారత వ్యతిరేకత నూరిపోశారు. భారత్‌లో ముస్లింలను నమాజ్ చేయనివ్వరని అబద్ధాలు చెప్పారు. మేం ఒకసారి ముంబైలో అతడిని మసీదుకు తీసుకువెళ్లాం. అక్కడ జరుగుతున్న నమాజ్‌ను చూసి కసబ్ ఆశ్చర్యపోయాడు. ►భారత్ పంపేముందు కసబ్‌కు వారం పాటు సెలవు ఇచ్చి, రూ. 1.25 లక్షలు ఇచ్చి ఇంటికి పంపించారు. ఆ డబ్బును సోదరి వివాహానికి ఖర్చు చేయమని కుటుంబానికి ఇచ్చాడు. ►నవంబర్ 21, 2012న కసబ్‌ను పుణెలోని ఎరవాడ సెంట్రల్ జైళ్లో ఉరి తీశారు -
‘కసబ్‌కీ బేటీ’ అన్నారు!
దశాబ్దం క్రితం జరిగిన 26/11 ముంబై దాడులకు ప్రత్యక్ష సాక్షి ఆరేళ్ల దేవిక. ముంబై ఛత్రపతి శివాజీ టర్మినస్(సీఎస్టీ)లో అమాయకులను పొట్టనబెట్టుకున్న లష్కరే ఉగ్రవాది కసబ్‌ను పోలీసులు పట్టుకున్నాక అతడిని పోలీసు పరేడ్‌లో గుర్తుపట్టిన అత్యంత చిన్న వయసు ప్రత్యక్ష సాక్షి ఈమె. ఉగ్రవాదిని గుర్తించడంలో సాయంచేసినందుకు ఆ కుటుంబం ఎదుర్కొన్న చేదు అనుభవం ఒకటైతే, ఆ చిన్ని మనసును నొప్పించిన ఘటనలెన్నో. 2008 నవంబర్ 26న ఉగ్రబుల్లెట్ల నుంచి దేవిక త్రుటిలో తప్పించుకుంది. కసబ్‌ని గుర్తుపట్టి, అతడికి వ్యతిరేకంగా సాక్ష్యమిచ్చేందుకు నాడు కోర్టు మెట్లెక్కినపుడు దేవిక వయసు తొమ్మిదేళ్లు. ఘటన జరిగినపుడు ఆమె వయసు కేవలం ఆరేళ్లు. ‘నా కుడి కాలుని షూట్ చేశారు’ అంటూ ఆనాటి చేదు జ్ఞాపకాలను గుర్తుచేసుకుంది దేవిక. ప్రస్తుతం దేవిక ఇంటర్మీడియెట్ చదువుతోంది. దాడి జరిగిన రోజు పుణెలోని తన చిన్న అన్నయ్యను కలవడానికి తండ్రి నట్వర్లాల్, పెద్ద అన్నయ్యలతో కలిసి రైలెక్కడానికి ముంబై సీఎస్టీకి వచ్చింది. అదే సమయంలో రైల్వేస్టేషన్లో కసబ్ విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ఓ బుల్లెట్ దేవిక కుడి కాలును చీల్చుకుంటూ దూసుకెళ్లింది. రక్తసిక్తమైన దేవిక రెండు నెలల పాటు ఆసుపత్రిపాలైంది. కోలుకుని కోర్టుకెళ్లిన దేవికను ‘నిన్నెవరు కాల్చారు?’ అని ప్రశ్నించినపుడు సూటిగా కసబ్ వైపు చూపించింది. దీంతో అప్పట్లో దేవిక పేరు మార్మోగింది. దేశం యావత్తు ఆ చిన్నారి తెగువను ప్రశంసించింది. అయితే, దేవికను కష్టాలు మరోరూపంలో మొదలయ్యాయి. బడిలో తోటి విద్యార్థినులు ‘కసబ్‌కీ బేటీ’ అని పిలిచేవారు. స్నేహితులు దగ్గరికి రావడానికి భయపడ్డారు. సూటిపోటి మాటలతో వేధించారు. దీంతో దేవిక మరో పాఠశాలలో చేరాల్సి వచ్చింది. అక్కడా పరిస్థితిలో పెద్దగా మార్పులేదు. దీనికితోడు దేవిక కుటుంబానికి ఉగ్రవాదుల నుంచి బెదిరింపులు ఎదురయ్యాయి. అయినా దేవిక, ఆమె కుటుంబం వెనక్కి తగ్గలేదు. దేవిక తండ్రి రోజుకూలీ. ఇంత పేదరికంలోనూ తను లక్ష్యంగా పెట్టుకున్న ఐపీఎస్ ఆశయాన్ని సాధించేందుకు దేదిక కష్టపడి చదువుతోంది. 26/11 మృతులకు సోమవారం జమ్మూలో నివాళులర్పిస్తున్న పాఠశాల విద్యార్థులు -
మరో దాడి జరిగితే యుద్ధమే..!
ముంబై పీడకలకు పదేళ్లు. దేశ ఆర్థిక రాజధానిని తూటాల వర్షంతో చిన్నాభిన్నం చేసిన ఉగ్ర విధ్వంసం జరిగి దశాబ్దం గడిచింది. దేశ భద్రతకు సవాలుగా నిలిచిన పాకిస్తాన్ ఉగ్ర కుట్ర జరిగి పదేళ్లయింది. నేటికి సరిగ్గా పదేళ్ల కిత్రం ముంబైపై ఆధునిక ఆయుధాలతో విరుచుకుపడిన 12 మంది లష్కరే రాక్షసుల బారిన పడి 166 మంది ప్రాణాలు కోల్పోయారు. 300 మందికి పైగా గాయపడ్డారు. పాకిస్తాన్లో ఐఎస్ఐ ఆధ్వర్యంలో ఆధునిక శిక్షణ పొందిన ఆ ఉగ్రవాదులను మట్టుపెట్టే క్రమంలో సందీప్ ఉన్నికృష్ణన్, హేమంత్ కర్కరే, విజయ్ సలాస్కర్, అశోక్ కామ్టే తదితర సాహస అధికారులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఆ దుర్ఘటనకు పదేళ్లయిన సందర్భంగా కొన్ని జ్ఞాపకాలు.. ముంబై/వాషింగ్టన్: 26/11 అంతటి తీవ్ర దాడులు భారత్‌పై మరోసారి జరిగితే భారత్, పాక్‌ల మధ్య ప్రాంతీయ యుద్ధం సంభవించే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. 2008 నవంబర్ 26న 10 మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులు ముంబైలో మారణహోమం సృష్టించి 166 మందిని పొట్టనబెట్టుకోవడం తెలిసిందే. ఈ దాడికి సూత్రధారి అయిన హఫీజ్ సయీద్ పాకిస్తాన్లో స్వేచ్ఛగా తిరుగుతున్నాడనీ, దాడికి కారకులను శిక్షిస్తామని ఇచ్చిన మాటను పాక్ నిలబెట్టుకోలేదని వారు పేర్కొన్నారు. అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థ సీఐఏ (సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ) మాజీ అధికారి బ్రూస్ రీడెల్ మాట్లాడుతూ ‘26/11 దాడి సూత్రధారులకు శిక్ష పడటాన్ని బాధిత కుటుంబాలు ఇంకా చూడాల్సి ఉంది. అయితే పాకిస్తాన్ వైఖరి చూస్తుంటే ఇది దాదాపుగా అసాధ్యమనిపిస్తోంది. ఇంతటి తీవ్రమైన దాడి మరోసారి జరిగితే ఇక యుద్ధం అనివార్యం కావొచ్చు’ అని అభిప్రాయ పడ్డారు. దాడుల సమయంలో అమెరికాలో పాక్ రాయబారిగా పనిచేసిన హుస్సేన్ హక్కానీ మాట్లాడుతూ ‘ఇంకో దాడి జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరూ ఊహించలేరు. అయితే 26/11 దాడుల సూత్రధారులను శిక్షిస్తామన్న తమ హామీని పాక్ నిలబెట్టుకోవాలి. కానీ వారందరినీ పాక్ వదిలేసింది. అందరూ స్వేచ్ఛగా తిరుగుతున్నారు. అంటే భారత్‌పై ఉగ్రదాడికి పాల్పడిన వారిని తాము ఉపేక్షిస్తామని పాక్ పరోక్షంగా చెబుతోంది’ అని అన్నారు. దాడుల సమయంలో అమెరికా జాతీయ భద్రతా మండలి దక్షిణాసియా విభాగ డైరెక్టర్‌గా ఉన్న అనీశ్ గోయెల్ మాట్లాడుతూ ‘భారత్–పాక్‌ల యుద్ధాన్ని నివారించడమే నాడు మా ప్రధాన లక్ష్యం. నాటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్, నాటి భారత ప్రధాని మన్మోహన్ సింగ్‌కు ఫోన్ చేసి సంయమనం పాటించాలని కోరారు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఓ దశలో పాక్‌పై భారత్ యుద్ధానికి దిగుతుందని కూడా నాడు అనిపించింది’ అని చెప్పారు. పోలీసులు ఉగ్రవాదుల్ని పారిపోనిచ్చారు ఫొటో జర్నలిస్ట్ సెబాస్టియన్ ముంబై మారణహోమం సందర్భంగా ఉగ్రవాదులను నిలువరించే అవకాశమున్నప్పటికీ భయపడ్డ మహారాష్ట్ర పోలీసులు వారిని పారిపోనిచ్చారని కసబ్ ఫొటోను షూట్చేసిన జర్నలిస్ట్ సెబాస్టియన్ డిసౌజా అలియాస్ సబీ(67) తెలిపారు. ముంబై దాడులకు నేటితో పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘2008, నవంబర్ 26న నేను ఆఫీసులో పనిచేసుకుంటుండగా పక్కనే ఉన్న సీఎస్టీలో కాల్పుల శబ్దం వినిపించింది. వెంటనే నా కెమెరా, లెన్సులు తీసుకుని కిందకు పరిగెత్తాను. రైల్వేస్టేషన్‌లోకి దూరి ఓ బోగీలో దాక్కున్నా. కానీ అక్కడి నుంచి ఫొటో తీయడానికి యత్నించగా కుదరలేదు. దీంతో మరో బోగీలోకి వెళ్లి ప్లాట్‌ఫామ్‌పై ఉన్న ఉగ్రవాదుల ఫొటోలు తీశాను’ అని చెప్పారు. క్రూరంగా నవ్వుతూ కాల్పులు సీఎస్టీ అనౌన్సర్ విష్ణు ఛత్రపతి శివాజీ టెర్మినస్(సీఎస్టీ) రైల్వేస్టేషన్ లో క్రూరంగా నవ్వుతూ అమాయకులపై గుళ్ల వర్షం కురిపించిన ఉగ్రవాది కసబ్ ముఖం తనకు ఇంకా గుర్తుందని ఆరోజు అనౌన్సర్‌గా విధులు నిర్వర్తిస్తున్న విష్ణు జెందె(47) గుర్తుచేసుకున్నారు. ‘నవంబర్ 26న రాత్రి 9.15 గంటల సమయంలో రైల్వేస్టేషన్లో పెద్ద శబ్దం వినిపించగానే ఏదో పేలుడు జరిగిందనుకున్నా. కానీ ఇద్దరు వ్యక్తులు తుపాకులు పట్టుకుని వస్తుండటాన్ని చూడగానే ఇది ఉగ్రదాడి అని అర్థమైపోయింది. ప్రయాణికులందరూ రైల్వేస్టేషన్ నుంచి వెళ్లిపోవాలనీ, ఉగ్రవాదులు కాల్పులు జరుపుతున్నారని ప్రజల్ని అప్రమత్తం చేశా. ఉగ్రవాదులకు దూరంగా ఉన్న ప్లాట్‌ఫామ్ 1 దగ్గరి నుంచి బయటకు వెళ్లిపోవాలని చెప్పా. ఘటనాస్థలికి చేరుకోవాల్సిందిగా రైల్వే పోలీసులను కోరాను. మరోవైపు సహచరుడితో కలిసి ప్లాట్‌ఫామ్‌పైకి చేరుకున్న కసబ్ క్రూరంగా నవ్వుతూ, దూషిస్తూ ప్రయాణికులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు’ అంటూ నాటి అనుభవాలను విష్ణు గుర్తుచేసుకున్నారు. రెండుసార్లు ఫెయిల్ ముంబైలో ఉగ్రదాడికి పాల్పడ్డ పాక్ పౌరుడు కసబ్‌కు లష్కరే తోయిబా కరాచీలో ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు తాజాగా వెల్లడైంది. ప్రము ఖ చరిత్రకారుడు సరోజ్ కుమార్ రత్ కసబ్ విచారణాధికారులకు ఇచ్చిన వాంగ్మూలాన్ని ఉటంకిస్తూ రాసిన ‘ఫ్రజైల్ ఫ్రంటియర్స్: ది సీక్రెట్ హిస్టరీ ఆఫ్ ముంబై టెర్రర్ అటాక్స్’ పుస్తకంలో ఈ అంశాలను ప్రస్తావించారు. ‘కసబ్‌కు తొలుత నావికుడిగా, చేపలుపట్టేలా ఐఎస్ఐ అధికారులు, లష్కరే తోయిబా కమాండర్లు రెండేళ్లు శిక్షణ ఇచ్చారు. అయితే ఉగ్రదాడి కోసమే ఈ శిక్షణ ఇస్తున్నట్లు చెప్పలేదు. ఇది ఎవరికైనా తెలిస్తే భారత్‌పై దాడిచేసే మార్గాలు మూసుకుపోతాయన్న భయంతో టాప్ కమాండర్లు హఫీజ్ సయీద్, జకీవుర్ రెమ్మాన్ లఖ్వీ గోప్యత పాటించారు. ముంబైపై 2008, నవంబర్ 26న దాడికి ముందు లష్కరే చేసిన రెండు ప్రయత్నాలు విఫలమయ్యాయి. 2008, సెప్టెంబర్‌లో ఉగ్రవాదులను తీసుకెళుతున్న బోటు సముద్రంలో ఓ రాయిని ఢీకొని మునిగిపోయింది. దీంతో లష్కరే వర్గాలు కొనప్రాణాలతో ఉన్న తమ ఉగ్రవాదుల్ని కాపాడాయి. ఇక రెండోసారి నవంబర్ 7న ఉగ్రవాదుల బృందం మరోసారి భారత్‌కు బయలుదేరింది. ఈ సందర్భంగా భారత్‌కు చెందిన ఓ బోటు కెప్టెన్‌ను లొంగిపోవాల్సిందిగా ఉగ్రవాదులు కోరగా, అతను నిరాకరించి పడవను వేగంగా తీసుకెళ్లిపోయాడు. ‘ఆపరేషన్ కసబ్’ ఇలా.. ప్రాణాలతో చిక్కిన ఉగ్రవాది కసబ్‌ను ఉరితీసేందుకు ఏర్పాట్లు చాలా రహస్యంగా సాగాయని ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ‘కసబ్‌ను ఉరితీయడం కోసం ఆర్థర్రోడ్ జైలులోని అండా సెల్ నుంచి పుణెలోని ఎర్రవాడ కేంద్ర కారాగారానికి తరలించడానికి నవంబర్ 20న రాత్రి ఏర్పాట్లు పూర్తిచేశాం. రాత్రిపూట కసబ్‌ను పోలీస్ వ్యానులో ఎక్కించాం. మహారాష్ట్ర పోలీసులకు చెందిన ఫోర్స్ వన్ కమాండో బృందం ఈ వాహనానికి రక్షణగా బయలుదేరింది. ఎక్కువ కార్లు ఒకేసారి వెళితే అనుమానం రావొచ్చన్న ఆలోచనతో రాష్ట్ర రిజర్వు పోలీస్ బలగాలు కొంతదూరం నుంచి ఈ వాహనాలను వెంబడించాయి. ఈ ఆపరేషన్ ముగిసేవరకూ ఇందులో పాల్గొన్న అధికారుల ఫోన్లను స్వాధీనం చేసుకున్నాం. అర్ధరాత్రి కసబ్‌ను ఎర్రవాడ జైలు అధికారులకు అప్పగించగానే..‘పార్సిల్ రీచ్డ్ ఫాక్స్’ అంటూ పోలీస్ ఉన్నతాధికారి సంకేత భాషలో మిగతావారికి సమాచారం చేరవేశారు. ఉరితీత నోటీసులను వారంరోజుల కసబ్‌కు అందజేశాం. చివరికి నవంబర్ 21న తెల్లవారుజామున 3 గంటలకు కసబ్‌ను ఉరితీశారు. ఆ తర్వాత కసబ్ ఉరి వార్త ప్రపంచమంతా తెలిసిపోయింది’ అని అప్పటి అనుభవాలను గుర్తుచేసుకున్నారు. -
26/11 పదేళ్ల ఉగ్ర జ్ఞాపకం
‘అల్లా కసమ్, ఐసి గల్తీ దొబార నహీ హోగీ’. ఉరితీసే ముందు అజ్మల్ కసబ్ చివరి మాటలివి. ‘అల్లా మీద ప్రమాణం. ఇలాంటి తప్పు మళ్లీ చెయ్యను’ అని! పాకిస్తానీ టెర్రరిస్ట్ కసబ్. ముంబైపై ఉగ్రదాడుల సూత్రధారి! 2008 నవంబర్ 26–27 మధ్య.. ఆ అర్ధరాత్రి, ముంబైలో ఏకకాలంలో కనీసం పదిచోట్ల బాంబు దాడులు జరిపించి, 174 మంది దుర్మరణానికి, మూడొందల మందికి పైగా క్షతగాత్రులవడానికి కారణమైన లష్కరే తోయిబా టెర్రరిస్ట్. అతడి చివరి మాటలివి. కసబ్‌ని 2012లో భారత ప్రభుత్వం ఉరితీసింది. అంతకు నాలుగేళ్ల క్రితమే.. ముంబై పేలుళ్లు జరిగిన మరుసటి రోజు.. మళ్లీ ఇలాంటి ఘోరం జరగనిచ్చేది లేదని భారత ప్రభుత్వం ప్రతిన పూనింది. మరి అప్పటికీ ఇప్పటికీ పరిస్థితి ఏమైనా మారిందా? మారిందని మనకు అనిపించవచ్చు. అయితే టెర్రరిస్టులను సజీవంగా పట్టుకునే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయిన ఐదుగురు పోలీస్ అధికారుల కుటుంబాల పరిస్థితి మాత్రం ఏం మారలేదని అంటున్నారు. అసలు పరిస్థితిని మార్చుకోవలసినంతగా ఎందుకు మనం నిర్లక్ష్యం వహించామని అడుగుతున్నారు. ఆ ఐదుగురి గురించి ఒక మననం. ఆ కుటుంబాల గురించి ఒక అవలోకనం. హేమంత్ కర్కరే ముంబై యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) చీఫ్. దాదర్‌లోని తన ఇంట్లో భార్యతో కలిసి భోజనం చేస్తున్నప్పుడు ఫోన్ వచ్చింది కర్కరేకి. ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్ రైల్వే స్టేషన్లోకి ఉగ్రవాదులు చొరబడ్డారని సమాచారం! కర్కరే రైల్వే స్టేషన్‌కి వెళ్లే సరికే ఉగ్రవాదులు అక్కడి నుంచి కామా ఆల్బ్లెస్ హాస్పిటల్‌కి మూవ్ అయ్యారు. కర్కరే మిగతా ఆఫీసర్స్‌ని కలుపుకుని ఆల్బ్లెస్కి వెళ్లారు. కొంతమందిని అక్కడ ఉంచి.. కర్కరే, కామ్తే, సలాస్కర్ క్వాలిస్ జీప్ ఎక్కారు. ఒక ఎర్ర కారు వెనుక టెర్రరిస్టులు నక్కి ఉన్నారని వైర్లెస్లో ఇన్ఫర్మేషన్ రావడంతో అక్కడికి Ðð ళ్లారు. ఎర్ర కారులోని టెర్రరిస్టులు వీళ్లను గుర్తించి కాల్పులు జరిపారు. మొదట కర్కరే ఏకే 47 కింద పడింది. ఆ వెంటనే కర్కరే నేలకు ఒరిగాడు. హేమంత్ కర్కరే, కవిత కుటుంబం: భార్య కవిత, కొడుకు ఆశాశ్, కూతుళ్లు సయాలి, జూయీ. ఇదీ హేమంత్ కుటుంబం. కవిత (57) 2014లో బ్రెయిన్ హెమరేజ్‌తో చనిపోయారు. ఆమె అభీష్టానుసారం పిల్లలు.. తల్లి అవయవాలను ఆసుపత్రికి డొనేట్ చేశారు. తన భర్త మరణానికి కారణం భద్రతా లోపాలేనని కవిత ఎప్పుడూ అంటుండేవారు. పోలీస్ సిబ్బందికి అధునాతనమైన ఆయుధాలను ఇవ్వాలని, వాళ్లను ఎప్పటికప్పుడు సుశిక్షితులను చేసే వ్యవస్థ ఉండాలని ప్రభుత్వానికి లేఖలు కూడా రాశారు. తుకారామ్ ఆంబ్లే అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్. టెర్రరిస్టులు మెరైన్ డ్రైవ్ వైపు వెళుతున్నారని సమాచారం రావడంతో.. ఆ దారిని బ్లాక్ చేసే డ్యూటీని తుకారామ్‌కి అప్పజెప్పింది డిపార్ట్మెంట్. కారును ఆపాడు. ఒట్టి చేతుల్తో కసబ్‌తో కలియబడి అతడి దగ్గరున్న బుల్లెట్లన్నీ లాగేసుకున్నాడు. తుకారామ్ ఆ పని చేయకపోయుంటే.. కసబ్ తనని తను కాల్చుకుని ఉండేవాడేమో. టెర్రరిస్టులతో జరిగిన ఆ ఘర్షణలోనే తుకారామ్ మరణించాడు. తుకారామ్ ఆంబ్లే, తారాబాయి కుటుంబం: తుకారామ్ ఆంబ్లేకి నలుగురు కూతుళ్లు. పవిత్ర, వందన, వైశాలి, భారతి. కొడుకులు లేరు. భార్య తారాబాయి. ఉగ్రదాడుల్లో తుకారామ్ చనిపోయే నాటికి పవిత్రకు, వందనకు పెళ్లిళ్లు అయిపోయాయి. ఆ ఇంట్లో ప్రస్తుతం తారాబాయి, వైశాలి, భారతి ఉంటున్నారు. ‘‘ఇప్పటికీ.. మా నాన్న డ్యూటీ అయిపోయాక, ఇంట్లోకి రాగానే తలపై నుంచి టోపీ తీసి రోజూ పెట్టే చోటే తగిలించి, మా వైపు చూసి నవ్వుతూ ‘ఏంటి విశేషాలు..’ అని అడుగుతున్నట్లే ఉంటుంది. కానీ మాకు తెలుసు మా నాన్న తిరిగి రారని. వస్తే బాగుండని అనిపిస్తుంది’’ అని అంటుంది వైశాలి. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ సందీప్ ఆర్మీ ఆఫీసర్. తాజ్ హోటల్లోని ఆరో ఫ్లోర్లో ఉగ్రదాడి జరుగుతున్నప్పుడు అక్కడికి ఎన్.ఎస్.సి. (నేషనల్ సెక్యూరిటీ గార్డ్) టీమ్‌ని లీడ్ చేసింది సందీపే. మొత్తం పదిమంది కమాండోలు. వారికి గైడ్‌లైన్స్ ఇస్తున్న సమయంలో వెనుక నుంచి జరిగిన కాల్పుల్లో సందీప్ చనిపోయాడు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్, అమ్మ ధనలక్ష్మి కుటుంబం: అమ్మ ధనలక్ష్మి, నాన్న ఉన్నికృష్ణన్.. సందీప్, వీళ్ల ముగ్గురే. సందీప్ ఒకడే సంతానం. పెళ్లి కావలసి ఉంది. ఉగ్రవాదులతో తలపడుతున్నప్పుడు.. ‘‘ముందుకు వెళ్లకండి. నేను హ్యాండిల్ చేస్తాను’’ అన్నవి అతడి చివరి మాటలు. ఆపరేషన్‌లో పాల్గొన్న మిగతా కమాండోలను ఉద్దేశించి ఆ మాటలు అన్నాడు. ‘‘నా కొడుకు చనిపోలేదు. బతికే ఉన్నాడు’’ అని అంటుంటారు ధనలక్ష్మి.. ఎవరు ఆనాటి సంఘటనను ప్రస్తావించినా. అశోక్ కామ్తే అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్. ఎటాక్ జరుగుతున్న ఏరియా అతడి పరిధిలోని కాదు. కానీ టెర్రరిస్టులు అనగానే అక్కడి ఆఫీసర్స్కి సహకారం అందించడానికి బయల్దేరాడు. సి.ఎస్.ఎం.టి. రైల్వే స్టేషన్లో హేమంత్ కర్కరేకి, విజయ్ సలాస్కర్కి జత కలిశాడు. వారితో కలిసి క్వాలిస్ జీప్ ఎక్కాడు. వీళ్ల జీప్‌పై టెర్రరిస్టులు కాల్పులు జరుపుతుంటే.. చివరి వరకు అతడి తుపాకీ గర్జిస్తూనే ఉంది. కర్కరే, సలాస్కర్, తర్వాత అశోక్ కామ్తే టెర్రరిస్టుల బులెట్లకు బలి అయ్యాడు. అశోక్ కామ్తే, వినీత కుటుంబం: అశోక్, ఆయన భార్య వినీత, ఇద్దరు కొడుకులు రాహుల్, అర్జున్, అశోక్ తల్లిదండ్రులు, చెల్లి షర్మిల అంతా ఒకే ఇంట్లో ఉండేవారు. అశోక్ మరణంతో ఆ కుటుంబం ఆత్మస్థయిర్యం సడలింది కానీ, అశోక్ భార్య ధీశాలిగా కుటుంబం కోసం నిలబడ్డారు. భర్త జీవిత చరిత్రను ‘టు ద లాస్ట్ బుల్లెట్’ అనే పుస్తకంగా తెచ్చారు. వినీత లా చదివారు. కార్మికుల కేసులను వాదిస్తుంటారు. అశోక్ చనిపోయాక, ఆయన ఉండే గదికి ఆ కుటుంబం ఒక బోర్డును పెట్టింది. ‘‘మిమ్మల్ని చూసి మేం గర్వపడుతున్నాం. మీరు మా హీరో’ అని అందులో రాసి ఉంటుంది. డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం వల్లే తన భర్త.. ఉగ్రవాదుల ఘాతుకానికి బలయ్యాడని వినీత ఇప్పటికీ బలంగా నమ్ముతున్నారు. విజయ్ సలాస్కర్ పోలీస్ ఇన్స్పెక్టర్. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. యాంటీ–ఎక్స్టార్షన్ (బలవంతపు వసూళ్ల నిరోధం) హెడ్డు. కర్కరే, కామ్తేలతో పాటు ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించాడు. విజయ్ సలాస్కర్ భార్య స్మిత కుటుంబం: విజయ్ సలాస్కర్ భార్య స్మిత. కూతురు దివ్య ఏకైక సంతానం. విజయ్ చనిపోయేటప్పటికే ఆమె వయసు 21. ‘‘డాడీ ఎప్పుడూ త్వరగా ఇంటికి రారు. కానీ ఆ రోజు రాత్రి (నవంబర్ 26) త్వరగా వచ్చారు. ‘‘త్వరగా వచ్చారేంటి డాడీ’’ అన్నాను. ‘‘నిన్ను సర్ప్రైజ్ చేద్దామనీ’’ అని నవ్వుతూ అన్నారు. ‘‘అయితే లాంగ్ డ్రైవ్‌కి వెళ్లి ఐస్‌క్రీమ్ తినాల్సిందే’’ అన్నాను. మమ్మీ తిట్టింది. ‘‘ముందు ఆయన్ని భోజనం చెయ్యనివ్వు. తర్వాత వెళ్దువు’’ అంది. నేను.. నా బెడ్రూమ్లోకి వెళ్లాను. అంతే. ఆ తర్వాత డాడీకి ఏదో కాల్ వచ్చింది. వెంటనే వెళ్లిపోయారు. 11.57 కి ‘‘ఎక్కడున్నారు?’’ అని మమ్మీ డాడీకి ఫోన్ చేసింది. ‘‘స్పాట్’లో అని చెప్పారట డాడీ. చెప్పుడూ చెప్పే జవాబే! ‘‘ఇదేం బాగోలేదు’’ అంటోంది మమ్మీ. కొంతసేపటి తర్వాత టీవీ స్క్రోలింగ్‌లో డాడీ చనిపోయినట్లు వచ్చింది’’.. అని మాత్రం షేర్ చేసుకోగలుగుతున్నారు దివ్య. ఆ తర్వాతి ఘటనలు గుర్తు చేసుకోడానికి ఆమె ఇష్టపడడం లేదు. వీళ్లైదుగురే కాదు. బ్రేవ్ హార్ట్స్ ఇంకా ఉన్నాయి. హవల్దార్ గజేంద్రసింగ్, నాగప్ప మహాలే, కిశోర్, షిండే, సంజయ్ గోవిల్కర్ వంటి ఎందరో ఉగ్రమూకలతో ప్రాణాలకు ఒడ్డి పోరాడారు. వీరిలో కొందరు చనిపోయారు. కొందరు క్షతగాత్రులయ్యారు. పాణాలకు ఒడ్డి పోరాడారు. వీరిలో కొందరు చనిపోయారు. కొందరు క్షత గాత్రులయ్యారు. -
అమిత్‌షాను టార్గెట్ చేసిన అఖిలేశ్ భార్య
-
అమిత్‌షాను టార్గెట్ చేసిన అఖిలేశ్ భార్య
జౌన్పూర్: ఉగ్రవాది కసాయి కసబ్ చనిపోయి చాలా రోజులవుతున్నా ఉత్తరప్రదేశ్ ఎన్నికల పుణ్యానా, నేతల దయవల్ల మరోసారి అతడిపేరు విరివిగా వినిపిస్తోంది. జనాలకు చిరాకు వచ్చే స్థాయిలో కసబ్ పేరును తలుస్తున్నారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా నోట వచ్చిన ఈ మాటను ఒక నేత తర్వాత మరో నేత మోస్తూనే ఉన్నారు. ప్రతిపక్ష పార్టీలపై దాడి చేసేందుకు అమిత్‌షా ఈ మాటను ఉపయోగించగా ఇప్పుడు ప్రతిపక్షాలన్నీ కూడా తిరిగి బీజేపీపై దాడి చేసేందుకు అదే పేరును తలుస్తూ దానికి కొత్త అర్థాన్ని, నిర్వచనాలను, విస్తృతిని కల్పిస్తున్నాయి. తాజాగా, కసబ్ అనే పేరుకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ కొత్త నిర్వచనం చెప్పారు. కసబ్ అనే పేరులో క అంటే హిందీలో కంప్యూటర్ అని, స అంటే స్మార్ట్ ఫోన్ అని, ఇక బీ అంటే బచ్చే (చిన్నారులు) అని ఆమె కొత్త అర్ధం చెప్పారు. ఈ రోజుల్లో కంప్యూటర్ లేకుండా ఉండలేమని, ఇక స్మార్ట్‌ఫోన్‌తో ప్రభుత్వ విధానాలన్నీ కూడా తెలుసుకోవచ్చని, పిల్లల సంరక్షణే తమ ధ్యేయంగా ముందుకెళతామని వివరించారు. అమిత్ షా చెప్పినంత చెడు అర్థం తమకు వర్తించదని ఆమె ఎదురుదాడికి దిగారు. తొలుత కసబ్ అనే పేరులో క అంటే కాంగ్రెస్ అని, స అంటే సమాజ్‌వాది పార్టీ అని బీ అంటే బీ అంటే బీఎస్పీ అని, ఈ కసబ్ పీడ త్వరలోనే వదులుతుందంటూ అమిత్‌షా విమర్శించగా ఆ సమయంలో స్పందించిన అఖిలేశ్ కా అంటే పావురం అని చెప్పారు. ఇక మాయావతి అయితే, అమిత్‌షా అయితే కసబ్‌ను మించినవారని, అసలు అమిత్ షా ఒక టెర్రిరిస్టు అని తీవ్రంగా ఆరోపించారు. ఇలా, కసబ్ పేరుతో పెద్ద దుమారం రేపుతున్నారు. -
కసబ్ బారినుంచి తప్పించుకోండి: అమిత్ షా
ఉత్తరప్రదేశ్ వాసులు 'కసబ్' బారి నుంచి తప్పించుకోవాలని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా అన్నారు. ఈ 'కసబ్'లో.. క అంటే కాంగ్రెస్, స అంటే సమాజ్‌వాదీ, బ అంటే బహుజన్ సమాజ్ పార్టీ అని ఆయన అభివర్ణించారు. గోరఖ్‌పూర్‌లో జరిగిన ఎన్నికల సభలో పాల్గొని ఆయన మాట్లాడారు. కసబ్‌ను పూర్తిగా పడుకోబెడితే తప్ప రాష్ట్రంలో అభివృద్ధి అన్నదే కనిపించదని చెప్పారు. ఇంతకుముందు ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా స్కాం అంటే సమాజ్‌వాదీ, కాంగ్రెస్, అఖిలేష్, మాయావతి అని అభివర్ణించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ముంబై ఉగ్రదాడి ఘటనలో సజీవంగా పట్టుబడిన ఏకైక ఉగ్రవాది కసబ్ పేరును అమిత్ షా వాడుకున్నారు. అయితే, ప్రధానమంత్రి ఉపయోగించిన స్కాం పదాన్ని అఖిలేష్ యాదవ్ మరోలా వాడుకున్నారు. స్కాం అంటే సేవ్ కంట్రీ ఫ్రమ్ అమిత్ షా అండ్ మోదీ అని ఆయన చెప్పారు. -
కసబ్ మంచివాడో కాదో తెలియదు కానీ..
ముంబై ఉగ్రదాడుల కేసులో నిందితుడు... ఇటీవల అప్రూవర్‌గా మారిన పాక్ ఆమెరికన్ ఉగ్రవాది డేవిడ్ హెడ్లీ విచారణ రెండోరోజూ కొనసాగింది. శివసేన అధినేత బాలఠాక్రే హత్యకు ప్లాన్ చేశామని ప్రకటించి సంచలనం సృష్టించిన హెడ్లీ మరిన్ని వివరాలు వెల్లడించాడు. కసబ్ మంచివాడో కాదో తెలియదు గానీ.. అతను చేసిన పని ఎంతమాత్రం మంచిది కాదని వీడియో కాన్ఫరెన్స్ విచారణలో పేర్కొన్నాడు. 26 నవంబర్ దాడి ఘటనపై తాను ఇప్పటికే పశ్చాత్తాపం ప్రకటించానన్నాడు. ఆ పేలుళ్లలో భాగస్వామిగా నేరం చేశానని చెప్పాడు. కరాచీలోని లష్కరే తాయిబా కార్యాలయాన్ని తన జీవితంలో ఎప్పుడూ సందర్శించలేదని తెలిపాడు. 26/11 దాడుల తర్వాత కూడా భారత్‌పై దాడిచేసేందుకు తాను ప్రయత్నించానన్నాడు. కానీ ఈసారి అల్-కాయిదా సూచనలతో దాడి చేసేందుకు ప్రణాళిక రచించినా అది అమలుకాలేదని క్రాస్ ఎగ్జామినేషన్‌లో తెలిపాడు. మరోవైపు పాక్ ఐఎస్ఐ ముంబై దాడుల కోసం భారీగా నిధులు సమకూర్చినట్లు డేవిడ్ హెడ్లీ విచారణలో అంగీకరించాడని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ వెల్లడించారు. -
'కసబ్‌ను చంపినందుకు కక్ష తీర్చుకుంటా'
పాట్నా: రాజస్థాన్ పోలీసు ఉన్నతాధికారులకు కసబ్‌ను ఉద్దేశిస్తూ బీహార్ పోలీసు కానిస్టేబుల్ బెదిరింపు ఎస్సెమ్మెస్‌లు చేశాడు. అజ్మల్ కసబ్, యాకుబ్ మెమన్ ఉరితీయడం పట్ల తాను కక్ష తీర్చుకుంటానని, వరుస బాంబు పేలుళ్లకు పాల్పడతానని రాజస్థాన్ డీజీపీ ఇతర ఉన్నత పోలీసు అధికారులకు ఎస్సెమ్మెస్ పంపించాడు. దీంతో అతడిని పోలీసులు ట్రేజ్ చేసి వెంటనే అరెస్టు చేశారు. ఈ విషయాన్ని బీహార్ పోలీసు ఉన్నతాధికారి తెలిపాడు. అరెస్టు చేసిన వ్యక్తిని సిగోరి అనే గ్రామానికి చెందిన షా ఉజేయిర్గా గుర్తించామని అతడిని విచారిస్తున్నామని వివరించారు. ప్రస్తుతం విధుల్లోనే ఉన్న ఉజెయిర్ మానసికంగా కూడా బాగానే ఉన్నాడని, ఇటీవల కాలంలో ఇలాంటి తరహా ఎస్సెమ్మెస్‌లు పంపించడం అతడికి పరిపాటిగా మారిందని ప్రాథమిక విచారణలో వెల్లడయినట్లు వివరించారు. అయితే, ఇవన్నీ అతడు కావాలని చేస్తున్నాడా లేక మరేదైనా కోణముందా అనే దిశగా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజే అతడు ఈ ఎస్సెమ్మెస్‌లు పంపించాడు. -
రెండో కసబ్!
బుద్ధి మారని పాకిస్థాన్‌కు ఇది రెండో షాక్. 2008లో ముంబై దాడిలో ఉగ్రవాది కసబ్ పట్టుబడిన విధంగానే బుధవారం జమ్మూ-కశ్మీర్‌లోని ఉధంపూర్ ప్రాంతంలో మరో ఉగ్రవాది దొరికిపోయాడు. దాంతో ఆ దేశం అనుసరిస్తున్న ద్వంద్వ ప్రమాణాలు మరోసారి ప్రపంచానికి వెల్లడయ్యాయి. ఇలా ఉగ్రవాదుల్ని పంపడం అక్కడి సైన్యం పనా... దాని నేతృత్వంలో పనిచేస్తున్న గూఢచార సంస్థ ఐఎస్ఐ పన్నాగమా... పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబా చేసిందా లేక ఈ ముగ్గురి సమన్వయంతో అమలైన పథకమా అన్నది ఇంకా తేలాల్సి ఉంది. పంపింది ఎవరైనా... మరో పక్షం రోజుల్లో జరగబోయే ఇరు దేశాల జాతీయ భద్రతా సలహాదారుల సమావేశాన్ని భగ్నం చేయడం కోసమేనని కేంద్ర ప్రభుత్వం విశ్వసిస్తోంది. చంపడానికీ, చావడానికీ సిద్ధపడి వచ్చే ఉగ్రవాదుల్ని పట్టుకోవడం అంత సులభం కాదు. అందుకు సమయస్ఫూర్తి, గుండె ధైర్యం దండిగా ఉండాలి. ఎంతో చాకచక్యంగా వ్యవహరించగలగాలి. ఆ పని ఉధంపూర్ సమీప గ్రామస్తులు చేయగలిగారు. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై వెళ్తున్న బీఎస్ఎఫ్ జవాన్ల వాహనంపై దాడి చేసి ఇద్దరిని పొట్టన బెట్టుకున్న ఉగ్రవాదుల్లో ఒకడు ఎదురు కాల్పుల్లో అక్కడికక్కడే మరణించగా మరొకడు గ్రామంలోకొచ్చి ఏకే-47 చూపి బెదిరించి అయిదుగురు పౌరుల్ని తీసుకెళ్లి ఒక స్కూల్ భవనంలో బంధించగా ఇద్దరు యువకులు ప్రాణాలకు తెగించి అతన్ని పట్టుకున్నారు. ఆ యువకుడు తన పేరును ఖాసిమ్ అని కాసేపు...ఉస్మాన్ అని కాసేపు... నవేద్ అని కాసేపు చెప్పాడు. అందులో ఏది నిజమో, అతని పుట్టుపూర్వోత్తరాలేమిటో, ఎవరు పంపగా వచ్చాడో, ఎక్కడ శిక్షణ పొందాడో నిఘా సంస్థల ఇంటరాగేషన్‌లో వెల్లడికావలసి ఉన్నా...పట్టుబడిన వెంటనే అతని హావభావాలూ, ఇచ్చిన జవాబులూ గమనిస్తే ఏ స్థాయి వ్యక్తుల్ని ఉగ్రవాదులుగా మార్చి ఇక్కడకు పంపుతున్నారో అర్ధమవుతుంది. మనుషుల్ని చంపడం వినోదమని... ఈ క్రమంలో చనిపోవడం అల్లా ఆజ్ఞగా భావిస్తానని అతను చెబుతున్నాడు. అతనిలో అపరాధభావంగానీ, ఇకపై ఏమవుతుందోనన్న బెదురుగానీ కనబడలేదు. ఏమాత్రం మానసిక పరిణతి సాధించని యువకుల్ని ఎంచుకుని వారికి మతోన్మాదాన్ని నూరిపోసి, మనుషుల ప్రాణాలు తీయడం ఘన కార్యమని చిత్రించి మారణాయుధాలు చేతికిచ్చి పంపుతున్నారని అతని మాటల్ని వింటే తెలుస్తుంది. ఉధంపూర్‌లో దాడికి వచ్చిన ఈ ఇద్దరూ గత నెల 27న పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలో ఏడుగుర్ని కాల్చిచంపిన ముఠాలోని వారేనన్న అనుమానాలున్నాయి. పాకి స్థాన్లోని ఫైసలాబాద్ నుంచి తామిద్దరమే 12 రోజులక్రితం ఇటు వచ్చామంటున్న ఉగ్రవాది మాటల్లో ఎంతవరకూ నిజం ఉన్నదో ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. ఒక దేశంగా మనుగడ సాగిస్తున్న పాకిస్థాన్‌లో వ్యవస్థలు పరస్పరం తలపడటం గమనిస్తాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడే పౌర ప్రభుత్వాలను అక్కడి సైన్యం పెద్దగా లెక్కచేయదు. అన్నిటా తమ ప్రమేయం ఉండాలని కోరుకుంటుంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను అమలు చేయడం నామర్దాగా భావిస్తుంది. అంతర్గత వ్యవహారాల్లో ఇందువల్ల తలెత్తే సమస్యలేమిటన్నది పక్కనబెడితే అంతర్జాతీ యంగా... మరీ ముఖ్యంగా భారత్‌తో సంబంధాల విషయంలో పాక్ ప్రభుత్వానికి ఇబ్బందులు ఏర్పడుతున్నా, తలెత్తుకోలేని పరిస్థితులు ఎదురవుతున్నా సైన్యానికి పట్టదు. ఇరు దేశాలమధ్యా సామరస్యపూర్వక వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్న ప్రతిసారీ దాన్ని భగ్నం చేయడం పాక్ సైన్యానికి అలవాటుగా మారింది. అందువల్లే తాజా ఘటన వెనక త్వరలో జరగబోయే ఇరు దేశాల ఎన్ఎస్ఏల సమావేశానికి అడ్డంకులు కల్పించే దురుద్దేశం ఉండొచ్చునని కేంద్రం అంచనా వేస్తున్నది. రెండేళ్లక్రితం పాకిస్థాన్‌లో అధికారం స్వీకరించినప్పుడు ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రపంచానికి స్పష్టమైన హామీ ఇచ్చారు. తమ భూభాగం ఉగ్రవాదుల అడ్డా కానీయబోమని చెప్పారు. సరిహద్దుల్ని ప్రశాంతంగా ఉంచడానికి తమవైపుగా కృషి చేస్తామని అన్నారు. కానీ ఆచరణలో ఇవన్నీ ఎటో కొట్టుకుపోయాయి. అధీన రేఖ వద్ద తరచు కాల్పుల విరమణ ఉల్లంఘనలు చోటు చేసుకుంటుండగా ఉగ్రవాదుల చొరబాట్లూ ఆగలేదు. ఈమధ్యే పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలో ఉగ్రవాదులు హింసాకాండ సృష్టించారు. పాకిస్థాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ చీఫ్‌గా పనిచేసి రిటైరైన తారిక్ ఖోసా రెండు రోజులక్రితమే పాకిస్థాన్ ద్వంద్వ ప్రమాణాలను అక్కడి ‘డాన్’ పత్రికకు రాసిన వ్యాసంలో నిశితంగా విమర్శించారు. ముంబై దాడితో ప్రమేయం ఉన్న నిందితులను విచారించడంలో జరుగుతున్న జాప్యాన్ని తప్పుబట్టారు. ఈ కేసు విషయంలో సక్రమంగా వ్యవహరించాలని ఆయన హితవు చెప్పిన రెండ్రోజులకే ఇక్కడ మరో కసబ్ దొరికిపోయాడు. ఉగ్రవాది పట్టుబడిన ఉధంపూర్ ప్రాంతం ఇటీవలికాలంలో ప్రశాంతంగా ఉంటున్నది. మిలిటెన్సీ జాడ దాదాపు కనుమరుగైంది. అక్కడ నిఘా సరిగా లేకపోవడంవల్లే ఉగ్రవాదుల కదలికలు సాధ్యమైందనిపిస్తుంది. అమర్నాథ్ యాత్రీకులు ఆ ప్రాంతంనుంచే వెళ్తున్నారు గనుక అదనపు భద్రత, నిఘా అవసరం ఉండగా ఏకే-47తో ఉగ్రవాదులు ఎలా రాగలిగారో అంతుబట్టదు. పాక్ నుంచి ఇంకెంతమంది సరిహద్దులు దాటివచ్చారో ఊహకందదు. తమ ఎఫ్ఐఏ మాజీ చీఫ్ చెప్పాడని మాత్రమే కాదు...తాజా ఘటనతోనైనా పాకిస్థాన్ ప్రభుత్వం కళ్లు తెరవాలి. ద్వైపాక్షికంగా సమస్యలుంటే వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకునే ప్రయత్నాలు చేయాలి తప్ప ఇలా ఉగ్రవాదాన్ని ఎగుమతి చేసి పొరుగు దేశంలో సమస్యలు సృష్టించాలనుకోవడం తెలివితక్కువతనం. దీన్ని సరిదిద్దాల్సిన బాధ్యత అక్కడి ప్రభుత్వంపై ఉంది. ఇరు దేశాల సంబంధాలనూ ఎవరో కొందరు వ్యక్తులు లేదా ముఠాలు నిర్దేశించడానికి ప్రయత్నిస్తుంటే చేతగానితనాన్ని ప్రదర్శించడం ఆత్మహత్యాసదృశమవుతుందని తెలుసుకోవాలి. -
కసబ్..అఫ్జల్...మెమన్..
న్యూఢిల్లీ : గత మూడేళ్లలో యాకుబ్ మెమన్ది మూడో ఉరితీత. దేశంలో గడిచిన మూడేళ్ల కాలంలోమూడు ఉరిశిక్షలు అమలు అయ్యాయి. 2008 ముంబై మారణకాండలో సజీవంగా పట్టుబడ్డ కసాయి అజ్మల్ అమీర్ కసబ్ 2012 నవంబరు 12న పుణేలోని యెరవాడ జైలులో ఉరితీశారు. తర్వాత 2013 ఫిబ్రవరి 9న అఫ్జల్ గురు (పార్లమెంటుపై దాడి కేసులో మరణశిక్ష పడింది)ను తీహార్ జైలులో ఉరి తీశారు. ఆ తర్వాత అతడిని జైలులోనే ఖననం చేశారు. ఇక ముంబై పేలుళ్ల కేసులో నిందితుడు యాకుబ్ మెమన్ను గురువారం మహారాష్ట్రలోని నాగపూర్ సెంట్రల్ జైలులో ఉరి తీసిన విషయం తెలిసిందే. కాగా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం 2004 నుంచి 2015 మధ్యకాలంలో దేశంలోని వివిధ కోర్టులు ఏకంగా 1,303 మందికి మరణదండన విధించాయి. అయితే వీరిలో వెస్ట్ బెంగాల్ (2004), మహారాష్ట్ర (2012), ఢిల్లీ (2013)కి చెందిన ముగ్గురు మాత్రమే ఉరికంబం ఎక్కారు. ఓ టీనేజీ అమ్మాయిని రేప్ చేసి చంపిన వాచ్‌మన్ ధనంజయ్ ఛటర్జీని 2004 ఆగష్టు 14న వెస్ట్ బెంగాల్‌లోని అలిపోర్ సెంట్రల్ జైలులో ఉరితీశారు. ఇక 2004 -2014 మధ్య కాలంలో ఎవరికీ ఉరిశిక్ష అమలు కాలేదు. ఈ పదేళ్ల కాలంలో 3.751 ఉరిశిక్షలను వివిధ కోర్టులు జీవితఖైదుగా మార్చాయి.