
అమిత్‌షాను టార్గెట్ చేసిన అఖిలేశ్ భార్య
జౌన్‌పూర్: ఉగ్రవాది కసాయి కసబ్ చనిపోయి చాలా రోజులవుతున్నా ఉత్తరప్రదేశ్ ఎన్నికల పుణ్యానా, నేతల దయవల్ల మరోసారి అతడిపేరు విరివిగా వినిపిస్తోంది. జనాలకు చిరాకు వచ్చే స్థాయిలో కసబ్ పేరును తలుస్తున్నారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా నోట వచ్చిన ఈ మాటను ఒక నేత తర్వాత మరో నేత మోస్తూనే ఉన్నారు. ప్రతిపక్ష పార్టీలపై దాడి చేసేందుకు అమిత్‌షా ఈ మాటను ఉపయోగించగా ఇప్పుడు ప్రతిపక్షాలన్నీ కూడా తిరిగి బీజేపీపై దాడి చేసేందుకు అదే పేరును తలుస్తూ దానికి కొత్త అర్థాన్ని, నిర్వచనాలను, విస్తృతిని కల్పిస్తున్నాయి.
తాజాగా, కసబ్ అనే పేరుకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ కొత్త నిర్వచనం చెప్పారు. కసబ్ అనే పేరులో క అంటే హిందీలో కంప్యూటర్ అని, స అంటే స్మార్ట్ ఫోన్ అని, ఇక బీ అంటే బచ్చే (చిన్నారులు) అని ఆమె కొత్త అర్ధం చెప్పారు. ఈ రోజుల్లో కంప్యూటర్ లేకుండా ఉండలేమని, ఇక స్మార్ట్‌ఫోన్‌తో ప్రభుత్వ విధానాలన్నీ కూడా తెలుసుకోవచ్చని, పిల్లల సంరక్షణే తమ ధ్యేయంగా ముందుకెళతామని వివరించారు. అమిత్ షా చెప్పినంత చెడు అర్థం తమకు వర్తించదని ఆమె ఎదురుదాడికి దిగారు.
తొలుత కసబ్ అనే పేరులో క అంటే కాంగ్రెస్ అని, స అంటే సమాజ్‌వాది పార్టీ అని బీ అంటే బీ అంటే బీఎస్పీ అని, ఈ కసబ్ పీడ త్వరలోనే వదులుతుందంటూ అమిత్‌షా విమర్శించగా ఆ సమయంలో స్పందించిన అఖిలేశ్ కా అంటే పావురం అని చెప్పారు. ఇక మాయావతి అయితే, అమిత్‌షా అయితే కసబ్‌ను మించినవారని, అసలు అమిత్ షా ఒక టెర్రిరిస్టు అని తీవ్రంగా ఆరోపించారు. ఇలా, కసబ్ పేరుతో పెద్ద దుమారం రేపుతున్నారు.