కసబ్ బారినుంచి తప్పించుకోండి: అమిత్ షా
ఉత్తరప్రదేశ్ వాసులు 'కసబ్' బారి నుంచి తప్పించుకోవాలని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా అన్నారు. ఈ 'కసబ్'లో.. క అంటే కాంగ్రెస్, స అంటే సమాజ్‌వాదీ, బ అంటే బహుజన్ సమాజ్ పార్టీ అని ఆయన అభివర్ణించారు. గోరఖ్‌పూర్‌లో జరిగిన ఎన్నికల సభలో పాల్గొని ఆయన మాట్లాడారు. కసబ్‌ను పూర్తిగా పడుకోబెడితే తప్ప రాష్ట్రంలో అభివృద్ధి అన్నదే కనిపించదని చెప్పారు.
ఇంతకుముందు ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా స్కాం అంటే సమాజ్‌వాదీ, కాంగ్రెస్, అఖిలేష్, మాయావతి అని అభివర్ణించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ముంబై ఉగ్రదాడి ఘటనలో సజీవంగా పట్టుబడిన ఏకైక ఉగ్రవాది కసబ్ పేరును అమిత్ షా వాడుకున్నారు. అయితే, ప్రధానమంత్రి ఉపయోగించిన స్కాం పదాన్ని అఖిలేష్ యాదవ్ మరోలా వాడుకున్నారు. స్కాం అంటే సేవ్ కంట్రీ ఫ్రమ్ అమిత్ షా అండ్ మోదీ అని ఆయన చెప్పారు.