బెంగళూరు: కర్ణాటక ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు కేంద్రమంత్రి వ్యాఖ్యలపై కర్ణాటక కాంగ్రెస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్‌తోపాటు ఆ పార్టీ నేతలు రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా, డాక్టర్ పరమేశ్వర్ బెంగుళూరులోని హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఇటీవల కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అమిత్ షా రెచ్చగొట్టే ప్రకటనలు చేశారని ఆరోపించారు. మత విద్వేషాన్ని ప్రోత్సహించేలా వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. అంతేగాక ప్రతిపక్షాలను కించపరిచేలా మాట్లాడారని విమర్శించారు. ‘ అమిత్ షా పూర్తిగా తప్పుడు, నిరాధారమైన ఆరోపణలు చేశారు. భారత జాతీయ కాంగ్రెస్ ప్రతిష్టను దిగజార్చడానికే ఉద్ధేశ్యపూర్వంగా ఇలాంటి ప్రకటనలు చేశారు. భారీ జనసమూహం, మీడియా ద్వారా చూస్తున్న ప్రేక్షకుల్లో మత కల్లోలాలు సృష్టించాలనే స్పష్టమైన లక్ష్యంతో ఇలా వ్యాఖ్యానించారు’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేగాక అమిత్ షా మాట్లాడిన వీడియో క్లిప్‌ను కూడా జత చేశారు.
చదవండి: టెన్త్ పేపర్ లీక్ కేసులో బండి సంజయ్‌కు ఊరట
మరోవైపు కేంద్రమంత్రి అమిత్‌షాపై కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల సంఘానికి సైతం ఫిర్యాదు చేసింది. కేంద్రమంత్రి వ్యాఖ్యలు అర్థరహితమని డీకే శివకుమార్ మండిపడ్డారు. హోంమంత్రి అమిత్‌షా ఆ మాటలు ఎలా చెబుతారని ప్రశ్నించారు. దీనిపై ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మరోవైపు అమిత్ షాపై ఈసీకి ఫిర్యాదుపై బీజేపీ స్పందించింది. కేంద్రమంత్రిపై ఈసీకి ఫిర్యాదు కాంగ్రెస్ రాజకీయ జిమ్మిక్కు అని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై విమర్శించారు. కాంగ్రెస్ ఆరోపణల్లో పస లేదని అన్నారు.
కాగా కర్ణాటక ఎన్నికల సందర్భంగా ఈనెల 25న విజయపుర, ఇతర ప్రాంతాల్లో అమిత్ షా ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కర్ణాటకలో బీజేపీని గద్దె దింపి కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పగిస్తే కచ్చితంగా రాష్ట్రంలో గొడవలు జరుగుతాయని అమిత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మత ఘర్షణలు, లేనిపోని అల్లర్లు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.
చదవండి: ష్.. కిచ్చా సుదీప్ ప్రచారానికి రెస్పాన్స్ ఇది!
Comments
Please login to add a commentAdd a comment