సాక్షి న్యూఢిల్లీ : కేంద్ర బలగాలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యలపై హోంమంత్రి అమిత్ షా మండిపడ్డారు. కోల్‌కతాలో శుక్రవారం మీడియాను ఉద్దేశించి షా మాట్లాడుతూ, ఓటమి భయం టీఎంసీని పీడిస్తోందని, ఈ ఫ్రస్ట్రేషన్‌లో వారి చర్యలు,వ్యాఖ్యలే దీనికి నిదర్శమని వ్యాఖ్యానించారు. పోల్ డ్యూటీలో సీఆర్‌పీఎఫ్ హోం మంత్రిత్వ శాఖ పరిధిలోకి రాదని, ఎన్నికల సంఘం పరిధిలోకి వస్తుందనీ ఆయన పేర్కొన్నారు. ప్రజలను అరాచకం వైపు నెట్టివేస్తున్నారా అంటూ ఎద్దేవా చేశారు. అసలు ఇలాంటి సీఎంను తన జీవితంలో చూడలేదంటూ హోంమంత్రి ఘాటుగా విమర్శించారు. (అది బీజేపీ సీఆర్‌పీఎఫ్)
అటు మమత వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి నోటీసులు జారీ చేసింది. కేంద్ర బలగాలపై ఆమె చేసిన వ్యాఖ్యలకు గాను వివరణ ఇవ్వాల్సిందిగా ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా మార్చి 28, ఏప్రిల్ 7న కేంద్ర భద్రతా దళాలను "ఘెరావ్" చేయమని ప్రజలకు చెబుతూ మమత అత్యంత అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై శనివారం ఉదయం 11 గంటల్లోగా స్పందించాలని పేర్కొంది. మమత వ్యాఖ్యలు, ఎన్నికల కోడ్‌తోపాటు చట్టాన్ని ఉల్లంఘించినట్టేనని ఈసీ తెలిపింది. అయితే గత రెండు రోజుల్లో మమతకు ఈసీనుంచి నోటీసులు రావడం ఇది రెండవసారి.
మరోవైపు ఈసీ పది నోటీసులిచ్చినా తన వైఖరి మారదని సీఎం మమతా తేల్చి చెప్పారు. మతాల ప్రాతిపదికన ఓటర్లను విడగొట్టే ప్రయత్నాలకు వ్యతిరేకంగా తాను మాట్లాడుతూనే ఉంటానని దీదీ గురువారం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. కాగా ఎనిమిది దశల ఎన్నికలలో భాగంగా నాలుగో రౌండ్‌లో శనివారం పోలింగ్ జరగనుంది. మే 2న ఫలితాలు వెలువడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment