
కసబ్..అఫ్జల్...మెమన్..
న్యూఢిల్లీ : గత మూడేళ్లలో యాకుబ్ మెమన్ది మూడో ఉరితీత. దేశంలో గడిచిన మూడేళ్ల కాలంలోమూడు ఉరిశిక్షలు అమలు అయ్యాయి. 2008 ముంబై మారణకాండలో సజీవంగా పట్టుబడ్డ కసాయి అజ్మల్ అమీర్ కసబ్ 2012 నవంబరు 12న పుణేలోని యెరవాడ జైలులో ఉరితీశారు. తర్వాత 2013 ఫిబ్రవరి 9న అఫ్జల్ గురు (పార్లమెంటుపై దాడి కేసులో మరణశిక్ష పడింది)ను తీహార్ జైలులో ఉరి తీశారు. ఆ తర్వాత అతడిని జైలులోనే ఖననం చేశారు. ఇక ముంబై పేలుళ్ల కేసులో నిందితుడు యాకుబ్ మెమన్ను గురువారం మహారాష్ట్రలోని నాగపూర్ సెంట్రల్ జైలులో ఉరి తీసిన విషయం తెలిసిందే.
కాగా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం 2004 నుంచి 2015 మధ్యకాలంలో దేశంలోని వివిధ కోర్టులు ఏకంగా 1,303 మందికి మరణదండన విధించాయి. అయితే వీరిలో వెస్ట్ బెంగాల్ (2004), మహారాష్ట్ర (2012), ఢిల్లీ (2013)కి చెందిన ముగ్గురు మాత్రమే ఉరికంబం ఎక్కారు. ఓ టీనేజీ అమ్మాయిని రేప్ చేసి చంపిన వాచ్‌మన్ ధనంజయ్ ఛటర్జీని 2004 ఆగష్టు 14న వెస్ట్ బెంగాల్‌లోని అలిపోర్ సెంట్రల్ జైలులో ఉరితీశారు. ఇక 2004 -2014 మధ్య కాలంలో ఎవరికీ ఉరిశిక్ష అమలు కాలేదు. ఈ పదేళ్ల కాలంలో 3.751 ఉరిశిక్షలను వివిధ కోర్టులు జీవితఖైదుగా మార్చాయి.