కసబ్ మంచివాడో కాదో తెలియదు కానీ..
ముంబై ఉగ్రదాడుల కేసులో నిందితుడు... ఇటీవల అప్రూవర్‌గా మారిన పాక్ ఆమెరికన్ ఉగ్రవాది డేవిడ్ హెడ్లీ విచారణ రెండోరోజూ కొనసాగింది. శివసేన అధినేత బాలఠాక్రే హత్యకు ప్లాన్ చేశామని ప్రకటించి సంచలనం సృష్టించిన హెడ్లీ మరిన్ని వివరాలు వెల్లడించాడు. కసబ్ మంచివాడో కాదో తెలియదు గానీ.. అతను చేసిన పని ఎంతమాత్రం మంచిది కాదని వీడియో కాన్ఫరెన్స్ విచారణలో పేర్కొన్నాడు. 26 నవంబర్ దాడి ఘటనపై తాను ఇప్పటికే పశ్చాత్తాపం ప్రకటించానన్నాడు. ఆ పేలుళ్లలో భాగస్వామిగా నేరం చేశానని చెప్పాడు. కరాచీలోని లష్కరే తాయిబా కార్యాలయాన్ని తన జీవితంలో ఎప్పుడూ సందర్శించలేదని తెలిపాడు.
26/11 దాడుల తర్వాత కూడా భారత్పై దాడిచేసేందుకు తాను ప్రయత్నించానన్నాడు. కానీ ఈసారి అల్-కాయిదా సూచనలతో దాడి చేసేందుకు ప్రణాళిక రచించినా అది అమలుకాలేదని క్రాస్ ఎగ్జామినేషన్‌లో తెలిపాడు. మరోవైపు పాక్ ఐఎస్ఐ ముంబై దాడుల కోసం భారీగా నిధులు సమకూర్చినట్లు డేవిడ్ హెడ్లీ విచారణలో అంగీకరించాడని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ వెల్లడించారు.