Jammu- kashmir
-
రెండో కసబ్!
బుద్ధి మారని పాకిస్థాన్‌కు ఇది రెండో షాక్. 2008లో ముంబై దాడిలో ఉగ్రవాది కసబ్ పట్టుబడిన విధంగానే బుధవారం జమ్మూ-కశ్మీర్‌లోని ఉధంపూర్ ప్రాంతంలో మరో ఉగ్రవాది దొరికిపోయాడు. దాంతో ఆ దేశం అనుసరిస్తున్న ద్వంద్వ ప్రమాణాలు మరోసారి ప్రపంచానికి వెల్లడయ్యాయి. ఇలా ఉగ్రవాదుల్ని పంపడం అక్కడి సైన్యం పనా... దాని నేతృత్వంలో పనిచేస్తున్న గూఢచార సంస్థ ఐఎస్ఐ పన్నాగమా... పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబా చేసిందా లేక ఈ ముగ్గురి సమన్వయంతో అమలైన పథకమా అన్నది ఇంకా తేలాల్సి ఉంది. పంపింది ఎవరైనా... మరో పక్షం రోజుల్లో జరగబోయే ఇరు దేశాల జాతీయ భద్రతా సలహాదారుల సమావేశాన్ని భగ్నం చేయడం కోసమేనని కేంద్ర ప్రభుత్వం విశ్వసిస్తోంది. చంపడానికీ, చావడానికీ సిద్ధపడి వచ్చే ఉగ్రవాదుల్ని పట్టుకోవడం అంత సులభం కాదు. అందుకు సమయస్ఫూర్తి, గుండె ధైర్యం దండిగా ఉండాలి. ఎంతో చాకచక్యంగా వ్యవహరించగలగాలి. ఆ పని ఉధంపూర్ సమీప గ్రామస్తులు చేయగలిగారు. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై వెళ్తున్న బీఎస్ఎఫ్ జవాన్ల వాహనంపై దాడి చేసి ఇద్దరిని పొట్టన బెట్టుకున్న ఉగ్రవాదుల్లో ఒకడు ఎదురు కాల్పుల్లో అక్కడికక్కడే మరణించగా మరొకడు గ్రామంలోకొచ్చి ఏకే-47 చూపి బెదిరించి అయిదుగురు పౌరుల్ని తీసుకెళ్లి ఒక స్కూల్ భవనంలో బంధించగా ఇద్దరు యువకులు ప్రాణాలకు తెగించి అతన్ని పట్టుకున్నారు. ఆ యువకుడు తన పేరును ఖాసిమ్ అని కాసేపు...ఉస్మాన్ అని కాసేపు... నవేద్ అని కాసేపు చెప్పాడు. అందులో ఏది నిజమో, అతని పుట్టుపూర్వోత్తరాలేమిటో, ఎవరు పంపగా వచ్చాడో, ఎక్కడ శిక్షణ పొందాడో నిఘా సంస్థల ఇంటరాగేషన్‌లో వెల్లడికావలసి ఉన్నా...పట్టుబడిన వెంటనే అతని హావభావాలూ, ఇచ్చిన జవాబులూ గమనిస్తే ఏ స్థాయి వ్యక్తుల్ని ఉగ్రవాదులుగా మార్చి ఇక్కడకు పంపుతున్నారో అర్ధమవుతుంది. మనుషుల్ని చంపడం వినోదమని... ఈ క్రమంలో చనిపోవడం అల్లా ఆజ్ఞగా భావిస్తానని అతను చెబుతున్నాడు. అతనిలో అపరాధభావంగానీ, ఇకపై ఏమవుతుందోనన్న బెదురుగానీ కనబడలేదు. ఏమాత్రం మానసిక పరిణతి సాధించని యువకుల్ని ఎంచుకుని వారికి మతోన్మాదాన్ని నూరిపోసి, మనుషుల ప్రాణాలు తీయడం ఘన కార్యమని చిత్రించి మారణాయుధాలు చేతికిచ్చి పంపుతున్నారని అతని మాటల్ని వింటే తెలుస్తుంది. ఉధంపూర్‌లో దాడికి వచ్చిన ఈ ఇద్దరూ గత నెల 27న పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలో ఏడుగుర్ని కాల్చిచంపిన ముఠాలోని వారేనన్న అనుమానాలున్నాయి. పాకి స్థాన్లోని ఫైసలాబాద్ నుంచి తామిద్దరమే 12 రోజులక్రితం ఇటు వచ్చామంటున్న ఉగ్రవాది మాటల్లో ఎంతవరకూ నిజం ఉన్నదో ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. ఒక దేశంగా మనుగడ సాగిస్తున్న పాకిస్థాన్‌లో వ్యవస్థలు పరస్పరం తలపడటం గమనిస్తాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడే పౌర ప్రభుత్వాలను అక్కడి సైన్యం పెద్దగా లెక్కచేయదు. అన్నిటా తమ ప్రమేయం ఉండాలని కోరుకుంటుంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను అమలు చేయడం నామర్దాగా భావిస్తుంది. అంతర్గత వ్యవహారాల్లో ఇందువల్ల తలెత్తే సమస్యలేమిటన్నది పక్కనబెడితే అంతర్జాతీ యంగా... మరీ ముఖ్యంగా భారత్‌తో సంబంధాల విషయంలో పాక్ ప్రభుత్వానికి ఇబ్బందులు ఏర్పడుతున్నా, తలెత్తుకోలేని పరిస్థితులు ఎదురవుతున్నా సైన్యానికి పట్టదు. ఇరు దేశాలమధ్యా సామరస్యపూర్వక వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్న ప్రతిసారీ దాన్ని భగ్నం చేయడం పాక్ సైన్యానికి అలవాటుగా మారింది. అందువల్లే తాజా ఘటన వెనక త్వరలో జరగబోయే ఇరు దేశాల ఎన్ఎస్ఏల సమావేశానికి అడ్డంకులు కల్పించే దురుద్దేశం ఉండొచ్చునని కేంద్రం అంచనా వేస్తున్నది. రెండేళ్లక్రితం పాకిస్థాన్‌లో అధికారం స్వీకరించినప్పుడు ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రపంచానికి స్పష్టమైన హామీ ఇచ్చారు. తమ భూభాగం ఉగ్రవాదుల అడ్డా కానీయబోమని చెప్పారు. సరిహద్దుల్ని ప్రశాంతంగా ఉంచడానికి తమవైపుగా కృషి చేస్తామని అన్నారు. కానీ ఆచరణలో ఇవన్నీ ఎటో కొట్టుకుపోయాయి. అధీన రేఖ వద్ద తరచు కాల్పుల విరమణ ఉల్లంఘనలు చోటు చేసుకుంటుండగా ఉగ్రవాదుల చొరబాట్లూ ఆగలేదు. ఈమధ్యే పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలో ఉగ్రవాదులు హింసాకాండ సృష్టించారు. పాకిస్థాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ చీఫ్‌గా పనిచేసి రిటైరైన తారిక్ ఖోసా రెండు రోజులక్రితమే పాకిస్థాన్ ద్వంద్వ ప్రమాణాలను అక్కడి ‘డాన్’ పత్రికకు రాసిన వ్యాసంలో నిశితంగా విమర్శించారు. ముంబై దాడితో ప్రమేయం ఉన్న నిందితులను విచారించడంలో జరుగుతున్న జాప్యాన్ని తప్పుబట్టారు. ఈ కేసు విషయంలో సక్రమంగా వ్యవహరించాలని ఆయన హితవు చెప్పిన రెండ్రోజులకే ఇక్కడ మరో కసబ్ దొరికిపోయాడు. ఉగ్రవాది పట్టుబడిన ఉధంపూర్ ప్రాంతం ఇటీవలికాలంలో ప్రశాంతంగా ఉంటున్నది. మిలిటెన్సీ జాడ దాదాపు కనుమరుగైంది. అక్కడ నిఘా సరిగా లేకపోవడంవల్లే ఉగ్రవాదుల కదలికలు సాధ్యమైందనిపిస్తుంది. అమర్నాథ్ యాత్రీకులు ఆ ప్రాంతంనుంచే వెళ్తున్నారు గనుక అదనపు భద్రత, నిఘా అవసరం ఉండగా ఏకే-47తో ఉగ్రవాదులు ఎలా రాగలిగారో అంతుబట్టదు. పాక్ నుంచి ఇంకెంతమంది సరిహద్దులు దాటివచ్చారో ఊహకందదు. తమ ఎఫ్ఐఏ మాజీ చీఫ్ చెప్పాడని మాత్రమే కాదు...తాజా ఘటనతోనైనా పాకిస్థాన్ ప్రభుత్వం కళ్లు తెరవాలి. ద్వైపాక్షికంగా సమస్యలుంటే వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకునే ప్రయత్నాలు చేయాలి తప్ప ఇలా ఉగ్రవాదాన్ని ఎగుమతి చేసి పొరుగు దేశంలో సమస్యలు సృష్టించాలనుకోవడం తెలివితక్కువతనం. దీన్ని సరిదిద్దాల్సిన బాధ్యత అక్కడి ప్రభుత్వంపై ఉంది. ఇరు దేశాల సంబంధాలనూ ఎవరో కొందరు వ్యక్తులు లేదా ముఠాలు నిర్దేశించడానికి ప్రయత్నిస్తుంటే చేతగానితనాన్ని ప్రదర్శించడం ఆత్మహత్యాసదృశమవుతుందని తెలుసుకోవాలి. -
కశ్మీర్లో కొత్త ఏలికలు
ఆలస్యంగానైనా జమ్మూ-కశ్మీర్లో పీడీపీ-బీజేపీ కూటమి నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. రాష్ట్రంలో ఎన్నికలు పూర్తయి రెండు నెలలు దాటుతున్నా ప్రధాన సమస్యల విషయంలో రెండు పార్టీలమధ్యా ఏకాభిప్రాయం కుదరక ఈ ఆలస్యం చోటుచేసుకుంది. ఈ కూటమి ఎన్నికల ముందు ఏర్పడింది కాదు. పీడీపీ, బీజేపీలు రెండూ ఎన్నికల్లో పరస్పరం తలపడ్డాయి. ఇవి రెండూ ‘ఉత్తర, దక్షిణ ధ్రువాలు’ అంటూ నూతన ముఖ్యమంత్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్ చేసిన వ్యాఖ్యల్లో నిజముంది. పీడీపీ ప్రధానంగా వేర్పాటువాదంవైపు ఒకింత మొగ్గు చూపే ప్రాంతీయ పార్టీ. బీజేపీ జాతీయవాదాన్ని బలంగా వినిపించే జాతీయ పార్టీ. ఒక దేశంలో రెండు రాజ్యాంగాలు ఉండటమేమిటని ప్రశ్నించే పార్టీ. జమ్మూ- కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తికి వీలుకల్పిస్తున్న 370వ అధికరణ, సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టం అమలు, వేర్పాటువాద హుర్రియత్ కాన్ఫరెన్స్ విషయం లో అనుసరించాల్సిన వైఖరి, పాకిస్థాన్‌తో చర్చలు వగైరా అంశాల్లో రెండు పార్టీల కూ భిన్నాభిప్రాయాలున్నాయి. ఇంతకాలమూ అధికారంలో ఉన్న నేషనల్ కాన్ఫ రెన్స్, కాంగ్రెస్ కూటమిని తిరస్కరించిన రాష్ట్ర ప్రజలు ప్రత్యామ్నాయాన్ని ఎంచు కోవడంలో మాత్రం వేర్వేరు తోవలను ఎంచుకున్నారు. జమ్మూ ఓటర్లు ప్రధానంగా బీజేపీపైనే విశ్వాసం ఉంచారు. కశ్మీర్లో అత్యధిక సంఖ్యాకులు పీడీపీని ఎంచుకు న్నారు. కశ్మీర్లో బీజేపీ అన్ని స్థానాల్లోనూ డిపాజిట్లు కోల్పోయింది. ఒకే ఒక్క స్థానంలో ఆ పార్టీ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి సజాద్ లోన్ గెలిచారు. అలాగే, పీడీపీ జమ్మూలో మూడు స్థానాలు మాత్రమే గెలుచుకోగలిగింది. రెండు ప్రధాన ప్రాంతాల్లో ప్రాబల్యం సాధించిన రెండు వేర్వేరు పార్టీలు కలిసి అధికారం పంచుకోవడం రాష్ట్ర శ్రేయస్సుకు దోహదపడుతుందని సాగుతున్న విశ్లేష ణల్లో వాస్తవం ఉంది. జమ్మూ-కశ్మీర్ నిత్యం సమస్యలతో సతమతమయ్యే రాష్ట్రం. అది సరిహద్దు రాష్ట్రం కావడంవల్ల పొరుగునున్న పాకిస్థాన్వైపునుంచి అక్కడి సైన్యం అండదండలతో మిలిటెంట్ల చొరబాట్లు ఉంటాయి. అడపా దడపా వారు సృష్టించే విధ్వంసకాండ ఉంటుంది. శాంతిభద్రతల పరిరక్షణ కోసమంటూ మన భద్రతా దళాలు తీసుకునే చర్యలు ఒక్కోసారి వికటించి తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తుంటాయి. గత కొన్నేళ్లుగా ఈ పరిస్థితుల్లో ఎంతో కొంత మార్పు వచ్చింది. మిలిటెన్సీ దాదాపు అదుపులో ఉంది. కనుకనే చాలామంది జమ్మూ-కశ్మీర్లో సాధ్యమైనంత త్వరగా సుస్థిర ప్రజా ప్రభుత్వం ఏర్పడాలని, ఈ ప్రశాంతత కొన సాగాలని కోరుకున్నారు. రాజకీయ పార్టీల మధ్య ఉండే విభేదాల పర్యవసానంగా ప్రజలకు ప్రభుత్వం లేని పరిస్థితి ఉండరాదని భావించారు. బీజేపీ జమ్మూ- కశ్మీర్లో తొలిసారి ప్రభుత్వంలో పాల్గొనడంవల్ల, పాలనలో భాగం కావడంవల్ల కశ్మీర్ ప్రజలకు ఆ పార్టీ పనితీరును సన్నిహితంగా పరిశీలించే అవకాశం కలుగు తుంది. ఆ పార్టీ తీరుతెన్నులు చూశాక దానిపై ఏర్పర్చుకున్న అభిప్రాయం మారినా మారొచ్చు. అలాగే...అక్కడి ప్రజల విషయంలోనైతేనేమి, సమస్యల విషయంలో అయితేనేమి బీజేపీకి ఉండే అభిప్రాయాల్లో కూడా మార్పు వచ్చే వీలుంటుంది. కేంద్రంలో పాలక పక్షంగా ఉన్న పార్టీ రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామి కావడంవల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలమధ్య సత్సంబంధాలు ఏర్పడతాయి. అది రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుంది. జమ్మూ, కశ్మీర్ ప్రాంతాలమధ్య చాన్నాళ్లుగా ఉంటున్న అపో హలు సమసిపోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. రాష్ట్రంలో ఉన్న చాలా సమస్య లకు మూలకారణం ఈ అపోహలే. వీటిని తమ తమ రాజకీయ ప్రయోజనాల కోసం పీడీపీ, ఎన్సీ, బీజేపీలు పెంచి పోషించాయి. జమ్మూకు ప్రాతినిధ్యం వహిం చే బీజేపీ ఇప్పుడు ప్రభుత్వంలో ఉండటం ఆ రీత్యా ఎంతో ప్రయోజనం చేకూర్చే అంశం. అయితే, పరస్పర విరుద్ధ అభిప్రాయాలున్న పార్టీలు కలిసి ఆరేళ్లపాటు ప్రభు త్వాన్ని నడపడం అంత సులభమేమీ కాదు. అది మొదటి రోజే రుజువైంది. ఎన్నికలు సామరస్యపూర్వక వాతావరణంలో ప్రశాంతంగా జరగడానికి సహకరిం చినందుకు హురియత్‌కూ, మిలిటెంట్లకూ, పరోక్షంగా పాకిస్థాన్‌కూ ముఫ్తీ కృతజ్ఞ తలు చెప్పడం...దానిపై బీజేపీ తీవ్రంగా స్పందించడం అందుకు రుజువు. రాజ్యాం గంపై విశ్వాసం ఉన్న సంస్థలూ, జమ్మూ-కశ్మీర్ పౌరులూ మాత్రమే ప్రశాంత ఎన్ని కలకు కారణమని బీజేపీ ఎత్తిపొడిచింది. కలిసి ప్రభుత్వాన్ని ఏర్పర్చడానికి రెండు పార్టీలూ తమ తమ వైఖరులను సడలించుకున్నాయి. 370వ అధికరణ రద్దు కావా ల్సిందేనంటున్న బీజేపీ అందుకోసం పట్టుబట్టరాదని నిర్ణయించుకుంది. సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టం రద్దు కావాల్సిందేనని డిమాండు చేస్తున్న పీడీపీ మెత్తబడింది. కూటమి ప్రభుత్వం ఆ చట్టం అవసరంలేని ప్రాంతాలేవో సమీక్షించి కేంద్రానికి సిఫార్సు చేస్తుందని, దీనిపై కేంద్రం తుది నిర్ణయం తీసుకుంటుందని కనీస ఉమ్మడి కార్యక్రమం చెబుతున్నది. కశ్మీర్‌లోయలో మిలిటెన్సీ ఒక్కటే ప్రధాన సమస్య కాదు. నిజానికి అనేక సమస్యలను అపరిష్కృతంగా వదిలేయడంవల్ల పుట్టుకొచ్చిన సమస్య అది. యువతకు ఉపాధి లేకపోవడం అందులో ప్రధానమైనది. విద్య, వైద్యం, విద్యుదుత్పాదన, వ్యవసాయం, టూరిజం, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటివి అక్కడ అరకొరగా ఉన్నాయి. పుష్కలంగా వనరులున్నా ప్రజల సామాజిక, ఆర్థికాభివృద్ధికి అవి అక్కరకు రావడంలేదు. ఏ సమస్యను లేవనెత్తినా, దేన్ని ప్రశ్నించినా శాంతిభద్రతల సమస్యగా పరిగణించడం అక్కడ సర్వసాధారణం. పీడీపీ-బీజేపీ కూటమి ప్రభుత్వం ప్రజాతంత్ర సంస్థలకు విలువనిచ్చి, ప్రజాస్వామిక వాతావరణం ఏర్పర్చడానికి కృషిచేస్తే జమ్మూ-కశ్మీర్ దేశంలోని ఇతర రాష్ట్రాల తరహాలోనే అభివృద్ధి చెందడానికి, ప్రశాంతంగా మనుగడ సాగించడానికి ఉపయోగపడుతుంది. పీడీపీ-బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడటం ఆ దిశగా పడిన తొలి అడుగు కావాలని ఆశిద్దాం.