ఆలస్యంగానైనా జమ్మూ-కశ్మీర్‌లో పీడీపీ-బీజేపీ కూటమి నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. రాష్ట్రంలో ఎన్నికలు పూర్తయి రెండు నెలలు దాటుతున్నా ప్రధాన సమస్యల విషయంలో రెండు పార్టీలమధ్యా ఏకాభిప్రాయం కుదరక ఈ ఆలస్యం చోటుచేసుకుంది. ఈ కూటమి ఎన్నికల ముందు ఏర్పడింది కాదు. పీడీపీ, బీజేపీలు రెండూ ఎన్నికల్లో పరస్పరం తలపడ్డాయి. ఇవి రెండూ ‘ఉత్తర, దక్షిణ ధ్రువాలు’ అంటూ నూతన ముఖ్యమంత్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్ చేసిన వ్యాఖ్యల్లో నిజముంది. పీడీపీ ప్రధానంగా వేర్పాటువాదంవైపు ఒకింత మొగ్గు చూపే ప్రాంతీయ పార్టీ. బీజేపీ జాతీయవాదాన్ని బలంగా వినిపించే జాతీయ పార్టీ. ఒక దేశంలో రెండు రాజ్యాంగాలు ఉండటమేమిటని ప్రశ్నించే పార్టీ.
జమ్మూ- కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తికి వీలుకల్పిస్తున్న 370వ అధికరణ, సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టం అమలు, వేర్పాటువాద హుర్రియత్ కాన్ఫరెన్స్ విషయం లో అనుసరించాల్సిన వైఖరి, పాకిస్థాన్‌తో చర్చలు వగైరా అంశాల్లో రెండు పార్టీల కూ భిన్నాభిప్రాయాలున్నాయి. ఇంతకాలమూ అధికారంలో ఉన్న నేషనల్ కాన్ఫ రెన్స్, కాంగ్రెస్ కూటమిని తిరస్కరించిన రాష్ట్ర ప్రజలు ప్రత్యామ్నాయాన్ని ఎంచు కోవడంలో మాత్రం వేర్వేరు తోవలను ఎంచుకున్నారు. జమ్మూ ఓటర్లు ప్రధానంగా బీజేపీపైనే విశ్వాసం ఉంచారు. కశ్మీర్‌లో అత్యధిక సంఖ్యాకులు పీడీపీని ఎంచుకు న్నారు. కశ్మీర్‌లో బీజేపీ అన్ని స్థానాల్లోనూ డిపాజిట్లు కోల్పోయింది. ఒకే ఒక్క స్థానంలో ఆ పార్టీ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి సజాద్ లోన్ గెలిచారు. అలాగే, పీడీపీ జమ్మూలో మూడు స్థానాలు మాత్రమే గెలుచుకోగలిగింది. రెండు ప్రధాన ప్రాంతాల్లో ప్రాబల్యం సాధించిన రెండు వేర్వేరు పార్టీలు కలిసి అధికారం పంచుకోవడం రాష్ట్ర శ్రేయస్సుకు దోహదపడుతుందని సాగుతున్న విశ్లేష ణల్లో వాస్తవం ఉంది. జమ్మూ-కశ్మీర్ నిత్యం సమస్యలతో సతమతమయ్యే రాష్ట్రం. అది సరిహద్దు రాష్ట్రం కావడంవల్ల పొరుగునున్న పాకిస్థాన్‌వైపునుంచి అక్కడి సైన్యం అండదండలతో మిలిటెంట్ల చొరబాట్లు ఉంటాయి. అడపా దడపా వారు సృష్టించే విధ్వంసకాండ ఉంటుంది. శాంతిభద్రతల పరిరక్షణ కోసమంటూ మన భద్రతా దళాలు తీసుకునే చర్యలు ఒక్కోసారి వికటించి తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తుంటాయి.
గత కొన్నేళ్లుగా ఈ పరిస్థితుల్లో ఎంతో కొంత మార్పు వచ్చింది. మిలిటెన్సీ దాదాపు అదుపులో ఉంది. కనుకనే చాలామంది జమ్మూ-కశ్మీర్‌లో సాధ్యమైనంత త్వరగా సుస్థిర ప్రజా ప్రభుత్వం ఏర్పడాలని, ఈ ప్రశాంతత కొన సాగాలని కోరుకున్నారు. రాజకీయ పార్టీల మధ్య ఉండే విభేదాల పర్యవసానంగా ప్రజలకు ప్రభుత్వం లేని పరిస్థితి ఉండరాదని భావించారు. బీజేపీ జమ్మూ- కశ్మీర్‌లో తొలిసారి ప్రభుత్వంలో పాల్గొనడంవల్ల, పాలనలో భాగం కావడంవల్ల కశ్మీర్ ప్రజలకు ఆ పార్టీ పనితీరును సన్నిహితంగా పరిశీలించే అవకాశం కలుగు తుంది. ఆ పార్టీ తీరుతెన్నులు చూశాక దానిపై ఏర్పర్చుకున్న అభిప్రాయం మారినా మారొచ్చు. అలాగే...అక్కడి ప్రజల విషయంలోనైతేనేమి, సమస్యల విషయంలో అయితేనేమి బీజేపీకి ఉండే అభిప్రాయాల్లో కూడా మార్పు వచ్చే వీలుంటుంది.
కేంద్రంలో పాలక పక్షంగా ఉన్న పార్టీ రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామి కావడంవల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలమధ్య సత్సంబంధాలు ఏర్పడతాయి. అది రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుంది. జమ్మూ, కశ్మీర్ ప్రాంతాలమధ్య చాన్నాళ్లుగా ఉంటున్న అపో హలు సమసిపోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. రాష్ట్రంలో ఉన్న చాలా సమస్య లకు మూలకారణం ఈ అపోహలే. వీటిని తమ తమ రాజకీయ ప్రయోజనాల కోసం పీడీపీ, ఎన్‌సీ, బీజేపీలు పెంచి పోషించాయి. జమ్మూకు ప్రాతినిధ్యం వహిం చే బీజేపీ ఇప్పుడు ప్రభుత్వంలో ఉండటం ఆ రీత్యా ఎంతో ప్రయోజనం చేకూర్చే అంశం. అయితే, పరస్పర విరుద్ధ అభిప్రాయాలున్న పార్టీలు కలిసి ఆరేళ్లపాటు ప్రభు త్వాన్ని నడపడం అంత సులభమేమీ కాదు. అది మొదటి రోజే రుజువైంది. ఎన్నికలు సామరస్యపూర్వక వాతావరణంలో ప్రశాంతంగా జరగడానికి సహకరిం చినందుకు హురియత్‌కూ, మిలిటెంట్లకూ, పరోక్షంగా పాకిస్థాన్‌కూ ముఫ్తీ కృతజ్ఞ తలు చెప్పడం...దానిపై బీజేపీ తీవ్రంగా స్పందించడం అందుకు రుజువు. రాజ్యాం గంపై విశ్వాసం ఉన్న సంస్థలూ, జమ్మూ-కశ్మీర్ పౌరులూ మాత్రమే ప్రశాంత ఎన్ని కలకు కారణమని బీజేపీ ఎత్తిపొడిచింది. కలిసి ప్రభుత్వాన్ని ఏర్పర్చడానికి రెండు పార్టీలూ తమ తమ వైఖరులను సడలించుకున్నాయి.
370వ అధికరణ రద్దు కావా ల్సిందేనంటున్న బీజేపీ అందుకోసం పట్టుబట్టరాదని నిర్ణయించుకుంది. సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టం రద్దు కావాల్సిందేనని డిమాండు చేస్తున్న పీడీపీ మెత్తబడింది. కూటమి ప్రభుత్వం ఆ చట్టం అవసరంలేని ప్రాంతాలేవో సమీక్షించి కేంద్రానికి సిఫార్సు చేస్తుందని, దీనిపై కేంద్రం తుది నిర్ణయం తీసుకుంటుందని కనీస ఉమ్మడి కార్యక్రమం చెబుతున్నది. కశ్మీర్‌లోయలో మిలిటెన్సీ ఒక్కటే ప్రధాన సమస్య కాదు. నిజానికి అనేక సమస్యలను అపరిష్కృతంగా వదిలేయడంవల్ల పుట్టుకొచ్చిన సమస్య అది. యువతకు ఉపాధి లేకపోవడం అందులో ప్రధానమైనది.
విద్య, వైద్యం, విద్యుదుత్పాదన, వ్యవసాయం, టూరిజం, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటివి అక్కడ అరకొరగా ఉన్నాయి. పుష్కలంగా వనరులున్నా ప్రజల సామాజిక, ఆర్థికాభివృద్ధికి అవి అక్కరకు రావడంలేదు. ఏ సమస్యను లేవనెత్తినా, దేన్ని ప్రశ్నించినా శాంతిభద్రతల సమస్యగా పరిగణించడం అక్కడ సర్వసాధారణం. పీడీపీ-బీజేపీ కూటమి ప్రభుత్వం ప్రజాతంత్ర సంస్థలకు విలువనిచ్చి, ప్రజాస్వామిక వాతావరణం ఏర్పర్చడానికి కృషిచేస్తే జమ్మూ-కశ్మీర్ దేశంలోని ఇతర రాష్ట్రాల తరహాలోనే అభివృద్ధి చెందడానికి, ప్రశాంతంగా మనుగడ సాగించడానికి ఉపయోగపడుతుంది. పీడీపీ-బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడటం ఆ దిశగా పడిన తొలి అడుగు కావాలని ఆశిద్దాం.
కశ్మీర్‌లో కొత్త ఏలికలు
Published Mon, Mar 2 2015 12:30 AM | Last Updated on Mon, Jul 30 2018 8:14 PM
Advertisement
Advertisement