Pdp-BJP alliance
-
కశ్మీర్, మోదీ విదేశీ టూర్లపై థాకరే సెటైర్లు
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ సర్కార్‌పై శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే మరోసారి ధ్వజమెత్తారు. 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీ అబద్ధాలు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిందటూ తీవ్ర విమర్శలకు దిగారు. ఎన్నికల్లో విజయం సాధించేందుకు తప్పుడు వాగ్దానాలు చేసిందని దుయ్యబట్టారు. గురుగావ్‌లో శివసేన 52వ ఆవిర్భావ దినోత్సం సందర్భంగా శివసేన కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన థాకరే మంగళవారం ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ విదేశీ టూర్లపై కూడా థాకరే సెటైర్లు వేశారు. త్వరలోనే ప్రధాని ఇతర గ్రహాల పర్యటనకు కూడా వెళ్లనున్నారంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. జమ్మూ కశ్మీర్లో పీడీపీ ప్రభత్వానికి మద్దతు ఉపసంహరణపై థాకరే విమర్శలు గుప్పించారు. 600 మంది జవాన్లు ప్రాణత్యాగం, మూడు సంవత్సరాల సమయం గడిచిన తరువాత గానీ అక్కడి ప్రభుత్వం వేస్ట్ అని అర్థం కాలేదా అంటూ మండిపడ్డారు. పీడీపీతో తెగతెంపులు చేసుకున్నారు. మరిక పాకిస్థాన్‌పై కూడా ఒత్తిడి తీసుకురండి..అప్పుడు బీజేపీని స్వాగతిస్తామని పేర్కొన్నారు. ఉగ్రవాదానికి మతంతో సంబంధం లేనపుడు, రంజాన్ రోజు కాల్పుల విరమణ ఎందుకు ప్రకటించిందని ఆయన ప్రశ్నించారు. గణపతి పండుగ లేదా దసరా సమయంలో పాకిస్తాన్ ఇదే విధానాన్ని అనుసరిస్తుందా అంటూ రంజాన్ మాసంలో కశ్మీర్లో కాల్పుల విరమణ నిర్ణయాన్ని థాకరే తప్పు బట్టారు. -
కుప్పకూలిన సంకీర్ణం
జమ్మూ–కశ్మీర్లో ఆదినుంచీ ఒడిదుడుకులతో నెట్టుకొస్తున్న పీడీపీ–బీజేపీ కూటమి ప్రభుత్వం ఉన్నట్టుండి మంగళవారం కుప్పకూలింది. కూటమినుంచి తప్పుకుంటున్నట్టు బీజేపీ ప్రకటించ డంతో ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ రాజీనామా సమర్పించారు. ఇది హఠాత్ పరిణామమే కానీ...అనూహ్యమైనదేమీ కాదు. ఎందుకంటే ఈ రెండు పార్టీలూ భిన్న ధ్రువాలు. 2014 నవంబర్–డిసెంబర్ మధ్య జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రెండూ పరస్పరం కత్తులు నూరుకున్నాయి. 87 స్థానాలున్న అసెంబ్లీలో సాధారణ మెజారిటీ 44 స్థానాలు కాగా, ఏ పార్టీకీ అన్ని సీట్లు లభించలేదు. ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న కశ్మీర్ ప్రాంతంలో పీడీపీ 28 స్థానాలు గెల్చుకోగా, హిందువులు ఎక్కువగా ఉన్న జమ్మూలో బీజేపీ 25 చోట్ల విజయం సాధించింది. అంతవరకూ పాలకపక్షంగా ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్ 15, కాంగ్రెస్ 12 స్థానాలు సొంతం చేసుకున్నాయి. ఇలాంటి అనిశ్చితిలో పీడీపీ, బీజేపీలు సుదీర్ఘంగా మంతనాలు సాగించి ‘కనీస ఉమ్మడి అజెండా’ను రూపొందించుకుని ముఫ్తీ మహమ్మద్ సయీద్ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. దురదృష్టవశాత్తూ ముఫ్తీ ఏడాది గడవకుండానే కన్నుమూశారు. ఆ తర్వాత మళ్లీ రెండున్నర నెలలపాటు అనిశ్చితే రాజ్యమేలింది. మళ్లీ చర్చోపచర్చలు జరిగాయి. చివరకు పాత అజెండాతోనే ముఫ్తీ కుమార్తె మెహబూబా ముఫ్తీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. చైనా, పాకిస్తాన్లతో సరిహద్దులున్న జమ్మూ–కశ్మీర్ దశాబ్దాలుగా మిలిటెన్సీతో అట్టుడుకు తోంది. కనుకనే అక్కడ అత్యంత మెలకువతో వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల కారణం గానే కేంద్రంలో పాలకపక్షంగా ఉన్న పార్టీ, రాష్ట్రంలో మెజారిటీ తెచ్చుకున్న పార్టీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పర్చడం రివాజు. పీడీపీ, బీజేపీలు భిన్న ధ్రువాలు గనుక అది సాధ్యపడదేమోనని అందరూ భావించారు. కానీ అందరి అంచనాలనూ ఆ పార్టీలు తలకిందులు చేసి సన్నిహితమయ్యాయి. జమ్మూ–కశ్మీర్ సమస్యకు జాతీయ పరిష్కారం కోరే దిశగా తమ అజెండాను రూపొందించుకున్నా మని రెండు పార్టీలూ చెప్పడం చాలామందికి నచ్చింది. కశ్మీర్ విషయంలో బీజేపీ అభిప్రాయాలు అందరికీ తెలుసు. అయితే 2014 ఎన్నికల్లో 370 అధికరణం అంశాన్ని ఆ పార్టీ పక్కన పెట్టింది. ఇతర అంశాల్లో సైతం తన వైఖరిని సడలించుకోబట్టే అది పీడీపీతో జత కట్టిందని అనేకులు భావిం చారు. అటు జమ్మూ, ఇటు కశ్మీర్ మత ప్రాతిపదికన చీలినట్టు ఎన్నికల ఫలితాలు తేటతెల్లం చేసిన నేపథ్యంలో ఇది శుభ పరిణామని వారు విశ్వసించారు. ఇరు పార్టీలూ ప్రత్యర్థులుగా ఉండటం మంచిదికాదని వారి భావన. కానీ పీడీపీ, బీజేపీలు తాము కూటమిగా ఉన్నామని,మంచి పాలన అందించాలని మరిచినట్టు గత రెండేళ్ల పరిణామాలు రుజువుచేశాయి. కశ్మీర్ సమస్యను ఆదినుంచీ బీజేపీ శాంతిభద్రతల సమస్యగానే చూస్తోంది. అక్కడ రాజకీయ పరిష్కారాన్ని కనుగొనడంలో విఫలం కావడం వల్లనే ఉద్రిక్తతలు ఏర్పడుతున్నాయన్న వాదననను ఆ పార్టీ అంగీకరించదు. ఆ సమస్య విషయంలో చర్చల ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పిన కేంద్రం గత అక్టోబర్‌లో అందుకోసం ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) డైరెక్టర్‌గా పనిచేసి రిటైరైన దినేశ్వర్ శర్మను మధ్యవర్తిగా ప్రకటించడం ఈ అవగాహన పర్యవసానమే. అంతక్రితం పలుమార్లు మధ్యవర్తుల రాయబారాలు నడిచాయి. వాజపేయి నేతృత్వంలోని ప్రభుత్వం ఒకసారి కేంద్ర మాజీ మంత్రి కేసీ పంత్‌నూ, మరోసారి ప్రస్తుత గవర్నర్ ఎన్. ఎన్. వోహ్రాను నియమించింది. యూపీఏ సర్కారు ప్రముఖ పాత్రికేయుడు దిలీప్ పడ్గావ్కర్ తదితరులతో మధ్యవర్తుల కమిటీ నియమించింది. ఆ ప్రభుత్వాలు మధ్యవర్తులిచ్చిన నివేదికలపై ఏం చర్యలు తీసుకున్నాయన్న సంగతలా ఉంచితే కనీసం మాజీ పోలీస్ అధికారులను ఆ పని కోసం నియమించలేదు. దినేశ్వర్ శర్మ ఏం సాధించారో తెలియదుగానీ అప్పటికీ, ఇప్పటికీ కశ్మీర్ పరిస్థితి అయితే దారుణంగా క్షీణించింది. కనీస ఉమ్మడి అజెండాలోని 15 అంశాలనూ సమర్ధవంతంగా అమలు చేసి ఉంటే కశ్మీర్ పరిస్థితి ఇంత దిగజారేది కాదు. యువకుల్లో నైపుణ్యాభివృద్ధి, సిద్ధాంతాలు ఎలాంటివైనా అన్ని పక్షాలతో చర్చించడం, అకౌం టబిలిటీ కమిషన్ ఏర్పాటు, సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టం వర్తింపుపై సమీక్ష, వాజపేయి నినాదమైన ఇన్సానియత్(మానవత్వం), జమ్రూహియత్(ప్రజాస్వామ్యం), కశ్మీరియత్(కశ్మీరీ సంస్కృతి, సంప్రదాయం)ల అమలు వగైరాలు ఆ అజెండాలోని ముఖ్యాంశాలు. కశ్మీర్ సమస్యపై పాకిస్తాన్‌తో చర్చలు ప్రారంభించడం, హుర్రియత్ నేతలతోసహా కశ్మీర్‌లోని సంబంధిత పక్షాలన్నిటితో మాట్లాడటం వంటి అంశాల్లో పీడీపీ, బీజేపీల మధ్య తీవ్ర విభేదాలు న్నాయి. భద్రతా దళాలకూ, ఉద్యమకారులకూ మధ్య తరచుగా తలెత్తే ఘర్షణల్లో మెహబూబా వైఖరికీ, బీజేపీ వైఖరికీ పొంతనే లేదు. మొన్నటికి మొన్న కథువాలో ఎనిమిదేళ్ల పాప అసిఫాపై జరిగిన సామూహిక అత్యాచారం, హత్య విషయంలోనూ ఇరు పార్టీలూ వేర్వేరు వాదనలు చేశాయి. ఎన్నో ఒత్తిళ్ల తర్వాతగానీ ఆ కేసు నిందితులకు వత్తాసు పలికిన బీజేపీ మంత్రులు కేబినెట్ నుంచి తప్పుకోలేదు. ఇక రంజాన్ మాసం సందర్భంగా కాల్పుల విరమణ ప్రకటించాలని మెహ బూబా ఒత్తిడి తెస్తే తొలుత కేంద్రం ససేమిరా అంది. చివరకు అయిష్టంగా కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ద్వారా కాల్పుల విరమణ ప్రకటన చేయించింది. కానీ దానివల్ల ఆశించిన ఫలితం రాలేదు సరిగదా ఉగ్రవాదులు మరింత రెచ్చిపోయి హింసాకాండకు పాల్పడ్డారు. ప్రముఖ పాత్రి కేయుడు సుజాత్ బుఖారీని కాల్చిచంపారు. జవాన్ ఔరంగజేబును చిత్రహింసలు పెట్టి ప్రాణాలు తీశారు. కూటమిలో కొనసాగడం వల్ల ఇలాంటి చర్యలన్నిటికీ సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన స్థితిలో పడ్డామని బీజేపీకి బెంగపట్టుకున్నట్టుంది. కానీ ఇకపై అన్నిటికీ తామే జవాబుదారీ అవుతామని ఆ పార్టీ గుర్తుంచుకోవాలి. కశ్మీర్ విషయంలో మరింత జాగురూకతతో మెలగాలని, దాన్ని మరింత విషాదం చుట్టుముట్టకుండా చూడాలని అందరూ కోరుకుంటారు. -
విఫలమైన మోదీ కశ్మీర్ పాలసీ
సాక్షి, న్యూఢిల్లీ: కశ్మీర్లో ప్రధాని నరేంద్ర మోదీ పాలసీ పూర్తిగా విఫలమైంది. పీడీపీతో పొత్తు పెట్టుకుని కశ్మీర్‌పై మరింత పట్టు సాధిద్దామనుకున్న మోదీ ప్రయత్నం విఫలమైంది. నేటితో గత మూడేళ్లుగా కశ్మీర్‌ని పరిపాలిస్తున్న పీడీపీ- బీజేపీ సంకీర్ణ ప్రభుత్వానికి తెరపడింది. సయ్యద్ ముఫ్తీ మహ్మద్ మరణాంతరం సీఎంగా బాధ్యతలు స్వీకరించిన మెహబూబా ముఫ్తీ తన తండ్రి కంటే మరిన్ని విపత్కర పరిస్థితులను కశ్శీర్‌లో ఎదుర్కొన్నారు. హిస్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వనీ ఎన్‌కౌంటర్‌తో కశ్మీర్లో మొదలైన హింస నేటికీ ఆగలేదు. బుర్హాన్ వనీని ఎన్కౌంటర్ చేయడంతో లోయలో మిలిటెంట్స్ చర్యలు మరింత పెరిగాయి. బీజేపీ ప్రభుత్వం చేపట్టిన సర్జికల్ దాడులు కశ్మీర్లో శాంతి నెలకొల్పడానికి ఏమాత్రం పనిచేయలేదు. సర్జికల్ దాడులు సరిహద్దు వెంట మరిన్ని దాడులకు కారణమయ్యాయి. రంజాన్ మాసం సందర్భంగా కశ్మీర్లో మిలిటెంట్స్ మరింత రెచ్చిపోయారు. ముస్లింల పవిత్ర మాసంలో కశ్శీర్ యువకులను మిలిటెంట్ దళాల్లోకి తీసుకుని వారిని తీవ్రవాదులుగా తయారుచేశారు. వారి చర్యలకు అనేక మంది అమాయక కశ్మీర్ ప్రజలు ప్రాణాలు కొల్పోతున్నా.. దాడులను నివారించడంతో పీడీపీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. సీనియర్ పాత్రికేయుడు సుజాత్ బుఖారిని తన కార్యాలయంలో దుండుగులు దారుణంగా హత్యచేయడంతో కశ్మీర్లో శాంతి భద్రతలు ఏవిధంగా ఉన్నాయో ఇట్టే అర్ధమవుతోంది. పాక్‌తో చర్చలు జరిపితే సమస్యలు పరిష్కారం అవుతాయని మెహబూబా ముఫ్తీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే. సరిహద్దులో పాక్‌తో ఎప్పుడు యుద్ధ వాతావరణమే కొనసాగించిన బీజేపీ ప్రభుత్వం ఆ దిశాగా ఎప్పుడు అడుగులు వేయలేదు. లోయలో సమస్యకు పరిష్కారం చూపడం కష్టంగా భావించిన మోదీ-అమిత్ షా ద్వయం చివరికి పీడీపీ ప్రభుత్వం నుంచి బయటకు వస్తున్నట్లు ప్రకటించింది. మూడేళ్ల సంకీర్ణ ప్రభుత్వంలో శాంతి నెలకొల్పడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం కావడంతో బీజేపీ మద్దతు ఉపసంహరించుకుంది. కె.రామచంద్ర మూర్తి -
కశ్మీర్లో కొత్త ఏలికలు
ఆలస్యంగానైనా జమ్మూ-కశ్మీర్లో పీడీపీ-బీజేపీ కూటమి నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. రాష్ట్రంలో ఎన్నికలు పూర్తయి రెండు నెలలు దాటుతున్నా ప్రధాన సమస్యల విషయంలో రెండు పార్టీలమధ్యా ఏకాభిప్రాయం కుదరక ఈ ఆలస్యం చోటుచేసుకుంది. ఈ కూటమి ఎన్నికల ముందు ఏర్పడింది కాదు. పీడీపీ, బీజేపీలు రెండూ ఎన్నికల్లో పరస్పరం తలపడ్డాయి. ఇవి రెండూ ‘ఉత్తర, దక్షిణ ధ్రువాలు’ అంటూ నూతన ముఖ్యమంత్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్ చేసిన వ్యాఖ్యల్లో నిజముంది. పీడీపీ ప్రధానంగా వేర్పాటువాదంవైపు ఒకింత మొగ్గు చూపే ప్రాంతీయ పార్టీ. బీజేపీ జాతీయవాదాన్ని బలంగా వినిపించే జాతీయ పార్టీ. ఒక దేశంలో రెండు రాజ్యాంగాలు ఉండటమేమిటని ప్రశ్నించే పార్టీ. జమ్మూ- కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తికి వీలుకల్పిస్తున్న 370వ అధికరణ, సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టం అమలు, వేర్పాటువాద హుర్రియత్ కాన్ఫరెన్స్ విషయం లో అనుసరించాల్సిన వైఖరి, పాకిస్థాన్‌తో చర్చలు వగైరా అంశాల్లో రెండు పార్టీల కూ భిన్నాభిప్రాయాలున్నాయి. ఇంతకాలమూ అధికారంలో ఉన్న నేషనల్ కాన్ఫ రెన్స్, కాంగ్రెస్ కూటమిని తిరస్కరించిన రాష్ట్ర ప్రజలు ప్రత్యామ్నాయాన్ని ఎంచు కోవడంలో మాత్రం వేర్వేరు తోవలను ఎంచుకున్నారు. జమ్మూ ఓటర్లు ప్రధానంగా బీజేపీపైనే విశ్వాసం ఉంచారు. కశ్మీర్లో అత్యధిక సంఖ్యాకులు పీడీపీని ఎంచుకు న్నారు. కశ్మీర్లో బీజేపీ అన్ని స్థానాల్లోనూ డిపాజిట్లు కోల్పోయింది. ఒకే ఒక్క స్థానంలో ఆ పార్టీ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి సజాద్ లోన్ గెలిచారు. అలాగే, పీడీపీ జమ్మూలో మూడు స్థానాలు మాత్రమే గెలుచుకోగలిగింది. రెండు ప్రధాన ప్రాంతాల్లో ప్రాబల్యం సాధించిన రెండు వేర్వేరు పార్టీలు కలిసి అధికారం పంచుకోవడం రాష్ట్ర శ్రేయస్సుకు దోహదపడుతుందని సాగుతున్న విశ్లేష ణల్లో వాస్తవం ఉంది. జమ్మూ-కశ్మీర్ నిత్యం సమస్యలతో సతమతమయ్యే రాష్ట్రం. అది సరిహద్దు రాష్ట్రం కావడంవల్ల పొరుగునున్న పాకిస్థాన్వైపునుంచి అక్కడి సైన్యం అండదండలతో మిలిటెంట్ల చొరబాట్లు ఉంటాయి. అడపా దడపా వారు సృష్టించే విధ్వంసకాండ ఉంటుంది. శాంతిభద్రతల పరిరక్షణ కోసమంటూ మన భద్రతా దళాలు తీసుకునే చర్యలు ఒక్కోసారి వికటించి తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తుంటాయి. గత కొన్నేళ్లుగా ఈ పరిస్థితుల్లో ఎంతో కొంత మార్పు వచ్చింది. మిలిటెన్సీ దాదాపు అదుపులో ఉంది. కనుకనే చాలామంది జమ్మూ-కశ్మీర్లో సాధ్యమైనంత త్వరగా సుస్థిర ప్రజా ప్రభుత్వం ఏర్పడాలని, ఈ ప్రశాంతత కొన సాగాలని కోరుకున్నారు. రాజకీయ పార్టీల మధ్య ఉండే విభేదాల పర్యవసానంగా ప్రజలకు ప్రభుత్వం లేని పరిస్థితి ఉండరాదని భావించారు. బీజేపీ జమ్మూ- కశ్మీర్లో తొలిసారి ప్రభుత్వంలో పాల్గొనడంవల్ల, పాలనలో భాగం కావడంవల్ల కశ్మీర్ ప్రజలకు ఆ పార్టీ పనితీరును సన్నిహితంగా పరిశీలించే అవకాశం కలుగు తుంది. ఆ పార్టీ తీరుతెన్నులు చూశాక దానిపై ఏర్పర్చుకున్న అభిప్రాయం మారినా మారొచ్చు. అలాగే...అక్కడి ప్రజల విషయంలోనైతేనేమి, సమస్యల విషయంలో అయితేనేమి బీజేపీకి ఉండే అభిప్రాయాల్లో కూడా మార్పు వచ్చే వీలుంటుంది. కేంద్రంలో పాలక పక్షంగా ఉన్న పార్టీ రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామి కావడంవల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలమధ్య సత్సంబంధాలు ఏర్పడతాయి. అది రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుంది. జమ్మూ, కశ్మీర్ ప్రాంతాలమధ్య చాన్నాళ్లుగా ఉంటున్న అపో హలు సమసిపోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. రాష్ట్రంలో ఉన్న చాలా సమస్య లకు మూలకారణం ఈ అపోహలే. వీటిని తమ తమ రాజకీయ ప్రయోజనాల కోసం పీడీపీ, ఎన్సీ, బీజేపీలు పెంచి పోషించాయి. జమ్మూకు ప్రాతినిధ్యం వహిం చే బీజేపీ ఇప్పుడు ప్రభుత్వంలో ఉండటం ఆ రీత్యా ఎంతో ప్రయోజనం చేకూర్చే అంశం. అయితే, పరస్పర విరుద్ధ అభిప్రాయాలున్న పార్టీలు కలిసి ఆరేళ్లపాటు ప్రభు త్వాన్ని నడపడం అంత సులభమేమీ కాదు. అది మొదటి రోజే రుజువైంది. ఎన్నికలు సామరస్యపూర్వక వాతావరణంలో ప్రశాంతంగా జరగడానికి సహకరిం చినందుకు హురియత్‌కూ, మిలిటెంట్లకూ, పరోక్షంగా పాకిస్థాన్‌కూ ముఫ్తీ కృతజ్ఞ తలు చెప్పడం...దానిపై బీజేపీ తీవ్రంగా స్పందించడం అందుకు రుజువు. రాజ్యాం గంపై విశ్వాసం ఉన్న సంస్థలూ, జమ్మూ-కశ్మీర్ పౌరులూ మాత్రమే ప్రశాంత ఎన్ని కలకు కారణమని బీజేపీ ఎత్తిపొడిచింది. కలిసి ప్రభుత్వాన్ని ఏర్పర్చడానికి రెండు పార్టీలూ తమ తమ వైఖరులను సడలించుకున్నాయి. 370వ అధికరణ రద్దు కావా ల్సిందేనంటున్న బీజేపీ అందుకోసం పట్టుబట్టరాదని నిర్ణయించుకుంది. సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టం రద్దు కావాల్సిందేనని డిమాండు చేస్తున్న పీడీపీ మెత్తబడింది. కూటమి ప్రభుత్వం ఆ చట్టం అవసరంలేని ప్రాంతాలేవో సమీక్షించి కేంద్రానికి సిఫార్సు చేస్తుందని, దీనిపై కేంద్రం తుది నిర్ణయం తీసుకుంటుందని కనీస ఉమ్మడి కార్యక్రమం చెబుతున్నది. కశ్మీర్‌లోయలో మిలిటెన్సీ ఒక్కటే ప్రధాన సమస్య కాదు. నిజానికి అనేక సమస్యలను అపరిష్కృతంగా వదిలేయడంవల్ల పుట్టుకొచ్చిన సమస్య అది. యువతకు ఉపాధి లేకపోవడం అందులో ప్రధానమైనది. విద్య, వైద్యం, విద్యుదుత్పాదన, వ్యవసాయం, టూరిజం, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటివి అక్కడ అరకొరగా ఉన్నాయి. పుష్కలంగా వనరులున్నా ప్రజల సామాజిక, ఆర్థికాభివృద్ధికి అవి అక్కరకు రావడంలేదు. ఏ సమస్యను లేవనెత్తినా, దేన్ని ప్రశ్నించినా శాంతిభద్రతల సమస్యగా పరిగణించడం అక్కడ సర్వసాధారణం. పీడీపీ-బీజేపీ కూటమి ప్రభుత్వం ప్రజాతంత్ర సంస్థలకు విలువనిచ్చి, ప్రజాస్వామిక వాతావరణం ఏర్పర్చడానికి కృషిచేస్తే జమ్మూ-కశ్మీర్ దేశంలోని ఇతర రాష్ట్రాల తరహాలోనే అభివృద్ధి చెందడానికి, ప్రశాంతంగా మనుగడ సాగించడానికి ఉపయోగపడుతుంది. పీడీపీ-బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడటం ఆ దిశగా పడిన తొలి అడుగు కావాలని ఆశిద్దాం. -
రేపు జమ్మూకశ్మీర్ సీఎంగా ముఫ్తీ ప్రమాణం
న్యూఢిల్లీ : జమ్ము కశ్మీర్ నూతన ముఖ్యమంత్రిగా పీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ముఫ్తీ మొహమ్మద్ సయీద్ ఆదివారం ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. పీడీపీ, బీజేపీ కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాయి. ప్రభుత్వంలో బీజేపీ కూడా చేరనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో శుక్రవారం ఉదయం పీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ముఫ్తీ మొహమ్మద్ సయీద్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జమ్ము కశ్మీర్ ప్రభుత్వ ఏర్పాటు, ఉమ్మడి ప్రణాళికపై చర్చించారు. రాష్ట్రానికి సయీద్ ఆరేళ్లపాటు సీఎంగా కొనసాగుతానేజ బీజేపీ నేత నిర్మల్ సింగ్ డిప్యూటీ సీఎంగా ఉంటారని సమాచారం.