శ్రీనగర్: వివాదాస్పద పౌరసత్వ సవరణ ముసాయిదా బిల్లుపై దేశ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ దేశాల్లో మతపరమైన వేధింపులు, వివక్షను ఎదుర్కొంటూ భారత్‌కు వచ్చిన ముస్లిమేతర శరణార్ధులకు పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించిన ఈ బిల్లుకు బుధవారం కేంద్ర కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. దీనిపై జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తి కూతురు సనా ఇల్తిజా జావేద్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముస్లింలపై వివక్ష చూపేందుకే బీజేపీ ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టిందని, భారత్‌లో ముస్లింలకు చోటులేకుండాపోతోందని ఆవేదన చెందారు. ముస్లింలకు రెండో తరగతి జనాభాగా చూపేందుకు ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ట్విటర్‌లో పోస్ట్ చేశారు. కాగా ఆర్టికల్ 370 రద్దు అనంతరం ముఫ్తి పోలీసులచే నిర్బంధించబడిన విషయం తెలిసిందే. దీంతో ఆమె తల్లి సోషల్ మీడియా ఖాతాను జావేద్ ఉపయోగిస్తున్నారు.
భారత్ లౌకికత్వానికి ఈ మతతత్వ బిల్లు వ్యతిరేకమని విపక్షాలు వాదిస్తున్నాయి. ముఖ్యంగా ఈ వలసలు అధికంగా ఉన్న ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ఈ ప్రతిపాదనపై ఆగ్రహంతో ఉన్నారు. ఇస్లామిక్ దేశాల నుంచి శరణార్ధులుగా వచ్చిన వారిలో హిందువులే అత్యధికంగా ఉంటారు. ముస్లిమేతరులకు పౌరసత్వమిచ్చి వారికి ఎన్నార్సీ నుంచి రక్షణ కల్పించాలని బీజేపీ భావిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న అక్రమ వలసదారులను గుర్తించి, దేశం నుంచి పంపించేందుకు వీలుగా జాతీయ పౌరపట్టిక (నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్‌షిప్–ఎన్నార్సీ)ను సిద్ధం చేయాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. దేశ ప్రయోజనాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా పౌరసత్వ బిల్లు రూపకల్పన సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. ఈ బిల్లును నేడు కానీ, రేపు కానీ సభలో ప్రవేశపెట్టి, వచ్చే వారం సభ ఆమోదం పొందేలా చూడాలని కేంద్రం ఆలోచిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment