Mufti Mahammad Sayeed
-
జేకేలోనూ ‘ఇండియా’ కూటమికి ఎదురు దెబ్బ!
జమ్ముకశ్మీర్‌లో ‘ఇండియా’ కూటమికి మరో ఎదురుదెబ్బ తగిలింది. నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) తర్వాత ఇప్పుడు పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) కూడా లోక్‌సభ ఎన్నికల్లో తమ అభ్యర్థులను నిలబెట్టాలని నిర్ణయించింది. పార్టీ పార్లమెంటరీ కమిటీ త్వరలో అభ్యర్థుల పేర్లను ప్రకటించనుందని సమాచారం. గతంలోనే ఎన్సీ తాము లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించింది. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి చర్చించేందుకు సెంట్రల్ కశ్మీర్లో జరిగిన పీడీపీ సమావేశంలో పార్టీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికలకు తమ పార్టీ సిద్ధమైందని, త్వరలో రాష్ట్రంలోని లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ఖరారు చేయనున్నామన్నారు. మహ్మద్ సర్తాజ్ మదానీ నేతృత్వంలోని పార్టీ పార్లమెంటరీ బోర్డు త్వరలో అభ్యర్థుల పేర్లను ఖరారు చేయనుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పార్టీ సీనియర్ ఉపాధ్యక్షుడు అబ్దుల్ రెహమాన్, ప్రధాన కార్యదర్శులు డాక్టర్ మెహబూబ్ బేగ్, గులాం నబీ లోన్ హంజురా తదితరులు పాల్గొన్నారు. మరోవైపు ఎన్సీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా ఇటీవల మీడియాతో మాట్లాడుతూ ఎన్సీకి ప్రస్తుతమున్న సీట్లు మినహా మిగిలిన స్థానాల్లో పొత్తును గురించి పరిశీలిస్తామని ప్రకటించారు. అయితే ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించారు. -
భారత్‌లో ముస్లింలకు చోటెక్కడ?
శ్రీనగర్: వివాదాస్పద పౌరసత్వ సవరణ ముసాయిదా బిల్లుపై దేశ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ దేశాల్లో మతపరమైన వేధింపులు, వివక్షను ఎదుర్కొంటూ భారత్‌కు వచ్చిన ముస్లిమేతర శరణార్ధులకు పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించిన ఈ బిల్లుకు బుధవారం కేంద్ర కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. దీనిపై జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తి కూతురు సనా ఇల్తిజా జావేద్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముస్లింలపై వివక్ష చూపేందుకే బీజేపీ ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టిందని, భారత్‌లో ముస్లింలకు చోటులేకుండాపోతోందని ఆవేదన చెందారు. ముస్లింలకు రెండో తరగతి జనాభాగా చూపేందుకు ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ట్విటర్లో పోస్ట్ చేశారు. కాగా ఆర్టికల్ 370 రద్దు అనంతరం ముఫ్తి పోలీసులచే నిర్బంధించబడిన విషయం తెలిసిందే. దీంతో ఆమె తల్లి సోషల్ మీడియా ఖాతాను జావేద్ ఉపయోగిస్తున్నారు. భారత్ లౌకికత్వానికి ఈ మతతత్వ బిల్లు వ్యతిరేకమని విపక్షాలు వాదిస్తున్నాయి. ముఖ్యంగా ఈ వలసలు అధికంగా ఉన్న ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ఈ ప్రతిపాదనపై ఆగ్రహంతో ఉన్నారు. ఇస్లామిక్ దేశాల నుంచి శరణార్ధులుగా వచ్చిన వారిలో హిందువులే అత్యధికంగా ఉంటారు. ముస్లిమేతరులకు పౌరసత్వమిచ్చి వారికి ఎన్నార్సీ నుంచి రక్షణ కల్పించాలని బీజేపీ భావిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న అక్రమ వలసదారులను గుర్తించి, దేశం నుంచి పంపించేందుకు వీలుగా జాతీయ పౌరపట్టిక (నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్‌షిప్–ఎన్నార్సీ)ను సిద్ధం చేయాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. దేశ ప్రయోజనాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా పౌరసత్వ బిల్లు రూపకల్పన సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. ఈ బిల్లును నేడు కానీ, రేపు కానీ సభలో ప్రవేశపెట్టి, వచ్చే వారం సభ ఆమోదం పొందేలా చూడాలని కేంద్రం ఆలోచిస్తోంది. -
‘గాంధీ ఇండియానా లేక గాడ్సే ఇండియానా’
సాక్షి, న్యూఢిల్లీ: కశ్మీర్‌పై కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తూ పీడీపీ అధినేత్రి, మాజీ ముఖ్యమత్రి మెహబూబా ముఫ్తీ కుమార్తె సనా ఇల్తిజార్ జావేద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది గాంధీ జన్శించిన ఇండియానా లేక గాడ్సే ఇండియానా అంటూ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. శుక్రవారం ఢిల్లీలో ఓ మీడియా సంస్థ నిర్వహించిన ఇంటర్వ్యూ ఇల్తిజార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కశ్మీర్‌పై బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి హోదా కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. నెలలు గడుస్తున్న రాష్ట్ర వ్యాప్తంగా కమ్యూనికేషన్ వ్యవస్థ ఏ మాత్రం మెరుగుపడలేదని, ప్రజలపై నిర్బంధం విధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టికల్ 370 రద్దు అనంతరం కశ్మీర్ ప్రజలకు, దేశ ప్రజలకు మధ్య దూరం చాలా పెరిగిందన్నారు. తమపై విధించిన ఆంక్షలను పూర్తిగా సడలించి లోయలో ప్రశాంతతను పునరుద్ధరించాలని ఇల్తిజార్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కశ్మీర్‌పై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అత్యంత కీలకమైన నిర్ణయంపై తమను కనీసం సంప్రదించకపోవడం దారుణమన్నారు. ఇది తమ హక్కులను కాలరాయడమేనని ఆమె అభిప్రాయపడ్డారు. కాగా ఆర్టికల్ 370 రద్దు రాష్ట్ర విభజన నేపథ్యంలో మెహబూబా ముఫ్తీ సహా ఒమర్ అబ్దుల్లాను గృహ నిర్బంధం లో ఉంచిన సంగతి తెలిసిందే. పార్టీ కార్యకర్తలు న్యాయవాదులు ఆఖరికి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడేందుకు ఆమెకు అనుమతి ఇవ్వలేదని సనా అన్నారు. అదే విధంగా కశ్మీర్లో కేంద్రం అనుసరిస్తున్న విధానాలను కూడా ఆమె తీవ్రంగా విమర్శించారు. -
ఆర్టికల్ 370 రద్దు, మాజీ సీఎంలు అరెస్ట్
జమ్ము కశ్మీర్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును రాజ్యసభలో ఆమోదించిన వెనువెంటనే జమ్ముకశ్మీర్‌లో కీలక పరిణామాలు చకాచకా చోటు చేసుకున్నాయి. మాజీ ముఖ్యమంత్రులు, రాష్ట్ర కీలక నేతలను అదుపులోకి తీసుకోవడం కలకలం సృష్టించింది. ఇప్పటికే గృహ నిర్బంధంలో ఉంచిన మాజీ ముఖ్యమంత్రి , పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీని సోమవారం సాయంత్రం అరెస్ట్ చేశారు. అనంతరం ఆమెను శ్రీనగర్‌లోని ప్రభుత్వ గెస్ట్‌హౌస్ హరినివాస్కు తరలించారు. ముందు జాగ్రత్త చర్యగా ముఫ్తీని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. మరో మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా కూడా అరెస్ట్ చేసినట్టు సమాచారం. ఒమర్ అరెస్ట్‌పై అధికారిక నిర్ధారణ రావాల్సి వుంది. జమ్మూకశ్మీర్‌కు భారీగా బలగాలను తరలించిన రోజు దగ్గరినుంచీ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో శ్రీనగర్‌లో ఆదివారం అర్ధరాత్రి నుంచి 144 సెక్షన్ విధించారు. అలాగే రాష్ట్రంలోని ముగ్గురు ప్రధాన నేతలు పీపుల్స్ కాన్ఫరెన్స్ నేత సజాద్‌లోన్‌తో పాటు మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లాలను హౌజ్ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ను రద్దు చేస్తూ మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం భారత ప్రజాస్వామ్యంలో చీకటి రోజుగా ముఫ్తీ అభివర్ణించారు. ఇది కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయమనీ, ఇది చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధమని ఆమె ట్వీట్ చేశారు. ఇది ఇలా వుంటే ఆర్టికల్ 370 రద్దుతో పాటు జమ్మూకశ్మీర్ పునర్ విభజన బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. సుదీర్ఘమైన చర్చ అనంతరం 370 ఆర్టికల్ రద్దు బిల్లు మూజువాణి ఓటుతో నెగ్గింది. అయితే, జమ్మూకశ్మీర్ పునర్ విభజన బిల్లుకు సవరణలుకోరిన నేపథ్యంలో బిల్లుపై ఓటింగ్ జరగగా.. అనుకూలంగా 125 ఓట్లు, వ్యతిరేకంగా 61 ఓట్లు రాగా ఒకరు తటస్థంగా ఉన్నారు. -
సూపర్ హిట్ రీమేక్‌లో బాలయ్య..?
సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇటీవల జై సింహా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలయ్య ప్రస్తుతం ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్‌లో నటించేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమా తరువాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభం కానుంది. ఇలా వరుస సినిమాలో బిజీగా ఉన్న బాలయ్య ఓ సూపర్ హిట్ సినిమాను రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నారట. కన్నడలో శివరాజ్ కుమార్, శ్రీ మురళి, శాన్వీలు ప్రధాన పాత్రల్లో నార్తన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మఫ్టీ. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కి ఘనవిజయం సాధించిన ఈ సినిమాను బాలకృష్ణ హీరోగా రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే వరుస సినిమాలతో బిజీగా ఉన్న బాలయ్య మఫ్టీ రీమేక్‌కు అంగీకరిస్తాడా లేదా చూడాలి. -
జైషే టాప్ కమాండర్ హతం
సాక్షి, శ్రీనగర్: జైషే మహమ్మద్ ఉగ్రసంస్థకు చెందిన టాప్ కమాండర్ ముఫ్తీ వకాస్ హతమయ్యాడు. జమ్మూకశ్మీర్‌లోని సంజువాన్ ఆర్మీ క్యాంపుపై దాడికి ప్రధాన సూత్రధారి అయిన వకాస్‌ను భారత ఆర్మీ, కశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్ నిర్వహించిన ఆపరేషన్‌లో భాగంగా మట్టుపెట్టాయి. కశ్మీర్‌లోని అవంతీపూర్‌లో ఉగ్రకదలికలు ఉన్నట్లు గుర్తించిన 50 రాష్ట్రీయ రైఫిల్స్ బృందాలు, భారత ఆర్మీ, స్థానిక పోలీసులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. హతివారాలో జరిపిన ఎన్కౌంటర్లో సంజువాన్ ఆర్మీ క్యాంపు దాడి ప్రధాన నిందితుడు ముఫ్తీ వకాస్ హతమయ్యాడని శ్రీనగర్ ఆర్మీ క్యాంపు అధికార ప్రతినిధి కల్నల్ రాజేశ్ కలియా మీడియాకు వివరించారు. ఓ ఏకే 47 రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నామని, ఈ ఆపరేషన్‌లో పౌరులెవరికీ ఎలాంటి హానీ జరగలేదన్నారు. నూర్ మహమ్మద్ అనంతరం జైషే ఉగ్రసంస్థకు వకాస్ ప్రధాన కమాండర్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. గత నెలలో జమ్మూ నగర శివార్లలోని సంజువాన్ ఆర్మీక్యాంపుపై జరిగిన ఉగ్రదాడిలో ఒక పౌరుడు, ఐదుగురు ఆర్మీ సిబ్బందితో కలిపి మొత్తం ఆరుగురు మృత్యువాతపడ్డారు. -
శాన్వి... ద డైరెక్టర్!
నిజమే.. శాన్వీ శ్రీవాత్సవ కథలు రెడీ చేసుకుంటున్నారు. ఎందుకంటే... డైరెక్టర్ కాలనుకుంటున్నారు కనుక! ఇంతకీ, ఈ అమ్మాయి ఎవరో గుర్తు పట్టారా? లవ్లీ, అడ్డా, రౌడీ, ప్యార్ మే పడిపోయానే వంటి తెలుగు సినిమాల్లో హీరోయిన్గా నటించిన అమ్మాయే... ఈ శాన్వీ! ఇప్పుడు కన్నడలో ఫుల్ బిజీ హీరోయిన్. లాస్ట్ టు ఇయర్స్‌లో ఏడు సినిమాలు చేశారు. ఇప్పుడామె డైరెక్టర్ కావాలనుకుంటున్నది రియల్ లైఫ్‌లో కాదు... రీల్ లైఫ్‌లో! శివ రాజ్‌కుమార్, శ్రీమురళీ హీరోలుగా నటిస్తున్న కన్నడ సినిమా ‘మఫ్టీ’. అందులో శ్రీమురళికి జోడీగా, డైరెక్టర్ కావాలనుకునే పాత్రలో శాన్వి నటిస్తున్నారు. అదండీ సంగతి!! -
దేశవిదేశాల్లో స్వేచ్ఛా గీతిక
ఘనంగా 71వ స్వాతంత్య్ర వేడుకలు న్యూఢిల్లీ/బీజింగ్/మెల్బోర్న్: మువ్వన్నెలు రెపరెపలాడాయి. మహాత్ములను స్మరిస్తూ... వారి త్యాగాలను కీర్తిస్తూ... గుండెలు ఉప్పొంగాయి. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటు తూ దేశంలోనే కాదు... విదేశీ గడ్డపైనా భారత 71వ స్వాతంత్య్ర వేడుకలు మిన్నం టాయి. దేశంలోని అన్ని ప్రాంతాల్లో ప్రజలు ఉత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు జాతీయ పతాకాన్ని ఎగురవేసి ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. అభివృద్ధి పథకాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రకటించారు. జమ్మూ కశ్మీర్‌ను భారత్‌కు కిరీటంలా దేశ ప్రజలంతా విశ్వసిస్తారని, ఎప్పటికీ తమ రాష్ట్రం అలానే ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదని సీఎం ముఫ్తీ స్పష్టం చేశారు. పట్నాయక్‌కు అస్వస్థత: మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో వేడుకల వేదికల వద్ద రుణమాఫీ చేయాలంటూ రైతులు నిరసనలు తెలిపారు. పతాక ఆవిష్కరణలకు అంతరాయం కలిగించారు. ఒడిశా ఉత్సవా ల్లో ప్రసంగిస్తుండగా సీఎం నవీన్ పట్నాయక్ హఠాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు. అయినా జెండా వందనం అయ్యే వరకు ఉండి, తరువాత అక్కడి నుంచి వెళ్లిపో యారు. ఆయన ఆరోగ్యం స్థిరంగానే ఉందని అనంతరం అధికారులు ప్రకటించారు. విదేశీ గడ్డపై భారతీయం ప్రపంచం నలుమూలలా ఉన్న వేలాది మంది భారతీయులు స్వాతంత్య్ర సంబరాల్లో మునిగిపోయారు. మువ్వన్నెల జెండాలు చేతపట్టి... జాతీయ గీతాలు ఆలపించి భారత మాతకు జేజేలు పలికారు. చైనా, ఆస్ట్రేలియా, జపాన్, సింగపూర్, సౌదీ, బ్రిటన్, ఈజిప్ట్, ఇజ్రాయెల్, దక్షిణాఫ్రికాల్లో ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. ఆస్ట్రేలియాలోని భారతీయులకు ఆ దేశ ప్రధాని మాల్కమ్ టర్న్‌బుల్ శుభాకాంక్షలు చెప్పారు. జపాన్ ప్రముఖులు భారతీయు లకు అక్కడి వార్తాపత్రికల ద్వారా శుభాకాం క్షలు తెలిపారు. బ్రిటన్‌లోని భారతీయులు చారిత్రక పార్లమెంట్ స్క్వేర్ నుంచి తొలి సారిగా ఫ్రీడమ్ రన్ చేపట్టారు. దక్షిణా ఫ్రికా లోని ప్రిటోరియా, డర్బన్, కేప్‌టౌన్, జోహ న్నెస్బర్గ్ల్లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ స్వాతంత్య్ర సందేశాన్ని వినిపించారు. -
జమ్మూకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన విధించాలి
ఢిల్లీ: జమ్మూకశ్మీర్ లో రాష్ట్రపతి పాలన విధించాలని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి అన్నారు. మహబూబా ముఫ్తీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ఆయన మంగళవారమిక్కడ వ్యాఖ్యానించారు. సర్కార్ వైఫల్యం వల్లే అనంత్‌నాగ్ లో యాత్రికులపై ఉగ్రదాడి జరిగిందన్నారు. జమ్మూ ప్రజలకు భద్రత కరువైందని సుబ్రహ్మణ్యస్వామి వ్యాఖ్యానించారు. కాగా జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఉగ్రవాదులు నిన్న అమర్నాథ్ యాత్రికుల బస్సుపై జరిపిన కాల్పుల్లో ఆరుగురు మహిళలు సహా ఏడుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. మరో 32 మంది గాయపడ్డారు. మృతులంతా గుజరాత్ వాసులు. 2000 సంవత్సరం తర్వాత ఉగ్రవాదులు అమర్నాథ్ యాత్రికులపై భీకరంగా దాడి చేయడం ఇదే తొలిసారి. మరోవైపు ముఖ్యమంత్రి ముఫ్తీ తాజా పరిణామాలతో పాటు, శాంతి భద్రతలపై మంత్రివర్గంతో సమావేశమయ్యారు. ఈరోజు ఉదయం ఆమె ఉగ్రవాదిలో గాయపడ్డవారిని పరామర్శించారు. ఉగ్రదాడితో కాశ్మీరీలందరూ సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన ఇది అని ఆమె అన్నారు. -
రాజకీయాల్లోకి మాజీ సీఎం కొడుకు
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి దివంగత ముఫ్తీ మహమ్మద్ సయీద్ కొడుకు తసాదుక్ ముఫ్తీ ఎట్టకేలకు రాజకీయ అరంగేట్రం చేశారు. తండ్రి తొలి వర్ధంతి సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన సభలో ఆయన అధికార పీడీపీ (పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ)లో చేరారు. వృత్తిరీత్యా సినిమాటోగ్రాఫర్ అయిన తసాదుక్, ముఖ్యమంత్రి కొడుకుగా కాకుండా తన ప్రతిభతో కష్టపడి పైకి వచ్చారు. సోదరి, జమ్మూకశ్మీర్ ప్రస్తుత ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ సమక్షంలో ఆయన పార్టీలో చేరుతూ ‘మన రాష్ట్రంలో రాజకీయాలను ప్రక్షాళన చేయాలనేది నా కల. ఇన్నాళ్లూ నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను. ఈ రోజు పీడీపీలో చేరాను. ఇది నా జీవితంలో ముఖ్యమైన రోజు’అని అన్నారు. తసాదుక్ చేరికను మెహబూబా ముఫ్తీ స్వాగతించారు. -
'రెచ్చగొట్టి నా కూతుర్ని చంపించాడు'
లాహోర్: తమ కుమార్తె హత్యకు మతాధికారి ముఫ్తీ అబ్దుల్ ఖావి కారణమని పాకిస్థాన్ వివాదస్పద మోడల్ కందిల్ బలోచ్ తల్లి ఆరోపించారు. తన కొడుకు మొహ్మద్ వసీంను ఖావి రెచ్చగొట్టి తన కూతురిని చంపించాడని ఆమె పేర్కొంది. కందిల్ హత్య కేసులో ఖావి పేరును చేర్చినట్టు పోలీసులు ప్రకటించిన నేపథ్యంలో ఆమె ఈ ఆరోపణ చేశారు. జియో న్యూస్ తో ఆమె మాట్లాడుతూ... 'నా కూతురు హత్య కేసులో ముఫ్తీ అబ్దుల్ ఖావి, కందిల్ మాజీ భర్త ఆశిక్ హుస్సేన్, మరో వ్యక్తి షాహిద్ ప్రమేయముంది. ఖావి సలహా మేరకు కందిల్ ను వసీం చంపాడు. ఖావి రెచ్చగొట్టడం వల్లే ఇదంతా చేశాడు. కందిల్ మాజీ భర్త హుస్సేన్ తోనూ వసీం కాంటాక్ట్ లో ఉన్నాడ'ని చెప్పారు. ఈ కేసులో ఖావి పేరు కూడా చేర్చామని, ఫోరెన్సిక్ నివేదిక కోసం చూస్తున్నామని ముల్తాన్ పోలీస్ చీఫ్ అజహర్ ఇక్రమ్ తెలిపారు. కందిల్ తో సెల్ఫీ దిగడంతో ఖావి.. మతాధికారి పదవి కోల్పోయాడు. కాగా, తమ కుటుంబం పరువు మంటగలుపుతుందనే కందిల్ ను హత్య చేసినట్టు ఆమె సోదరుడు వసీం కోర్టు ముందు అంగీకరించాడు. -
ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన ముఫ్తీ
శ్రీనగర్ : పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు, జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ గురువారం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ స్పీకర్ కవీంద్ర గుప్తా ...ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ నెల 25న జరిగిన అనంత నాగ్ ఉప ఎన్నికల్లో ఆమె విజయం సాధించిన విషయం తెలిసిందే. ముఫ్తీ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి హిలాల్ అహ్మద్ షాపై 12,000 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. దివంగత ముఖ్యమంత్రి, ముఫ్తీ తండ్రి ముఫ్తీ మహ్మద్ సయ్యద్ మృతితో అనంతనాగ్‌లో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. మెహబూబా ముఫ్తీ ఈ ఏడాది ఏప్రిల్‌లో జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అనంతరం అనంతనాగ్ లోక్ సభ సభ్యత్వానికి ఆమె రాజీనామా చేశారు. దాంతో లోక్ సభ నియోజకవర్గంలో తాజాగా ఎన్నికలు జరగనున్నాయి. -
'పాకిస్థాన్ ఇంటర్నెట్ సంచలనం' వివాదం
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ఇంటర్నెట్ సంచలనం కాందీల్ బాలోచ్ మరో వివాదానికి కారణమైంది. సెల్ఫీతో మతాధికారి పదవికి ఎసరు పెట్టింది. మతాధికారి ముఫ్తీ అబ్దుల్ ఖావితో తీసుకున్న సెల్ఫీని తన ఫేస్బుక్ లో పోస్ట్ చేసింది. ఖావి పక్కన కూర్చుని ఆయనను సరదాగా ఆట పట్టించింది. ఆయన టోపీ పెట్టుకుని సెల్ఫీ తీసుకుంది. అదే సమయంలో అబ్దుల్ ఖావి సెల్ ఫోన్ లో మాట్లాడుతున్నట్టుగా సెల్ఫీలో ఉంది. బాలోచ్ తో సన్నిహితంగా మెలిగినందుకు మతాధికారి పదవి నుంచి ఖావిని మతవ్యవహారాల శాఖ తొలగించింది. కాగా, ఇఫ్తార్ విందుకు రావాలని ఖావి ఆహ్వానించడంతో ఆయన వద్దకు వెళ్లానని బాలోచ్ వెల్లడించింది. తనకు ఆయన 'ప్రపోజ్' చేశారని చెప్పి బాంబు పేల్చింది. బాలోచ్ చెప్పిన విషయాలను ఖావి తోసిపుచ్చారు. తమ విషయాలు నేర్చుకుంటానని చెప్పడంతో ఆమెను ఆహ్వానించానని ఖావి తెలిపారు. నిష్టగా రంజాన్ ఉపవాసం చేస్తానని తనకు చెప్పిందన్నారు. కాగా, గతంలోనూ బాలోచ్ సంచలన ప్రకటనలతో వార్తల్లోకి ఎక్కింది. టీ20 ప్రపంచకప్ లో ఇండియాను పాకిస్థాన్ టీమ్ ఓడిస్తే నగ్నంగా డాన్స్ చేస్తానని ప్రకటించి కలకలం రేపింది. -
వచ్చింది ఐజీ అని గుర్తించలేక..
పిడుగురాళ్ల: గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పట్టణ పోలీస్ స్టేషన్‌ను ఐజీ సంజయ్ శనివారం రాత్రి ఆకస్మికంగా సందర్శించారు. మఫ్టీలో వచ్చిన ఆయన స్టేషన్ పరిసరాల్లో ఉన్న బాధితులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. పోలీసుల పని తీరు ఎలా ఉందంటూ విచారించారు. ఇంత జరుగుతున్నా వచ్చింది ఐజీ అని అక్కడున్న పోలీసులు పసిగట్టలేకపోయారు. ఆలస్యంగా ఎస్ఐ రమేష్‌బాబు ఐజీని గుర్తించి సర్ అనే సరికి అక్కడున్న సీఐ శ్రీధర్‌రెడ్డి, మరో ఎస్ఐ మహమ్మద్ రఫీతోపాటూ సిబ్బంది కూడా అప్రమత్తమయ్యారు. ఆ తర్వాత ఐజీ స్టేషన్ అంతా కలియతిరిగారు. రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసి వెళ్లారు. -
'ఒక్క అడుగు ముందుకు పడలేదు'
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ లో ప్రభుత్వ ఏర్పాటుపై కొనసాగుతున్న సస్పెన్స్ కొనసాగుతోంది. బీజేపీ, పీడీపీ మధ్య జరుగుతున్న చర్చల్లో పురోగతి కనిపిచడం లేదు. ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సయిద్ మరణం తర్వాత ఆ పదవికి ఆయన కుమార్తెను ఎన్నుకున్నారని, అంతకుమించి ఒక్క అడుగు ముందుకు పడలేదని బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ తెలిపారు. కశ్మీర్ లో రాజకీయ అనిశ్చితికి తాము కారణంగా కాదని స్పష్టం చేశారు. పీడీపీ కొత్త షరతులకు ఒప్పుకోమని అన్నారు. కొన్ని అంశాలపై స్పష్టత రావాల్సివుందని, అంతవరకు సందిగ్ధం కొనసాగుతుందని రాంమాధవ్ చెప్పారు. -
కశ్మీర్ ‘ప్రభుత్వం’పై తొలగని అనిశ్చితి
పార్టీ నేతలతో మెహబూబా మంతనాలు కేంద్రం స్పందన తర్వాత ఆలోచిద్దామని వ్యాఖ్య శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటుపై మళ్లీ అనిశ్చితి నెలకొంది. దివంగత సీఎం ముఫ్తీ మహ్మద్ సయీద్ కూతురు, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ కటువుగా మాట్లాడుతుండటంతో.. బీజేపీతో పొత్తు ఉంటుందా లేదా అనే అనుమానాలు నెలకొన్నాయి. ఆదివారం పీడీపీ నేతలతో 4 గంటలు భేటీ అయిన మెహబూబా.. రాష్ట్ర రాజకీయ, ఆర్థిక అంశాలపై కేంద్రం స్పష్టమైన వైఖరి చెబితేనే.. బీజేపీపై పొత్తుపై ఆలోచిస్తామన్నారు. కశ్మీర్ లోయలో శాంతి నెలకొల్పి రాష్ట్రానికి పునర్వైభవం తీసుకువచ్చేందుకు దివంగత సీఎం ప్రయత్నిస్తే.. రాష్ట్రం, కేంద్రంలోని బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు అనవసర వివాదాన్ని సృష్టిస్తున్నాయని ఆమె అన్నట్లు సమాచారం. పీడీపీ-బీజేపీ అధికారంలోకి వచ్చిన 10 నెలల్లో రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు మెల్లిగా ముందడుగు వేస్తున్నాయని.. అయితే.. ఇరు పార్టీల మధ్య నెలకొన్న సమస్యలతో.. ఎంత చేసినా ప్రజల్లో సానుకూల అభిప్రాయమే లేదన్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య బీజేపీతో పొత్తుపై పునరాలోచించాల్సిందేననే అభిప్రాయం పార్టీనేతల్లోనూ వ్యక్తమైనట్లు తెలిసింది. నిర్ణయాధికారాన్ని మెహబూబాకే వదిలేసినట్లు సమాచారం. -
సీఎం నివాసాన్ని ఖాళీ చేసిన కుటుంబీకులు
జమ్ముకశ్మీర్ దివంగత ముఖ్యమంత్రి అధికారిక నివాస భవనాన్ని ఆయన కుటుంబీకులు, బంధువులు ఖాళీచేశారు. ఇటీవల సీఎం ముఫ్తీ మహమ్మద్ సయీద్ చనిపోవడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఈ విషయాన్ని అధికారవర్గాలు గురువారం తెలిపాయి. సయీద్ మరణం తర్వాత ఆయన కుటుంబసభ్యులు జమ్మూ, శ్రీనగర్‌లలోని సీఎం నివాసాల్లో ఉండట్లేదు. కానీ విలువైన వస్తువులు, ఇతర సామగ్రిని తీసుకున్నారు. అనంతరం అధికారికంగా ఆ భవనాన్ని పూర్తిగా రాష్ట్ర ఎస్టేట్స్ విభాగానికి స్వాధీనం చేశారు. జనవరి 7న ముఫ్తీ సయీద్ మరణం, అనంతనాగ్ జిల్లాలోని బిజ్ బెహరాలో అంత్యక్రియలు ముగిసిన అనంతరం ఆయన భార్య గుల్షన్ అరా, కుమారుడు తసాదక్ ముప్తీ, కుమార్తె మెహబూబా ముఫ్తీ శ్రీనగర్‌లోని అత్యంత భద్రత ఉండే మరో భవనంలోకి మారిన సంగతి తెలిసిందే. -
సామరస్య సారథికి సలాం
త్రికాలమ్ కశ్మీర్‌పైన తిరిగి కారుమబ్బులు కమ్ముకుంటున్నాయి. పఠాన్‌కోట మీదా, అఫ్ఘానిస్తాన్‌లో మజారే షరీఫ్‌లోని భారత దౌత్య కార్యాలయంపైనా దాడి చేయడానికి కారణం కశ్మీరీ ప్రొఫెసర్ అఫ్జల్ గురును ఉరితీయడమేనంటూ ఉగ్రవాదులు ప్రకటించారు. ఉగ్రవాదులు కశ్మీర్‌ను ప్రశాంతంగా ఉండనీయరనేది స్పష్టం. ఈ పరిస్థితులలో ముఖ్యమంత్రి పదవి మెహబూబాకు అగ్నిపరీక్ష. సోదరులను హత్య చేసి, తండ్రిని నిర్బంధించి సింహాసనం అధిష్టించిన మొఘల్ చక్రవర్తి ఎవరో అందరికీ తెలుసు. పెద్దకొడుకు దారా సుఖో షాజహాన్‌కు వారసుడు కావలసినవాడు. తమ్ముడు ఔరంగజేబు అధికార దాహానికీ, అమానుషానికీ తక్కిన తమ్ముళ్లు షా షుజా, మురాద్ బక్ష్‌తో పాటు బలైనవాడు దారా. అతడు వీరుడే కాకుండా తత్త్వశాస్త్రం అధ్యయనం చేసిన మేధావి. ఖురాన్లో ప్రస్తావించిన ‘కితాబ్ అల్ మఖ్నూన్’ (నిక్షిప్తగ్రంథం) ఉప నిషత్తులేనని బలంగా నమ్మిన వ్యక్తి. బెనారస్ పండితుల సహకారంతో ఉపనిష త్తులను పార్సీలోకి అనువదించిన ఘనుడు. హిందూ, ఇస్లాం మతాల మధ్య వైరుధ్యం లేదని విశ్వసించిన సూఫీ మత ప్రచారకుడు ఖాద్రీ పరంపరను పాటించి, మియా మీర్ శిష్యరికం చేసినవాడు. అటువంటి దారా దారిలో జీవితాంతం నడిచిన సామరస్యవాది గురువారం కన్నుమూసిన కశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్. స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత జమ్మూ-కశ్మీర్ పాకిస్తాన్లో కాకుండా భారత్‌లో విలీనం కావడానికి ప్రధాన కారకుడు ప్రజానాయకుడు షేక్ అబ్దుల్లా. శ్రీనగర్కీ, ఢిల్లీకీ వారధిగా నిలిచిన రాజనీతిజ్ఞడు ముఫ్తీ సాహెబ్. సామరస్య సాధనే ఆయన రాజకీయ జీవిత లక్ష్యం. జిన్నా ద్విజాతి సిద్ధాంతాన్ని నిర్ద్వంద్వంగా తిరస్కరించి భారత్‌లో హిందువులదీ, మహమ్మదీయులదీ ఒకే జాతి అంటూ చాటిన వ్యక్తి ముఫ్తీ. భారత్ ఎప్పటికైనా పాకిస్తాన్‌తో స్నేహ సంబంధాలు నెలకొల్పుకోవాలనీ, అప్పుడే కశ్మీర్ సుస్థిరంగా, ప్రశాంతంగా మనగలుగుతుందనీ ముఫ్తీ విశ్వాసం. దారా సుఖోతో పాటు జవహార్‌లాల్ నెహ్రూ కూడా ఆయనకు ఆదర్శం. ‘మై తో నెహ్రూ జమానా కే నేతా హూ’ అనేవారు. ఆయనది గంగా-జమునీ తెహజీబ్. ముఫ్తీ కుటుంబం కాంగ్రెస్ పార్టీలో చాలా కాలం ఉంది. ఫారుఖ్ అబ్దుల్లాతో ఇందిరాగాంధీకి విభేదాలు వచ్చినప్పుడు ముఫ్తీ ముఖ్యమంత్రి కావలసింది. కానీ ఫారుఖ్ జమ్మూ-కశ్మీర్ అసెంబ్లీని రద్దు చేయవలసిందిగా సిఫార్సు చేయడంతో అప్పటి అవకాశం చేజారింది. లేకపోతే 41 ఏళ్లకే ముఖ్యమంత్రి పదవి వరించేది. ప్లెబిసైట్ ప్రతిపాదనకు స్వస్తి చెప్పేందుకు అంగీకరించారనే కారణంగా ఫారుఖ్ పట్ల ఇందిరకు కొంత సానుకూలత ఉండేది. కాంగ్రెస్ పార్టీతో రాజీ పడి తిరిగి అధికారంలోకి వచ్చిన ఫారుఖ్‌ని నేషనల్ కాన్ఫరెన్స్‌లో చీలిక తేవడం ద్వారా పడగొట్టి ముఫ్తీ ప్రతీకారం తీర్చుకున్నారు. రాజీవ్‌గాంధీ మంత్రిమండలిలో టూరిజం శాఖ నిర్వహించిన ముఫ్తీ విశ్వనాథ్ ప్రతాప్ సింగ్‌తో పాటు ప్రభుత్వం నుంచి వైదొలిగి జనమోర్చా నెలకొల్పారు. 1989 ఎన్నికలలో గెలిచిన నేషనల్ ఫ్రంట్ నేతగా వీపీ సింగ్ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ముఫ్తీ వీపీ సింగ్ ప్రభుత్వంలో దేశీయాంగశాఖ మంత్రి. చిన్న కుమార్తె రుబయ్యా సయీద్‌ను అపహరించిన జమ్మూ-కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జేకేఎల్ఎఫ్) నాయకులతో చర్చలు జరిపి కూతురిని విడిపించుకున్నారు. ఈ కారణంగా కశ్మీర్లో తీవ్రవాదం ప్రబలిందని పరిశీలకుల అభిప్రాయం. అణచివేత, హింసాకాండ ముఫ్తీ హోంశాఖ నిర్వహిస్తున్న సమయంలోనే కశ్మీర్లో భద్రతా దళాలు తీవ్రవాదులనూ, వేర్పాటువాదులనూ ఉక్కుపాదంతో అణచివేశాయి. సాధారణ పౌరులు అనేక మంది మరణించారు. కశ్మీర్లో భారత్ పట్ల వ్యతిరేకత ప్రబలింది. ఆ దశలో ముఫ్తీ సహచరులలో చాలామంది వేర్పాటువాద శిబిరంలో చేరిపోయారు. ముఫ్తీ మాత్రం ప్రధాన రాజకీయ స్రవంతిలోనే కొనసాగారు. 1999లో పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ (పీడీపీ)ని నెలకొల్పి నేషనల్ కాన్ఫరెన్స్‌కి ప్రత్యామ్నాయ ప్రాంతీయ పార్టీగా నిలిచారు. 2002 ఎన్నికలలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని విజయం సాధించి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ముఫ్తీ సామరస్య విధానాలను అమలు పరిచారు. ఇన్సానియత్ (మానవత్వం) అనే మాటను ఆయన పదే పదే ఉపయోగించేవారు. కార్గిల్ యుద్ధం, పార్లమెంటు భవనంపైన ఉగ్రవాదుల దాడి తర్వాత పాకిస్తాన్‌తో చర్చలు జరపవలసిందిగా నాటి ప్రధాని వాజపేయిని ముఫ్తీ ప్రోత్సహించారు. ఇన్సానియత్తో పాటు జమ్రూహియత్ (ప్రజాస్వామ్యం), కశ్మీరియత్ (కశ్మీర్ సంస్కృతీ సంప్రదాయాలు) అనే మూడు స్తంభాలపైనే కశ్మీర్ శాంతి సౌధం సగర్వంగా నిలబడాలనేది వాజపేయి వాదం. ముఫ్తీ అభిప్రాయం కూడా అదే. ‘హీలింగ్ టచ్’ అనే విధానం ద్వారా కశ్మీరీల హృదయాలలో గాయాలను మాన్పించే ప్రక్రియకు ముఫ్తీ శ్రీకారం చుట్టారు. పాకిస్తాన్ పట్ల త్రిముఖ వ్యూహం అమలు చేయాలని వాజపేయి సంకల్పించింది ముఫ్తీ ప్రోద్బలంతోనే. పాకిస్తాన్‌తో, వేర్పాటువాదులతో విడివిడిగా చర్చలు జరపుతూనే కశ్మీర్ ప్రజల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలన్నది వ్యూహం. 2004లో యూపీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో కలసి ఇదే వ్యూహాన్ని కొనసాగించే ప్రయత్నం చేశారు. ముఫ్తీ 2005లో ముఖ్యమంత్రి పదవిని గులాం నబీ ఆజాద్‌కు అప్పగించినప్పటికీ కశ్మీర్లో ‘హీలింగ్ టచ్’ విధానం కొనసాగింది. దీని ఫలితం 2005 నుంచి కనిపించింది. 2004లో సుమారు 4000 మంది కశ్మీర్ లోయలో హింసాకాండకు బలైనారు. ఈ సంఖ్య 2008 నాటికి 150కి తగ్గింది. పరిపాలనా యంత్రాంగాన్ని పటిష్ఠంగా నడిపిం చడం ముఫ్తీ హయాంలో స్పష్టంగా కనిపించిన మార్పు. ఆ రోజుల్లో లద్దాఖ్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలనే ఉద్యమం సాగుతోంది. లే, కార్గిల్ హిల్ కౌన్సిల్స్‌ను నెలకొల్పి అధికార వికేంద్రీకరణ చేసిన ఫలితంగా ఆ ప్రాంతంలో అభివృద్ధి స్పష్టంగా కనిపించింది. ప్రజలు శాంతించారు. శ్రీనగర్- ముజఫరాబాద్ రహదారిని ముఫ్తీతో కలసి నాటి ప్రధాని మన్మోహన్సింగ్ ప్రారంభించారు. రెండు ప్రాంతాల మధ్య వ్యాపార సంబంధాలు మొదలైనాయి. విద్యా సంస్థలూ, ఆసుపత్రులూ నెలకొల్పారు. పారా మిలిటరీ ఆపరేషన్స్ గ్రూపులను ఉపసంహరించారు. లోగడ పాకిస్తాన్‌కు వెళ్లిపోయిన మిలిటెంట్లను తిరిగి రావ లసిందిగా ఆహ్వానించారు. కొంతమంది వెనక్కి వచ్చారు. కశ్మీర్ పండిట్లు తిరిగి వస్తే వారి నివాసానికి అవసరమైన ఏర్పాట్లు చేసినప్పటికీ వారికి విశ్వాసం కలగలేదు. తిరిగి రాలేదు. ప్రత్యర్థితో కలసి ప్రభుత్వం ఒమర్ అబ్దుల్లా అధికారంలోకి వచ్చిన తర్వాత కశ్మీర్లో మళ్లీ హింస పెరిగింది. రాళ్లు రువ్వుతున్న యువకులపై సాయుధ పోలీసులు కాల్పులు జరపడంతో 2010 వేసవిలో వందమందికి పైగా మరణించారు. కేంద్ర ప్రభుత్వం పట్ల విశ్వాస రాహిత్యం, దశాబ్దాల తరబడి నిర్దాక్షిణ్యంగా అణచివేయడం కారణంగా కశ్మీరీల హృదయాలలో ఆగ్రహం రగులుతూ ఉంటుంది. ముఫ్తీ మానవీయ విధానాలు కొంతకాలం అశాంతికి అడ్డుకట్ట వేయగలిగాయి. అదే ముఫ్తీ 2014 ఎన్నికల అనంతరం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినా మునుపటి ‘హీలింగ్ టచ్’ కనిపించలేదు. ఎన్నికలలో హోరాహోరీ పోరాడిన ప్రధాన ప్రత్యర్థి బీజేపీతో ఎన్నికల అనంతరం పొత్తు పెట్టుకొని ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఒక్క ముఫ్తీ మహమ్మద్ సయీద్‌కి మాత్రమే సాధ్యం. దీనిని అవకాశవాదంగా ఎవ్వరూ ఆక్షేపించలేదు. సామరస్యవాదిగా ముఫ్తీ రాజీవ్‌తో, వీపీ సింగ్‌తో, వాజపేయితో, సోనియాగాంధీతో, మన్మోహన్ సింగ్‌తో వ్యవహారం చేసినట్టే నరేంద్రమోదీతోనూ కలసి అడుగులు వేయగలి గారు. పీడీపీ-బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ముందు కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందించుకోవడానికే నాలుగు నెలలపాటు సుదీర్ఘ సమాలో చనలు జరపవలసి వచ్చింది. ముఫ్తీ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత కూడా సంకీర్ణ సమస్యలతో కొంత, విధానాల పట్ల విభేదాలతో కొంత, కేంద్రం నుంచి నిధుల రాబట్టుకోవడానికి ప్రయత్నించడంతో కొంత సమయం వృధా అయిపోయింది. నిజానికి ముఫ్తీ మొదటిసారి ముఖ్యమంత్రిగా అమలు చేసిన విధానాల ఊసు ఇంత వరకూ లేదు. తొలి మహిళా ముఖ్యమంత్రి ఈసారి ముఖ్యమంత్రిగా మెహబూబానే ప్రమాణం చేయాలన్నది ముఫ్తీ అభిమతం. వార్థక్యం, అనారోగ్యం కారణంగా పదవీ బాధ్యతలు నిర్వ హించలేనని చెప్పారు. తాను డ్రాయింగ్ రూంలో కూర్చొని మాట్లాడే రాజకీయవాదిని మాత్రమేననీ, నిజమైన ప్రజానాయకురాలు తన కూతురేననీ, పార్టీని బలోపేతం చేసిందీ, ఎన్నికలలో గెలిపించిందీ ఆమేననీ సందర్భం వచ్చినప్పుడల్లా అనేవారు. సంతాపదినాలు పూర్తయిన తరువాత మెహబూబా ముఫ్తీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారు. ఇండియాలో మహమ్మదీయులు మెజారిటీగా ఉన్న ఒకే ఒక రాష్ట్రం జమ్మూ-కశ్మీర్. అటువంటి రాష్ట్రానికి ఒక మహిళ ముఖ్యమంత్రి కావడం చరిత్ర. తండ్రి వలె కాకుండా మెహబూబాకు దూకుడు ఎక్కువ. ఇద్దరు కూతుళ్లతో ఒంటరి తల్లిగా జీవిస్తున్న మెహబూబాకు ఢిల్లీలోనూ, శ్రీనగర్‌లోనూ శ్రేయోభిలాషులు అనేకమంది ఉన్నారు. వేర్పాటు వాదులతో సైతం ఆమెకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సొంత పార్టీలో ముఠాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి పదవికి తాము మాత్రమే సరిపోతామని భావించే సీనియర్లూ ఉన్నారు. వారందరినీ దారిలో పెట్టి తండ్రి ఆచరించిన సామరస్య విధానాలను అమలు చేయడం ఎట్లా అన్నది 56 సంవత్సరాల మెహబూబా ఎదుట ఉన్న పెనుసవాలు. అయితే మెహబూబా విచారం నుంచి కోలుకునే దాకా బాధ్యతలు స్వీకరించరని వార్తలు వచ్చాయి. అందుకే జమ్మూ- కశ్మీర్లో తాత్కాలికంగా గవర్నర్ పాలన విధించారు. కశ్మీర్ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం అభ్యసించిన మెహబూబా పార్టీ వ్యవహారాలు చక్కబెట్టగలరు కానీ బీజేపీతో కలసి సంకీర్ణ ప్రభుత్వాన్ని నెట్టుకురాగలరా అన్నది సందేహం. పైగా కశ్మీర్‌పైన తిరిగి కారుమబ్బులు కమ్ముకుంటున్నాయి. పఠాన్‌కోట మీదా, అఫ్ఘానిస్తాన్‌లో మజారే షరీఫ్‌లోని భారత దౌత్య కార్యాలయంపైనా దాడి చేయడానికి కారణం కశ్మీరీ ప్రొఫెసర్ అఫ్జల్ గురును ఉరితీయడమేనంటూ ఉగ్రవాదులు ప్రకటించారు. ఉగ్రవాదులు కశ్మీర్‌ను ప్రశాంతంగా ఉండనీ యరనేది స్పష్టం. ఈ పరిస్థితులలో ముఖ్యమంత్రి పదవి మెహబూబాకు అగ్నిపరీక్ష. కె.రామచంద్రమూర్తి -
తాత్కాలింగా గవర్నర్ రూల్
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ మఖ్యమంత్రిగా పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ(56) బాధ్యతలను స్వీకరించే కార్యక్రమం ప్రస్తుతానికి వాయిదా పడింది. గురువారం కన్నుమూసిన ముఖ్యమంత్రి, ఆమె తండ్రి మొహమ్మద్ సయీద్ నాలుగవ రోజు కర్మకాండ (చౌహరం) కార్యక్రమాలు పూర్తయ్యేంత వరకు ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉండాలని ఆమె నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన కార్యక్రమాలు జనవరి 10 ఆదివారం నిర్వహించునున్నట్టు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. అప్పటివరకు అధికారిక వ్యవహారాల్లో పాల్గొనడానికి ఆమె విముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. దీంతో రాష్ట్ర గవర్నర్ ఎన్ ఎన్ వోరా అధికారిక వ్యవహారాలను పర్యవేక్షించనున్నారు. ఈ మేరకు గవర్నర్ ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. కుటుంబ పెద్దను కోల్పోయిన బాధలో ప్రస్తుతం ముఫ్తీ కుటుంబం ఉందని, ఇపుడు ప్రమాణ స్వీకారం గురించి మాట్లాడలేమని పీడీపీ పార్టీ సీనియర్ నేత తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పరిపాలనా వ్యవహారాలను తాత్కాలికంగా గవర్నర్ ఎన్ ఎన్ వోరా నిర్వహిస్తారని చెప్పారు. రాజ్యాంగ పరంగా ఎదురయ్యే ఇబ్బందులను మెహబూబా ముఫ్తీ దృష్టికి తీసుకెళ్లినపుడు వాటిని కూడా ఆమె తోసి పుచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రంలో ఏడు రోజుల పాటు సంతాప దినాలను పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని వాయిదా వేయాలని పెద్దలు ఆమెకు సూచించారు. కాగా రాష్ట్ర సీఎం ముప్తీ మహమ్మద్ సయూద్ నిన్న అనారోగ్యంతో కన్నమూయడంతో తదుపరి ముఖ్యమంత్రి ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో ఆయన కుమార్తె, అనంతనాగ్ ఎంపీ, మెహబూబా ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలను చేపట్టడం దాదాపు ఖాయమైంది. ఈ మేరకు బీజేపీ- పీడీపీ సంకీర్ణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. -
3 గం.లకు మెహబూబా ప్రమాణ స్వీకారం
-
కశ్మీర్ సీఎం సయీద్ అస్తమయం
న్యూఢిల్లీ/శ్రీనగర్: జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మొహమ్మద్ సయీద్(79) గురువారం ఉదయం న్యూఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. అనంతరం, గురువారం సాయంత్రం ఆయన స్వస్థలమైన అనంత్‌నాగ్ జిల్లాలోని బిజ్‌బెహరలో అంత్యక్రియలు నిర్వహించారు. డిసెంబర్ 24న తీవ్ర అస్వస్థతకు గురైన సయీద్‌ను ప్రత్యేక విమానంలో న్యూఢిల్లీకి తీసుకువచ్చి, అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్)లో చేర్పించారు. ప్రాణాంతక సెప్సిస్ ఇన్ఫెక్షన్తో, న్యుమోనియాతో బాధ పడ్తున్న ఆయన్ను కొద్ది రోజులుగా వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతూనే గురువారం ఉదయం ఆయన మరణించారు. అనంతరం, వైమానిక దళ ప్రత్యేక విమానంలో త్రివర్ణ పతాకం, తెలుపు, ఎరుపు వర్ణాల జమ్మూకశ్మీర్ రాష్ట్ర జెండాలతో కప్పిన ఆయన పార్థివ దేహాన్ని శ్రీనగర్‌కు తరలించారు. ప్రజల సందర్శనార్ధం శ్రీనగర్‌లోని నివాసంలో కొద్దిసేపు మృతదేహాన్ని ఉంచారు. సాయంత్రం బిజ్‌బెహరలో వందలాది మంది అభిమానుల అశ్రునయనాల మధ్య, ప్రభుత్వ లాంఛనాలతో మృతదేహాన్ని ఖననం చేశారు. జమ్మూకశ్మీర్ మాజీ సీఎంలు ఒమర్ అబ్దుల్లా, గులాం నబీ ఆజాద్ తదితరులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఆజాద్, ఒమర్‌లు సయీద్ శవపేటికను తమ భుజాలపై మోసి, గౌరవం ప్రకటించారు. పాలెం విమానాశ్రయంలో మృతదేహానికి ప్రధాని మోదీ శ్రద్ధాంజలి ఘటించారు. కేంద్ర కేబినెట్ సమావేశమై రెండు నిమిషాల పాటు మౌనం పాటించింది. జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి మృతికి సంతాపసూచకంగా గురువారం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానుల్లో జాతీయ పతాకాలను అవనతం చేయాలని కేంద్రం ప్రకటించింది. జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రిగా పదవిలో ఉండి చనిపోయిన వారిలో ముఫ్తీ మొహమ్మద్ రెండో వారు. మొదటి వ్యక్తి 1982లో చనిపోయిన షేక్ మొహమ్మద్ అబ్దుల్లా. తదుపరి సీఎం మెహబూబా ముఫ్తీ సయీద్ ఆకస్మిక మరణంతో కశ్మీర్ తదుపరి సీఎంగా ఆయన కూతురు, ఎంపీ, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ(56) బాధ్యతలు స్వీకరించనున్నారు. జమ్మూకశ్మీర్ పీడీపీ ఎమ్మెల్యేలు తమ శాసనసభాపక్ష నేతగా మొహబూబాను ఏకగ్రీవంగా ఎన్నుకుని, ఆ సమాచారాన్ని గవర్నర్‌కు ఇచ్చారు. సంకీర్ణ పక్షమైన బీజేపీ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేయలేదు. మెహబూబా కశ్మీర్ తొలి మహిళా సీఎం కానున్నారు. దేశానికి తీరని లోటు సయీద్ మృతిపట్ల రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతితో పాటు వివిధ పార్టీల నేతలు సంతాపం వ్యక్తం చేశారు. రాజకీయ చాతుర్యానికి, దార్శనికతకు ఆయన ప్రతీక అని సంతాప సందేశంలో రాష్ట్రపతి ప్రణబ్ పేర్కొన్నారు. దేశ ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యత ఇచ్చే నేతగా సయీద్‌ను ఉపరాష్ట్రపతి హమీద్ అభివర్ణించారు. సయీద్ మృతి దేశానికి తీరని లోటు అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. సయీద్ మృతిపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ సంతాపం వ్యక్తం చేశారు. కేసీఆర్ సంతాపం సాక్షి, హైదరాబాద్: సయీద్ మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ డిమాండ్‌కు దేశవ్యాప్తంగా మద్ధతు కూడగడుతున్న సమయంలో సయీద్ అండగా నిలిచారన్నారు. వ్యక్తిగతంగా ముఫ్తీతో తనకున్న అనుబంధాన్ని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. సయీద్ మృతిపై వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రగాఢ సంతాపం తెలిపారు. సయీద్ కుటుంబ సభ్యులకు ఆయన సానుభూతి ప్రకటించారు. సంక్షుభిత కశ్మీర్లో శాంతి స్థాపనకు కృషిచేసిన సయీద్ గొప్ప రాజనీతిజ్ఞుడని ఆయన ప్రశంసించారు. -
పదవిలో ఉండి ప్రాణాలు కోల్పోయిన నేతలెవరంటే...
న్యూఢిల్లీ: పదవీ బాధ్యతల్లో ఉండి ప్రాణాలుకోల్పోయినవారి జాబితా భారత్‌లో కొంచెంకొంచెం పెరుగుతూ వస్తోంది. గతంలో ప్రధాని, రాష్ట్రపతి, ముఖ్యమంత్రి ఇలా వరుసగా దాదాపు అన్ని స్థాయి పదవుల్లో ఉన్న నేతలు.. దురదృష్టవశాత్తు బాధ్యతల్లో ఉండగానే ఏదో ఒక ప్రమాదరూపంలో చనిపోతున్నారు. గురువారం ఉదయం 7.30గంటల ప్రాంతంలో జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి మఫ్తీ మహ్మద్ సయీద్ ఎయిమ్స్ లో కన్ను మూశారు. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది కాలానికే చనిపోయారు. ఈ నేపథ్యంలో పదవిలో ఉండి ప్రాణాలుకోల్పోయిన నేతల వివరాలను ఒకసారి పరిశీలిస్తే.. జవహార్ లాల్ నెహ్రూ (నవంబర్ 14, 1889-మే 27, 1964) భారత స్వాతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించిన నేత జవహార్ లాల్ నెహ్రూ. ఆయన స్వాతంత్ర్య భారతావనికి తొలి ప్రధాని. ఆయన పదవిలో ఉండగానే 1962లో అస్వస్థతకు గురై కశ్మీర్లో చికిత్స పొందుతూ మెల్లగా కోలుకున్నారు. ఆ తర్వాత పదవిలో ఉండగానే 1964 మే 27న గుండెపోటుతో చనిపోయారు. లాల్ బహదూర్ శాస్త్రి (అక్టోబర్ 2, 1904-జనవరి 11, 1966) జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ నేత లాల్ బహదూర్ శాస్త్రి. ఆయన నెహ్రూ అనంతరం ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. నెహ్రూ ప్రారంభించిన విధానాలను ఆయన అమలుచేసేందుకు పూనుకున్నారు. అయితే, పదవిలో ఉండగానే జనవరి 10, 1966లో గుండెపోటుతో తాష్కెంట్లో కన్ను మూశారు. విదేశాల్లో చనిపోయిన తొలి భారత ప్రధాని కూడా ఈయనే. జాకీర్ హుస్సేన్(ఫిబ్రవరి 8, 1897-మే 3, 1969) భారత్‌కు తొలి ముస్లిం రాష్ట్రపతిగా అతితక్కువకాలం పనిచేసి పదవిలో ఉండగానే చనిపోయారు జాకీర్ హుస్సేన్. జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ సహ వ్యవస్థాపకుల్లో ఒకరైన జాకీర్ ఆ వర్సిటీకి వీసీగా కూడా పనిచేశారు. అనంతరం భారత స్వాతంత్ర్య పోరులో కీలకంగా పనిచేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి(జూలై 8, 1949-సెప్టెంబర్ 2, 2009) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన నేత వైఎస్ రాజశేకర్ రెడ్డి. అందరూ ఆయనను ప్రేమగా వైఎస్ఆర్ అని పిలుచుకుంటారు. కాంగ్రెస్ పార్టీలో తిరుగులేని నేతగా ఎదిగిన ఆయన అఖండ ప్రజాభిమానాన్ని సొంతం చేసుకున్నారు. ఏ నాయకుడు ప్రవేశపెట్టని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రెండుసార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తొలిసారి 2004 నుంచి 2009వరకు సీఎంగా పనిచేసిన వైఎస్సార్ రెండోసారి కూడా సీఎంగా ప్రమాణం చేసిన (2009) కొద్ది రోజులకే అనూహ్యంగా హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలుకోల్పోయారు. డోర్జీ ఖండూ(19 మార్చి 1955-30 ఏప్రిల్ 2011) కాంగ్రెస్ పార్టీకి చెందిన డోర్జీ ఖండూ అరుణాచల్ ప్రదేశ్ కు ఆరో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. కానీ, దురదృష్టవశాత్తు ఏప్రిల్ 30, 2011న హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలుకోల్పోయారు. -
ముఫ్తీ సయీద్ మృతి తీవ్ర బాధాకరం
-
కశ్మీర్ సీఎం మృతి పట్ల తెలుగు సీఎంల సంతాపం
హైదారాబాద్: అనారోగ్యంతో గురువారం కన్నుమూసిన జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్(79)కు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ సంతాపం తెలిపారు. తెలంగాణకు మఫ్తీ మహ్మద్ మద్దతుగా నిలిచారని ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గుర్తు చేసుకున్నారు. అంత్యక్రియలకు రాష్ట్రం నుంచి డిప్యూటీ సీఎం మహమూద్ అలీ బృందం హాజరు కానున్నట్లు సమాచారం. ముఫ్తీ మహ్మద్ సయీద్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. -
తదుపరి సీఎంగా మహబూబా ముఫ్తీ?
-
చాలా బాధాకరం!
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్ కన్నుమూతపై రాజకీయ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం దేశ రాజకీయాలకు తీరని లోటు అంటూ సంతాపం తెలిపారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ ఇలా నాయకులంతా ఆయన మృతిపై ప్రగాఢ సంతాపం తెలిపారు. ముఫ్తీ సయీద్ మృతి పట్ల నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా. - ప్రణబ్‌ముఖర్జీ, రాష్ట్రపతి ముఫ్తీ సయీద్ మృతి తీవ్ర బాధాకరం. ఆయన మరణం జమ్ముకశ్మీర్‌కు, దేశ రాజకీయాలకు తీరని లోటు. సామాన్యులు, పేద ప్రజలంటే అమితంగా ఇష్టపడే నాయకుడు ఆయన. జమ్ముకశ్మీర్‌కు సంబంధించిన సంక్లిష్టతలను బాగా ఎరిగిన నేత. కశ్మీర్‌లోయలో శాశ్వత శాంతిని తీసుకురావాలని నిరంతరం తపించేవారు. - రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి ముఫ్తీ సయీద్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం. - అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ సీఎం నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా, గుజరాత్ సీఎం ఆనందిబెన్, బీజేపీ నేత రాంమాధవ్ తదితర నేతలు ముఫ్తీ సయీద్ మృతి పట్ల సంతాపం తెలిపారు. -
కశ్మీర్ సీఎం కన్నుమూత.
-
తదుపరి సీఎంగా మహబూబా ముఫ్తీ?
జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్ (79) అనారోగ్యంతో కన్నుమూయడంతో ఆయన కుమార్తె మహబూబా ముఫ్తీ తదుపరి సీఎం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ విషయమై ఇప్పటికే పీడీపీ, బీజేపీల మధ్య కూడా ఓ అవగాహన కుదిరినట్లు తెలుస్తోంది. చాలాకాలం నుంచి ముఫ్తీ మహ్మద్ సయీద్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. దాంతో ఒకవేళ ఆయన కొంతవరకు కోలుకున్నా కూడా ముఖ్యమంత్రి బాధ్యతలను నిర్వహించే స్థాయిలో లేరని, అందువల్ల ఇక కుమార్తెకు నెమ్మదిగా పగ్గాలు అప్పగిస్తే మంచిదని ఇంతకుముందే పీడీపీ వర్గాలు సూచనప్రాయంగా తెలిపాయి. ఈనెల 18వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగాల్సి ఉన్నాయి. మెహబూబా ముఫ్తీని సీఎం చేసేందుకు తమవైపు నుంచి ఎలాంటి అభ్యంతరం లేదని బీజేపీ కూడా చెప్పేసింది. మహబూబాను సీఎం చేయడానికి పార్టీలో ఏకాభిప్రాయం ఉందని పార్టీ సీనియర్ నేత, ప్రభుత్వ అధికార ప్రతినిధి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నయీం అఖ్తర్ కూడా అన్నారు. ప్రభుత్వానికి నేతృత్వం వహించేందుకు మహబూబాయే సరైన చాయిస్ అని గతంలో ముఫ్తీ మహ్మద్ సయీద్ కూడా చెప్పారని, ఆమె నాయకత్వం విషయంలో పార్టీలో కూడా రెండో ఆలోచన ఏదీ లేదని తెలిపారు. నవంబర్ 13వ తేదీన జరిగిన ఓ విలేకరుల సమావేశంలో ముఫ్తీ మహ్మద్ సయీద్ కూడా ఈ విషయాన్ని సూచనప్రాయంగా వెల్లడించారు. ఆమెకు ప్రజలతో మంచి సంబంధాలు ఉన్నాయని, అందువల్ల ఆమె సీఎం కావడమే మంచిదని అన్నారు. తనకు ప్రజలను కలిసేందుకు టైమ్ సరిపోవడం లేదని, ఆమెకు ఇటు ప్రజలతోను, అటు పార్టీ కార్యకర్తలతో కూడా సత్సంబంధాలు ఉన్నాయని చెప్పారు. -
కశ్మీర్ సీఎం కన్నుమూత
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్ గురువారం ఉదయం కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందిన సంగతి తెలిసిందే. ఈ నెల 24న ఆయనకు జ్వరం, ఛాతినొప్పి రావడంతో చికిత్స నిమిత్తం ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఎయిమ్స్‌కు తరలించి.. ఐసీయూలో చికిత్స అందించారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం ముఫ్తీ తుదిశ్వాస విడిచారని జమ్ముకశ్మీర్ విద్యాశాఖ మంత్రి నయీం అఖ్తర్ తెలిపారు. ఆయన వయస్సు 79 సంవత్సరాలు. ముఫ్తీ కూతురు మహబూబ్ ముఫ్తీ ఆయన వారసురాలిగా సీఎం పగ్గాలు చేపట్టే అవకాశముందని బీజేపీ వర్గాలు తెలిపాయి. గతంలో ముఫ్తీ కూడా ఇదే విషయాన్ని ఓసారి స్పష్టం చేశారు. జమ్ముకశ్మీర్ 12వ ముఖ్యమంత్రిగా పీడీపీ అగ్రనేత ముఫ్తీ మహ్మద్ సయీద్(79) 2015 మార్చి 1వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెల్చుకున్న పీడీపీ.. బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. పీడీపీ వ్యవస్థాపకుడైన ముఫ్తీ మహ్మద్ సయీద్ కశ్మీర్ సీఎంగా పదవి చేపట్టడం ఇది రెండోసారి. గతంలో 2002 నుంచి పీడీపీ-కాంగ్రెస్ ప్రభుత్వానికి మూడేళ్లపాటు సారథ్యం వహించారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న ముఫ్తీ మహమ్మద్ సయీద్ 1987 వరకు మొదట కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. 1987లో ఫరుఖ్ అబ్దుల్లా ప్రభుత్వం పడిపోవడానికి ప్రధాన కారణం ముఫ్తినే అంటారు. ఆ తర్వాత ఆయన వీపీ సింగ్ నేతృత్వంలోని జన్ మోర్చాలో చేరి.. దేశ తొలి హోంమంత్రిగా 1989 వరకు కేంద్ర మంత్రిమండలిలో కొనసాగారు. ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరి పీవీ నరసింహారావు హయాంలో పనిచేశారు. 1999లో కాంగ్రెస్‌తో తెగదెంపులు చేసుకొని కూతురు మహబూబా ముఫ్తీతో కలిసి జమ్ముకశ్మీర్ పీపుల్ డెమొక్రటిక్ పార్టీని స్థాపించారు. 2002 అసెంబ్లీ ఎన్నికల్లో పీడీపీ 18 సీట్లు గెలువడంతో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని సంకీర్ణ ప్రభుత్వ ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేశారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో పీడీపీ అత్యధిక సీట్లు సాధించడంతో బీజేపీతో చేతులు కలిపి మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. దేశ హోంమంత్రిగా.. రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించిన ముఫ్తీ మహమ్మద్ కుటుంబం లక్ష్యంగా పలుమార్లు మిలిటెంట్లు దాడులు చేశారు. కశ్మీర్లో భారత పాలనను వ్యతిరేకిస్తున్న వేర్పాటువాదులు ముఫ్తీని లక్ష్యంగా చేసుకొని దాడులకు దిగారు. 1989లో ముఫ్తీ కేంద్ర హోంమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కూతురు రుబియాను ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. దీంతో జైల్లో ఉన్న ఐదుగురు ఉగ్రవాదుల విడుదల చేయించడం ద్వారా తన కూతురును ముఫ్తీ విడిపించుకున్నారు. -
రెండు రోజుల్లో నిర్ణయం!
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరడం, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు త్వరలో జరగనున్న నేపథ్యంలో అధికార పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ) సందిగ్ధంలో పడింది. ముఫ్తీ ఆరోగ్య పరిస్థితి కుదుటపడకుంటే ఏం చేయాలనే దానిపై పీడీపీ సమాలోచనలు జరుపుతోంది. ఆయన కోలుకోకపోతే అసెంబ్లీలో పార్టీకి ఎవరు నాయకత్వం వహిస్తారనే దానిపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశముందని సమాచారం. ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ముఖ్యమంత్రి లేకుండా కేబినెట్ సమావేశం సాధ్యం కాదు. అయితే తమ ముందు రెండు మార్గాలు ఉన్నాయని పీడీపీ వర్గాలు వెల్లడించాయి. సీఎం పేరుతో ముందుకెళ్లడం లేదా సంకీర్ణ భాగస్వామిని సంప్రదించి మరొకరిని ముఖ్యమంత్రిగా నియమించాలని పేర్కొన్నాయి. ఒకవేళ మరొకరిని ముఖ్యమంత్రిని చేయాల్సివస్తే సయీద్ కుమార్తె, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ వైపు పార్టీ ఏకగ్రీవంగా మొగ్గుచూపే అవకాశముందని తెలిపాయి. ఊపిరితిత్తుల సమస్యలతో బాధ పడుతున్న సయీద్ గత రెండు వారాలుగా ఢిల్లీలోని ఎయిమ్స్ లో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. -
ఐసీయూలో జమ్ము కశ్మీర్ సీఎంకు చికిత్స
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్‌ను బుధవారం ఐసీయూకు తరలించారు. సయీద్‌కు ఆక్సిజన్ థెరఫీ అవసరమని, వైద్య నిపుణుల బృందం ఆయన పరిస్థితిని సమీక్షిస్తోందని ఎయిమ్స్ వర్గాలు తెలిపాయి. 79 ఏళ్ల సయీద్ స్పృహలో ఉన్నారని వైద్యులు చెప్పారు. ఈ నెల 24న జమ్ము కశ్మీర్ సీఎంకు జ్వరం, ఛాతినొప్పి రావడంతో చికిత్స నిమిత్తం ప్రత్యేక హెలికాప్టర్లో ఢిల్లీకి తరలించి ఎయిమ్స్‌లో చేర్చారు. సయీద్‌కు తోడుగా ఆయన కుమార్తె, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ వచ్చారు. మంగళవారం కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. ఎయిమ్స్‌ను సందర్శించి సయీద్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన జమ్ము కశ్మీర్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెల్చుకున్న పీడీపీ.. బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. -
ఢిల్లీకి కశ్మీర్ సీఎం తరలింపు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్(79) తన నివాసంలో గురువారం అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన హుటాహుటిన రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన విమానంలో ఢిల్లీకి తరలించారు. జాతీయ వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్)లో ఆయనను చేర్చినట్టు అధికారవర్గాలు వెల్లడించాయి. జమ్మూకశ్మీర్ లో పీడీపీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడడంతో మార్చిలో ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. -
'మీ కలలకు రెక్కలు తొడగండి'
ముంబయి: భవిష్యత్తులో సందేశాత్మక చిత్రాలను రూపొందించాలని జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి మఫ్తీ మహమ్మద్ సయీద్ తమ రాష్ట్ర మాస్ కమ్యూనికేషన్ విద్యార్థులకు చెప్పారు. వారి కలలకు రెక్కలు జతచేయాలని, ఏదనుకుంటే అది చేయాలని ఆత్మవిశ్వాసంతో ముందుకు పోవాలని సూచించారు. కాశ్మీర్‌లోని మీడియా ఎడ్యుకేషన్ రిసెర్చ్ సెంటర్(ఎంఈఆర్సీ) యూనివర్సిటీకి చెందిన 12మంది పోస్టుగ్రాడ్యుయేట్ విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు విధువినోద్ చోప్రాను గుర్తు చేశారు. వినోద్ తమకు గర్వించదగిన పుత్రుడని, అతడు రూపొందించే చిత్రాల్లో ఎప్పుడూ ఒక సందేశం దాగి ఉంటుందని అన్నారు. జమ్మూకశ్మీర్ వ్యాలీలో కళలు, సంస్కృతి, భాషలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ఈ విద్యార్థులను ముంబయిలో జరుగుతున్న 17వ మామి చిత్రోత్సవానికి ఆహ్వానించిన సందర్భంగా ఆయన ఈ విధంగా వారిని ప్రోత్సహించారు. -
'వారికి కళ్లెం వేసేది మోదీనే'
దేశంలో పరమత అసహనం పెరిగిపోతున్నదంటూ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కీలక మిత్రపక్షం పీడీపీ నుంచి బలమైన మద్దతు లభించింది. ఈ విషయంలో ప్రధాని మోదీని పీడీపీ అధినేత, జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తి మహమ్మద్ సయీద్ వెనకేసుకొచ్చారు. జమ్ముకశ్మీర్‌లో బీజేపీ-పీడీపీ కూటమి అనుబంధం బలంగా ఉందని ఆయన తెలిపారు. జమ్ముకశ్మీర్ పర్యటనలో భాగంగా శ్రీనగర్‌లో నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని మోదీ కచ్చితమైన సందేశాన్ని ఇస్తారని, భారత్‌లోని భిన్నత్వం, బహుళత్వంపై తన విశ్వాసాన్ని ప్రకటిస్తారని ఆశిస్తున్నట్టు ముఫ్తి చెప్పారు. ప్రస్తుతం ఇష్టానుసారంగా మాట్లాడుతూ మత ఉద్రిక్తతలు పెంచుతున్న పార్టీ నేతలకు మోదీ కళ్లెం వేస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. త్వరలో ప్రధాని మోదీ జమ్ముకశ్మీర్‌లో పర్యటించనున్న నేపథ్యంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బీజేపీ-పీడీపీ సంకీర్ణ సర్కారు బలంగా ఉందని, బీజేపీ కూడా తమ రాష్ట్రంలో చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని తెలిపారు. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేకంగా తాము ప్యాకేజీ ఇవ్వాలని కోరడం లేదని, అయితే 2003లో వాజ్‌పేయ్ తరహాలోనే మోదీ కూడా కశ్మీర్‌కు ప్యాకేజీ ప్రకటించడంతోపాటు పాకిస్థాన్‌కు స్నేహం హస్తం అందిస్తారని ఆశిస్తున్నట్టు తెలిపారు. మోదీ విజయవంతం అవుతారు 'దాద్రీ ఘటన బాధాకరం. దురదృష్టకరం. మన ప్రజాస్వామ్యంపై మచ్చ. కానీ మోదీ అజెండా 'అందరికీ సహాయం, అందరి వికాసం'. ఆయన మతవాది కానేకాదు. త్వరలోనే ఆయన తన పార్టీలో విచ్చలవిడిగా వ్యవహరిస్తున్న నేతలకు కళ్లెం వేస్తారని నాకు నమ్మకముంది. ఇందుకు సమయం పడుతుంది. మోదీ నియంతృత్వవాది కాదు అనేది నా అనుభవం. మాతో పొత్తు పెట్టుకునే ముందు ఆయన చాలామందితో చర్చలు, సంప్రదింపులు జరిపారు. మోదీకి మరో ప్రత్యామ్నాయం లేదు. ఆయన సంకుచిత రాజకీయాల నుంచి బయటకు వచ్చి.. ఆర్థికాభివృద్ధి, రాజకీయ ఏకాభిప్రాయం దిశగా కృషి చేయక తప్పదు. పాకిస్థాన్‌తో స్నేహానికి ప్రయత్నించక తప్పదు' అని ముఫ్తి పేర్కొన్నారు. -
'కాశ్మీరీలను దేశభక్తి నిరూపించుకోమనడం సరికాదు'
హైదరాబాద్/ జమ్మూ కాశ్మీర్: జమ్మూ కాశ్మీర్లో ముఫ్తీ మహ్మద్ సయీద్ నేతృత్వంలోని ప్రొగ్రెసివ్ డెమాక్రటిక్ ఫ్రంట్ తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని బీజేపీ సీనియర్ నేత, జాతీయ కార్యదర్శి రామ్ మాధవ్ సమర్థించారు. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వంలో బీజేపీ సమాన భాగస్వామి కావడం దేశభద్రతకు మంచిదని, ఈ ప్రయోగం సఫలమైతే జాతీయవాదానికి మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. పీడీపీతో పొత్తు చర్చల్లో కీలక పాత్ర వహించిన రామ్ మాధవ్ జమ్మూ కాశ్మీర్ స్టడీ సెంటర్ సంస్థ నిర్వహించిన సదస్సులో జాతీయ భద్రత - జమ్మూ కాశ్మీర్ నుంచి అరుణాచల్ వరకూ అన్న అంశంపై ప్రసంగించారు. ఇరు పార్టీల మధ్య రాజకీయ అంశాల్లో వైరుధ్యాలు ఉన్న మాట వాస్తవమేనని, ఇది రాజకీయ పొత్తు కాదని, పీడీపీ- బీజేపీలది పరిపాలనాపరమైన పొత్తు అని అన్నారు. జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఇచ్చినతీర్పును గౌరవించి తాము పీడీపీతో అధికారంలో పాలుపంచుకుంటున్నామని అన్నారు. దేశ భద్రతకు, దేశ సమైక్యతకు ఏ మాత్రం భంగం కలిగితే బిజెపి ప్రభుత్వం నుంచి వైదొలిగేందుకు వెనుకాడబోదని ఆయన స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వంలో బీజేపీ ఉన్నంత వరకూ వేర్పాటు వాద శక్తులకు అంగుళం కూడా తావివ్వబోమని ఆయన ప్రకటించారు. సైన్య బలగాల ప్రత్యేక అధికారాల చట్టం విషయంలో ఎలాంటి రాజీకీ తావుండబోదని కూడా ఆయన అన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా 67 శాతం మంది ప్రజలు కాశ్మీర్ లోయలో ఓటు వేసి, ఉగ్రవాదాన్ని, వేర్పాటువాదాన్ని ధిక్కరించారని ఆయన అన్నారు. కాశ్మీర్ లోయ ప్రజలను తమ దేశభక్తిని నిరూపించుకొమ్మని పదేపదే అడగడం సరైనది కాదని కూడా ఆయన అన్నారు. కాశ్మీరీ ప్రజలను కలుపుకుపోవాలే తప్ప వేరు చేయడం సరికాదని ఆయన అన్నారు. కాశ్మీరీ పండితులను తిరిగి కాశ్మీర్ కి సగౌరవంగా తీసుకువచ్చే విషయంలో, వారికి భద్రత, రక్షణ కల్పించే విషయంలో తొలి దఫా చర్చలు పూర్తయ్యాయని, కాశ్మీర్ లోని శరణార్థులకు పునరావాసం కల్పించే విషయంలో చర్యలు ప్రారంభమయ్యాయని ఆయన అన్నారు. మోదీ ప్రభుత్వం ఏడాది పాలన గురించి ప్రస్తావిస్తూ దేశం సురక్షితమైన నాయకత్వం చేతుల్లో ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలు సైతం విమర్శించలేనంత మంచి పాలనను మోదీ ఇచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. మోదీ ప్రభుత్వం దేశాన్ని నిరాశ నుంచి ఆశ వైపు తీసుకువెళ్లిందని ఆయన అన్నారు. బిజెపి ప్రభుత్వాన్ని సూట్ బూట్ ప్రభుత్వం అంటున్న కాంగ్రెస్ గత పదేళ్లుగా ఇచ్చింది లూట్ ఝూట్ (దోపిడీ, అబద్దాల పాలన) పాలన అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజ్ఞాభారతి సంస్థ అధ్యక్షులు టీ హనుమాన్ చౌదరి, జమ్మూ కాశ్మీర్ స్టడీ సెంటర్ అధ్యక్షులు ప్రొ. తిరుపతి రావులు కూడా ప్రసంగించారు. -
నిరపరాధే.. కానీ పదకొండేళ్లు జైల్లో టార్చర్
అహ్మదాబాద్: పదకొండేళ్లపాటు తనను నానాయాతనలు పెట్టిన తీరును గాంధీనగర్ ఓ ఆలయంపై దాడి కేసులో అదుపులోకి తీసుకున్న వ్యక్తి మఫ్తీ అబ్దుల్ ఖయ్యూం వివరించాడు. ఆ విషయాలన్నింటిని 200 పేజీల పుస్తకంలో వివరించాడు. హిందీలో రాసిన ఈ పుస్తకానికి గ్యారా సాల్ సాలఖోన్ కే పిచే(పదకొండేళ్లు జైలు లోపల) అని పేరు పెట్టాడు. 2002లో గాంధీ నగర్లో అక్షర్‌థామ్ ఆలయం వద్ద పేలుళ్లు చోటుచేసుకున్నాయి. అదే సమయంలో ఇద్దరు ఉగ్రవాదులు చనిపోగా వారి వద్ద ఓ సూసైడ్ నోట్ కనిపించింది. దీని ఆధారంగా అక్కడే ఉంటున్న మఫ్తీ అబ్దుల్ ఖయ్యూంను గుజరాత్ పోలీసులు అరెస్టు చేసి జైలులో వేశారు. దాదాపు పదకొండు సంవత్సరాలపాటు అతడిని పరివిధాల ప్రశ్నించడం, భయాందోళనలు కలిగేలా టార్చర్ పెట్టడంలాంటివి చేశారు. ఈ కేసు పలు కోణాల్లో విచారణ పూర్తవుతూ వాయిదాలు పడుతూ సుప్రీంకోర్టు వరకు రాగా.. ఈ దాడికి మఫ్తీకి సంబంధం లేదని నిరపరాధి అని గత ఏడాది మే 17న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ప్రస్తుతం తన ఇంటివద్దే ఉంటున్న ఆయన తనకు నష్ట పరిహారం ఇప్పించాలని, తనపై తప్పుడు కేసులు బనాయించి ఇన్నాళ్లపాటు ఇబ్బందిపెట్టిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ వాదనల సందర్భంగా ఢిల్లీ వెళ్తున్న ఆయన ఓ మీడియాతో మాట్లాడారు. 'నాకు అన్నీ గుర్తున్నాయి. ఏ కారణం లేకుండా పదకొండేళ్లపాటు ఒళ్లుగగుర్పొడిచేలా పోలీసులు వ్యవహరించిన తీరు దారుణం. నా పరువు, నా కుటుంబ ప్రతిష్ఠ అంతాపోయింది. ఈ విషయాలన్నీ నేను నా పుస్తకంలో రాశాను. విచారణ సమయంలో వాళ్లు ఎన్ని రకాల టార్చర్లు పెట్టారో వాటన్నింటిని అందులో పేర్కొన్నాను' అని చెప్పారు. తనకు న్యాయం జరిగే వరకు పోరాడుతానని చెప్పారు. -
ఉగ్రవాదులను కట్టడి చేయండి
పాకిస్తాన్‌ను కోరిన కశ్మీర్ సీఎం సయీద్ జమ్మూ: కశ్మీర్లో వెంటవెంటనే జరిగిన రెండు ఉగ్రవాద దాడులను జమ్మూకశ్మీర్ సీఎం ముఫ్తీ మొహమ్మద్ సయీద్ ఖండించారు. ఉగ్రవాదులను కట్టడిచేయాలని పాకిస్తాన్‌ను కోరారు. ఈ మేరకు ఆదివారం ఆయన రాష్ట్ర అసెంబ్లీలో ఓ ప్రకటన చేశారు. శుక్ర, శనివారాల్లో ఉగ్రవాదులు ఓ పోలీస్‌స్టేషన్, ఓ సైనిక శిబిరంపై దాడికి పాల్పడ్డం తెలిసిందే. దీన్ని ఖండిస్తూ అసెంబ్లీ తీర్మానం చేసింది. రెండు దేశాలమధ్య శాంతికి విఘాతం కలిగించేలా హింసకు పాల్పడుతున్న ఉగ్రవాదులను కట్టడి చేయాల్సిందిగా పాక్‌కు సూచించాలని ఈ తీర్మానం కేంద్రాన్ని కోరింది. రాష్ట్ర ప్రజలు ఇటువంటి ఉగ్రవాద చర్యలకు బెదిరిపోరని సయీద్ అన్నారు. భారత్‌తో శాంతి సంబంధాలను కోరుకుంటున్నట్లయితే హింసా శక్తులను అదుపులో పెట్టాలని పాక్‌కు సూచించారు. పాక్ ప్రమేయాన్ని ఎత్తి చూపకుండా ప్రభుత్వాలకు సంబంధం లేకుండా దాడులకు పాల్పడుతున్న ఉగ్రవాదులను అరికట్టడానికి సరిహద్దుల్లో నిఘా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. దాడులను ఖండి స్తూ తాము ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీక ర్ తిరస్కరించడంపై నిరసన వ్యక్తంచేస్తూ నేషనల్ కాన్ఫరెన్స్ వాకౌట్ చేసింది. ఈ అంశంపై చర్చ జరగాలని కాంగ్రెస్ పార్టీ కూడా ఉభయ సభల్లో పట్టుబట్టింది. ఉగ్రవాదులు సొంతంగానే దాడులు చేస్తున్నారని సీఎం చెబుతుంటే, ఉపముఖ్యమంత్రి మాత్రం పాక్ సర్కారు, ఐఎస్ఐ హస్తం ఉందంటున్నారని పేర్కొంది. ‘ఉగ్ర’ వాతావరణం వద్దు: రాజ్‌నాథ్ సరిహద్దు వెంట ‘ఉగ్ర’ వాతావరణంలేకుండా చూడాలని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాక్‌ను కోరారు. అట్టారీ సరిహద్దులో ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బాసిత్‌తో మీర్వాయిజ్ భేటీ హురియత్ కాన్ఫరెన్స్ ఛైర్మన్ మీర్వాయిజ్ ఉమర్ ఫరూక్ భారత్‌లో పాక్ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్‌ను ఢిల్లీలో కలిశారు. కశ్మీర్ తీవ్రవాదంపై శ్వేతపత్రం జమ్మూకశ్మీర్‌లో తీవ్రవాదంపై శ్వేతపత్రం విడుదల చేయాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సూచించింది. ప్రజలకు సమాచారం కోసం రాష్ట్రంలోని తీవ్రవాదం, దాని చుట్టూ ఉన్న అనేక అంశాలతో కూడిన శ్వేతపత్రాన్ని వెలువరించాలని హోం మంత్రిత్వ శాఖకు చెందిన పార్లమెంట్ కమిటీ తన నివేదికలో పేర్కొంది. -
పాక్.. మీ ఉగ్రవాదులను కంట్రోల్ చేయ్: ముఫ్తీ
జమ్మూకాశ్మీర్: పాకిస్థాన్ తమ దేశ ఉగ్రవాదులను నియంత్రణలో పెట్టుకోవాలని జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సయ్యద్ హెచ్చరించారు. ఇది ముమ్మాటికీ తమ ప్రాంతంలో శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టే కుట్రేనని అన్నారు. రెండు రోజుల కిందట పోలీసు క్యాంపులపై వరుసగా పాక్ మిలిటెంట్లు దాడి చేయడాన్ని ఆయన ఖండించారు. ఇదే విషయంపై వారు రెండు సభల్లో తీర్మానం చేసి ఏకగ్రీవంగా ఆమోదించారు. కేంద్రం ఈ విషయంలో జోక్యం చేసుకొని ఇలాంటి దాడులు జరగకుండా ఉండేందుకు పాక్‌పై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని, దానిద్వారా తమ రాష్ట్రంలో ప్రజలకు భరోసా ఇచ్చినట్లవుతుందని చెప్పారు. దాడులను చేసిన వారిని గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. ఎప్పుడూ శాంతి శాంతి అనడం కాదు. నిజంగా పాక్ శాంతిని కోరుకునేదే అయితే ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ ముందు ఉగ్రవాదాన్ని, ఉగ్రవాదులను నియంత్రణలోకి తీసుకురావాలని కోరారు. అదే సమయంలో, పాక్ కూడా ఉగ్రవాదుల బాధిత దేశమని తమకు తెలుసని అన్నారు. అయితే, దాని నియంత్రణ మేం ఏం చేయలేమంటూ మాట్లాడితే తాము ఈ రూపంలోనే స్పందిస్తామని, భవిష్యత్‌లో ఇలాంటివి జరగకుండా ఉంటాయని షరీఫ్ తమకు హామీ ఇవ్వాల్సినవసరం ఉందన్నారు. -
అట్టుడుకుతున్న లోకసభ
న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్ వ్యాఖ్యలపై రెండోరోజు కూడా లోకసభ అట్టుడుకుతోంది. కేంద్ర హోంమంత్రి రాజ్ నాధ్ సింగ్, పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి వెంకయ్యనాయుడు సమాధానాలతో సంతృప్తి పడని ప్రతిపక్షాలు మంగళవారం కూడా ముఫ్తీ వ్యాఖ్యలను ఖండిస్తూ తీర్మానం చేయాలని పట్టుబట్టాయి. బీజేపీ, కేంద్ర ప్రభుత్వ వైఖరిని వెల్లడించిన తరువాత కూడా మళ్లీ విషయాన్ని లేవనెత్తడం సబబు కాదని హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. మంత్రి సమాధానానికి ప్రతిగా కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ ప్రధాని మోదీ వివరణ ఇస్తే మిన్ను విరిగి మీద పడుతుందా అంటూ ప్రశ్నించారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది.తృణమూల్, జేడీయూ, ఆర్జేడీ సభ్యులు వెల్ లోకి దూసుకు వచ్చి నినాదాలు చేశారు. స్పీకర్ సుమిత్రా మహాజన్ పదే పదే వారించినా పరిస్థితి సద్దు మణగలేదు. దీంతో సభను పదిహేను నిమిషాల పాటు మళ్లీ వాయిదా వేశారు. -
సయీద్ వ్యాఖ్యలపై దుమారం
జమ్మూ/న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో కొలువుతీరిన కొత్త ప్రభుత్వం రోజుకో వివాదంతో వార్తల్లో నిలుస్తోంది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి ఉగ్రవాద సంస్థలు, పాక్, హురియత్‌ల ఔదార్యమే కారణమంటూ ముఖ్యమంత్రి ముఫ్తీ మొహమ్మద్ సయీద్ చిచ్చు రాజేయగా.. ఆయన పార్టీ(పీడీపీ) ఎమ్మెల్యేల బృందం ఏకంగా ఉగ్రవాది అఫ్జల్ గురు భౌతిక అవశేషాలను తమకందజేయాలంటూ సోమవారం కేంద్రాన్ని డిమాండ్ చేసి ఆ వేడిని మరింత పెంచింది. పీడీపీ తీరుతో రాష్ట్రంలో ఆ పార్టీతో అధికారాన్ని పంచుకుంటున్న బీజేపీ ఇరుకున పడుతోంది. పాక్, వేర్పాటువాద సంస్థ హురియత్, ఉగ్రవాద సంస్థలు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సజావుగా సాగడానికి అవసరమైన వాతావరణాన్ని కల్పించారంటూ, ఎన్నికల ప్రశాంత నిర్వహణ ఘనత వారిదేనంటూ ఆదివారం సీఎంగా ప్రమాణం చేయగానే సయీద్ చేసిన వ్యాఖ్య రాజకీయంగా పెద్ద దుమారం లేపింది. పార్లమెంటు ఉభయసభల్లో ఈ అంశాన్ని లేవనెత్తిన ప్రతిపక్షాలు.. దీనిపై ప్రధాని మోదీ ప్రకటన చేయాలని, సయీద్ వ్యాఖ్యలను ఖండిస్తూ తీర్మానం చేయాలని డిమాండ్ చేశాయి. సయీద్ వ్యాఖ్యలతో కేంద్రానికి, బీజేపీకి సంబంధం లేదని, ఈ విషయంపై ప్రధానితో మాట్లాడి, ఆయన అనుమతితోనే ఈ ప్రకటన చేస్తున్నానంటూ లోక్‌సభలో హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇచ్చిన వివరణతో విపక్షాలు తృప్తి చెందలేదు. స్వయంగా తానే ప్రధానితో పాక్ ఉగ్ర సంస్థల ఔదార్యం గురించి చెప్పానని సయీద్ ప్రకటించినందువల్ల.. ఈ విషయంపై మోదీనే స్పందించాలని డిమాండ్ చేస్తూ.. లోక్‌సభ నుంచి విపక్షాలన్నీ వాకౌట్ చేశాయి. మరోపక్క.. సయీద్ ఆదివారం నాటి తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. తన వాదనకు కట్టుబడి ఉన్నానని సోమవారం సచివాలయంలో బాధ్యతల స్వీకరణ అనంతరం స్పష్టం చేశారు. ‘బుల్లెట్ల కన్నా, గ్రెనేడ్ల కన్నా ఓటరు స్లిప్పులు(ప్రజాస్వామ్యం) బలమైనవన్న విషయం వారు(పాక్, హురియత్) గుర్తించారు. ప్రజలు అవే కోరుకుంటున్న విషయం వారు అర్థం చేసుకున్నారు’ అని వివరించారు. కాగా, సయీద్ వ్యాఖ్యలు రాజకీయ గిమ్మిక్కులని హురియత్ కాన్ఫరెన్స్ విమర్శించింది. అసెంబ్లీ స్పీకర్ పదవి బీజేపీకి? కశ్మీర్ అసెంబ్లీ కొత్త స్పీకరు పదవి బీజేపీకి దక్కనుంది. పీడీపీ-బీజేపీల కూటమి స్పీకర్‌గా బీజేపీ ఎమ్మెల్యే కవీందర్ గుప్తాను ఎన్నుకునే అవకాశముంది. ప్రభుత్వ ఏర్పాటుకోసం ఇరు పార్టీలూ ఓ ఫార్ములాను ఏర్పర్చుకున్నాయని, దానికే కట్టుబడి ఉండేలా ఇరుపార్టీ నేతలతో కూడిన సమన్వయ కమిటీ చూసుకుంటుందని ఈ మేరకు బీజేపీ వర్గాలు తెలిపాయి. -
ముఫ్తీ వ్యాఖ్యలపై పార్లమెంటులో రగడ
జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్ చేసిన వ్యాఖ్యలపై పార్లమెంటు ఉభయ సభల్లో ధుమారం రేగింది. సోమవారం జరుగుతున్న ప్రశ్నోత్తరాలను కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని ప్రధాన ఎజెండాగా తీసుకొని అడ్డుకుంది. ఉగ్రవాదులు సహకరించడం వల్లే జమ్మూ కశ్మీర్లో ఎన్నికలు జరిగాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ముప్తీ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ సమాధానం చెప్పాలని పట్టుబట్టింది. ఈ అంశాన్ని తాము చాలా సీరియస్ గా తీసుకుంటున్నామని చెప్పింది. అవి దేశం మొత్తానికి వర్తించే వివాదాస్పద వ్యాఖ్యలని, మనోభావాలను దెబ్బతీసేవని పేర్కొంది. బీజేపీ అగ్రనేతల మధ్య సీఎంగా ప్రమాణం చేసిన ముఫ్తీ అనంతరం మీడియా సమావేశంలో ముఖ్యమైన ప్రాంతానికి సంబంధించి అలాంటి వ్యాఖ్యలు చేస్తే మీరు ఎందుకు మందలించలేదని లేదని కేంద్రాన్ని కాంగ్రెస్ నిలదీసింది. పాకిస్థాన్‌ను పరోక్షంగా పొగడటమేనని వ్యాఖ్యానించింది. మనందరిని విమర్శించడమేనని చెప్పింది. ఇందుకు రాజ్‌నాథ్ సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. మఫ్తీ అభిప్రాయంతో కేంద్రానికి సంబంధం లేదని చెప్పారు. అంతకుముందు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా ఏపీలో ఎమ్మెల్సీ స్థానాలను పెంచే ప్రతిపాదనను బిల్లు రూపంలో తీసుకొచ్చారు. -
కశ్మీర్లో కొత్త ఏలికలు
ఆలస్యంగానైనా జమ్మూ-కశ్మీర్లో పీడీపీ-బీజేపీ కూటమి నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. రాష్ట్రంలో ఎన్నికలు పూర్తయి రెండు నెలలు దాటుతున్నా ప్రధాన సమస్యల విషయంలో రెండు పార్టీలమధ్యా ఏకాభిప్రాయం కుదరక ఈ ఆలస్యం చోటుచేసుకుంది. ఈ కూటమి ఎన్నికల ముందు ఏర్పడింది కాదు. పీడీపీ, బీజేపీలు రెండూ ఎన్నికల్లో పరస్పరం తలపడ్డాయి. ఇవి రెండూ ‘ఉత్తర, దక్షిణ ధ్రువాలు’ అంటూ నూతన ముఖ్యమంత్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్ చేసిన వ్యాఖ్యల్లో నిజముంది. పీడీపీ ప్రధానంగా వేర్పాటువాదంవైపు ఒకింత మొగ్గు చూపే ప్రాంతీయ పార్టీ. బీజేపీ జాతీయవాదాన్ని బలంగా వినిపించే జాతీయ పార్టీ. ఒక దేశంలో రెండు రాజ్యాంగాలు ఉండటమేమిటని ప్రశ్నించే పార్టీ. జమ్మూ- కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తికి వీలుకల్పిస్తున్న 370వ అధికరణ, సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టం అమలు, వేర్పాటువాద హుర్రియత్ కాన్ఫరెన్స్ విషయం లో అనుసరించాల్సిన వైఖరి, పాకిస్థాన్‌తో చర్చలు వగైరా అంశాల్లో రెండు పార్టీల కూ భిన్నాభిప్రాయాలున్నాయి. ఇంతకాలమూ అధికారంలో ఉన్న నేషనల్ కాన్ఫ రెన్స్, కాంగ్రెస్ కూటమిని తిరస్కరించిన రాష్ట్ర ప్రజలు ప్రత్యామ్నాయాన్ని ఎంచు కోవడంలో మాత్రం వేర్వేరు తోవలను ఎంచుకున్నారు. జమ్మూ ఓటర్లు ప్రధానంగా బీజేపీపైనే విశ్వాసం ఉంచారు. కశ్మీర్లో అత్యధిక సంఖ్యాకులు పీడీపీని ఎంచుకు న్నారు. కశ్మీర్లో బీజేపీ అన్ని స్థానాల్లోనూ డిపాజిట్లు కోల్పోయింది. ఒకే ఒక్క స్థానంలో ఆ పార్టీ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి సజాద్ లోన్ గెలిచారు. అలాగే, పీడీపీ జమ్మూలో మూడు స్థానాలు మాత్రమే గెలుచుకోగలిగింది. రెండు ప్రధాన ప్రాంతాల్లో ప్రాబల్యం సాధించిన రెండు వేర్వేరు పార్టీలు కలిసి అధికారం పంచుకోవడం రాష్ట్ర శ్రేయస్సుకు దోహదపడుతుందని సాగుతున్న విశ్లేష ణల్లో వాస్తవం ఉంది. జమ్మూ-కశ్మీర్ నిత్యం సమస్యలతో సతమతమయ్యే రాష్ట్రం. అది సరిహద్దు రాష్ట్రం కావడంవల్ల పొరుగునున్న పాకిస్థాన్వైపునుంచి అక్కడి సైన్యం అండదండలతో మిలిటెంట్ల చొరబాట్లు ఉంటాయి. అడపా దడపా వారు సృష్టించే విధ్వంసకాండ ఉంటుంది. శాంతిభద్రతల పరిరక్షణ కోసమంటూ మన భద్రతా దళాలు తీసుకునే చర్యలు ఒక్కోసారి వికటించి తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తుంటాయి. గత కొన్నేళ్లుగా ఈ పరిస్థితుల్లో ఎంతో కొంత మార్పు వచ్చింది. మిలిటెన్సీ దాదాపు అదుపులో ఉంది. కనుకనే చాలామంది జమ్మూ-కశ్మీర్లో సాధ్యమైనంత త్వరగా సుస్థిర ప్రజా ప్రభుత్వం ఏర్పడాలని, ఈ ప్రశాంతత కొన సాగాలని కోరుకున్నారు. రాజకీయ పార్టీల మధ్య ఉండే విభేదాల పర్యవసానంగా ప్రజలకు ప్రభుత్వం లేని పరిస్థితి ఉండరాదని భావించారు. బీజేపీ జమ్మూ- కశ్మీర్లో తొలిసారి ప్రభుత్వంలో పాల్గొనడంవల్ల, పాలనలో భాగం కావడంవల్ల కశ్మీర్ ప్రజలకు ఆ పార్టీ పనితీరును సన్నిహితంగా పరిశీలించే అవకాశం కలుగు తుంది. ఆ పార్టీ తీరుతెన్నులు చూశాక దానిపై ఏర్పర్చుకున్న అభిప్రాయం మారినా మారొచ్చు. అలాగే...అక్కడి ప్రజల విషయంలోనైతేనేమి, సమస్యల విషయంలో అయితేనేమి బీజేపీకి ఉండే అభిప్రాయాల్లో కూడా మార్పు వచ్చే వీలుంటుంది. కేంద్రంలో పాలక పక్షంగా ఉన్న పార్టీ రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామి కావడంవల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలమధ్య సత్సంబంధాలు ఏర్పడతాయి. అది రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుంది. జమ్మూ, కశ్మీర్ ప్రాంతాలమధ్య చాన్నాళ్లుగా ఉంటున్న అపో హలు సమసిపోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. రాష్ట్రంలో ఉన్న చాలా సమస్య లకు మూలకారణం ఈ అపోహలే. వీటిని తమ తమ రాజకీయ ప్రయోజనాల కోసం పీడీపీ, ఎన్సీ, బీజేపీలు పెంచి పోషించాయి. జమ్మూకు ప్రాతినిధ్యం వహిం చే బీజేపీ ఇప్పుడు ప్రభుత్వంలో ఉండటం ఆ రీత్యా ఎంతో ప్రయోజనం చేకూర్చే అంశం. అయితే, పరస్పర విరుద్ధ అభిప్రాయాలున్న పార్టీలు కలిసి ఆరేళ్లపాటు ప్రభు త్వాన్ని నడపడం అంత సులభమేమీ కాదు. అది మొదటి రోజే రుజువైంది. ఎన్నికలు సామరస్యపూర్వక వాతావరణంలో ప్రశాంతంగా జరగడానికి సహకరిం చినందుకు హురియత్‌కూ, మిలిటెంట్లకూ, పరోక్షంగా పాకిస్థాన్‌కూ ముఫ్తీ కృతజ్ఞ తలు చెప్పడం...దానిపై బీజేపీ తీవ్రంగా స్పందించడం అందుకు రుజువు. రాజ్యాం గంపై విశ్వాసం ఉన్న సంస్థలూ, జమ్మూ-కశ్మీర్ పౌరులూ మాత్రమే ప్రశాంత ఎన్ని కలకు కారణమని బీజేపీ ఎత్తిపొడిచింది. కలిసి ప్రభుత్వాన్ని ఏర్పర్చడానికి రెండు పార్టీలూ తమ తమ వైఖరులను సడలించుకున్నాయి. 370వ అధికరణ రద్దు కావా ల్సిందేనంటున్న బీజేపీ అందుకోసం పట్టుబట్టరాదని నిర్ణయించుకుంది. సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టం రద్దు కావాల్సిందేనని డిమాండు చేస్తున్న పీడీపీ మెత్తబడింది. కూటమి ప్రభుత్వం ఆ చట్టం అవసరంలేని ప్రాంతాలేవో సమీక్షించి కేంద్రానికి సిఫార్సు చేస్తుందని, దీనిపై కేంద్రం తుది నిర్ణయం తీసుకుంటుందని కనీస ఉమ్మడి కార్యక్రమం చెబుతున్నది. కశ్మీర్‌లోయలో మిలిటెన్సీ ఒక్కటే ప్రధాన సమస్య కాదు. నిజానికి అనేక సమస్యలను అపరిష్కృతంగా వదిలేయడంవల్ల పుట్టుకొచ్చిన సమస్య అది. యువతకు ఉపాధి లేకపోవడం అందులో ప్రధానమైనది. విద్య, వైద్యం, విద్యుదుత్పాదన, వ్యవసాయం, టూరిజం, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటివి అక్కడ అరకొరగా ఉన్నాయి. పుష్కలంగా వనరులున్నా ప్రజల సామాజిక, ఆర్థికాభివృద్ధికి అవి అక్కరకు రావడంలేదు. ఏ సమస్యను లేవనెత్తినా, దేన్ని ప్రశ్నించినా శాంతిభద్రతల సమస్యగా పరిగణించడం అక్కడ సర్వసాధారణం. పీడీపీ-బీజేపీ కూటమి ప్రభుత్వం ప్రజాతంత్ర సంస్థలకు విలువనిచ్చి, ప్రజాస్వామిక వాతావరణం ఏర్పర్చడానికి కృషిచేస్తే జమ్మూ-కశ్మీర్ దేశంలోని ఇతర రాష్ట్రాల తరహాలోనే అభివృద్ధి చెందడానికి, ప్రశాంతంగా మనుగడ సాగించడానికి ఉపయోగపడుతుంది. పీడీపీ-బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడటం ఆ దిశగా పడిన తొలి అడుగు కావాలని ఆశిద్దాం. -
జమ్మూకశ్మీర్ సీఎం వివాదస్పద వ్యాఖ్యలు
జమ్మూ: జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మరుక్షణమే పీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ముఫ్తీ మొహమ్మద్ సయీద్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగడానికి పాకిస్థాన్, వేర్పాటువాదులు, తీవ్రవాదులు సహకరించారని వ్యాఖ్యానించారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్టాడారు. వేర్పాటువాదులు, తీవ్రవాదులు సహకరించకుంటే ఎన్నికలు ప్రశాంతంగా జరిగేవి కాదని అన్నారు. వారు ప్రజాస్వామ్యాన్ని గౌరవించారని తెలిపారు. సయీద్ వ్యాఖ్యలను మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా తప్పుబట్టారు. ఎన్నికలు జరిగేలా సహకరించినందుకు వేర్పాటువాదులు, తీవ్రవాదులకు ధన్యవాదాలు తెలపాలా అని ప్రశ్నించారు. సయీద్ వ్యాఖ్యలపై బీజేపీ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
జమ్మూకశ్మీర్‌లో కొలువుదీరిన సంకీర్ణ ప్రభుత్వం
-
జమ్మూకశ్మీర్‌లో కొలువుదీరిన సంకీర్ణ ప్రభుత్వం
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో పీడీపీ- బీజీపీ సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా పీడీపీ నేత ముఫ్తీ మహ్మద్ సయీద్ ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ కి చెందిన నిర్మల సింగ్ డిప్యూటీ సీఎంగా డోంగ్రీ భాషలో ప్రమాణం చేశారు. నగరంలోని జమ్మూ యూనివర్సిటీలోని జనరల్ జోరావర్ సింగ్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో వీరి చేత గవర్నరు ఎన్ఎన్ వోరా ప్రమా ణం చేయించారు. మంత్రులుగా అబ్దుల్ రెహమాన్ భట్, వీర్, చంద్ర ప్రకాశ్, జావేద్ ముప్తఫా మీర్, అబ్దుల్ హక్ ఖాన్, బాలి భగత్ , లాల్ సింగ్ తదితరులు ప్రమాణం చేశారు.ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పీడీపీ నేత మహమూద్ ముఫ్తీ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. -
నేడు జమ్మూకశ్మీర్ సీఎంగా ముఫ్తీ ప్రమాణం
-
నేడు కశ్మీర్ సీఎంగా ముఫ్తీ ప్రమాణం
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో ఎట్టకేలకు 49 రోజుల తర్వాత నూతన ప్రభుత్వం కొలువుదీరనుంది. రాష్ట్ర 12వ ముఖ్యమంత్రిగా పీడీపీ అగ్రనేత ముఫ్తీ మహ్మద్ సయీద్(79) ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నగరంలోని జమ్మూ యూనివర్సిటీలో గల జనరల్ జోరావర్ సింగ్ ఆడిటోరియంలో జరిగే కార్యక్రమంలో ముఫ్తీ చేత గవర్నరు ఎన్ఎన్ వోరా ప్రమా ణం చేయించనున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హర్యానా, పంజాబ్ ముఖ్యమంత్రులు, బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ, బీజేపీ చీఫ్ అమిత్ షా, మురళీ మనోహర్ జోషీ హాజరు కానున్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత మోదీ, ముఫ్తీ సయీద్‌లు సంయుక్తంగా విలేకరుల సమావేశంలో మాట్లాడనున్నారు. ఇరుపార్టీల ఉమ్మడి కార్యాచరణను కూడా విడుదల చేయనున్నారు. పీడీపీ వ్యవస్థాపకుడైన ముఫ్తీ మహ్మద్ సయీద్ కశ్మీర్ సీఎంగా పదవి చేపడుతుండటం ఇది రెండోసారి. గతంలో 2002 నుంచి పీడీపీ-కాంగ్రెస్ ప్రభుత్వానికి మూడేళ్లపాటు సారథ్యం వహించారు. ఈసారి సయీద్ పూర్తిగా ఆరేళ్లు పదవిలో కొనసాగుతారు. బీజేపీ నేత నిర్మల్ సింగ్ ఉప ముఖ్యమంత్రిగా ఉంటారు. సీఎంతోపాటు రెండు పార్టీల నుంచి 12 మంది చొప్పున మంత్రులుగా ప్రమాణం చేస్తారు. -
రేపు జమ్మూకశ్మీర్ సీఎంగా ముఫ్తీ ప్రమాణం
న్యూఢిల్లీ : జమ్ము కశ్మీర్ నూతన ముఖ్యమంత్రిగా పీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ముఫ్తీ మొహమ్మద్ సయీద్ ఆదివారం ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. పీడీపీ, బీజేపీ కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాయి. ప్రభుత్వంలో బీజేపీ కూడా చేరనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో శుక్రవారం ఉదయం పీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ముఫ్తీ మొహమ్మద్ సయీద్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జమ్ము కశ్మీర్ ప్రభుత్వ ఏర్పాటు, ఉమ్మడి ప్రణాళికపై చర్చించారు. రాష్ట్రానికి సయీద్ ఆరేళ్లపాటు సీఎంగా కొనసాగుతానేజ బీజేపీ నేత నిర్మల్ సింగ్ డిప్యూటీ సీఎంగా ఉంటారని సమాచారం. -
కశ్మీర్లో 25 మందితో కేబినెట్
రేపు సీఎంగా ప్రమాణం చేయనున్న ముఫ్తీ సయీద్ ప్రధానితో గంటపాటు చర్చలు జరిపిన పీడీపీ అగ్రనేత డిప్యూటీ సీఎం సహా బీజేపీకి 12 మంత్రి పదవులు అన్ని అంశాలపై ఏకాభిప్రాయం కుదిరిందన్న సయీద్ ప్రజల కోసం ఉత్తర-దక్షిణ ధ్రువాలు ఏకమయ్యాయని వ్యాఖ్య న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో కొలువుదీరనున్న పీడీపీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో భాగంగా 25 మందితో కూడిన మంత్రివ ర్గం ఏర్పాటుకానుంది. కాబోయే సీఎం, పీడీపీ అగ్రనేత ముఫ్తీ మొహమ్మద్ సయీద్ నేతృత్వంలోని ఈ కేబినెట్లో సగం మంది బీజేపీ సభ్యులు ఉంటారు. ఆదివారం జమ్మూలోని జోర్వార్‌సింగ్ ఆడిటోరియంలో జరిగే ప్రమాణస్వీకారానికి ప్రధాని మోదీ హాజరుకానున్నారు. కశ్మీర్లో సర్కారు ఏర్పాటులో 2 నెలలుగా కొనసాగిన ప్రతిష్టంభనను తొలగించడానికి పీడీపీ-బీజేపీ ఇటీవలే ఒప్పందానికి రావడం తెలిసిందే. ఆర్టికల్ 370 సహా కీలకాంశాలపై ఏకాభిప్రాయం కుదిరిన నేపథ్యంలో శుక్రవారం ప్రధాని మోదీతో ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసంలోనే సయీద్ భేటీ అయ్యారు. గంటపాటు ఈ భేటీ జరిగింది. ప్రమాణానికి ప్రధానిని సయీద్ ఆహ్వానించారు. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం సయీద్ కేబినెట్లో ఉపముఖ్యమంత్రి సహా 12 మంది బీజేపీ సభ్యులు ఉంటారు. ఆ పార్టీ నేత నిర్మల్ సింగ్‌కు డిప్యూటీ పోస్టు దక్కే అవకాశముంది. కాగా, ప్రధానితో చర్చల వివరాలను మీడియాకు తెలపడానికి సయీద్ నిరాకరించారు. తమ ఉమ్మడి ప్రభుత్వం చేపట్టే కనీస ఉమ్మడి కార్యక్రమం వివరాలను ఆదివారం మధ్యాహ్నం ప్రకటిస్తామని మాత్రం అన్నారు. పీడీపీ-బీజేపీ కూటమిని ఉద్దేశించి వ్యాఖ్యానిస్తూ ఉత్తర-దక్షిణ ధ్రువాలు ఏకమైనట్లుగా అభివర్ణించారు. ఎన్నికల ఫలితాలను బట్టి కశ్మీర్ ప్రజలు పీడీపీకి, జమ్మూ ప్రజలు బీజేపీకి పట్టం కట్టారని, అందుకే రెండు పార్టీలు కలసి రాష్ట్రాభివృద్ధికి పాటుపడాలని నిర్ణయించుకున్నామన్నారు. కేంద్రంలో స్పష్టమైన మెజారిటీ ఉన్న ప్రభుత్వం ఉన్నందున రాష్ర్టంలో వచ్చిన అవకాశాన్ని వృథా చేసుకోకూడదనే పీడీపీ భావించిందని, ‘అందరితో కలిసి, అందరి అభివృద్ధి’ అన్న మోదీ నినాదానికి తానూ మద్దతిస్తున్నానన్నారు. రాష్ర్టంలో రాజకీయంగా, పాలనాపరంగా బీజేపీతో కసి కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని అమలుపరుస్తామన్నారు. రాష్ర్టంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి మోదీతో కలసి పనిచేస్తానని పేర్కొన్నారు. పాకిస్తాన్ విషయంలో మాజీ ప్రధాని వాజ్‌పేయి అనుసరించిన విధానాన్నే పాటిస్తామని, అందుకు మోదీ అంగీకరించారన్నారు. కశ్మీర్‌ను శాంతి ద్వీపంగా మార్చాలని మోదీ భావిస్తున్నారని, తమ అభిమతమూ అదేనని అన్నారు. జమ్మూ, కశ్మీర్ ప్రాంతాల ప్రజల ఆకాంక్ష మేరకే ఇరు పార్టీలు కలసి పనిచేస్తాయని పునరుద్ఘాటించారు. మోదీతో భేటీ తర్వాత మాజీ ప్రధానులు, మన్మోహన్సింగ్, వాజ్‌పేయిని కూడా వారి నివాసాలకు వెళ్లి సయీద్ కలుసుకున్నారు.ద తొమ్మిదేళ్ల తర్వాత సయీద్ మళ్లీ సీఎం అవుతుండగా, కశ్మీర్లో బీజేపీ తొలిసారిగా అధికారం చేపడుతుండటం విశేషం. శుక్రవారం పీడీపీ సయూద్‌ను తన శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంది. బీజేపీతో పీడీపీ జట్టుకట్టడాన్ని నేషనల్ కాన్ఫరెన్స్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా తప్పుబట్టారు. ఈ కూటమి పట్ల రాష్ర్ట ప్రజలేమీ హర్షించడం లేదన్నారు. బీజేపీతో పీడీపీ కలవడం వల్ల రాష్ర్ట రాజధాని నాగ్‌పూర్(ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం ఇక్కడే ఉంది) కు మారిందన్నారు. -
ప్రధానితో ముఫ్తీ మొహమ్మద్ సయీద్ భేటీ
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో శుక్రవారం ఉదయం పీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ముఫ్తీ మొహమ్మద్ సయీద్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జమ్ము కశ్మీర్ ప్రభుత్వ ఏర్పాటు, ఉమ్మడి ప్రణాళికపై చర్చించినట్లు సమాచారం. కాగా భేటీ అనంతరం కనీస ఉమ్మడి ప్రణాళిక(సీఎంపీ)ను బహిర్గతం చేయనున్నట్లు సమాచారం. మరోవైపు జమ్మూకశ్మీర్‌లో బీజేపీ-పీడీపీ కూటమి నేతృత్వంలో ప్రభుత్వం కొలువు దీరనుంది. రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రిగా పగ్గాలు పీడీపీ ముఫ్తీ మొహమ్మద్ సయీద్ మార్చి 1వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రానికి సయీద్ ఆరేళ్లపాటు సీఎంగా కొనసాగుతారని, బీజేపీ నేత నిర్మల్ సింగ్ డిప్యూటీ సీఎంగా ఉంటారని సమాచారం. -
కాశ్మీర్ సీఎంగా ముఫ్తీ మహ్మద్ సయీద్?
జమ్ము కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఇన్నాళ్లుగా నెలకొన్న సందిగ్ధం ఎట్టకేలకు తొలగిపోయింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పీడీపీ అధినేత ముఫ్తీ మహ్మద్ సయీద్ మార్చి 1న ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం అన్నీ అనుకున్నట్లే జరిగితే.. కాశ్మీర్ ముఖ్యమంత్రి పదవిలో ఆయన ఆరేళ్ల పాటు కొనసాగే అవకాశం ఉంది. జమ్ము యూనివర్సిటీలోని జొరావర్ సింగ్ స్మారక ఆడిటోరియంలో ప్రమాణస్వీకారం జరుగుతుంది. పీడీపీ, బీజేపీల మధ్య కామన్ మినిమమ్ ప్రోగ్రాం (సీఎంపీ) ఖరారైంది. ఇందుకోసం పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఢిల్లీలో మంగళవారం సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. ఈ వారంలోనే ప్రధాని నరేంద్రమోదీని కూడా కలిసి సంకీర్ణ ప్రభుత్వ ప్రమాణస్వీకారానికి హాజరవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. -
జమ్మూ కాశ్మీర్ కొత్త సీఎంగా ముఫ్తీ మహమ్మద్!
న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్లో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ, పీడీపీల మధ్య చర్చలు ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చాయి. ఓ వారం రోజుల్లో ఆ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా పీడీపీ అధినేత ముఫ్తీ మహ్మద్ సయ్యద్ బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని సమాచారం. ఒకటి రెండు రోజుల్లో సయ్యద్... ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్లో ప్రభుత్వ ఏర్పాటుపై మోదీ ఓ ప్రకటన చేసే అవకాశం ఉంది. అయితే పీడీపీ అధ్యక్షురాలు మహబూబా ముఫ్తీ ఆదివారం న్యూఢిల్లీలో బీజేపీ అగ్రనేతలతో సమావేశం కానున్నారని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. 87 స్థానాలు గల జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర అసెంబ్లీకి ఇటీవల ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో పీడీపీ 28 స్థానాలు, బీజేపీ 25 స్థానాలు కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. -
'పీడీపీ - బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు చారిత్రక మార్పు'
శ్రీనగర్: పీడీపీ ప్రెసిడెంట్ ముఫ్తి మహ్మద్ సయ్యద్ గత రెండు నెలలుగా జమ్మూ - కశ్మీర్ ముఖ్యమంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో పీడీపీకి బీజేపీ మద్దతు ఇస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే దేశానికే ఓ చారిత్రకావకాశం వచ్చినట్టు అవుతుందని ముఫ్తి అన్నారు. ఒప్పందం పూర్తయిందా.. ఇప్పటికే ఇరు పార్టీల మధ్య ఒప్పందం కూడా కుదిరిందనే వార్తలు వస్తున్నాయి, అయితే అది ఇంకా జరగలేదు. ఆరెస్సెస్ ప్రభావంతో ఉన్న బీజేపీని జమ్మూ కశ్మీర్ ప్రజలు ఆదరించరు. పైగా శ్యాంప్రసాద్ ముఖర్జీని అరెస్టు చేయటం కూడా బీజేపీకి కలిసి రాని అంశం. ఇదొక చరిత్రగా భావిస్తున్నారు జమ్మూ ప్రజలు అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ప్రస్తుతానికి తనకు తెలిసినంత వరకు బీజేపీ ఎలాంటి సందేహం లేకుండా పీడీపీతో కలిసి పోతుందని ముఫ్తి అన్నారు. ఈ రెండు పార్టీలు కలవటం దేశంలోనే ఓ చారిత్రకమార్పు అని అన్నారు. కాగా జమ్మూ - కశ్మీర్ కేవలం ముస్లిం మెజారిటీ రాష్ట్రం. అక్కడి ప్రజలు బీజేపీని ఆహ్వానించరనేది అక్కడ వినిపిస్తున్న వాదన. కాగా, సీఎం పీఠాన్ని దశలవారీగా రెండు పార్టీలు పంచుకోవాలని బీజేపీ రాష్ట్ర నేతలు తాజా డిమాండ్‌ను అధిష్టానం ముందు ఉంచినట్లు సమాచారం. మరోవైపు, చర్చలు కొనసాగుతున్నాయని మంగళవారం బీజేపీ నేత రామ్‌మాధవ్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఏర్పాటుపై కచ్చితమైన గడువును పేర్కొనకుండా.. త్వరలోనే ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టత వస్తుందన్నారు. పీడీపీతో చర్చలు ఆయన నేతృత్వంలోనే సాగుతున్న విషయం తెలిసిందే. -
ముఫ్తీ మహ్మద్ సయ్యిద్ గెలుపు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ శాసనసభల్లో పోటీ చేసిన రాజకీయ ప్రముఖులకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. పలువురు గెలుపొందగా, మరికొందరు ఓటమి పాలయ్యారు. పీడీపీ అధ్యక్షుడు ముఫ్తీ మహ్మద్ సయ్యిద్ గెలుపొందారు. అనంతనాగ్ స్థానం నుంచి 6 వేల పైచిలుకు ఓట్లతో నెగ్గారు. వేర్పాటువాద మాజీ నాయకుడు సాజిద్ గనీ లోన్ కూడా విజయం సాధించారు. హంద్వారా అసెంబ్లీ స్థానం నుంచి 4800 పైగా ఓట్లతో గెలిచారు. మాజీ ఉప ముఖ్యమంత్రి తారాచంద్ ఓటమి పాలయ్యారు. ఛాంబ్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన తారాచంద్ బీజేపీ అభ్యర్థి డాక్టర్ కిషన్ లాల్ చేతిలో 14,790 ఓట్లతో ఓడిపోయారు. మాజీ బ్యాంకర్ హసీబ్ డ్రాబు రాజ్‌పొరా స్థానం నుంచి గెలుపొందారు. -
పాపం పోలీసులని తెలియక..
మఫ్టీలో ఉన్న మహిళా కానిస్టేబుళ్లపై దాడికి దొంగల యత్నం సాక్షి, ముంబై: అహమ్మదాబాద్ నేషనల్ హైవే సమీపంలో ఉన్న కాసా ప్రాంతం సమీపంలో మఫ్టీలో ప్రయాణిస్తున్న నలుగురు మహిళా పోలీసులపై దోపిడీ దొంగలు దాడి చేశారు. ఈ సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి....కాసా ప్రాంతంలో అధికంగా దారిదోపిడీలు జరుగుతుండటంతో దొంగలను పట్టుకోవడానికి కాసా ప్రాంత పోలీసులు పథకం పన్నారు. ఈ మేరకు మఫ్టీలో ముగ్గురు మహిళా కానిస్టేబుళ్లు అద్దె వాహనం తీసుకుని సాధారణ ప్రయాణికులుగా ఆ ప్రాంతంలో ప్రయాణించారు. అనంతరం దారిలో వాహనం రిపేర్ వచ్చినట్లు ఆపి దొంగల కోసం ఎదురుచూడసాగారు. వారు ఊహించినట్లుగానే కొంతసేపటికి ఐదుగురు వ్యక్తులు వచ్చి వారిని ప్రశ్నించారు. వాహనంలో డ్రైవర్‌తోపాటు ముగ్గురూ మహిళలే ఉండటంతో బెదిరించి దోపిడీ చేసేందుకు యత్నించారు. అంతవరకు సాధారణ మహిళలుగా నటించింది కానిస్టేబుళ్లుగా గుర్తించిన దొంగలు ఒక్కసారిగా ఖంగుతిని పారిపోయేందుకు యత్నించారు. తమను పట్టుకోవడానికి ప్రయత్నించిన వారిపై కారం పొడి చల్లారు. అయితే దొంగల్లో ఇద్దరిని పోలీసులు పట్టుకోగలిగారు. మిగిలిన ముగ్గురూ సమీప అటవీ ప్రాంతంలోకి పారిపోయారని, త్వరలోనే వారినీ పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. -
స్వయం పాలనే లక్ష్యం
మేనిఫెస్టోలో పీడీపీ హామీ శ్రీనగర్: స్వయం పాలన సంకల్పంగా పీపుల్ డెమొక్రాటిక్ పార్టీ(పీడీపీ) ఎన్నికల మేనిఫెస్టోను సీనియర్ నేతలు ముఫ్తీ మొహమ్మద్సయీద్ శుక్రవారం విడుదల చేశారు. అవినీతికి తావులేని సుపరిపాలన అందిస్తామని అందులో పేర్కొన్నారు. అస్తవ్యస్తమైన రాష్ట్ర ఆర్థిక రంగాన్ని గాడినపెడతామని పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్ ప్రజల సాధికారతకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రాష్ట్రానికి అందించిన ప్రత్యేక ప్రతిపత్తి కొనసాగాల్సిందేనని తేల్చి చెప్పారు. ఆ అధికరణ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల నుంచి వ్యక్తిగత బాధ్యతల వరకు.. ఆర్థిక వ్యవస్థ నుంచి భావోద్వేగాల వరకు అన్నింటిపై ప్రభావం చూపుతుందని అందులో పేర్కొన్నారు. నియంత్రణ రేఖకు అవతలి వైపుతో సత్సంబంధాలు, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు పూర్తి స్థాయి అనుసంధానత, ప్రాంతీయ స్వేచ్ఛావాణిజ్య ప్రాంతం ఏర్పాటు తమ లక్ష్యాలని తెలిపారు.