
కాశ్మీర్ సీఎంగా ముఫ్తీ మహ్మద్ సయీద్?
జమ్ము కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఇన్నాళ్లుగా నెలకొన్న సందిగ్ధం ఎట్టకేలకు తొలగిపోయింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పీడీపీ అధినేత ముఫ్తీ మహ్మద్ సయీద్ మార్చి 1న ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం అన్నీ అనుకున్నట్లే జరిగితే.. కాశ్మీర్ ముఖ్యమంత్రి పదవిలో ఆయన ఆరేళ్ల పాటు కొనసాగే అవకాశం ఉంది.
జమ్ము యూనివర్సిటీలోని జొరావర్ సింగ్ స్మారక ఆడిటోరియంలో ప్రమాణస్వీకారం జరుగుతుంది. పీడీపీ, బీజేపీల మధ్య కామన్ మినిమమ్ ప్రోగ్రాం (సీఎంపీ) ఖరారైంది. ఇందుకోసం పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఢిల్లీలో మంగళవారం సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. ఈ వారంలోనే ప్రధాని నరేంద్రమోదీని కూడా కలిసి సంకీర్ణ ప్రభుత్వ ప్రమాణస్వీకారానికి హాజరవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి.