పాక్.. మీ ఉగ్రవాదులను కంట్రోల్ చేయ్: ముఫ్తీ
జమ్మూకాశ్మీర్: పాకిస్థాన్ తమ దేశ ఉగ్రవాదులను నియంత్రణలో పెట్టుకోవాలని జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సయ్యద్ హెచ్చరించారు. ఇది ముమ్మాటికీ తమ ప్రాంతంలో శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టే కుట్రేనని అన్నారు. రెండు రోజుల కిందట పోలీసు క్యాంపులపై వరుసగా పాక్ మిలిటెంట్లు దాడి చేయడాన్ని ఆయన ఖండించారు.
ఇదే విషయంపై వారు రెండు సభల్లో తీర్మానం చేసి ఏకగ్రీవంగా ఆమోదించారు. కేంద్రం ఈ విషయంలో జోక్యం చేసుకొని ఇలాంటి దాడులు జరగకుండా ఉండేందుకు పాక్పై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని, దానిద్వారా తమ రాష్ట్రంలో ప్రజలకు భరోసా ఇచ్చినట్లవుతుందని చెప్పారు. దాడులను చేసిన వారిని గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. ఎప్పుడూ శాంతి శాంతి అనడం కాదు.
నిజంగా పాక్ శాంతిని కోరుకునేదే అయితే ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ ముందు ఉగ్రవాదాన్ని, ఉగ్రవాదులను నియంత్రణలోకి తీసుకురావాలని కోరారు. అదే సమయంలో, పాక్ కూడా ఉగ్రవాదుల బాధిత దేశమని తమకు తెలుసని అన్నారు. అయితే, దాని నియంత్రణ మేం ఏం చేయలేమంటూ మాట్లాడితే తాము ఈ రూపంలోనే స్పందిస్తామని, భవిష్యత్లో ఇలాంటివి జరగకుండా ఉంటాయని షరీఫ్ తమకు హామీ ఇవ్వాల్సినవసరం ఉందన్నారు.