శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌లోని గందేర్‌బల్‌లోని గుండ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా తీవ్రంగా ఖండించారు. భారతదేశంలో ఉగ్రవాదం వ్యాప్తి చేయటాన్ని పాకిస్తాన్ ఆపేయాలని అన్నారు. భారత్‌తో సత్సంబంధాలు కావాలంటే పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలకు స్వస్తి చెప్పాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. జమ్ము కశ్మీర్ ఎప్పటికీ పాకిస్థాన్‌గా మారదని తెలిపారు. పాకిస్తాన్ తన గడ్డపై ఉగ్రవాదాన్ని పెంచిపోషించడం విరవించకుంటే తీవ్ర పరిణామాలుంటాయని వార్నింగ్ ఇచ్చారు.
‘‘భారత్‌తో సత్సంబంధాలు కావాలంటే ఉగ్రవాద చర్యలకు స్వస్తి పలకాలని పాక్ నాయకత్వానికి చెప్పాలనుకుంటున్నా. జమ్ము కశ్మీర్ ఎప్పటికీ పాకిస్థాన్‌గా మారదు. కశ్మీర్ ప్రజలుగా మేము గౌరవంగా జీవించి.. విజయం సాధిస్తాం. 75 ఏళ్లుగా ఉగ్రవాదం లేని పాకిస్థాన్‌ను సృష్టించలేకపోతే ఇప్పుడు అది ఎలా సాధ్యమవుతుంది?. ఉగ్రవాదాన్ని అంతం చేసే సమయం వచ్చింది. లేకపోతే ఫలితాలు చాలా తీవ్రంగా ఉంటాయి.
..కశ్మీర్ అమాయకులను చంపితే ఇరు దేశాల మధ్య చర్చలు ఎలా జరుగుతాయి?. ఉగ్రవాదులు చేసిన దాడి చాలా దురదృష్టకరం. వలస వచ్చిన పేద కార్మికులు, ఒక డాక్టర్ ప్రాణాలు కోల్పోయారు. దీనివల్ల ఉగ్రవాదులకు ఏం ప్రయోజనం వస్తుంది? ఉగ్రవాదులు కశ్మీర్‌లో పాకిస్తాన్‌ను సృష్టించగలరని భావిస్తున్నారా.. మేము ఉగ్రవాదాన్నే అంతం చేయడానికి ప్రయత్నిస్తున్నాం’’ అని అన్నారు.
ఈ దాడికి కనీసం ఇద్దరు ఉగ్రవాదులు పాల్పడినట్లు తెలుస్తోంది. ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మరణించగా, మరో నలుగురు, ఓ డాక్టర్ తీవ్రంగా గాయపడి మృతి చెందారు. మరోవైపు ఉగ్రదాడిపై దర్యాప్తు చేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కశ్మీర్‌కు చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment