ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్‌కు భారత్ హెచ్చరిక
భారత్ గురించి మాట్లాడే అర్హత పాక్‌కు లేదని స్పష్టీకరణ
ఐక్యరాజ్యసమితి: జమ్మూకశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్యసమితిలో ప్రస్తావించిన పాకిస్తాన్‌కు భారత్ గట్టిగా బదులిచ్చింది. భారత్‌కు వ్యతిరేకంగా సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తే తీవ్ర పరిణామాలను స్వయంగా ఆహ్వానించినట్లే అవుతుందన్న సంగతి తెలుసుకోవాలని హితవు పలికింది. ప్రపంచవ్యాప్తంగా జరిగిన పలు ఉగ్రవాద దాడులపై పాకిస్తాన్ వేలిముద్రలు ఉన్నాయని స్పష్టంచేసింది. ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో శుక్రవారం భారత దౌత్యవేత్త భవిక మంగళానందన్ మాట్లాడారు.
ఇదే సభలో తాజాగా పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ జమ్మూకశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారు. ఆర్టికల్ 370పై మాట్లాడారు. దీనిపై భవిక మంగళానందన్ ఘాటుగా స్పందించారు. సైన్యం పెత్తనం కింద నలుగుతూ ఉగ్రవాదాన్ని ఉత్పత్తి చేసే దేశమైన పాకిస్తాన్ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ గురించి మాట్లాడడం ఏమటని నిలదీశారు.
ఎన్నికల్లో విచ్చలవిడిగా రిగ్గింగ్‌లు జరిగే దేశం ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతోందని ఎద్దేవా చేశారు. భారతదేశ భూభాగాన్ని కబళించేందుకు పాక్ కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ఆటంకాలు సృష్టించడానికి ఉగ్రవాదాన్ని నమ్ముకుంటోందని ధ్వజమెత్తారు. ఉగ్రవాదానికి, మాదక ద్రవ్యాల వ్యాపారానికి, చీకటి నేరాలకు మారుపేరైన పాకిస్తాన్‌కు భారత్ గురించి నోరువిప్పే అర్హత లేదని భవిక మంగళానందన్ పరోక్షంగా హెచ్చరించారు.
పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని పొరుగు దేశాలపై ఒక ఆయుధంగా ప్రయోగిస్తోందన్న సంగతి ప్రపంచం మొత్తానికి తెలుసని పేర్కొన్నారు. తమ దేశ పార్లమెంట్‌పై, ఆర్థిక రాజధాని ముంబై నగరంపై, మార్కెట్లపై, యాత్రా మార్గాలపై దాడులు చేసిన నీచ చరిత్ర పాకిస్తాన్ ఉందని నిప్పులు చెరిగారు. అలాంటి ధూర్త దేశం హింస గురించి నీతులు చెప్పడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. అల్‌ఖైదా ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్‌కు ఆశ్రయం ఇచ్చిన దేశం ఏమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment