India warning
-
ఉగ్రవాదాన్ని ఎగదోస్తే తీవ్ర పరిణామాలే
ఐక్యరాజ్యసమితి: జమ్మూకశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్యసమితిలో ప్రస్తావించిన పాకిస్తాన్‌కు భారత్ గట్టిగా బదులిచ్చింది. భారత్‌కు వ్యతిరేకంగా సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తే తీవ్ర పరిణామాలను స్వయంగా ఆహ్వానించినట్లే అవుతుందన్న సంగతి తెలుసుకోవాలని హితవు పలికింది. ప్రపంచవ్యాప్తంగా జరిగిన పలు ఉగ్రవాద దాడులపై పాకిస్తాన్ వేలిముద్రలు ఉన్నాయని స్పష్టంచేసింది. ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో శుక్రవారం భారత దౌత్యవేత్త భవిక మంగళానందన్ మాట్లాడారు. ఇదే సభలో తాజాగా పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ జమ్మూకశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారు. ఆర్టికల్ 370పై మాట్లాడారు. దీనిపై భవిక మంగళానందన్ ఘాటుగా స్పందించారు. సైన్యం పెత్తనం కింద నలుగుతూ ఉగ్రవాదాన్ని ఉత్పత్తి చేసే దేశమైన పాకిస్తాన్ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ గురించి మాట్లాడడం ఏమటని నిలదీశారు. ఎన్నికల్లో విచ్చలవిడిగా రిగ్గింగ్‌లు జరిగే దేశం ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతోందని ఎద్దేవా చేశారు. భారతదేశ భూభాగాన్ని కబళించేందుకు పాక్ కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ఆటంకాలు సృష్టించడానికి ఉగ్రవాదాన్ని నమ్ముకుంటోందని ధ్వజమెత్తారు. ఉగ్రవాదానికి, మాదక ద్రవ్యాల వ్యాపారానికి, చీకటి నేరాలకు మారుపేరైన పాకిస్తాన్‌కు భారత్ గురించి నోరువిప్పే అర్హత లేదని భవిక మంగళానందన్ పరోక్షంగా హెచ్చరించారు.పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని పొరుగు దేశాలపై ఒక ఆయుధంగా ప్రయోగిస్తోందన్న సంగతి ప్రపంచం మొత్తానికి తెలుసని పేర్కొన్నారు. తమ దేశ పార్లమెంట్‌పై, ఆర్థిక రాజధాని ముంబై నగరంపై, మార్కెట్లపై, యాత్రా మార్గాలపై దాడులు చేసిన నీచ చరిత్ర పాకిస్తాన్ ఉందని నిప్పులు చెరిగారు. అలాంటి ధూర్త దేశం హింస గురించి నీతులు చెప్పడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. అల్‌ఖైదా ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్‌కు ఆశ్రయం ఇచ్చిన దేశం ఏమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. -
పీఓకేను ఖాళీ చేయండి: భారత్ అల్టిమేటమ్
ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితి వేదికగా మరోసారి పాకిస్తాన్‌కు భారత్ ఘాటైన హెచ్చరికలు జారీ చేసింది. పాక్ దురాక్రమణలో ఉన్న కశ్మీర్లో భూభాగాలను ఖాళీ చేయాలని, పాక్ గడ్డపైనున్న ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేయాలని, సీమాంతర ఉగ్రవాదాన్ని నిలిపివేయాలని గట్టిగా చెప్పింది. అమెరికాలోని న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి 78వ సర్వప్రతినిధి సమావేశాల్లో పాకిస్తాన్ ఆపద్ధర్మ ప్రధానమంత్రి అన్వర్ ఉల్ హక్ కాకర్ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడంతో భారత్ గట్టిగా కౌంటర్ ఇచి్చంది. భారత్‌తో పాకిస్తాన్ శాంతిని కోరుకుంటోందని, రెండు దేశాల మధ్య శాంతి స్థాపన జరగాలంటే కశ్మీర్ అంశమే కీలకమని కాకర్ వ్యాఖ్యానించారు. ఐక్యరాజ్యసమితిలో భారత ఫస్ట్ సెక్రటరీ అయిన పెటల్ గెహ్లోత్ ఈ సమావేశంలో మాట్లాడారు. కాకర్ వ్యాఖ్యల్ని తిప్పికొట్టారు. భారత్‌పై నిరాధార ఆరోపణలు, తప్పుడు ప్రచారంతో అంతర్జాతీయ వేదికలను దుర్వినియోగం చేయడం పాక్‌కు ఒక అలవాటుగా మారిందని ఆమె అన్నారు. పాకిస్తాన్లో మానవ హక్కుల హననం నుంచి అంతర్జాతీయ సమాజం దృష్టిని మరల్చడానికే కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారని మండిపడ్డారు. ‘‘జమ్ము కశ్మీర్, లద్దాఖ్‌లు భారత్‌లో అంతర్భాగమని మేము పదే పదే చెబుతున్నాం. మా అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యానించే హక్కు పాక్‌కు లేదు’’అని ఆమె గట్టిగా చెప్పారు. దక్షిణాసియాలో శాంతి నెలకొనాలంటే పాకిస్తాన్ మూడు పనులు చేయాలని ఆమె సూచించారు. ‘‘మొదటిది సీమాంతర ఉగ్రవాదాన్ని అరికట్టాలి, ఉగ్రవాద శిబిరాలను వెంటనే ధ్వంసం చేయాలి. రెండోది చట్టవిరుద్ధంగా, దురాక్రమణ చేసి ఆక్రమించుకున్న భారత్ భూభాగాలను (పాక్ ఆక్రమిత కశ్మీర్)ను ఖాళీ చేసి వెళ్లిపోవాలి. ఇక మూడోది. పాకిస్తాన్లో మైనారీ్టలైన హిందువుల హక్కుల ఉల్లంఘనను అరికట్టాలి. ’’అని గెహ్లోత్ తీవ్ర స్వరంతో చెప్పారు. భారత్‌ను వేలెత్తి చూపించడానికి ముందు పాక్ తన దేశంలో మైనారీ్ట, మహిళల హక్కులకు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని హితవు పలికారు. -
మీ బలగాలను ఉపసంహరించుకోవాల్సిందే..
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లోని వివాదాస్పద ప్రాంతాల నుంచి సైనిక దళాలను ఉపసంహరించుకోవాల్సిందేనని చైనాకు భారత్ మరోసారి తేల్చిచెప్పింది. ఇరు దేశాల మధ్య శుక్రవారం కమాండర్ స్థాయి అధికారుల చర్చలు జరిగాయి. సైనికుల ఉపసంహరణపై రోడ్‌మ్యాప్‌ను ఖరారు చేయడమే లక్ష్యంగా ఈ చర్చలు జరిపినట్లు అధికార వర్గాలు తెలిపాయి. తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద భారత భూభాగంలోని చుషూల్‌లో ఉదయం 9.30 గంటలకు మొదలైన ఈ సంప్రదింపులు రాత్రి 7 గంటలకు ముగిశాయి. సరిహద్దు విషయంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు ప్రారంభమైనప్పటి నుంచి జరుగుతున్న చర్చల పరంపరలో ఇవి ఎనిమిదో దఫా చర్చలు కావడం విశేషం. ఎనిమిదో దఫా చర్చల్లో భారత్ తరపు బృందానికి లెఫ్టినెంట్ జనరల్ పీజీకే మీనన్ నేతృత్వం వహించారు. ఈ చర్చలు ఫలప్రదంగా సాగినట్లు అధికారులు తెలిపారు. యుద్ధావకాశాలు తోసిపుచ్చలేం: రావత్ తూర్పులద్దాఖ్ ప్రాంతంలో వాస్తవాధీన రేఖ వద్ద చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ దుస్సాహసానికి పాల్పడుతోందని, అయితే భారత్ బలగాలు దాన్ని దీటుగా ఎదుర్కోవడంతో ఊహించని ఎదురుదెబ్బలు డ్రాగన్ దేశానికి తప్పడంలేదని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ తెలిపారు. సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయని, యుద్ధానికి దారితీసే అవకాశాలను తోసిపుచ్చలేమని ఆయన వెల్లడించారు. చైనా, పాకిస్తాన్ కుమ్మౖక్కై ప్రాంతీయ ఉద్రిక్తతలను రెచ్చగొడుతు న్నాయని, ఇది భారత ప్రాదేశిక సమగ్రతకు ప్రమాదంగా పరిణమించిందని తెలిపారు. -
చైనాకు భారత్ స్ట్రాంగ్ వార్నింగ్
న్యూఢిల్లీ: ఓ వైపు తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నా చైనా తన బుద్ధి మార్చుకోవడం లేదు. సిక్కింలోని భారత్-చైనా సరిహద్దులో చైనా సైనికులు చొరబాటుకు యత్నించారు. సిక్కిం సెక్టార్‌లోని డోంగ్‌లాండ్ (డోక్లాం) సరిహద్దు ప్రాంతంలోకి చైనా సైన్యాలు చొచ్చుకురాగా, భారత బలగాలు అంతే దీటుగా సమాధానమిస్తున్నాయి. అంతేకాకుండా హద్దుల్లో ఉండాలంటూ చైనాకు వార్నింగ్ ఇచ్చింది. మరోవైపు భారత్‌కు భూటాన్ తన మద్దతు తెలిపింది. డోక్లాం మూడు దేశాలకు కూడలి వంటిది. ఇది భూటాన్ భూభాగం అయినప్పటికీ చైనా నియంత్రణలో ఉంది. కాగా డోంగ్లాంగ్ ప్రాంతంలో భారత సైన్యం ఆక్రమణకు పాల్పడిందంటూ చైనా విదేశాంగ ప్రతినిధిలు కాంగ్ నిన్న విలేకరుల సమావేశంలో ఓ ఫొటోను ప్రదర్శించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈ నెల 20న ఇరుదేశాల విదేశాంగశాఖ అధికారుల మధ్య చర్చలు జరిగినప్పటికీ చొరబాట్లు కొనసాగడం చైనాకు పరిపాటిగా మారింది. అంతేకాకుండా డోక్లాం సరిహద్దు నుంచి భారత్ తన సేనలను ఉపసంహరించుకోవాలని చైనా డిమాండ్ చేసింది. -
కశ్మీర్ అనిశ్చితికి పాక్ కారణం
* అక్కడి యువత దేశభక్తులే.. వారిని పాక్ రెచ్చగొడుతోంది * అన్ని పార్టీలూ సహకరించాలి: లోక్‌సభలో హోంమంత్రి రాజ్‌నాథ్ న్యూఢిల్లీ: కశ్మీర్లో రెండు వారాలుగా జరుగుతున్న అల్లర్లలో యువకులు చనిపోవటం, పలువురు గాయపడటం బాధించిందని.. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ లోక్‌సభలో అన్నారు. గురువారం.. కశ్మీర్‌పై చర్చ సందర్భంగా రాజ్‌నాథ్ మాట్లాడుతూ.. భారతదేశానికి వ్యతిరేకంగా కశ్మీర్ యువతను పాకిస్తాన్ రెచ్చగొడుతోందని.. అందులో సందేహమేమీ లేదన్నారు. భద్రతా బలగాలపై దాడు లు జరిగితే కొందరు సంబరాలు చేసుకోవటం దారుణమన్నారు. ‘కశ్మీరీ యువత దేశ భక్తులే. కానీ వారిని పక్కదారి పట్టించే ప్రయత్నం జరుగుతోంది. లోయలో అనిశ్చితిని పాకిస్తాన్ రెచ్చగొడుతోంది. ఇక్కడి ఉగ్రవాదానికి కూడా వారే కారణం. కశ్మీర్లో పరిస్థితి మెల్లమెల్లగా సర్దుకుంటోంది’ అని వెల్లడించారు. బుర్హాన్ వానీ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా పాక్ ‘చీకటి రోజు’ జరుపుకోవటంపై రాజ్‌నాథ్ తీవ్రంగా మండిపడ్డారు. ‘భారతదేశంలో విధ్వంసానికి, ఉగ్రవాద కార్యక్రమాలకు పాల్పడిన వ్యక్తిని కాల్చి చంపితే పాక్‌కు సంబంధమేంటి?’ అని రాజ్‌నాథ్ ఘాటుగా విమర్శించారు. కశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు అన్ని పార్టీలూ సహకరించాలని.. అందరూ కలిస్తేనే పరిస్థితి అదుపులోకి వస్తుందన్నారు. నిపుణులతో కమిటీ భద్రతా బలగాలు, పోలీసులు ఉపయోగిస్తున్న పెల్లెట్ గన్లపై పలువురు సభ్యులు సభలో ఆందోళన వ్యక్తం చేశారు. అయితే.. అంతపెద్ద సంఖ్యలో ఆందోళనకారులను అదుపు చేయటంలో.. చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయని.. అవి కూడా జరగకుండా జాగ్రత్తపడాలని భద్రతాబలగాలకు సూచించామని రాజ్‌నాథ్ తెలిపారు. ఈ పెల్లెట్ గన్లకు బదులుగా వినియోగించాల్సిన, తీసుకోవాల్సిన ప్రత్యామ్నాయాలపై.. ఓ నిపుణుల కమిటీని ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు. కశ్మీర్లో అఖిలపక్ష భేటీ లోయలో సాధారణ పరిస్థితులు నెలకొనేలా జాతీయస్థాయిలో చొరవ తీసుకోవాలని కశ్మీర్లో జరిగిన అఖిలపక్ష సమావేశంలో నిర్ణయించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం జాతీయస్థాయిలో రాజకీయ ఏకీకరణ జరగాలన్న ఏకాభిప్రాయానికి వచ్చారు. పీవోకేను ఖాళీ చేయండి: పాక్‌కు భారత్ హెచ్చరిక కశ్మీర్లో ఉగ్రవాదాన్ని రెచ్చగొడుతున్న పాకిస్తాన్.. ముందు పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)ను విడిచి వెళ్లాలని భారత విదేశాంగ శాఖ హెచ్చరించింది. భారత్‌కు వ్యతిరేకంగా పాక్‌లో ర్యాలీలు నిర్వహించటంపై తీవ్రంగా స్పందించింది. ‘ఐక్యరాజ్యసమితి ఉగ్రవాదులుగా గుర్తించిన వారు బహిరంగంగా పాక్‌లో ర్యాలీలు చేస్తున్నారు. ఇస్లామాబాద్‌లోని భారత హై కమిషనరేట్ ముట్టడిస్తామని బెదిరింపు కాల్స్ చేస్తున్నారు. అక్కడి భారతీయ అధికారుల భద్రత భరోసా పాక్‌దే’ అని పేర్కొంది.