![Eighth round of Corps Commander-level talks between India-China - Sakshi](/styles/webp/s3/article_images/2020/11/7/323.jpg.webp?itok=0SZyFZSa)
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లోని వివాదాస్పద ప్రాంతాల నుంచి సైనిక దళాలను ఉపసంహరించుకోవాల్సిందేనని చైనాకు భారత్ మరోసారి తేల్చిచెప్పింది. ఇరు దేశాల మధ్య శుక్రవారం కమాండర్ స్థాయి అధికారుల చర్చలు జరిగాయి. సైనికుల ఉపసంహరణపై రోడ్‌మ్యాప్‌ను ఖరారు చేయడమే లక్ష్యంగా ఈ చర్చలు జరిపినట్లు అధికార వర్గాలు తెలిపాయి. తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వద్ద భారత భూభాగంలోని చుషూల్‌లో ఉదయం 9.30 గంటలకు మొదలైన ఈ సంప్రదింపులు రాత్రి 7 గంటలకు ముగిశాయి. సరిహద్దు విషయంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు ప్రారంభమైనప్పటి నుంచి జరుగుతున్న చర్చల పరంపరలో ఇవి ఎనిమిదో దఫా చర్చలు కావడం విశేషం. ఎనిమిదో దఫా చర్చల్లో భారత్ తరపు బృందానికి లెఫ్టినెంట్ జనరల్ పీజీకే మీనన్ నేతృత్వం వహించారు. ఈ చర్చలు ఫలప్రదంగా సాగినట్లు అధికారులు తెలిపారు.
యుద్ధావకాశాలు తోసిపుచ్చలేం: రావత్
తూర్పులద్దాఖ్ ప్రాంతంలో వాస్తవాధీన రేఖ వద్ద చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ దుస్సాహసానికి పాల్పడుతోందని, అయితే భారత్ బలగాలు దాన్ని దీటుగా ఎదుర్కోవడంతో ఊహించని ఎదురుదెబ్బలు డ్రాగన్ దేశానికి తప్పడంలేదని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ తెలిపారు. సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయని, యుద్ధానికి దారితీసే అవకాశాలను తోసిపుచ్చలేమని ఆయన వెల్లడించారు. చైనా, పాకిస్తాన్ కుమ్మౖక్కై ప్రాంతీయ ఉద్రిక్తతలను రెచ్చగొడుతు న్నాయని, ఇది భారత ప్రాదేశిక సమగ్రతకు ప్రమాదంగా పరిణమించిందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment