కశ్మీర్ అనిశ్చితికి పాక్ కారణం
* అక్కడి యువత దేశభక్తులే.. వారిని పాక్ రెచ్చగొడుతోంది
* అన్ని పార్టీలూ సహకరించాలి: లోక్‌సభలో హోంమంత్రి రాజ్‌నాథ్
న్యూఢిల్లీ: కశ్మీర్లో రెండు వారాలుగా జరుగుతున్న అల్లర్లలో యువకులు చనిపోవటం, పలువురు గాయపడటం బాధించిందని.. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ లోక్‌సభలో అన్నారు. గురువారం.. కశ్మీర్‌పై చర్చ సందర్భంగా రాజ్‌నాథ్ మాట్లాడుతూ.. భారతదేశానికి వ్యతిరేకంగా కశ్మీర్ యువతను పాకిస్తాన్ రెచ్చగొడుతోందని.. అందులో సందేహమేమీ లేదన్నారు. భద్రతా బలగాలపై దాడు లు జరిగితే కొందరు సంబరాలు చేసుకోవటం దారుణమన్నారు.
‘కశ్మీరీ యువత దేశ భక్తులే. కానీ వారిని పక్కదారి పట్టించే ప్రయత్నం జరుగుతోంది. లోయలో అనిశ్చితిని పాకిస్తాన్ రెచ్చగొడుతోంది. ఇక్కడి ఉగ్రవాదానికి కూడా వారే కారణం. కశ్మీర్‌లో పరిస్థితి మెల్లమెల్లగా సర్దుకుంటోంది’ అని వెల్లడించారు. బుర్హాన్ వానీ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా పాక్ ‘చీకటి రోజు’ జరుపుకోవటంపై రాజ్‌నాథ్ తీవ్రంగా మండిపడ్డారు. ‘భారతదేశంలో విధ్వంసానికి, ఉగ్రవాద కార్యక్రమాలకు పాల్పడిన వ్యక్తిని కాల్చి చంపితే పాక్‌కు సంబంధమేంటి?’ అని రాజ్‌నాథ్ ఘాటుగా విమర్శించారు. కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు అన్ని పార్టీలూ సహకరించాలని.. అందరూ కలిస్తేనే పరిస్థితి అదుపులోకి వస్తుందన్నారు.
నిపుణులతో కమిటీ
భద్రతా బలగాలు, పోలీసులు ఉపయోగిస్తున్న పెల్లెట్ గన్లపై పలువురు సభ్యులు సభలో ఆందోళన వ్యక్తం చేశారు. అయితే.. అంతపెద్ద సంఖ్యలో ఆందోళనకారులను అదుపు చేయటంలో.. చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయని.. అవి కూడా జరగకుండా జాగ్రత్తపడాలని భద్రతాబలగాలకు సూచించామని రాజ్‌నాథ్ తెలిపారు. ఈ పెల్లెట్ గన్లకు బదులుగా వినియోగించాల్సిన, తీసుకోవాల్సిన ప్రత్యామ్నాయాలపై.. ఓ నిపుణుల కమిటీని ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు.
కశ్మీర్లో అఖిలపక్ష భేటీ
లోయలో సాధారణ పరిస్థితులు నెలకొనేలా జాతీయస్థాయిలో చొరవ తీసుకోవాలని కశ్మీర్‌లో జరిగిన అఖిలపక్ష సమావేశంలో నిర్ణయించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం జాతీయస్థాయిలో రాజకీయ ఏకీకరణ జరగాలన్న ఏకాభిప్రాయానికి వచ్చారు.
పీవోకేను ఖాళీ చేయండి: పాక్‌కు భారత్ హెచ్చరిక
కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని రెచ్చగొడుతున్న పాకిస్తాన్.. ముందు పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)ను విడిచి వెళ్లాలని భారత విదేశాంగ శాఖ హెచ్చరించింది. భారత్‌కు వ్యతిరేకంగా పాక్‌లో ర్యాలీలు నిర్వహించటంపై తీవ్రంగా స్పందించింది. ‘ఐక్యరాజ్యసమితి ఉగ్రవాదులుగా గుర్తించిన వారు బహిరంగంగా పాక్‌లో ర్యాలీలు చేస్తున్నారు. ఇస్లామాబాద్‌లోని భారత హై కమిషనరేట్ ముట్టడిస్తామని బెదిరింపు కాల్స్ చేస్తున్నారు. అక్కడి భారతీయ అధికారుల భద్రత భరోసా పాక్‌దే’ అని పేర్కొంది.