Home Minister Rajnath Singh
-
పాక్ సరిహద్దుల్లో రాజ్‌నాథ్ దసరా
న్యూఢిల్లీ: భారత్–పాక్ సరిహద్దుల్లోని అత్యంత సున్నిత ప్రాంతమైన బికనూర్‌లో దసరా, ఆయుధపూజ కార్యక్రమాల్లో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పాల్గొననున్నారు. ఇండో–పాక్ సరిహద్దుల్లో ఆయుధపూజ కార్యక్రమంలో ఓ సీనియర్ కేంద్రమంత్రి పాల్గొనడం ఇదే మొదటిసారి. రాజస్తాన్‌లోని బికనూర్ వద్దనున్న పాక్ సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ జవాన్లతో ఈ నెల 19న దసరా వేడుకల్లో రాజ్‌నాథ్ పాల్గొంటారని కేంద్ర హోంశాఖ వర్గాలు తెలిపాయి. అలాగే అక్కడి ప్రాంతంలో నిర్వహించబోయే ఆయుధపూజలో కూడా రాజ్‌నాథ్ పాల్గొంటారని వెల్లడించాయి. రెండ్రోజుల పర్యటనలో భాగంగా రాజ్‌నాథ్ ఈ నెల 18న రాత్రి బికనూర్ బోర్డర్ ఔట్‌పోస్టుకు చేరుకుంటారని.. 19న దసరా వేడుకల్లో జవాన్లతో కలసి పాల్గొంటారని అధికారులు తెలిపారు. పర్యటన సందర్భంగా రాజ్‌నాథ్ సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులపై సమీక్షించనున్నారు. గతేడాది చైనా సరిహద్దుల్లోని ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్ లో దసరా వేడుకల్లో రాజ్‌నాథ్ పాల్గొన్నారు. -
తక్షణ సాయం100 కోట్లు
కొచ్చి: భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమవుతున్న కేరళలో కేంద్ర హోమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం పర్యటించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘కేరళ అసాధారణమైన వరదలను ఎదుర్కొంటోంది. స్వతంత్ర భారత చరిత్రలో కేరళలో ఎన్నడూ ఈ స్థాయిలో వరద సంభవించలేదు. వర్షం, వరదల కారణంగా రాష్ట్రంలో పంటలు, మౌలికవసతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రస్తుతం కేరళకు తక్షణ సాయంగా రూ.100 కోట్లు అందజేస్తున్నాం’ అని రాజ్‌నాథ్ తెలిపారు. అంతకుముందు ఇడుక్కి, ఎర్నాకులం జిల్లాల్లో కేంద్ర పర్యాటక సహాయ మంత్రి అల్ఫోన్స్, సీఎం పినరయి విజయన్‌తో కలసి ఏరియల్ సర్వే నిర్వహించిన రాజ్‌నాథ్..కేరళను అన్నిరకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం వరద బాధితులతో మాట్లాడారు. కాగా, ప్రస్తుత విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు రూ.1,220 కోట్ల తక్షణ సాయం అందజేయాలని సీఎం విజయన్ రాజ్‌నాథ్‌కు విజ్ఞాపన పత్రాన్ని సమర్పించారు. వరదల కారణంగా రాష్ట్రంలో ఇప్పటివరకూ రూ.8,316 కోట్ల నష్టం సంభవించిందని పేర్కొన్నారు. ఎలాంటి విపత్కర పరిస్థితినయినా ఎదుర్కొనేందుకు వీలుగా 14 జాతీయ విపత్తు ప్రతిస్పందన దళాలను మోహరించినట్లు రాజ్‌నాథ్ తెలిపారు. కేరళలో భారీ వర్షాలు, వరదల కారణంగా ఇప్పటివరకూ 37 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. కాగా, ఇడుక్కి, వయనాడ్, కన్నూర్, ఎర్నాకులం, పాలక్కడ్, మలప్పురం జిల్లాల్లో ఆది, సోమవారాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించింది. కేరళతో పాటు మరో 16 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. -
చంద్రబాబు మాకు మిత్రుడే
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, బీజేపీ బంధం బలమైనదని లోక్‌సభ సాక్షిగా మరోసారి నిరూపితమైంది. ‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్డీయే నుంచి బయటకొచ్చినా ఈ రోజుకీ ఆయన మా మిత్రుడే. ఇకపై కూడా మా మిత్రుడిగానే కొనసాగుతారు. మా బంధం తెగిపోయేదికాదు’ అని శుక్రవారం లోక్‌సభలో అవిశ్వాసంపై చర్చ సందర్భంగా కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ అన్నారు. రాష్ట్ర విభజన తరువాత ఏపీకి కేటాయించిన నిధులు, సాయంపై సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన వల్ల ఏర్పడిన సమస్యలేంటో మాకు తెలుసు. ఏపీ అభివృద్ధికి ఎంత సాయం అవసరమో అంతా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. విభజన చట్టాన్ని ఇప్పటికే చాలా వరకు అమలు చేశాం. నూతన రాజధాని నిర్మాణానికి రూ. 1,500 కోట్లు ఇచ్చాం. గుంటూరు, విజయవాడకు అదనంగా రూ. వెయ్యి కోట్లు ఇచ్చాం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 6,764 కోట్లు విడుదల చేశాం. ప్రాజెక్టు వ్యయానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలపై చర్చ జరుగుతోంది. త్వరలోనే ఈ విషయంలో ఒక స్పష్టత వస్తుంది. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి రూ.1,050 కోట్లు ఇచ్చాం. అవసరమైతే ఇంకా ఇస్తాం. రిసోర్స్ గ్యాప్ భర్తీకి రూ.3, 979 కోట్లు విడుదల చేశాం. 2015–20 కాలానికి ఆర్థిక లోటును రూ. 22,113 కోట్లతో భర్తీ చేయాలని 14వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. ఇందుకోసం 2015–18 మధ్య కాలంలో రూ. 15,959 కోట్లు విడుదల చేశాం. ఇవి కాకుండా ఏపీకి అదనంగా సెంట్రల్ యూనివర్శిటీ, గిరిజన విశ్వవిద్యాలయం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం, అమరావతి చుట్టూ వంద కిలోమిటర్లు రింగురోడ్డు, ఎయిమ్స్, అగ్రికల్చర్ వర్సిటీకి రూ. 135 కోట్లు మంజూరు చేశాం. వైజాగ్–చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌కు అనుమతులిచ్చాం. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల ద్వారా ఏపీకి 2015–20 కాలానికి కేంద్రం నుంచి రూ. 2,06,910 కోట్లు మంజూరు కానున్నాయి. 2016 సెప్టెంబర్‌లో ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ ద్వారా రూ.8,140 కోట్ల విలువైన ఈఏపీ ప్రాజెక్టులకు అనుమతించాం. టీడీపీ ఇక ప్రత్యేక హోదా అంశాన్ని పక్కనపెట్టి ఇప్పటి వరకు మంజూరు చేసిన ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రాన్ని అభివద్ధి చేయడంపై దృష్టి సారించాలి’ అని సూచించారు. సిక్కుల ఊచకోతే అతిపెద్ద మూకదాడి.. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్య అనంతరం జరిగిన సిక్కుల ఊచకోతే అతిపెద్ద మూకదాడి అని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఇలాంటి ఘటనల నివారణకు కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని, కానీ రాష్ట్రాలే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇటీవల జరుగుతున్న వరస మూకహత్యలపై కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్న ప్రతిపక్షాలకు గట్టి సమాధానమిచ్చారు. 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లే అతిపెద్ద మూకహత్యా ఘటనలని, ఇందిరా గాంధీ హత్యానంతర పరిస్థితులను ప్రస్తావించారు. ఈ వ్యవహారంలో తమ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసిందని, సిక్కు వర్గానికి తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రకటించిన ప్రతిపక్షాల్లోనే ఒకరిపై ఒకరికి విశ్వాసం లేదని హేళన చేశారు.‘ఎవరిపై మీరు అవిశ్వాసం ప్రకటించారు? ప్రధాని నరేంద్ర మోదీపై ఉన్న నమ్మకంతో ఆయన ఇచ్చిన పిలుపు మేరకు లక్షలాది కుటుంబాలు స్వచ్ఛందంగా గ్యాస్ సబ్సిడీని వదులుకున్నాయి. కానీ ప్రతిపక్షాల్లోనే ఒకరిని మరొకరు విశ్వసించే పరిస్థితి లేదు. తమ నాయకుడు, విధానాల గురించి వాళ్లకే స్పష్టత లేదు’ అని అన్నారు. -
‘ఫెడరల్ ఫ్రంట్ ఆచరణ సాధ్యం కాదు’
సాక్షి, ఢిల్లీ : తెలంగాణలో భారతీయ జనతా పార్టీ 2019 ఎన్నికల్లో ఒంటరిగానే అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందని బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ స్పష్టం చేశారు. హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ని మంగళవారం దత్తాత్రేయ కలిశారు. ఈ సమావేశంలో ఏపీ, తెలంగాణలో రాజకీయ పరిస్థితులపై మాట్లాడినట్లు సమాచారం. శాంతి భద్రతలు, నక్సలైట్ సమస్యలు, పలు అభివృద్ది కార్యక్రమాలపై చర్చించినట్లు ఎంపీ తెలిపారు. అంతేకాక ఏపీ, తెలంగాణ హైకోర్టు ఏర్పాటు అంశాన్ని కూడా సమావేశంలో ప్రస్తావించినట్లు దత్తాత్రేయ చెప్పారు. ‘హైకోర్టు ఏర్పాటు అంశం న్యాయ శాఖ పరిధిలో ఉందని హోంమంత్రి తెలిపారు. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. కానీ, ఇప్పటి వరకూ పంచాయితీ రాజ్ ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయలేదు. సకాలంలో ఎన్నికలు జరుగతాయనే నమ్మకం లేదు. గ్రామ పంచాయితీలో అధికారం ప్రజలకు ఇవ్వాలి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక ఏ గ్రామ పంచాయితీలకు నిధులు ఇవ్వలేదు. టీఆర్ఎస్ బీజేపీకి ఎక్కడా ఒప్పందం లేదు’ అని దత్తాత్రేయ పేర్కొన్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఆచరణలో సాధ్యం కాదని బండారు దత్తాత్రేయ జోస్యం చెప్పారు. ‘అవినీతి, ఓటు బ్యాంకు రాజకీయాలకు తెరలేపింది. కాంగ్రెస్ పార్టీ తమ స్వార్థ రాజకీయాల కోసం అభివృద్ధిని అడ్డుకోవడానికి కొందరు ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ కేసీఆర్‌కి దూరంగా ఉంటుంది. రైతు బంధు పథకం రైతులకు ఉపశమనం మాత్రమే. తెలంగాణలో గ్రామాల వారిగా లబ్ధిదారుల పేర్లను వైబ్‌సైట్ ద్వారా బహిర్గతం చేయ్యాలని’ ఎంపీ బండారు దత్తాత్రేయ డిమాండ్ చేశారు. -
కశ్మీర్‌కు 9 అదనపు బెటాలియన్లు
జమ్మూ: పాకిస్తాన్ చేస్తున్న వరుస షెల్లింగ్ దాడులను తిప్పికొట్టేందుకు కశ్మీర్లో కొత్తగా 9 బెటాలియన్లను ఏర్పాటుచేస్తామని హోం మంత్రి రాజ్‌నాథ్ ప్రకటించారు. అందులో రెండింటిని సున్నిత ప్రాంతాల్లో మోహరిస్తామన్నారు. జమ్మూ, కశ్మీర్‌లలో ఒక్కోటి చొప్పున 2 మహిళా బెటాలియన్లను ఏర్పాటుచేస్తామని, వీటి వల్ల సుమారు 2 వేల మంది మహిళలకు ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. త్వరలో ఏర్పాటుచేయబోయే ఇండియన్ రిజర్వ్ బెటాలియన్లలో స్థానికులకే 60 శాతం ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. సరిహద్దుల్లో పాక్ కాల్పుల ప్రభావిత ప్రాంతాలైన ఆర్‌ఎస్‌పురా, కుప్వారా జిల్లాల్లో పర్యటించి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాల్పుల సమయంలో వాడుకోవడానికి అక్కడ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను అందుబాటులో ఉంచుతామని చెప్పారు. సరిహద్దు ప్రాంతాల్లో స్థానికులకు రక్షణగా రూ.450 కోట్ల వ్యయంతో 14,460 బంకర్లు నిర్మిస్తామన్నారు. పాక్ షెల్లింగ్‌లో మృతిచెందిన వారి కుటుంబీకులకు పరిహారాన్ని రూ.5 లక్షలకు పెంచామని తెలిపారు. ఈ మొత్తాన్ని బాధిత కుటుంబ బ్యాంకు ఖాతాలో వేస్తామని, ఇకపై ఈ సాయం పొందాలంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేయాల్సిన అవసరంలేదన్నారు. రాష్ట్రంలో స్థిరపడిన పశ్చిమ పాకిస్తాన్ శరణార్థుల కుటుంబాలకు రూ.ఐదున్నర లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని వెల్లడించారు. కుప్వారాలో వలసదారులు, స్థానిక ప్రతినిధులతో రాజ్‌నాథ్ సమావేశమయ్యారు. జిల్లా పోలీస్ లైన్స్ సందర్శించి అమర జవాన్లు, పోలీసులకు నివాళులర్పించారు. రాజ్‌నాథ్ వెంట కశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీ, కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ ఉన్నారు. రోహింగ్యాలపై సర్వే.. దేశంలో నివసిస్తున్న రోహింగ్యా ముస్లింలపై సర్వే జరపాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించామని రాజ్‌నాథ్ చెప్పారు. అలాగే వారు పౌరసత్వం పొందేలా ఎలాంటి చట్టబద్ధ పత్రాలు జారీచేయొద్దని సూచించామన్నారు. అన్ని రాష్ట్రాల నుంచి సర్వే సమాచారం వచ్చిన తరువాత రోహింగ్యాలను వెనక్కి పంపే ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. దేశవ్యాప్తంగా మావోయిస్టుల ప్రాబల్యం క్రమంగా తగ్గుముఖం పడుతోందని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కేవలం పది జిల్లాల్లోనే మావోయిస్టుల హింస ఆందోళనకరంగా ఉందని అన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో కూడా అతివాదుల కార్యకలాపాలు తగ్గాయని తెలిపారు. ప్రధానికి నక్సలైట్ల ముప్పు ఉందన్న వార్తలపై స్పందిస్తూ..మోదీ భద్రతకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. -
కేంద్రం చేతికి ‘జోన్లు’
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: రాష్ట్రంలో జోన్ల పునర్ వ్యవస్థీకరణ ప్రతిపాదనలను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కేంద్రం ముందు పెట్టారు. సోమవారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి ప్రతిపాదనలు అందజేశారు. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్–97 అనుసరించి తెలంగాణ ప్రజలకు సమాన అవకాశాలు కల్పించేందుకు ‘ఆర్టికల్ 371–డీ’ని కొనసాగించామని తెలిపారు. ‘రాష్ట్రపతి ఉత్తర్వులు’గా పిలుచుకునే ‘ది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ కేడర్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆర్డర్, 1975’ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 6 జోన్లు ఉండేవని వివరించారు. విభజన అనంతరం తెలంగాణలోకి జోన్–5, జోన్–6 వచ్చాయని, మిగిలిన జోన్లు నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌లోకి వెళ్లాయని వివరించారు. పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలన్న ఉద్దేశంతో రాష్ట్రంలోని 10 జిల్లాలను 31 జిల్లాలుగా విభజించామన్నారు. ‘‘కొత్త జిల్లాల నేపథ్యంలో రాష్ట్రంలో జోన్లను సర్దుబాటు చేయాల్సి ఉంది. ఇందుకు వీలుగా జోన్–5, జోన్–6లను జోన్లు, మల్టీ జోన్లు, స్టేట్ కేడర్‌గా పునర్ వ్యవస్థీకరించాల్సి ఉంది. సంబంధిత ప్రతిపాదనలను ఆమోదించి రాష్ట్రపతి ఉత్తర్వులకు సవరణ చేయాలి. ఈ ప్రతిపాదనలను ఆమోదించి రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసేలా చూడండి’’అని రాజ్‌నాథ్‌ను సీఎం కోరారు. దాదాపు 45 నిమిషాలపాటు వీరిరువురి సమావేశం సాగింది. ఈ సందర్భంగా పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని పలు అపరిష్కృత అంశాలను కూడా సీఎం హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. హైకోర్టు విభజనతోపాటు ఇతర కీలకాంశాలను చర్చించినట్టు సమాచారం. ముఖ్యమంత్రి వెంట టీఆర్ఎస్ ఎంపీ బి.వినోద్‌కుమార్, మిషన్ భగీరథ చైర్మన్ వి.ప్రశాంత్‌రెడ్డి, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి రావుల శ్రవణ్ రెడ్డి ఉన్నారు. ఢిల్లీలో ఒక్కరోజే.. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ఒక్కరోజులోనే ముగిసింది. సోమవారం రాత్రికే సీఎం ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం రాష్ట్రపతి, ప్రధాని, పలువురు కేంద్రమంత్రులను సీఎం కలవాల్సి ఉంది. మంగళవారం నుంచి మోదీ విదేశీ పర్యటనకు బయల్దేరనున్నారు. ఈ కారణంగా సోమవారం నిర్ణీత కార్యక్రమాలతో ఆయన బిజీగా ఉన్నారని, అందుకే ప్రధాని అపాయింట్మెంట్ దొరకలేదని టీఆర్ఎస్ శ్రేణులు వెల్లడించాయి. -
అవసరమైతే ‘హద్దు’ దాటుతాం: రాజ్‌నాథ్
న్యూఢిల్లీ: దేశ సమైక్యతను కాపాడుకునేందుకు.. అవసరమైతే భద్రతా దళాలు నియంత్రణ రేఖను దాటి ముందుకు వెళ్తాయని హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు. జమ్మూకశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగంగానే ఉంటుందని స్పష్టం చేశారు. పాక్ ఎన్ని కుయుక్తులకు పాల్పడినా కశ్మీర్‌ను భారత్ నుంచి వేరు చేయలేదన్నారు. శనివారం ఢిల్లీలో జరిగిన న్యూస్ 18 రైజింగ్ ఇండియా సమిట్‌లో ఆయన ప్రసంగించారు. ‘భారత్‌ను అంతర్గతంగా భద్రంగా ఉంచుకుంటాం. అంతేకాదు అవసరమైతే.. దేశాన్ని రక్షించుకునేందుకు సరిహద్దులు దాటి ముందుకు వెళ్తాం’ అని వ్యాఖ్యానించారు. -
డిసెంబర్ 15 నుంచి శీతాకాల సమరం
న్యూఢిల్లీ: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ముగిసిన మరుసటి రోజు నుంచే పార్లమెంట్ శీతాకాల సమరం మొదలు కానుంది. డిసెంబర్ 15న సమావేశాలు ప్రారంభమై జనవరి 5 వరకూ 14 రోజులు సభా కార్యక్రమాలు కొనసాగుతాయి. హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో శుక్రవారం ఢిల్లీలో జరిగిన పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీపీఏ) తేదీలను నిర్థారించింది. సీసీపీఏ ప్రతిపాదనలను రాష్ట్రపతి ఆమోదం కోసం పంపనున్నారు. పార్లమెంట్ సమావేశాల జాప్యాన్ని కేంద్ర మంత్రి అనంత్ కుమార్ సమర్థించుకున్నారు. జనవరి 1తో పాటు అన్ని పని దినాల్లోనూ సభ్యులు సమావేశాలకు హాజరుకావాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. ఈ సమావేశాల్లో ట్రిపుల్ తలాక్, ఎన్సీబీసీ తదితర కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. -
వాట్సాప్‌లో రూమర్... రాజ్‌నాథ్‌కు అవమానం
సాక్షి, జైపూర్ : కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌కు అవమానం ఎదురైంది. రాజస్థాన్ పర్యటనలో ఆయనకు గౌరవ వందనం దక్కలేదు. వాట్సాప్‌లో చక్కర్లు కొట్టిన ఓ పుకారు కారణంగా కానిస్టేబుళ్లంతా ముకూమ్మడిగా విధులకు గైర్హాజర్ కావటంతో ఇది చోటు చేసుకుంది. ఏం జరిగిందంటే... ఇటీవలె వసుంధర రాజే నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం పోలీస్ శాఖకు సంబంధించి ఓ నిర్ణయం తీసుకుంది. అయితే దాని వల్ల వారి వేతనాల్లో భారీగా కోతలు పడబోతున్నాయంటూ.. ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రస్తుతం 24 వేలుగా ఉన్న వారి జీతాలు 19 వేలకు పడిపోతుందని అందులో పేర్కొని ఉంది. దీంతో కానిస్టేబుళ్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా సోమవారం జోధ్ పూర్లో రాజ్‌నాథ్ సింగ్ పర్యటించగా.. నిరసనలో భాగంగా సుమారు 250 మంది కానిస్టేబుళ్లు సామూహికంగా విధులకు డుమ్మా కొట్టారు. దీంతో రాజ్‌నాథ్ గౌరవ వందనం స్వీకరించలేకపోయారు. అధికారులేం చెబుతున్నారు... కాగా, రాజ్‌నాథ్‌కు సైనిక వందనం దక్కకపోవటంపై అధికారులు స్పందించారు. ఆ 250 మందిలో గార్డ్ ఆఫ్ ఆనర్ కోసం నియమించిన కానిస్టేబుళ్లే ఎక్కువ మంది ఉన్నారు. వారికి ఎలాంటి లీవులు మంజూరు చేయలేదు. పైగా ఖచ్ఛితంగా విధులకు హాజరుకావాల్సిందేనని ముందస్తుగా చెప్పాం కూడా. అయినా కావాలనే వారు రాలేదు అని జోధ్ పూర్ పోలీసు కమిషనర్ అశోక్ రాథోడ్ తెలిపారు. మరోవైపు కానిస్టేబుళ్లు మాత్రం ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి భరోసా లభించలేదని.. తమ ఆందోళనను, భయాన్ని కేంద్రానికి చెప్పేందుకు ఇలా చేశామంటున్నారు. ఏదిఏమైనా విధులకు డుమ్మా కొట్టినందున వీరికి నోటీసులు పంపి శాఖా పరమైన చర్యలు తీసుకోనున్నామని రాజస్థాన్ డీజీపీ అజిత్ సింగ్ తేల్చి చెప్పారు. -
‘సమాధాన్’ కాదు ఫాసిస్టు దూకుడు!
ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా ప్రాంతంలో మావోయిస్టులు పారామిలటరీ బలగాలపై జరిపిన దాడి తరువాత మే 7న కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఆయా రాష్ట్రాల సీఎంలు, హోం మంత్రులు, డీజీపీల భేటీ ఏర్పర్చారు. ఈ భేటీలో ‘ప్రతి అంశంలోను దూకుడుగా వెళ్లాలని’ రాష్ట్ర ప్రభుత్వాలకు పిలుపు ఇచ్చారు. ‘చాలా జాగ్రత్తగా ఉండడం’, ‘రక్షణాత్మక ధోరణిలో వ్యవహరించడం’ అన్నది అంతిమంగా ‘ఎదురుదాడి సామర్థ్యాన్ని కుంగదీస్తున్న’ విషయాన్ని గుర్తించాలి’ అని చెప్పారు. ఈ ప్రకటనలోని ‘దూకుడు’ (అఫెన్స్) అనే పదం కేవలం మిలటరీ రంగానికే పరిమితమైనది కాదు. దానితో పాటు ప్రధానంగా భావజాల రంగానికి కూడా వర్తిస్తుంది. ఇప్పటికే కాషాయ సేవ ఈ దాడి ప్రారంభించింది. రాజ్యాంగయంత్రం నుంచి కూడా ఈ దాడి ప్రారంభమైంది. ఈ దాడిలో భాగంగానే ‘మావోయిస్టుల కన్నా మావోయిజం ప్రచారం చేõ¯ వాళ్లే ప్రమాదకరం అనే’ ప్రకటన వెలువడింది. ఈ మధ్య ఒక టీవీ చానల్లో హరగోపాల్‌తో చర్చలో పాల్గొన్న ఒక పోలీసు అధికారి ‘మావోయిస్టుల కన్నా పౌరహక్కుల సంఘాల వాళ్లే ప్రమాదకరమ’ని మాట్లాడడం గమనించవచ్చు. ఈ దాడి కేవలం మావోయిజంపైనే కాదు. మొత్తంగా ప్రగతిశీల భావాలపైనే, చివరకు లిబరల్ డెమోక్రసీ ఆలోచనలపై కూడా దాడి ప్రారంభమైంది. బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ రచనల్లో ఈ విషయాలు స్పష్టంగా స్పష్టమవుతున్నాయి. మావోయిస్టు పార్టీ నేతృత్వంలో జరుగుతున్న ప్రజాయుద్ధం పోరాడుతున్న ప్రజలకు ప్రత్యామ్నాయ మార్గంగా క్రమక్రమంగా పెరుగుతున్నది. ఈ పరిస్థితిని వాళ్లు అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిగా భావిస్తున్నారు. దీన్ని మన్మోహన్ సింగ్ ముందుగానే గుర్తించి మావోయిస్టు పార్టీ దేశ (పాలకవర్గాల) అంతర్గత భద్రతకు అత్యంత ప్రమాదకారి అని ప్రకటించాడు. ప్రస్తు తం మోదీ అండ్ కో కూడా ప్రజాయుద్ధ ప్రమాదాన్ని తీవ్రంగా భావిస్తున్నది. రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడిన ‘అఫెన్స్’ను ఈ కోణంలోంచే అర్థం చేసుకోవాలి. అఫెన్స్ చేయడం అంటే వాళ్లు రూపొందించుకున్న రాజ్యాంగాన్ని, చట్టాలను కూడా అవతల పడేసి,ఫాసిజాన్ని అమలు చేయడం అనే. ఇందుకు అనుగుణంగా వాళ్లు భావజాల రంగంలో ఫాసిస్టు శక్తులను (మేధావులు, యువతను) సంఘటిత పరుస్తున్నారు. అయితే రాబోయే ఎన్నికలను (పార్లమెంట్ ఎన్నికలు) దృష్టిలో పెట్టుకొని కొంత సంయమనాన్ని పాటిస్తున్నట్లుగా నటిస్తున్నారు. అయితే తీవ్రతరం అవుతున్న వర్గయుద్ధం వాళ్ల అంతరంగాన్ని బయటపెడుతున్నది. పై పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రజాస్వామ్య శక్తులు రంగంలోకి దిగాల్సి ఉన్నది. ప్రజలను ఎవరు గెలుచుకోగలిగితే వాళ్లు యుద్ధంలో గెలుస్తారనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలను గెలుచుకునేందుకు విప్లవ, ప్రజాస్వామిక శక్తులు కలిసి పోటీపడాలి. గతంలో కొంతమేరకు కుదేలైన బ్రాహ్మణవాద శక్తులు నేడు మోదీ పాలనలో దేశ వ్యాపితంగా సంఘటితపడి విప్లవ, పురోగామి భావాలపైన, శ్రామిక సంస్కృతిపైన దూకుడుగా దాడి చేస్తూ ప్రజలను పక్కదారి పట్టించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో విప్లవ, ప్రజాస్వామ్య శక్తులు రాజ్య నిర్బంధాన్ని ఎదుర్కొంటూ ప్రజలలో సిద్ధాంత, రాజకీయ కృషిని వేగిరపరచాలి. హిందూ ఫాసిజానికి, రాజ్య నిర్బంధానికి వ్యతిరేకంగా కలిసివచ్చే శక్తులన్నింటినీ కలుపుకొని పోరాడాలి. – జగబంధు, సీపీఐ ఎం–ఎల్ (మావోయిస్టు) పార్టీ అధికార ప్రతినిధి -
మియాపూర్ స్కాంపై కేంద్రానికి నివేదికలు
బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు సాక్షి, హైదరాబాద్: మియాపూర్ భూ కుంభకోణంపై ప్రధాని మోదీ, హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలకు నివేదికలు పంపినట్లు ఆ పార్టీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు తెలిపారు. ఈ కుంభకోణంపై కేంద్ర ప్రభుత్వం ద్వారా దర్యాప్తు జరిపించాలని కోరినట్లు చెప్పారు. ఈ స్కాంపై సీఎం కేసీఆర్ మౌనాన్ని వీడకపోతే దాన్ని ఒప్పుకున్నట్లే అవుతుందని, ఈ విషయంలో సీఎం చేస్తున్నదేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ తప్పు చేసినట్లు కేసీఆర్ తన మౌనం ద్వారా ఒప్పుకుంటున్నారని భావించాల్సి ఉంటుందన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, గోల్డ్ స్టోన్ ప్రసాద్‌ను ప్రభుత్వం కాపాడుతోందని ఆరోపించారు. ప్రసాద్ ఆచూకీని కనిపెట్టేందుకు పోలీస్ శాఖ లుకౌట్ నోటీస్ కూడా ఎందుకు జారీ చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలన్నారు. బీజేపీ నాయకులకు ఈ భూ కుంభకోణాలతో ఎలాంటి సంబంధం లేదని ఒక ప్రశ్నకు బదులిచ్చారు. గ్రూప్–2 నియామక ప్రక్రియపై హైకోర్టు స్టే విధించడం టీఎస్పీఎస్సీకి చెంప పెట్టు వంటిదని వ్యాఖ్యానించారు. కోర్టు అనర్హులుగా గుర్తించిన వారిని టీఎస్పీఎస్సీ ఏ విధంగా అర్హులుగా గుర్తించిందని ప్రశ్నించారు. దీనిపై టీఎస్పీఎస్సీ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
కూర్చొని పరిష్కరించుకోవాలి
⇒ ‘విభజన చట్టం’అంశాలపై రాజ్‌నాథ్ సింగ్ న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఉన్న అంశాలన్నీ పరిష్కారమవుతాయని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. మిగిలిన అంశాలను 2 రాష్ట్రాలు కూర్చొని పరిష్కరించుకుంటాయని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మూడేళ్ల పనితీరుపై ఆయన శనివారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విభజన జరిగి మూడేళ్లయినా సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయని, 9, 10 షెడ్యూళ్ల సంస్థల విభజన పెండింగ్‌లో ఉందని, వీటిని ఎలా పరిష్కరిస్తారని మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. ‘మేం సానుకూలంగా ఆలోచిస్తున్నాం. పునర్ వ్యవస్థీకరణ చట్టంలో అనేక అంశాలు ఉన్నాయి. ఇందులో అనేకం పరిష్కారమయ్యాయి కూడా. మిగిలి ఉన్న అంశాలను 2రాష్ట్రాలు కలిసి కూర్చొని పరిష్కరించుకుంటాయని ఆశిస్తున్నాం ’అని పేర్కొన్నారు. -
మసూద్‌పై చైనాతో భారత్ మంతనాలు
న్యూఢిల్లీ: పఠాన్‌కోట్ ఉగ్రదాడి సూత్రధారి, జైష్ ఎ మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే విషయమై చైనాతో మంతనాలు జరుపుతున్నామని, పాకిస్థాన్‌లో ఆశ్రయం పొందుతోన్న మాఫియాడాన్ దావూద్ ఇబ్రహీంను భారత్‌కు రప్పించేలా చర్యలు ముమ్మరం చేశామని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. మంగళవారం ఢిల్లీలో విలేకరుల సమావేశం నిర్వహించిన ఆయన పలు అంశాలపై మాట్లాడారు. ‘మతం, జాతి, కులం, వర్గం, భాషల పేర్లతో ఓట్లు అడగడం ఎన్నికల చట్టం కింద అవినీతి చర్య కిందికే వస్తుంది’ అన్న సుప్రీం కోర్టు తీర్పును (‘కులమతాల’పై సుప్రీం కోర్టు కీలక తీర్పు) తాము ఆహ్వానిస్తున్నామని, ఆ తరహా రాజకీయాలకు బీజేపీ మొదటి నుంచి వ్యతిరేకమని రాజ్‌నాథ్ చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్‌లో నాగావర్గీయుల ఆందోళనల నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో ఎప్పిటికప్పుడు మాట్లాడుతున్నామని, అక్కడ గవర్నర్ పాలన విధించే ఆలోచన ఏదీ లేదని, నిరసనకారులపై నిర్బంధాన్ని ఎత్తివేసేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రికి సూచించామని తెలిపారు. (వెంటాడి.. దుస్తులను చించి వేధించారు)బెంగళూరులో న్యూఇయర్ వేడుక సందర్భంగా మహిళలపై కీచకుల వేధింపులు గర్హనీయమని, స్త్రీల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత కర్ణాటక ప్రభుత్వానికి ఉండాలని రాజ్‌నాథ్ వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్‌లో అధికార సమాజ్‌వాదీ పార్టీలో తలెత్తిన విబేధాలపైనా స్పందిస్తూ తండ్రీకొడుకుల మధ్య తగవులాట మంచిదికాదని హితవు పలికారు. ('ఏ అమ్మాయిని వారు విడిచిపెట్టలేదు') -
20 వేల సంస్థలకు కేంద్రం భారీ షాక్
న్యూఢిల్లీ: స్వచ్ఛంద సంస్థలకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 వేల స్వచ్ఛంద సంస్థల లైసెన్స్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కేవలం 13వేల స్వచ్ఛంద సంస్థలు మాత్రమే సరైన లైసెన్స్‌లు కలిగి ఉన్నాయని, మిగితా సంస్థలన్నీ కూడా నిబంధనలు ఉల్లంఘించాయని కేంద్రం ప్రకటించింది. మంగళవారం కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ విదేశీయుల విభాగంపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమయంలో దేశంలో మొత్తం 33 వేల స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయని, వీటిల్లో 20 వేల సంస్థలు ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ చట్టాన్ని అతిక్రమించాయని, లైసెన్స్ విషయంలో తప్పుడు ధ్రువపత్రాలు ఉపయోగించడంతోపాటు అనైతికంగా వ్యవహరించారని, అందుకే వారి లైసెన్స్‌లు రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. చట్టపరంగా 13 వేల సంస్థలకు మాత్రమే ప్రస్తుతం గుర్తింపు ఉన్నట్లు స్పష్టం చేసింది. -
న్యూ ఇయర్‌కి కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్
న్యూఢిల్లీ: కొత్త సంవత్సరం వేళ కేంద్ర ప్రభుత్వం బంపర్ బహుమతిని తీసుకొస్తుంది. అది స్వదేశీయులకు కాదండోయ్ విదేశీయులకు. విదేశాల నుంచి భారత్‌లోని పర్యాటక ప్రదేశాలను చూసేందుకు వచ్చే పర్యాటకులకు ఇక నుంచి సిమ్ కార్డులు అందజేయాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. కొత్త సంవత్సరం కానుకగా వారికి వీటిని అందించనుంది. మొత్తం పన్నెండు విమానాశ్రయాల్లో దాదాపు 161 దేశాల నుంచి వచ్చే పర్యాటకులకు ఈ సిమ్ కార్డులను ఇవ్వనుంది. పంజిమ్, అహ్మదాబాద్, అమృత్ సర్, జైపూర్, బెంగళూరు, చెన్నై, ముంబయి, లక్నో, ఢిల్లీ, వారణాసి విమానాశ్రయాల్లో ఈ సర్వీసులను హోంశాఖ అందించనుంది. విదేశాల నుంచి వచ్చే టూరిస్టుల రక్షణ కోసమే ఈ సిమ్ కార్డులు ఇవ్వనున్నట్లు కేంద్రహోంశాఖ అధికారులు చెప్పారు. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ బీఎస్ఎన్ఎల్ సౌజ్యనంతో ఉచితంగా ఈ ప్రి-లోడెడ్ సిమ్ కార్డులను అందించే కార్యక్రమాన్ని ఈ వారంలో ప్రారంభించనున్నారు. ఈ వీసా ద్వారా వచ్చే వారికి ఈ సౌకర్యం అందిస్తారు. దీనిని తొలుత పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేసి అనంతరం పూర్తిస్థాయిలో అమలు చేయనున్నారు. -
పిరికిపందలే ఇలా దాడి చేస్తారు: రాజ్ నాథ్
న్యూఢిల్లీ: నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంబడి దాడులకు తెగబడుతున్న పాకిస్తాన్ చర్యలపై కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ మండిపడ్డారు. గ్రేటర్ నోయిడాలో ఇండో టిబెటన్ బార్డర్ ఫోర్స్(ఐటీబీపీ) 55వ వ్యవస్థాపక దినోత్సవంలో శుక్రవారం ఆయన పాల్గొన్నారు. భారత్ ను దెబ్బతీసేందుకు పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఆశ్రయించడాన్ని పిరికిపందల చర్యగా ఆయన అభివర్ణించారు. దాయాది దేశం ఎప్పుడూ ఇదే తరహాలో ఉగ్రచర్యలకు పాల్పడుతుందని, పిరికివాళ్లే టెర్రరిజాన్ని ఆయుధంగా చేసుకుని దాడులు చేస్తారని అన్నారు. ధైర్యవంతులు ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడరని, పాక్ మాత్రం భారత్ ను ఏదో రకంగా దెబ్బతీయాలని విశ్వప్రయత్నాలు చేయడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ సక్సెస్ సాధిస్తున్న దేశాలలో భారత్ ఒకటని రాజ్ నాథ్ పేర్కొన్నారు. సెప్టెంబర్ 17న జమ్ముకశ్మీర్ ఉడీలో ఆర్మీ క్యాంపుపై ఉగ్రదాడి తర్వాత పాక్ తన దాడులను మరింతగా కొనసాగిస్తుందని చెప్పారు. పాక్ పై భారత ఆర్మీ మొదటగా కాల్పులు జరపదని, ఒకవేళ దాయాది దేశం దాడులకు పాల్పడితే మాత్రం ధీటుగా జవాబిస్తామని రాజ్ నాథ్ తెలిపారు. భారత్ అదుపులోకి తీసుకున్న పాకిస్తాన్ హైకమిషన్ ఉద్యోగి విషయంపై మీడియా ప్రశ్నించగా.. ప్రభుత్వం ఈ తప్పక చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు. జమ్ముకశ్మీర్ లోని పూంఛ్ జిల్లా బాలాకోట్ సెక్టార్ వద్ద శుక్రవారం వేకువజామున బీఎస్ఎఫ్ బలగాలు జరిపిన దాడిలో ఏకంగా 15 మంది పాక్ జవాన్లు హతమైన విషయం తెలిసిందే. -
'మానవత్వానికి అదే పెద్ద ప్రమాదం'
మనామా(బహ్రెయిన్): రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మానవత్వానికి ఉగ్రవాదం అతిపెద్ద ప్రమాదంగా మారిందని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. మంచి ఉగ్రవాదులు, చెడు ఉగ్రవాదులు అంటూ వేర్వేరుగా పరిగణించడానికి వీల్లేదని చెప్పారు. ప్రస్తుతం మూడు రోజుల పర్యటనలో భాగంగా బహ్రెయిన్‌లో ఉన్న ఆయన అక్కడ అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ రషీద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫాతో సోమవార భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు ద్వైపాక్షిక అంశాలు చర్చించారు. అనంతరం ఉగ్రవాదం అంశంపై అధికారిక ప్రకటనను ఆయన చేశారు. 'ఉగ్రవాదాన్ని సమగ్ర రీతితో ఎదుర్కోవాలి. పాక్షికంగా చర్యలు చేపట్టిన కొన్ని దేశాలు ఉగ్రవాదం విషయంలో ఇప్పటికే విఫలమయ్యాయి' అని రాజ్‌నాథ్ అన్నారు. బహ్రెయిన్‌తో వర్తక సంబంధాలు మరింత పెంపొందించుకునేందుకు భారత్ ఎంతో ఉత్సాహంతో ఉందని, ఇప్పటికే ఇరు దేశాల మధ్య జరుగుతున్న వ్యాపార లావాదేవీలు సంతృప్తికరంగా ఉన్నాయని, వర్తకం బిలియన్ డాలర్లకు చేరుకుందని తెలిపారు. -
టెర్రరిజాన్ని దేశ విధానంగా వాడుతున్నారు..
న్యూఢిల్లీః టెర్రరిజాన్ని వ్యతిరేకించడంలో ప్రపంచమంతా ఒక్కతాటిపైకి రావాలని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. కొన్ని దేశాలు టెర్రరిజాన్ని తమ దేశ విధానంగా ఉపయోగించుకుంటున్నాయని, అటువంటి దేశాలను ఒంటరిని చేయాలని సూచించారు. రాజధాని ఢిల్లీలో జరిగిన ఓ సమావేశంలో హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాకిస్థాన్ పై పరోక్ష విమర్శలు చేశారు. ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ (ఏఐసిసి) సమావేశానికి హాజరైన రాజ్ నాథ్ అక్కడి ప్రసంగంలో ప్రత్యేకించి దేశం పేరు చెప్పకపోయినప్పటికీ పాకిస్థాన్ ను ఉద్దేశించి విమర్శించారు. ఆలోచనల్లోనూ, సమస్యలతోనూ కొన్ని దేశాలతో విభేదాలు ఉండొచ్చని, అయితే వాటి పరిష్కారానికి తుపాకీలను ఎక్కు పెట్టడమే పరిష్కారం కాదని ఆయన ఉద్ఘాటించారు. టెర్రరిజాన్ని కూకటి వేళ్ళతో పెకలివేయాలన్న రాజ్ నాథ్.. ప్రస్తుతం ప్రపంచం మొత్తం తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటోందని అన్నారు. -
కశ్మీర్లో రాజ్‌నాథ్ రెండురోజుల పర్యటన
న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ రేపు జమ్మూకశ్మీర్‌లో పర్యటించనున్నారు. రెండురోజుల పాటు పర్యటనలో ఆయనతో పాటు హోంశాఖ కార్యదర్శి రాజీవ్ మహర్షి కూడా వెళ్లనున్నారు. కశ్మీర్ లోయలో తాజా పరిస్థితులుపై ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ, సీనియర్ మంత్రులతో హోంమంత్రి సమీక్షించనున్నారు. కాగా హోంమంత్రి జమ్ములో పర్యటించడం ఈ నెలలో ఇది రెండోసారి. మరోవైపు జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులను చక్కదిద్దాలంటూ విపక్ష నేతలు...రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో పాటు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన విషయం తెలిసిందే. సమస్య పరిష్కారానికి ప్రధాని ఈ సందర్భంగా విపక్ష నేతలకు హామీ ఇచ్చారు. అలాగే తాజా పరిస్థితులపై రాజ్‌నాథ్ సోమవారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కాగా ముజాహిదీన్ కమాండర్, యువ వేర్పాటువాద నేత బుర్హాన్ వాని జులై 9న భద్రతాదళాల ఎన్కౌంటర్లో చనిపోయిననాటి నుంచి ప్రారంభమైన ఉద్రిక్తత నేటికి 46 రోజులు దాటింది. ఇప్పటి వరకు జరిగిన అల్లర్లలో 68 మంది మరణించారు. వేలమంది గాయపడ్డారు. ఇప్పటికీ పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ, మరికొన్ని చోట్ల ఆంక్షలు కొనసాగుతున్నాయి. -
పాకిస్తాన్ పర్యటనకు రాజ్ నాథ్
ఢిల్లీ: కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఉగ్రవాదుల హెచ్చరికలు, నిరసనలను బేఖాతరు చేస్తూ పాకిస్తాన్ పర్యటనకు వెళ్లారు. బుధవారం సాయంత్రం ఇస్లామాబాద్ చేరుకున్నారు. పాకిస్తాన్లో జరిగే సార్క్ సమావేశాల్లో రాజ్‌నాథ్ పాల్గొంటారు. ఉగ్రవాద గ్రూపులకు పాకిస్తాన్ సాయం, భారత నకిలీ కరెన్సీ నియంత్రణ తదితర విషయాలను ఈ సదస్సులో లేవనెత్తనున్నారు. కాగా రాజ్ నాథ్ పాక్ పర్యటనను ఉగ్రవాద సంస్థలు హిజ్బుల్ ముజాహిద్దీన్, లష్కరే తోయిబా తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. పాక్‌లో రాజ్‌నాథ్ పర్యటిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించాయి. రాజ్ నాథ్ పర్యటనను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు చేపడుతామని జమాత్-ఉద్-దావా చిఫ్ హఫీజ్ సయీద్ హెచ్చరించాడు. ఈ నేపథ్యంలో రాజనాథ్ పర్యటన టెన్షన్‌గా మారింది. కాగా రాజ్‌నాథ్‌కు భద్రత కల్పించాల్సిన బాధ్యత పాక్ ప్రభుత్వానిదేనని హోంశాఖ సహాయమంత్రి కిరణ్ రిజిజు ఇటీవల రాజ్యసభలో చెప్పారు. -
మంత్రిగారికి చేదు అనుభవం
శ్రీనగర్: ఇప్పటికి 45కు చేరిన మరణాలు.. 2000 మందికిపైగా గాయాలు.. రెండు వారాలుగా కర్ఫ్యూ.. కనీస అవసరాలకు ఇబ్బందులు.. ఇదీ కశ్మీర్ లోయలో పరిస్థితి. వీటిని చక్కదిద్దే ప్రయత్నంలో భాగంగా రెండు రోజుల పర్యటన కోసం శనివరాం కశ్మీర్ కు వచ్చిన కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు చేదు అనుభవం ఎదురైంది. శనివారం మధ్యాహ్నం స్థానిక వ్యాపారులతో భేటీ కావాలనుకున్నారు. కానీ అందుకు వ్యాపారులు సుముఖత వ్యక్తం చేయలేదు. 'మేం ఆయనతో మాట్లాడబోమ'ని అధికారులకు తేల్చి చెప్పారు. దీంతో చేసేదేమి లేక రాజ్ నాథ్ మరో కార్యక్రమానికి వెళ్లిపోయారు. రెండు రోజుల కశ్మీర్ పర్యటనలో భాగంగా శనివారం లోయకు వెళ్లిన హోం మంత్రి పలువురు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి పారమిలటరీ,సీఆర్పీఎఫ్, ఐటీబీపీ డీజీలు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. శనివారం సాయంత్రం లేదా ఆదివారం ఉదయం జమ్ముకశ్మీర్ గవర్నర్ నరీంద్రనాథ్ వోరా, సీఎం మొహబూబా ముఫ్తీలతో భేటీ అనంతరం ఆదివారం మధ్యాహ్నం రాజ్ నాథ్ తిరిగి ఢిల్లీ బయలుదేరతారు. చొరబాటుదారుల కాల్పుల్లో జవాన్ మృతి ఉత్తర కశ్మీర్ లోని కుప్వారా జిల్లా లైన్ ఆఫ్ కంట్రోల్ (ఎల్ వోసీ) వద్ద చొరబాటుదారులకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక జవాన్ మరణించినట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి ముష్కరులు చొరబాటుకు యత్నించారని, దీనిని గమనించిన పహారా బృందం ఉగ్రవాదులపై కాల్పులు జరిపిందని, ఎదురుకాల్పుల్లో జవాన్ మృతి చెందాడని ఆర్మీ వర్గాలు ఒక ప్రకటన విడుదల చేశాయి. కాల్పులు జరిపిన ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతున్నట్లు పేర్కొన్నాయి. -
కశ్మీర్ అనిశ్చితికి పాక్ కారణం
* అక్కడి యువత దేశభక్తులే.. వారిని పాక్ రెచ్చగొడుతోంది * అన్ని పార్టీలూ సహకరించాలి: లోక్‌సభలో హోంమంత్రి రాజ్‌నాథ్ న్యూఢిల్లీ: కశ్మీర్లో రెండు వారాలుగా జరుగుతున్న అల్లర్లలో యువకులు చనిపోవటం, పలువురు గాయపడటం బాధించిందని.. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ లోక్‌సభలో అన్నారు. గురువారం.. కశ్మీర్‌పై చర్చ సందర్భంగా రాజ్‌నాథ్ మాట్లాడుతూ.. భారతదేశానికి వ్యతిరేకంగా కశ్మీర్ యువతను పాకిస్తాన్ రెచ్చగొడుతోందని.. అందులో సందేహమేమీ లేదన్నారు. భద్రతా బలగాలపై దాడు లు జరిగితే కొందరు సంబరాలు చేసుకోవటం దారుణమన్నారు. ‘కశ్మీరీ యువత దేశ భక్తులే. కానీ వారిని పక్కదారి పట్టించే ప్రయత్నం జరుగుతోంది. లోయలో అనిశ్చితిని పాకిస్తాన్ రెచ్చగొడుతోంది. ఇక్కడి ఉగ్రవాదానికి కూడా వారే కారణం. కశ్మీర్లో పరిస్థితి మెల్లమెల్లగా సర్దుకుంటోంది’ అని వెల్లడించారు. బుర్హాన్ వానీ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా పాక్ ‘చీకటి రోజు’ జరుపుకోవటంపై రాజ్‌నాథ్ తీవ్రంగా మండిపడ్డారు. ‘భారతదేశంలో విధ్వంసానికి, ఉగ్రవాద కార్యక్రమాలకు పాల్పడిన వ్యక్తిని కాల్చి చంపితే పాక్‌కు సంబంధమేంటి?’ అని రాజ్‌నాథ్ ఘాటుగా విమర్శించారు. కశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు అన్ని పార్టీలూ సహకరించాలని.. అందరూ కలిస్తేనే పరిస్థితి అదుపులోకి వస్తుందన్నారు. నిపుణులతో కమిటీ భద్రతా బలగాలు, పోలీసులు ఉపయోగిస్తున్న పెల్లెట్ గన్లపై పలువురు సభ్యులు సభలో ఆందోళన వ్యక్తం చేశారు. అయితే.. అంతపెద్ద సంఖ్యలో ఆందోళనకారులను అదుపు చేయటంలో.. చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయని.. అవి కూడా జరగకుండా జాగ్రత్తపడాలని భద్రతాబలగాలకు సూచించామని రాజ్‌నాథ్ తెలిపారు. ఈ పెల్లెట్ గన్లకు బదులుగా వినియోగించాల్సిన, తీసుకోవాల్సిన ప్రత్యామ్నాయాలపై.. ఓ నిపుణుల కమిటీని ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు. కశ్మీర్లో అఖిలపక్ష భేటీ లోయలో సాధారణ పరిస్థితులు నెలకొనేలా జాతీయస్థాయిలో చొరవ తీసుకోవాలని కశ్మీర్లో జరిగిన అఖిలపక్ష సమావేశంలో నిర్ణయించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం జాతీయస్థాయిలో రాజకీయ ఏకీకరణ జరగాలన్న ఏకాభిప్రాయానికి వచ్చారు. పీవోకేను ఖాళీ చేయండి: పాక్‌కు భారత్ హెచ్చరిక కశ్మీర్లో ఉగ్రవాదాన్ని రెచ్చగొడుతున్న పాకిస్తాన్.. ముందు పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)ను విడిచి వెళ్లాలని భారత విదేశాంగ శాఖ హెచ్చరించింది. భారత్‌కు వ్యతిరేకంగా పాక్‌లో ర్యాలీలు నిర్వహించటంపై తీవ్రంగా స్పందించింది. ‘ఐక్యరాజ్యసమితి ఉగ్రవాదులుగా గుర్తించిన వారు బహిరంగంగా పాక్‌లో ర్యాలీలు చేస్తున్నారు. ఇస్లామాబాద్‌లోని భారత హై కమిషనరేట్ ముట్టడిస్తామని బెదిరింపు కాల్స్ చేస్తున్నారు. అక్కడి భారతీయ అధికారుల భద్రత భరోసా పాక్‌దే’ అని పేర్కొంది. -
'అంతా ఉత్తిదే.. నేను సీఎం రేసులో లేను'
లక్నో: తాను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి రేసులో లేనని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు. తనను సీఎం అభ్యర్థిగా ప్రకటించి బీజేపీ ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారానికి వెళుతుందని వస్తున్న వార్తా కథనాలను ఆయన తప్పుబట్టారు. అవి పూర్తిగా అవాస్తవంతో కూడిన విషయాలు అని చెప్పారు. ముఖ్యమంత్రి రేసులో ఎవరు ఉన్నా తన మద్దతును పూర్తిస్థాయిలో వారికి ఇస్తానని, పార్టీ గెలుపునకు కృషి చేస్తానని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ జెండా ఎగరడం ఖాయం అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. యూపీలోని చార్ భాగ్ రైల్వే స్టేషన్లో ఉచిత వైఫై సేవలు ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన సీఎం అభ్యర్థిత్వంపై స్పష్టతను ఇచ్చారు. -
రాజ్‌నాథ్‌కు చిర్రెత్తిపోయింది
లక్నో: కేంద్ర హోమంత్రి రాజ్ నాథ్ సింగ్ తొలిసారి తన స్వీయ నియంత్రణను కోల్పోయారు. తాను మాట్లాడుతుండగా మధ్యలో కలగజేసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను మాట్లేడేసమయంలో నిశ్శబ్దంగా ఉండకుంటే అందరికీ చెంపదెబ్బలుపడతాయని అన్నారు. ఉత్తరప్రదేశ్ పర్యటనలో ఉన్న ఆయన మౌ వద్ద నియోన్ ఫెర్టిలైజర్‌కు సంబంధించి మాట్లాడుతున్న సమయంలో అక్కడికి చేరిన పెద్ద సమూహం పెద్దగా కేకలు పెడుతుండగా ఆయన తొలుత వారిని వారించే ప్రయత్నం చేశారు. అయితే, వారు వినకుండా అలాగే తమ గోలను కొనసాగించడంతో ఆవేశానికి లోనైన ఆయన 'నిశ్శబ్దంగా ఉండండి. లేదంటే మీ చెంపలు పగులుతాయ్' అని అన్నారు. ఇదే సమయంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సహాయం చేసేందుకైనా తాము సిద్ధమని అన్నారు. మథురలో ఘర్షణకు రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. వేల ఎకరాల్లో ప్రభుత్వ భూమి గుర్తు తెలియని వ్యక్తులు కబ్జా చేస్తున్నా ప్రభుత్వం వద్ద వివరాల్లేకుండా పోయాయని అని విమర్శించారు. -
'అలా ఇంకోసారి రిపీటయిందో.. బాగోదు!'
న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, హర్యానా ముఖ్యమంత్రి ఎంఎల్ ఖత్తర్‌కు ప్రధాని నరేంద్రమోదీ గట్టి హెచ్చరికలు జారీచేశారు. రిజర్వేషన్ల పేరిట కొద్దిరోజుల కిందట హర్యానాలో జాట్లు చేసిన నానారచ్చ మరోసారి జరగొద్దని, అలా జరిగితే మీదే బాధ్యత అని వారిద్దరికి గట్టిగా చెప్పినట్లు తెలిసింది. ఓవైపు రిజర్వేషన్ల అంశాన్ని తాము పరిశీలిస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ మరోసారి ఉద్యమానికి వారు సిద్ధమవుతున్న నేపథ్యంలో మోదీ కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఖత్తర్ తో భేటీ అయ్యారు. గతంలో జరిగిన దుర్ఘటనలు కూడా వారి ముందు మోదీ ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఏం చేసైనా గతంలో జరిగినట్లు జరగకుండా చూసుకోవాలని మాత్రం వారికి గట్టిగా చెప్పారు. -
త్వరలో రాష్ట్రపతి, కేంద్ర హోం మంత్రిని కలుస్తాం
జేఎన్‌యూ విద్యార్థి విభాగం ఉపాధ్యక్షురాలు షెహ్ల రషీద్ ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో నెలకొన్న పరిస్థితులపై రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలవనున్నట్లు ఆ వర్సిటీ విద్యార్థి విభాగం ఉపాధ్యక్షులు షెహ్ల రషీద్ షోరా పేర్కొన్నారు. నగరానికి వచ్చిన ఆమె ఆదివారం లామకాన్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. దాదాపు రెండు నెలలుగా వర్సిటీలో చేసుకుంటున్న పరిణామాలపై వారిపై మాట్లాడేందుకు వర్సిటీ విద్యార్థులతో కలిసి వెళ్తామని చెప్పారు. ఇప్పటికే హోంమంత్రితో సమావేశం కావాలని అనుమతి కోరినట్లు వెల్లడించారు. తనతోపాటు వర్సిటీ విద్యార్థులపై ఆర్ఎస్ఎస్ కుట్రపూరిత ప్రచారం చేస్తోంద ని ఆరోపించారు. ‘అఫ్జల్‌గురు ఉరితీత ఘటనపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అంబేద్కర్‌వాదులంతా ఉరిశిక్షను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అలాగే రాజీవ్ గాంధీ హత్య, మరే ఇతర వ్యక్తులపైనా అటువంటి అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి’ అని ఫిబ్రవరి 9 రాత్రి వర్సిటీలో ఏం జరిగిందని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు. -
రాహుల్.. పరిణతి ఏదీ?
న్యూఢిల్లీ: పార్లమెంట్లో రాహుల్ ప్రసంగంపై జైట్లీ స్పందిస్తూ.. ‘యువకుడి నుంచి మధ్యవయస్కుడిగా మారుతున్న సమయంలో వ్యక్తుల నుంచి కొంతపరిణతిని ఆశిస్తాం. కానీ రాహుల్ మాట్లాడుతుండగా విన్న ప్రతీసారీ ఆయన మానసిక పరిణితిపై నాకు అనుమానం వస్తుం టుంది’ అని వ్యంగ్యంగా ఫేస్బుక్లో వ్యాఖ్యానించారు. కాగా, నాగా శాంతి ఒప్పందం గురించి తనకు తెలియదంటూ పార్లమెంట్లో రాహుల్ చేసిన వ్యాఖ్యలను హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తోసిపుచ్చారు. నాగా ఒప్పందం సమయంలో తాను ఆ సంప్రదింపుల్లో క్రియాశీలంగా వ్యవహరించానని ట్వీటర్లో తెలిపారు. -
సేఫ్ జోన్!
ఏవోబీలో మావోలదే పైచేయి దండకారణ్యంలోకి అడుగుపెట్టని పోలీసులు వెలుపల కూంబింగ్కే పరిమితమవుతున్న బలగాలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన మావో అగ్రనేతలు మావోయిస్టులపై ఉమ్మడి పోరు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఘంటాపథంగా చెబుతోంది. అవసరమైతే అదనపు బలగాలను దించేందుకు సిద్ధంగా ఉన్నామంటోంది. అయితే ప్రభుత్వ వ్యూహాల కంటే ముందుగానే మావోయిస్టులు ప్రతివ్యూహాలు రచిస్తున్నారు. హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జిల్లా పర్యటనకు వస్తున్న నేపథ్యంలో ముందుగానే సేఫ్‌జోన్‌లోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం విశాఖ మన్యంలో తమ కార్యకలాపాలను కూడా తగ్గించుకున్నారు. ఏవోబీలో వారి ప్రాబ ల్యానికి అడ్డుకట్ట వేయడం అంత సులువుకాదని నిపుణులు చెబుతున్నారు. విశాఖపట్నం: కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు చేపడుతున్న ఉమ్మడి ఆపరేషన్‌ను ముందే పసిగట్టిన మావోయిస్టు అగ్రనేతలు ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆంధ్రా-ఒడిశా బో ర్డర్ (ఏవోబీ) ఇన్చార్జ్ చలపతి, మావోయిస్టు మొదటి కేంద్ర ప్రాంతీయ (సీఆర్సీ) కమాండర్ కుడుముల వెంకట్రావు అలియస్ రవి, మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు నంబల్ల కేశవరావు అలియస్ గంగన్నలతో పాటు దళం ముఖ్య సభ్యులు సరిత, ఆజాద్, ఆనంద్‌లతో సహా ఎవరి అలజడీ మన్యంలో కనిపించడం లేదు. ఏవోబీని విడదీయలేరు విశాఖలో కేంద్ర హోం మంత్రి సమావేశం ఉండటంతో రెండు నెలల ముందు నుంచే ప్రత్యేక బలగాలను దించి మన్యంలో కూంబింగ్ ప్రారంభించారు. అయితే అది మావోయిస్టులను పట్టుకునేందుకు మాత్రం కాదు.. వారిని అడవిలోకి పంపడమే దాని లక్ష్యం. ఏవోబీలో పోలీసులకే తెలియని ప్రాంతాల్లో మావోయిస్టులు తరదాచుకుంటున్నారు. ఇంతవరకు ఏ బలగాలూ ఆ ప్రదేశాల దరిదాపులకు వెళ్లింది లేదంటున్నారు. అలాంటి ప్రాంతాల నుంచి మావోయిస్టులను వెళ్లగొట్టాలంటే అది అసాధ్యమంటున్నారు. కాని ప్రభుత్వాలు మారినప్పుడల్లా మావోయిస్టులపై ఏదో విధంగా పోరాటం చేస్తున్నట్లు చూపించుకోవడానికే ప్రయత్నిస్తుంటాయని, రాజ్‌నాథ్ సమావేశం కూడా అలాంటిదేనని దళం భావిస్తున్నట్లు సమాచారం. అమలు జరిగేలోగా పుంజుకోనున్న బలం ఇటు రాష్ట్ర పోలీసు అధికారులు కూడా తాము కోరినట్లుగా అన్నీ సమకూర్చితే తప్ప మావోలను అణచివేయడం కష్టమని నివేదిక ఇచ్చారు. ఆర్థిక, మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన కేంద్రం ఈ నివేదికలోని అంశాలను ఎన్నింటిని ఆచరణలోకి తీసుకువస్తుందనే దానిపై పోలీసుల భవిష్యత్ ప్రణాళిక ఉండబోతోంది. ఇదంతా జరగడానికి ఏన్నేళ్లు పడుతుందో చెప్పలేం. ఈ లోగా సరిహద్దు రాష్ట్రాలైన ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి కేడర్‌ను రప్పించి ఉద్యమాన్ని బలోపేతం చేసుకోవాలని మావోయిస్టులు ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. -
ఏవోబీపైనే గురి
* ‘మావో’ల అణచివేతకు మరిన్ని బలగాలు * విశాఖలో కేంద్రహోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమీక్ష సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రా ఒడిశా సరిహద్దు(ఏఒబీ)లో మావోయిస్టు కార్యకలాపాల అణిచివేతపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టింది. 2014తో పోలిస్తే మావోయిస్టు కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయని స్పష్టంచేసింది. 2014లో 162 జిల్లాల్లో మావోల ప్రభావం ఉంటే.. 2015లో 141 జిల్లాలకు తగ్గిందని వెల్లడించింది. ఇందుకోసం కృషి చేసిన బలగాలను కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అభినందించారు. చత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, తదితర రాష్ట్రాల్లో మావోల అణిచివేతకు తీసుకుంటున్న చర్యలతో మావోలు ఏవోబీని షెల్టర్ జోన్‌గా ఎంచుకునే ప్రమాదం ఉందని, అందువల్ల ఏవోబీలో ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. మావోల అణిచివేతకు రాష్ర్టం విజ్ఞప్తి మేరకు ఏపీకి అదనంగా బీఎస్ఎఫ్ బెటాలియన్‌ను మంజూరు చేస్తున్నట్టు చెప్పారు. ఏపీలో శాంతిభద్రతలు, ఏవోబీలో మావోయిస్టుల కార్యకలాపాల అణిచివేతకు తీసుకోవాల్సిన చర్యలైపై రాష్ర్ట డిప్యూటీ సీఎం, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఇతర పోలీస్ ఉన్నతాధికారులతో గురువారం విశాఖ కలెక్టరేట్ మీటింగ్ హాలులో కేంద్ర హోంమంత్రి సమీక్షించారు. మావోల అణిచివేతకు పొరుగు రాష్ట్రాలతో కలిసి ఏపీ పోలీస్ యంత్రాంగం చేస్తున్న జాయింట్ ఆపరేషన్ మంచి ఫలితాలనిస్తోందని రాజ్‌నాథ్ ప్రశంసించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఐటీ ఆధారిత కమ్యూనికేషన్ల వ్యవస్థను అభివృద్ధి చేసుకోవాలని ఆయన సూచించారు. కట్టడికి ఉమ్మడి కార్యాచరణ మావోయిస్టులపై పోరుకు దండకారణ్య పరిధిలోని రాష్ట్రాల ఉమ్మడి కార్యాచరణ దిశగా కేంద్రం నిర్దిష్టమైన అడుగువేసింది. దండకారణ్య ప్రాంతంలో మావోయిస్టుల కట్టడికి ఉమ్మడి ఆపరేషన్లే మార్గమని స్పష్టం చేసింది. అందుకోసం కేంద్రీకృత వ్యవస్థ ఏర్పాటు తప్పనిసరి అని పరోక్షంగా తేల్చిచెప్పింది. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. దండకారణ్య ప్రాంతంలో మావోయిస్టుల కట్టడిపై హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నిర్దిష్టమైన ప్రణాళికను వివరించినట్లు సమాచారం. ధీమాగా ఉండటానికి కుదరదు: ఏపీలో మావోయిస్టు కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయని ధీమాగా ఉండటానికి వీల్లేదని రాజ్‌నాథ్ హెచ్చరిం చినట్లు సమాచారం. మావోలు ప్రతిపాదిస్తున్న రెడ్ కారిడార్‌లో ఏపీ కూడా ఉందన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. మావోల ప్రభావిత ప్రాం తాల్లో భద్రతా, అభివృద్ధి అంశాలను కేంద్రమే పర్యవేక్షిస్తుందని సమాచారం. -
మావోలపై సమరం
ప్రతిఘటనకు సిద్ధమవుతున్న పోలీసులు ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతున్న కేంద్రం తొలిసారిగా విశాఖలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమీక్ష విశాఖపట్నం: విశాఖ మన్యంలో మావోయిస్టులు బలపడుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పరిస్థితి తీవ్రతను గుర్తించిన నిఘా వర్గాలు, పోలీసు ఉన్నతాధికారులు తక్షణ చర్యలకు సిఫార్సు చేశారు. శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించారు. దీంతో కేంద్ర ప్రభుత్వం నేరుగా జోక్యం చేసుకుంది. మావోయిస్టుల కార్యకలాపాలను అణచి వేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చించేందుకు స్వయంగా కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విశాఖ వచ్చారు. మావోయిస్టుల ఉద్యమంపై పోలీసు ఉన్నతాధికారులతో గురువారం సమావేశమయ్యారు. తొలిసారిగా కేంద్ర మంత్రి రాష్ట్ర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించడం ద్వారా మావోలపై సమర శంఖం పూరించారు. భారీ మార్పులు : ఏపీ ఏజెన్సీలో 11 పోలీస్స్టేషన్ల నిర్మాణం పూర్తయింది, మరో మూడు పోలీస్ స్టేషన్ల నిర్మాణ దశలో ఉన్నాయి. మావోల అణిచివేతకు పోలీస్ ఫోర్స్‌ను పెంచాలని భావిస్తున్నారు. మావోల అణిచివేతకు పొరుగు రాష్ట్రాలతో కలిసి ఏపీ పోలీస్ యంత్రాంగం చేస్తున్న జాయింట్ ఆపరేషన్లను మరింతగా విస్తరించనున్నారు. ఆర్ఆర్పీ-2 ప్రాజెక్టు కింద 1200 కిలోమీటర్ల రహదారులు ఏజెన్సీలో నిర్మించనున్నట్టు రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఐటీ ఆధారిత కమ్యూనికేషన్ల వ్యవస్థను అభివృద్ధి చేసుకోవాలని ఆయన సూచించారు. నిజానికి ఇప్పటికే విశాఖ ఏజెన్సీలో 11 టవర్లు నిర్మాణం పూర్తయింది. ప్రత్యేకంగా బోర్డర్ సెక్యురిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) బెటాలియన్‌ను ఇచ్చేందుకు కూడా కేంద్రం సానుకూలంగా ఉంది. సబ్‌ప్లాన్ నిధులతో ఏజెన్సీ రహదారులను కూడా విస్తరించనున్నారు. అత్యాధునిక కమ్యూనికేషన్ వ్యవస్థను కేంద్రం అందించనుంది. విస్తరణకు మావోల యత్నం : ఆంధ్రా - ఒడిశా సరిహద్దు (ఏవోబీ) ప్రాంతం మావోయిస్టులకు సురక్షిత ప్రాంతంగా చెబుతుంటారు. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, తదితర ఈశాన్య రాష్ట్రాల్లో మావోల అణిచివేతకు కఠిన చర్యలు తీసుకుంటుండటంతో ఇప్పటికే షెల్టర్ జోన్‌గా ఉన్న ఏవోబీని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకోవాలని మావోయిస్టులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలను ఆసరాగా చేసుకుని గిరిజనులకు చేరువై ఉద్యమాన్ని బలోపేతం చేసుకోవాలని వ్యూహాలు రచిస్తున్నారు. ఈ నేపధ్యంలో మన్యంలో అలజడులకు రంగం సిద్ధమవుతోందని తెలుసుకున్న కేంద్రం ప్రతిఘటనకు పూనుకుంది. ఏవోబీ, ట్రై జంక్షన్లో బలోపేతం: ఏవోబీతో పాటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల కూడలి (ట్రై జంక్షన్)లో తమ కార్యకలాపాలను విస్తరించడానికి మావోయిస్టులు కొద్ది కాలంగా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా ఆయుధాలను, ఆయుధ తయారీ సామాగ్రిని మన్యంలో వ్యాపారాలు, కాంట్రాక్టు పనులు చేసే వారి నుంచి సమకూర్చుకుంటున్నారు. ఇన్నాళ్లూ బయట నుంచే మావోలకు ఆయుధ సామాగ్రి అందుతోందనుకున్న పోలీసులకు మన్యంలోనే అలాంటి ఏర్పాటు చేసుకున్నారనే విషయం తెలిసి ఆశ్చర్యపోయారు. మరోవైపు ఛత్తీస్‌గఢ్, ఒడిశా వంటి రాష్ట్రాల నుంచి మావోయిస్టులను రప్పించి కేడర్‌ను పెంచుకోవడంతోపాటు అగ్రనాయకత్వంలో మార్పులు చేస్తున్నారు. కేంద్ర కమిటీ సభ్యులు భద్రత విధానాల్లోనూ మార్పులు చేస్తున్నారు. విశాఖ మన్యంలో మావోయిస్టులు తిరుగులేని శక్తిగా ఎదగడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీంతో నిఘా వర్గాల హెచ్చరికతో కేంద్ర ప్రభుత్వం నేరుగా జోక్యం చేసుకుంది. -
‘అఫ్జల్’ సభకు సయీద్ మద్దతు
హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటన ♦ ఈ నిజాన్ని దేశం అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి ♦ ఆధారాలు చూపాలని విపక్షాల డిమాండ్ ♦ బీజేపీ నేతలతో ప్రధాని మోదీ భేటీ అలహాబాద్/న్యూఢిల్లీ: జేఎన్‌యూ వ్యవహారంపై రాజకీయ రచ్చ మరింత ముదిరింది. పార్లమెంట్‌పై దాడి కేసులో దోషి అఫ్జల్ గురు ఉరిశిక్షను వ్యతిరేకిస్తూ వర్సిటీలో నిర్వహించిన నిరసన కార్యక్రమానికి లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ చీఫ్ హఫీజ్ సయీద్ మద్దతు ఉందని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు. ‘ఆ కార్యక్రమానికి సయీద్ మద్దతు ఉంది. ఇది చాలా దురదృష్టకరం. ఈ నిజాన్ని దేశం అర్థం చేసుకోవాలి’ అని ఆయన ఆదివారం అలహాబాద్‌లో విలేకరులతో చెప్పారు. జేఎన్‌యూలో నిరసనను రాజకీయ ప్రయోజనాల కోణంలో చూడొద్దని పార్టీలకు హితవు పలికారు. అనంతరం జాతి సమగ్రత, సార్వభౌమాధికారం విషయంలో దేశంలోని అన్ని పార్టీలు, ప్రజలు ఏకతాటిపై నడవాలని ట్విటర్లో కోరారు. జాతి వ్యతిరేక శక్తులపై పోరాడేందుకు చేతులు కలపాలని పిలుపునిచ్చారు. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారిని ఉపేక్షించబోమని, అలాగే అమాయకులను ఎట్టి పరిస్థితుల్లో వేధించబోమని స్పష్టంచేశారు. మండిపడ్డ విపక్షాలు: రాజ్‌నాథ్ ప్రకటనపై విపక్షాలు మండిపడ్డాయి. ‘ఇది విద్యార్థులపై చాలా తీవ్ర ఆరోపణ. ఆయన తన ప్రకటనకు ఆధారాలను ప్రజల ముందు ఉంచాలి’ అని కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ నేత డి.రాజా డిమాండ్ చేశారు.‘సాక్షాత్తూ హోంమంత్రే ఈ తీవ్రమైన ఆరోపణ చేసినందున అందుకు తగ్గ సాక్ష్యాలను చూపాలి’ అని ఏచూరి అన్నారు. వివిధ సంస్థలు అందించిన సమాచారం మేరకే రాజ్‌నాథ్ ప్రకటన చేశారని హోం శాఖ తెలిపింది. జాతి వ్యతిరేక ముద్ర వేయొద్దు: జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్యను విడుదల చేయాలని ఉద్యమిస్తున్న విద్యార్థులకు అక్కడి అధ్యాపకులు మద్దతు పలికారు. వర్సిటీలో పోలీసు గస్తీ ఆపేయాలని కోరుతూ విద్యార్థులతో కలసి క్యాంపస్‌లో మానవహారం నిర్వహించారు. విద్యకు, ప్రజాస్వామిక సంస్కృతికి నిలయమైన తమ సంస్థకు జాతి వ్యతిరేకమని ముద్ర వేయొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘వర్సిటీ కమిటీ దర్యాప్తు పూర్తవకముందే క్యాంపస్‌లో పోలీసు చర్యలకు వర్సిటీ అధికారులు అనుమతి ఇవ్వడం తప్పు’ అని జేఎన్‌యూటీఏ అధ్యక్షుడు విక్రమాదిత్య ఆరోపించారు. అఫ్జల్ కార్యక్రమాన్ని నిర్వహించింది కన్హయ్య కాదని, నిర్వాహకులకు, ఏబీవీపీకి మధ్య వాగ్వాదం జరగడంతో జోక్యం మాత్రమే చేసుకున్నాడని అన్నారు. వర్సిటీ అంతర్గత యంత్రాంగం దెబ్బతిందని అధ్యాపకులు అన్నారు. కన్హయ్య విడుదల కోసం సోమవారం నుంచి బంద్ చేపట్టాలని విద్యార్థులు నిర్ణయించారు.వర్సిటీలో జరిగిన అఫ్జల్ గురు సంస్మరణ సమావేశంలో తాము భారత్ వ్యతిరేక నినాదాలు చేశామన్న ఆరోపణలను ఏబీవీపీ తోసిపుచ్చింది. అది మార్పులు చేసిన వీడియో అంటూ పోలీసుకు ఫిర్యాదు చేసింది. గందరగోళంలో కాంగ్రెస్: బీజేపీ గందరగోళంలో, ఆందోళనతో ఉన్న కాంగ్రెస్.. ప్రభుత్వాన్ని లక్ష్యం చేసుకోవడానికి జాతివ్యతిరేక శక్తుల వైపు నిలుస్తోందని బీజేపీ జాతీయ కార్యదర్శి శ్రీకాంత్ ఆరోపించారు. మోదీ ప్రభుత్వానికి ఉన్న ప్రజాదరణను కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోందని అన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ అంటే దేశ ఐక్యతను దెబ్బతీయడం కాదని నటుడు అనుపమ్ ఖేర్ అన్నారు. పార్టీ నేతలతో మోదీ భేటీ: జేఎన్‌యూ వివాదం నేపథ్యంలో ఆదివారం ప్రధాని ఆదివారం బీజేపీ అగ్రనేతలతో భేటీ అయ్యారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితిని సమీక్షించడానికి పార్టీ చీఫ్ అమిత్ షా, మంత్రులు రాజ్‌నాథ్, జైట్లీ, సుష్మాలు ఆయనతో సమావేశమయ్యారు. జేఎన్‌యూ వివాదంతో ఈ భేటీకి సంబంధం లేదని, త్వరలో జరిగే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు వంటివి ప్రస్తావనకు వచ్చాయన్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్, లెఫ్ట్‌లు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న నేపథ్యంలో జేఎన్‌యూ అంశం చర్చకు ఉండొచ్చన్నారు. కార్యక్రమానికి మద్దతుగా సయీద్ ట్వీట్లు! అఫ్జల్ గురు ఉరికి సంబంధించి ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో జరుగుతున్న ఆందోళనకు మద్దతు తెలపాలంటూ పాక్ ప్రజలను కోరుతూ సయీద్ ట్విటర్లో కోరినట్టు వార్తలొచ్చాయి. అయితే ఆ ట్విటర్ ఖాతా లష్కరే నిర్వహిస్తున్నదా? కాదా? అన్న అంశంపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సయీద్ ట్వీట్ వెలుగుచూసిన వెంటనే వారు అప్రమత్తం అయ్యారు. జాతి వ్యతిరేక శక్తుల మాయలో పడొద్దని విద్యార్థులను కోరుతూ పోలీసు కమిషనర్ బస్సీ ట్విటర్లో పేర్కొన్నారు. కాగా, మంగళవారం జరిగిన అఫ్జల్ కార్యక్రమానికి సంబంధించి డిబార్ అయిన జేఎన్‌యూ విద్యార్థి సంఘం(జేఎన్‌యూఎస్‌యూ) అధ్యక్షుడు కన్హయ్య కుమార్ సహా 8 మందిలో కన్హయ్యను మినహా ఏడుగురు విద్యార్థులను వర్సిటీ దర్యాప్తు కమిటీ ముందుకు హాజరు కావాలని ఆదివారం ఆదేశించారు. ఆ కార్యక్రమంలో భారత వ్యతిరేక నినాదాలు చేసిన 13 మంది విద్యార్థుల ఆచూకీ తెలుసుకోవడానికి పోలీసులు ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు. అరెస్టయిన కన్హయ్యపై నమోదైన దేశద్రోహం కేసును ప్రత్యేక విభాగానికి బదిలీ చేయాల దర్యాప్తు అధికారులు ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులను కోరారు. 40 సెంట్రల్ వర్సిటీల మద్దతు కన్హయ్య అరెస్టును నిరసిస్తున్న జేఎన్‌యూ విద్యార్థులు, అధ్యాపకులకు పుణె ఫిల్మ్ ఇనిస్టిట్యూట్, హైదరాబాద్ వర్సిటీ సహా 40 సెంట్రల్ వర్సిటీల విద్యార్థులు, అధ్యాపకులు మద్దతు ప్రకటించారు. ప్రభుత్వంపై విద్యార్థుల నిరసన రాజ్యాంగ విరుద్ధం, దేశ ద్రోహం కాదని కేంద్ర వర్సిటీ అధ్యాపకుల సమాఖ్య అధ్యక్షురాలు నందితా నారాయణ్ అన్నారు.చట్టం తన పని తాను చేసుకోనివ్వాలని, వర్సిటీలో ప్రశాంత వాతావరణం ఉండేలా చూడాలని జేఎన్‌యూ వీసీ జగదీశ్ విద్యార్థులకు, అధ్యాపకులకు విజ్ఞప్తి చేశారు. 18న జరిగే వైస్ చాన్స్లర్ల సమావేశంలో.. వర్సిటీలో సమానత్వ సాధన, ఎస్సీ, ఎస్టీల సమస్యలకు సంబంధించిన 2012నాటి యూజీసీ నిబంధనలు చర్చకు వచ్చే అవకాశముంది. ‘నా బిడ్డను ఉగ్రవాది అనకండి’ ‘దయచేసి.. నా కొడుకును ఉగ్రవాది అనకండి’ అని కన్హయ్య తల్లి మీనాదేవి ఆవేదనతో అన్నారు. బిహార్‌లోని బెగుసరాయ్ జిల్లాలో ఉంటున్న ఆమె.. కన్హయ్య అరెస్ట్ వార్తను పొరుగింట్లో టీవీలో చూసి ఈవిధంగా స్పందించారు. ‘అతడు మమ్మల్ని(తల్లిదండ్రులను) ఏనాడూ అగౌరవించలేదు. ఇక దేశాన్నెలా అగౌరవిస్తాడు? హిందుత్వ రాజకీయాలను వ్యతిరేకించినందుకు అతన్ని వేధిస్తున్నారు’ అని పీటీఐతో చెప్పారు. అంగన్వాడీ కార్యకర్తగా పని చేస్తున్న మీనాకు నెలకు రూ. 3,500 జీతం వస్తోంది. తను, తన పెద్దకొడుకు సంపాదనే కుటుంబానికి ఆధారమని, తన భర్త ఏడేళ్లుగా పక్షవాతంతో బాధపడుతున్నారని ఆమె చెప్పింది. -
'ఇప్పటికైతే అనుమానం లేదు.. దర్యాప్తు పూర్తికాని'
న్యూఢిల్లీ: పఠాన్ కోట్ పై దాడికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి నేరస్తులను కఠినంగా శిక్షిస్తామని పాకిస్థాన్ హామీ ఇచ్చిందని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ మరోసారి స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌ను దర్యాప్తు విషయంలో ఇంకా అనుమానించాల్సిన అవసరం లేదని తాను అనుకుంటున్నానని చెప్పారు. వారు దర్యాప్తు పూర్తి చేసేవరకు ఎదురుచూస్తే బాగుంటుందని అన్నారు. పఠాన్‌కోట్ దాడికి సంబంధించి కొన్ని ప్రాథమిక ఆధారాలను, వివరణలను పాకిస్థాన్ భారత్‌కు ఇచ్చిన సందర్భంగా రాజ్‌నాథ్ ఇలా స్పందించారు. దాడికి పాల్పడిన ఉగ్రవాదుల నుంచి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న భారత్ వాటి వివరాలు తెలియజేయాలని పాకిస్థాన్‌ను కోరిన విషయం తెలిసిందే. అయితే, వాటిని పరిశీలించిన పాక్ అవి తమ దేశంలో రిజిస్ట్రేషన్ అయిన సిమ్ కార్డులు కాదని చెప్పడంతోపాటు, ఆ దేశ దర్యాప్తు అధికారులు పఠాన్ కోట్ దాడికి సంబంధించి ప్రాథమికంగా సేకరించిన ఆధారాలను భారత్ కు సోమవారం అందజేసిన విషయం తెలిసిందే. -
జవాన్లే చనిపోతున్నారేం?
రాజ్‌నాథ్‌ను నిలదీసిన విమాన ప్రమాద మృతుల బంధువులు న్యూఢిల్లీ: పాత విమానాలు వాడుతూ జవాన్ల ప్రాణాలను ఎందుకు ప్రమాదంలో పెడుతున్నారని విమానం ప్రమాదంలో చనిపోయిన బీఎస్ఎఫ్ జవాన్ల బంధువులు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను నిలదీశారు. మృతులకు బుధవారం రాజ్‌నాథ్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మృతుల బంధువులు మంత్రిపై మండిపడ్డారు. మంగళవారం ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన నిమిషాల్లోనే బీఎస్ఎఫ్ విమానం కుప్పకూలడం, 10 మంది చనిపోవడం తెలిసిందే. ‘ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోండి. సమాధానం చెప్పండి. ఈ ప్రమాదాల్లో జవాన్లే ఎందుకు మరణిస్తున్నారు. వీఐపీలకు ఎందుకు అలా జరగడం లేదు’ అని మరణించిన వారిలో ఒకరైన సబ్ ఇన్స్పెక్టర్ రబీందర్ సింగ్ కూతురు రాజ్‌నాథ్, బీఎస్ఎఫ్ చీఫ్ డీకే పాఠక్‌లను నిలదీశారు. రాజ్‌నాథ్ ఆమెను ఓదార్చారు. ఈ అంశాన్ని కచ్చితంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కూలిన విమానంలో ఎలాంటి లోపాలూ లేవని, అది 20 ఏళ్ల నాటిదని, అయితే దానికి 40 నుంచి 45 ఏళ్ల జీవిత కాలం ఉందని పాఠక్ తెలిపారు. అయినా ఈ ఘటనపై డెరైక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్‌విచారణ చేపడుతుందని పేర్కొన్నారు. పైగా విమానంలో తీసుకెళ్లే బరువు కూడా ఎక్కువగా లేదని, విమానం సామర్థ్యానికి తగ్గట్టే బరువు తీసుకెళ్లారనిస్పష్టం చేశారు. హోం శాఖ సహాయ మంత్రి కిరెన్ రిజిజు మాట్లాడుతూ.. ‘విమానం పాతది అనడం సరికాదు. అందులో నేనూ గతంలో ప్రయాణించాను. కచ్చితంగా అది సామర్థ్యం ఉన్నదే. అయితే ఎందుకు అలా కుప్పకూలిందో సరిగా తెలియడం లేదు’ అని పేర్కొన్నారు. -
రాజ్ నాథ్‌ను నిలదీసిన యువతి
-
రాజ్ నాథ్‌ను నిలదీసిన యువతి
న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ను ఓ యువతి నిలదీసింది. భోరుమని ఏడుస్తూ పలుమార్లు ప్రశ్నించింది. ఎప్పుడు తామే ఏడుస్తూ ఉండాలా? తమకే ఎందుకు ఈ పరిస్థితి అంటూ విలపించింది. ఢిల్లీలోని విమానాశ్రయానికి సమీపంలో బీఎస్ఎఫ్ కు చెందిన సూపర్ కింగ్ చిన్న విమానం కూలిపోయి ముగ్గురు బీఎస్ఎఫ్ అధికారులతో సహా పదిమంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. బుధవారం వారి అంత్యక్రియలు సందర్భంగా సఫ్దార్ జంగ్ విమానాశ్రయానికి వచ్చి చనిపోయిన జవాన్లకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చనిపోయినవారిలో కో పైలెట్ శివరెయిన్ కుటుంబానికి చెందిన ఓ యువతి నేరుగా రాజ్ నాథ్పైకి ప్రశ్నలు సంధించింది. 'సర్, ఎప్పుడూ సైనికుల కుటుంబాలే ఎందుకు ఏడవాలి? చెప్పండి సర్ ఇలా ఎందుకు? వీఐపీల విమానాల్లో ఎందుకు ఇలా జరగదు? సైనికులకు ఎందుకు పాత విమానాలు ఇస్తున్నారు? నిన్న కూలిపోయిన విమానం చాలా పాతది. అలా ఇవ్వడం సరికాదు. మీరు సమాధానం చెప్పాలి. నాకు సమాధానం కావాలి' అంటూ వెక్కివెక్కి ఏడుస్తూ ప్రశ్నించింది. ఈలోగా ఆమెను అక్కడ ఉన్న కొందరు వెనక్కి లాగారు. అనంతరం చనిపోయిన కో పైలెట్ భార్య మాట్లాడుతూ బీఎస్ఎఫ్ విభాగానికి కొత్త విమానాలు కావాల్సిన అవసరం ఉందని తన భర్త చెప్పేవారని, ఈ విమానం ఎంతోకాలం నుంచి వాడుతున్నామని చెప్పారని అన్నారు. అందుకే గత ఏడాది ఆ విమానం వాడేందుకు ఆయన పలుమార్లు నిరాకరించారని చెప్పారు. ఈ విమానం పాతది అవడం వల్లే సమస్య తలెత్తి అది కూలిపోయినట్లు తాను రాజ్ నాథ్ సింగ్ కు చెప్పినట్లు కోపైలెట్ రాజెష్ శివరాన్ మామ ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
'జయగారు.. మీకు సహకరిస్తాం'
చెన్నై: వరదల బారిన పడిన తమిళనాడుకు అన్ని విధాలా సహకరిస్తామని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్‌సింగ్ అన్నారు. ఈమేరకు ఆయన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు హామీ ఇచ్చారు. గత పది రోజులకిందట బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రోవాన్ తుఫానుగా మారి తమిళనాడు రాష్ట్రంపైన, కొన్ని ఆంధ్రప్రదేశ్ జిల్లాలపైన వర్షాలు విరుచుకుపడిన విషయం తెలిసిందే. దీనికారణంగా భారీ స్థాయిలో ఆస్తి, ప్రాణనష్టం చోటుచేసుకోగా పలు లోతట్టు ప్రాంతాలు ఇప్పటికీ జలమయమై ఉన్నాయి. చెన్నై నగరంలో వీధుల్లో చిన్నపడవల సహాయంతో తిరుగుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే జలదిగ్బంధమైన తమ ప్రాంతాలను ఆదుకోవాలని, భారీ స్థాయిలో నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి జయలలిత కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో రాజ్ నాథ్ అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. -
గుర్దాస్పూర్ దాడి పాక్ పనే
పంజాబ్‌లోని గుర్దాస్పూర్ జిల్లా దీనానగర్ పోలీసు స్టేషన్‌పై జరిగిన ఉగ్రదాడి పాకిస్థాన్ పనేనని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఈ దాడి విషయమై ఆయన రాజ్యసభలో ఓ ప్రకటన చేశారు. పాక్ నుంచి మన దేశంలోకి చొరబడిన ముగ్గురు ఉగ్రవాదులు దాడి చేయడానికే వచ్చారని, సరిహద్దు ఉగ్రవాదాన్ని అణిచేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన అన్నారు. మన దేశ శత్రువులు భారతదేశ సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేస్తున్నారని, పౌరుల భద్రత విషయంలో ఏమాత్రం రాజీపడేది లేదని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. అయితే.. హోం మంత్రి ఈ ప్రకటన చేస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ సభ్యులు తీవ్రస్థాయిలో గందరగోళం సృష్టించారు. ఇది రాజకీయాలకు సమయం కాదని, ఉగ్రవాద దాడిపై కేంద్ర హోం మంత్రి ప్రకటన చేస్తున్నారని డిప్యూటీ ఛైర్మన్ పీజే కురియన్ పదేపదే చెప్పినా ప్రయోజనం కనపడలేదు. ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూనే ఉన్నారు. -
సవాల్ చేస్తే గట్టి జవాబిస్తాం
హోం మంత్రి రాజ్‌నాథ్ హెచ్చరిక నీముచ్(మధ్యప్రదేశ్): పాకిస్తాన్‌తో భారత్ సత్సంబంధాలను కోరుకుంటోందని, అయితే దేశ ప్రతిష్టకు సవాల్ విసిరితే గట్టి జవాబిస్తామని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోమవారం హెచ్చరించారు. గురుదాస్‌పూర్ ఘటన నేపథ్యంలో ఆయన స్పందించారు. ‘పొరుగు దేశంతో మేం సత్సంబంధాలను కోరుకుంటూ ఉంటే సీమాంతర ఉగ్రవాద ఘటనలు ఎందుకు పదేపదే జరుగుతున్నాయో నాకు అర్థం కావడం లేదు. మేం శాంతిని కోరుకుంటున్నామని, అయితే అందుకు దేశ ప్రతిష్టను పణంగా పెట్టబోమని పొరుగు దేశానికి చెప్పదల్చుకున్నా’ అని ఆయన అన్నారు. సీఆర్పీఎఫ్ 76వ వ్యవస్థాపక దినం సందర్భంగా ఆ బలగం ఏర్పాటైన నీముచ్‌లో జరిగిన కార్యక్రమానికి రాజ్‌నాథ్ హాజరయ్యారు. గురుదాస్‌పూర్ ఘటన వివరాలు తెసుకున్నానని, పంజాబ్ సీఎం, జాతీయ భద్రతా సలహాదారు, హోం శాఖ కార్యదర్శితో మాట్లాడానని చెప్పారు. ఈ ఉదంతంపై మంగళవారం పార్లమెంట్లో ప్రకటన చేస్తానన్నారు. కాగా, ఉగ్రవాదం జాతీయ సమస్య అని, దాన్ని జాతీయ విధానాలతోనే అరికట్టాలని పంజాబ్ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ పేర్కొన్నారు. పంజాబ్‌లో ఉగ్రవాద దాడి జరుగుతుందని సమాచారమొస్తే సరిహద్దును మూసేయాల్సి బాధ్యత కేంద్రానిదేనన్నారు. ఆయన అమృత్‌సర్‌లోని గురునానక్ ఆస్పత్రికివెళ్లి దాడి క్షతగాత్రులను పరామర్శించారు. -
వారి తీరు దురదృష్టకరం
న్యూఢిల్లీ: పార్లమెంటులో ప్రతిపక్షాల ప్రవర్తన తీరు దురదృష్టకరమని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. లలిత్ మోదీ వ్యవహారంపై విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ పార్లమెంటులో ప్రకటన చేస్తారని చెప్పిన కూడా వారు వినకుండా సభా కార్యక్రమాలు అడ్డుకుంటున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవాలనీ సుష్మా చెప్తూనే ఉన్నారని, దానికి సంబంధించే ఓ స్పష్టమైన వివరణ ఇస్తానని చెప్తున్నా వినకుండా విపక్షాలు ప్రవర్తిస్తున్న తీరు నిజంగా దురదృష్టమే అని పార్లమెంటు వెలుపల విలేకరులతో చెప్పారు. మరోపక్క, కాంగ్రెస్ ఎంపీ జ్యోతిరాధిత్య సిందియా మాట్లాడుతూ తమ పార్టీ ఇతర పార్టీలైన తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీవంటివన్నీ కూడా లలిత్ మోదీ వ్యవహారంలో అవినీతికి పాల్పడిన మంత్రులు ఇద్దరు ముఖ్యమంత్రులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం తప్ప తాము ఇంకే కోరడం లేదని అన్నారు. మొత్తం విపక్షమంతా కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా కోరుతున్నాయని అన్నారు. -
విచారణ కేంద్రం పరిధిలో లేదు
‘శేషాచలం’పై హోం మంత్రి రాజ్‌నాథ్ సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిఫార్సు లేకుండా శేషాచలం ఎన్‌కౌంటర్‌పై సీబీఐ విచారణ సాధ్యం కాదని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. కేంద్రం సీబీఐ విచారణకు ఆదేశిస్తే రాష్ట్రాల మధ్య సంబంధాలు ఏమవుతాయో మీకు తెలుసని విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గేనుద్దేశించి వ్యాఖ్యానించారు. శేషాచలం ఎన్కౌంటర్లో 20 మంది ఆదివాసీలు హతమైన ఘటనపై ఎంపీలు మల్లిఖార్జున్ ఖర్గే, ములాయం సింగ్ యాదవ్, తంబిదొరై లోక్‌సభలో లేవనెత్తారు. దీనిపై మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘ ఏపీలో జరిగిన ఎన్కౌంటర్లో 20 మంది చనిపోయిన ఘటనపై ములాయం చర్చించారు. ఇటీవల ఈ అంశాన్ని సభలో లేవనెత్తగా పూర్తి వివరాలు తెలుసుకుని సభకు తెలియచేస్తానని హామీ ఇచ్చాను. ఎన్‌కౌంటర్‌పై రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక తెప్పించుకున్నాను. దర్యాప్తు కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. అక్కడి కోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం నమోదైంది. ఈ కేసులో ఇంకా నేనేమి చేయాలి? ఏం చేసినా రాజ్యాంగ నిబంధనల ప్రకారం జరగాలి. నేను ఏం చేయాలో మీరే చెప్పండి. మీరు చెప్పినట్టే నేను చేస్తాను’’ అని వారినుద్దేశించి అన్నారు. విపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే జోక్యం చేసుకుని సీబీఐ దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. ‘సీబీఐ విచారణకు ఎలా ఆదేశించాలి? అలా చేయలేం’ అని రాజ్‌నాథ్ బదులిచ్చారు. తప్పు చేసినట్లు రుజువైతే అది ఎంత పెద్ద సంస్థ అయినా ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించేది లేదని స్పష్టం చేశారు. ఏం చర్యలు తీసుకున్నారు? మరోసారి కేంద్రాన్ని ప్రశ్నించిన లోక్‌సభ ఉప సభాపతి సాక్షి, న్యూఢిల్లీ: శేషాచలం ఎన్కౌంటర్లో 20 మంది గిరిజనులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పొట్టనపెట్టుకున్న ఘనటనకు సంబధించి ఇప్పటి వరకు ఏం చర్యలు తీసుకున్నారని లోక్‌సభ ఉప సభాపతి డాక్టర్ తంబిదురై కేంద్రాన్ని ప్రశ్నించారు. మంగళవారం ఆయన హోం శాఖ పద్దులపై ప్రసంగిస్తున్నప్పుడు ఈ అంశాన్ని ప్రస్తావించారు. ‘జాతీయ మానవ హక్కుల కమిషన్ ఈ ఘటనపై విచారణ చేపట్టింది. అయితే కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏంటి? క్రితంసారి హోం మంత్రి ప్రకటన చేసినప్పుడు వివరాలు తెప్పించుకుంటామన్నారు. ఆ సమాచారం సభతో పంచుకుంటారా? ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది?. 20 మంది గిరిజనులను చంపేశారు. దీనిపై హోం మంత్రి సమాధానం చెప్పాలి’ అని తంబిదురై డిమాండ్ చేశారు. -
హైదరాబాద్‌లో నిఘా పెంచాలి...
రాజ్‌నాథ్‌ను కోరిన దత్తాత్రేయ న్యూఢిల్లీ: ఉగ్రవాద సంస్థలు, సంఘ వ్యతిరేక శక్తులకు అడ్డాగా మారిన హైదరాబాద్‌లో నిఘాను పెంచాలని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు విజ్ఞప్తి చేశారు. ఉగ్రవాదులకు సహకరించే రాజకీయ పార్టీలు, సంస్థలపై నిఘా పెంచి, కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు కేంద్ర జలసంఘం సలహాదారులు శ్రీరాం వెధిరె, బీజేపీ నేత కె.దిలీప్ కుమార్‌తో కలిసి దత్తాత్రేయ రాజ్‌నాథ్‌కు వినతి పత్రం అందచేశారు. ఐఐఎం ఏర్పాటు చేయాలి..: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) సంస్థను హైదరాబాద్‌లో ఏర్పాటుచేయాలని దత్తాత్రేయ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి స్మృతీ ఇరానీని కోరారు. రాష్ట్రంలో ఒక్క మహిళా యూనివర్సిటీ కూడా లేదని, ఉస్మానియా మహిళా కళాశాలను విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చేయాలని మంగళవారం ఆమెను కలిసి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో అన్ని మండల కేంద్రాల్లో రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ ద్వారా ఆంగ్ల మాధ్యమిక పాఠశాలలు ఏర్పరచాలని విన్నవించారు. -
23 నుంచి రాజ్యసభ భేటీలు
ఏప్రిల్ 20 నుంచి లోక్‌సభ సమావేశాలు న్యూఢిల్లీ: రాజ్యసభ మలిదశ బడ్జెట్ సమావేశాలు ఏప్రిల్ 23 నుంచి ప్రారంభం కానున్నాయి. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అధ్యక్షతన సమావేశమైన పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ మంగళవారం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ‘రాజ్యసభ 234వ సమావేశాలు(బడ్జెట్ సమావేశాల మొదటి భాగం) మార్చి 28, 2015న ప్రొరోగ్ అయ్యాయి. పెద్దల సభ 235వ సమావేశం ఏప్రిల్ 23న మొదలవుతుంది. లోక్‌సభ ఏప్రిల్ 20న ప్రారంభమై, మే 8తో ముగుస్తుంది. రాజ్యసభ మే 13 వరకు కొనసాగుతుంది’ అని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వశాఖ వర్గాలు వెల్లడించాయి. లోక్‌సభతో పాటు ఏప్రిల్ 20న రాజ్యసభను సమావేశపరచటానికి ప్రభుత్వానికి ఇబ్బంది లేనప్పటికీ, రాజ్యసభ నియమావళిలోని 39వ నిబంధన ప్రకారం వివిధ అంశాలపై నోటీసులు ఇవ్వటానికి సభ్యులకు 15 రోజుల సమయమివ్వాల్సి ఉన్నందున ఏప్రిల్ 23నుంచి పెద్దలసభ సమావేశాలను మొదలుపెట్టాలని నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మెజారిటీ లేకపోవటం వల్ల భూసేకరణ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టడానికి సాహసించలేకపోయిన ఎన్డీఏ సర్కారు, దానికి సంబంధించిన ఆర్డినెన్సును రెండోసారి జారీ చేసేందుకు పెద్దల సభను ప్రొరోగ్ చేసిన సంగతి తెలిసిందే. -
ఎంపీ మనోజ్‌తివారీకి బెదిరింపు లేఖ
సాక్షి, న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీ ఎంపీ, ప్రముఖ భోజ్‌పురి నటుడు మనోజ్‌తివారీకి... ప్రాణాలు తీస్తామంటూ ఓ బెదిరింపు లేఖ వచ్చింది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీపై చేసిన వ్యాఖ్యల వల్ల తనకు ఈ బెదిరింపు లేఖ వచ్చిందని మనోజ్ తివారీ చెప్పారు. ఈ విషయాన్ని హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ దృష్టికి తీసుకువెళ్లినట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం తాను వారణాసిలో ఉన్నానని, బుధవారం ఢిల్లీకి వచ్చిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. కాగా, రాహుల్‌గాంధీ సెలవులో వె ళ్లడంపై మనోజ్ తివారీ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ‘రాహుల్ గాంధీ అవివాహితుడు. ఆయన్ని బ్యాంకాక్, పటాయాలో విహరించనివ్వండి. ఆయన గురించి ఆందోళన చెందకండి’ అని మనోజ్ తివారీ వ్యాఖ్యానించారు. దీంతో ఢిల్లీలోని తన నివాసానికి బెదిరింపు లేఖ వచ్చినట్లు మనోజ్ తివారీ చెప్పారు. రోడ్డు యాక్సిడెంట్ చేస్తామని బెదిరించినట్లు ఆయన పేర్కొన్నారు. ‘ఎవరి గురించైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు. రాహుల్ గాంధీ గురించి మాట్లాడటం సరికాదు. ప్రాణాలు పోగొట్టుకుంటావు’ అని లేఖలో హెచ్చరించారని ఎంపీ తెలిపారు. -
ఉగ్రవాదాన్ని పోషించడాన్ని పాక్ ఆపేయాలి: రాజ్‌నాథ్
జైపూర్: పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పోషించడం ఆపినప్పుడే దక్షిణాసియాలో పరిస్థితులు మెరుగుపడతాయని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పేర్కొన్నారు. భారత్‌పై పరోక్ష యుద్ధం కోసం ఆ దేశం ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం మానుకోవాలని విజ్ఞప్తి చేశారు. గురువారం జైపూర్‌లో అంతర్జాతీయ ఉగ్రవాద వ్యతిరేక సదస్సును రాజ్‌నాథ్‌సింగ్ ప్రారంభించారు. ఇండియా ఫౌండేషన్, సర్దార్ పటేల్ పోలీస్ సెక్యూరిటీ యూనివర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో ఉగ్రవాదం, అందుకు సోషల్ మీడియా వినియోగం, సైబర్ దాడులు, చొరబాట్లు, నకిలీ కరెన్సీ వంటి అంశాలపై చర్చించనున్నారు. దీనిని ప్రారంభించిన అనంతరం రాజ్‌నాథ్ ప్రసంగించారు. మంచి ఉగ్రవాదులు, చెడు ఉగ్రవాదులంటూ ఉండరని ఉగ్రవాదులెవరైనా అందరికీ ప్రమాదకరమేనన్న విషయాన్ని పాక్ గుర్తించాలని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ‘‘మన దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు మూలం అంతా సరిహద్దుల ఆవలే ఉంది. పాకిస్తాన్ ఐఎస్ఐ, సైన్యం ఉగ్రవాదులకు తోడ్పడడం మానుకుంటే దక్షిణాసియా ప్రాంతంలో భద్రతా పరిస్థితులు బాగా మెరుగుపడతాయి. ఉగ్రవాదులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొంటూ విచ్చలవిడిగా పేట్రేగిపోతున్నారు. సైబర్ దాడులకు పాల్పడుతున్నారు. ఉగ్రవాద సంస్థల్లో చేరికలను ప్రోత్సహించేందుకూ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. యువతలో విషబీజాలు నాటుతున్నారు. ఇది అందరూ తీవ్రంగా దృష్టిపెట్టాల్సిన అంశం. ఇంతగా పేట్రేగిపోతున్న ఉగ్రవాదాన్ని నియంత్రించేందుకు అంతర్జాతీయంగా దేశాల మధ్య సహకారం అవసరం.’’ అని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. -
పోలీసు వ్యవస్థాపక దినోత్సవానికి ఆప్ మంత్రుల గైర్హాజరు
సాక్షి, న్యూఢిల్లీ : నగరంలో సోమవారం జరిగిన ఢిల్లీ పోలీసు వ్యవస్థాపక దినోత్సవ పరేడ్‌లో ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్గానీ, ఆయన మంత్రివర్గ సహచరులు గానీ పాల్గొనలేదు. దీనికి అంత ప్రాధాన్యమివ్వాల్సిన అవసరం లేదని, మంగళవారం జరిగే ఎట్ హోమ్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ చెప్పారు. గతంలో కూడా మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరు కాలేదనే విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. బస్సీసోమవారం ఉదయం కేజ్రీవాల్‌ను కలసి పోలీసు వ్యవస్థాపక దినోత్సవానికి రావాలంటూ ఆహ్వానించారు. కేజ్రీవాల్ కార్యక్రమం సమయాన్ని రాసుకున్నారని, మంగళవారం జరిగే కార్యక్రమానికి హాజరవుతారనే నమ్మకం తనకుందని బస్సీ చెప్పారు. కేజ్రీవాల్‌తో జరిగిన సమావేశంలో శాంతిభద్రతల పరిరక్షణ, మహిళల భద్రతకు సంబంధించి తాము చేపడుతున్న చర్యలపై చర్చించినట్లు బస్సీ చెప్పారు. ఢిల్లీవాసుల భద్రతకు ప్రభుత్వం పూర్తి సహకారాన్ని అందిస్తుందంటూ ముఖ్యమంత్రి తనకు హామీ ఇచ్చారన్నారు. ముఖ్యమంత్రికి భద్రత విషయంలో కేజ్రీవాల్ అభీష్టాన్ని గౌరవిస్తామన్నారు. పోలీసులు కల్పించే భద్రత సామాన్యులు తనను కలవడానికి అడ్డంకిగా మారొచ్చని సీఎం భావిస్తున్నారని, అందువల్లనే ఆయనకు భద్రతను పునర్వ్యవస్థీకరిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ జడ్ ప్లస్ కేటగిరీ భద్రతను పొందవచ్చు. అయితే కిందటిసారి సీఎం అయిన సందర్భంలోనూ భద్రతను నిరాకరించారు. పోలీసు భద్రత అనేది కేజ్రీవాల్‌కు, ప్రజలకు మధ్య అడ్డుగోడలా మారుతుందని, అందువల్ల కేజ్రీవాల్ ఈసారి కూడా భద్రత తీసుకోబోరంటూ ఆప్ నేత ఆశుతోష్ వారం క్రితం తెలిపిన సంగతి విదితమే. ఇదే అంశ ంపై మీడియా అడిగిన ప్రశ్నకు బస్సీ సమాధానమిస్తూ కేబినెట్‌కు, ముఖ్యమంత్రికి భద్రత కల్పించడం తమ బాధ్యతని అన్నారు. ప్రముఖుల పదవులను బట్టి తగిన భద్రతా ఏర్పాట్లు చేస్తామన్నారు. అదే సమయంలో వారి అవసరాల్నికూడా దృష్టిలో ఉంచుకుంటామన్నారు. భద్రతకు సంబంధించిన వివరాలను బయపెట్టబోనన్నారు. కళ్లు తిరిగి పడిపోయిన మహిళా అధికారి న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీసు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పరేడ్‌లో పాల్గొన్న మహిళా అధికారిణి సృ్పహ తప్పి పడిపోయింది. పరేడ్ అనంతరం మహిళా భద్రతపై కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ప్రసంగిస్తుండగా నియతి మిట్టల్ అనే మహిళా అధికారిణి ఆకస్మికంగా కిందపడిపోయింది. దీనిని గమనించిన రాజ్‌నాథ్‌సింగ్ ఒక్క నిమిషంపాటు ఆ తర్వాత తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఇదే సమయంలో సహ ఉద్యోగులు నియతిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. సుదీర్ఘ పని గంటలే ఇందుకు కారణమని ఇతర అధికారులు పేర్కొన్నారు. మరోవైపు ఇదే విషయమై పోలీసు శాఖ అధికార ప్రతినిధి రాజన్భగత్ మాట్లాడుతూ ఇటువంటివి సర్వసాధారణమేనన్నారు. ఒకే స్థితిలో ఎక్కువ సమయం అలాగే నిలబడితే ఇలా జరుగుతుందన్నారు. సుదీర్ఘ సమయంపాటు ఒకే స్థితిలో నిలబడాల్సి వస్తే ఏమిచేయాలనే విషయంలో శిక్ష ణా సమయంలో వీరికి నిపుణులు తగు సలహాలు, సూచనలు ఇస్తారన్నారు. -
నగర మహిళల భద్రత కోసం ‘హిమ్మత్’
సాక్షి, న్యూఢిల్లీ : నగర మహిళల భద్రతకు ఉద్దేశించిన మొబైల్ అప్లికేషన్ ‘హిమ్మత్’ను కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం ఆవిష్కరించారు. దేశంలో మొట్టమొదటిసారిగా నగరంలో అందుబాటులోకి వచ్చిన ఈ మొబైల్ యాప్ ఆవిష్కరణ కార్యక్రమానికి లె ఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌తో పాటు పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బస్సీ మాట్లాడుతూ హిమ్మత్ అప్లికేషన్ మహిళకు భద్రతను పెంపొదిస్తుందని చెప్పారు. ఈ స్మార్ట్ ఫోన్ అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేసుకున్నవారు ఆపద సమయంలో మొబైల్ ఫోన్‌ను ఊపటం లేదా పవర్ బటన్ని రెండుసార్లు నొక్కటం ద్వారా పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేయవచ్చని తెలిపారు. ఈ అప్లికేషన్ నేరుగా పోలీసు కంట్రోల్ రూమ్‌తో అనుసంధానమై ఉంటుందని, పోలీసులకు వెంటనే సూచన అందుతుందని, ఆ తరువాత లొకేషన్ గుర్తిస్తారని, ప్రతి పది సెకన్లకు ఓసారి అప్డేట్ అందుతుందని ఆయన చెప్పారు. వీలైనంత ఎక్కువమంది మహిళలు ఈ అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేసుకుంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ఇది మహిళల భద్రత కోసం దేశంలో మొట్టమొదటి అధికారిక ఏకీకృత అప్లికేషన్ అని బస్సీ తెలిపారు. మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ పోలీసులు ఈ యాండ్రాయిడ్ అప్లికేషన్ హిమ్మత్‌ను రూపొందించారు.అత్యవసర పరిస్థితిలో వీలైనంత త్వరగా పోలీసులను అప్రమత్తులను చేయడానికి ఇది అనువుగా ఉంటుంది. నిర్థారిత సమయం పాటు పవర్ బటన్ నొక్కిన వెంటనే ఇది పోలీసు కంట్రోల్ రూముకు కాల్ చేయడానికి వీలు కల్పించడంతో పాటు 30 సెకన్ల ఆడియా, వీడియో రికార్డింగ్ కూడా చేస్తుంది. వినియోగదారులు తమ ఐదుగురు మిత్రులు లేదా బంధువుల నంబర్లను మొబైల్ ఫోన్లో ఫీడ్ చేయాల్సిందిగా ఈ యాప్ వినియోగదారులకు సూచిస్తుంది. ఆపద సమయంలో వినియోగదారులు ఒకవేళ ఎస్ఓఎస్ కాల్ చేసినప్పటికీ వెంటనేవారు ఫీడ్ చేసిన ఐదు నంబర్లకు కూడా తక్షణమే సందేశం అందుతుంది.ఈ విధంగా పోలీసులే కాకుండా, బంధుమిత్రులు కూడా ఆపదలో ఉన్న మహిళకు సహాయం అందించగలిగే వీలుంటుందని పోలీసులు చెప్పారు. ఈ యాప్‌తో జరిపే ఆడియో, వీడియో రికార్డింగ్ సాక్ష్యంగా పనికివస్తుందని వారు వివరించారు. -
బారాపులా మూడో దశకు శంకుస్థాపన
సాక్షి, న్యూఢిల్లీ : బారాపులా కారిడార్‌ను సరాయ్ కాలేఖాన్ నుంచి మయూర్‌విహార్ వరకు పొడిగించడం కోసం పీడబ్ల్యూడీ రూపొందించిన ‘బారాపూలా’ప్రాజెక్టుకు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం శంకుస్థాపన చేశారు. మయూర్ విహార్‌లో జరిగిన శంకు స్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్, తూర్పుఢిల్లీ ఎంపీ మహేష్‌గిరీ హాజరయ్యారు. బారాపులా మూడోదశ కింద చేపట్టిన ఈ ప్రాజె క్టు నిర్మాణ పనులు వచ్చే సంవత్సరం మార్చిలో మొదలై 2017 డిసెంబర్ నాటికి పూర్తవుతాయని, 2018 జనవరి నుంచి ఈ కారిడార్‌పై వాహనాలు తిరుగుతాయని పీడబ్ల్యూడీ అధికారులు పేర్కొన్నారు. మూడో దశ కింద బారాపులా కారిడార్ విస్తరణకు 1,260 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని పీడబ్ల్యూడీ అంచనా వేసింది. ఈ ప్రాజెక్టు కింద నాలుగు లేన్ల క్యారే జ్‌వేను సైకిల్ ట్రాకులు, ఫుట్‌పాత్‌లతో నిర్మిస్తారు. 2020 నాటికి బారాపులా కారిడార్‌ను 1లక్షా 50 వేల వాహనాలు ఉపయోగిస్తాయని అధికారులు అంటున్నారు. మొదటి దశలో సత్ఫలితాలు.. సరాయ్‌కాల్ ఖాన్ నుంచి జవహర్లాల్ నెహ్రూ స్డేడియం వరకు మొదటి దశ కింద నిర్మించిన కారిడార్‌ను 70 వేల కార్లు ఉపయోగిస్తున్నట్లు గత సంత్సరం జరిపిన అధ్యయనంలో తేలింది. రెండో దశ కింద కారిడార్‌ను జవహర్లాల్ నెహ్రూ స్టేడియం నుంచి ఐఎన్ఏ వరకు పొడిగించారు. ఈ దశ కింద చేపట్టిన నిర్మాణం 2015 డిసెంబర్ వరకు పూర్తవుతాయని అంచనా, రెండో దశ నిర్మాణం పూర్తయిన తరువాత కారిడార్‌ను ఉపయోగించుకునే వాహనాల సంఖ్య లక్షకు పెరుగుతుందని అధికారులు అంటున్నారు. నాలుగో దశ కింద బారాపులా కారిడార్‌ను దౌళాకువా, ఢిల్లీ విమానాశ్రయం వరకు పొడిగించేందుకు త్వరలో అధ్యయనం చేపట్టనున్నారు. -
రాజధానిలో రాజ్‌నాథ్ ఆకస్మిక తనిఖీలు
న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం నగరంలోని పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆస్పత్రి, పోలీస్ స్టేషన్, మునిసిపల్ కార్యాలయం, బహిరంగ ప్రదేశాల్లో పరిశుభ్రత తీరు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఢిల్లీ రైల్వే స్టేషన్‌లోని మరుగుదొడ్డి తీరును తొలుత రాజ్‌నాథ్ పరిశీలించారు. కూలీలు, ట్యాక్సీ డ్రైవర్లతో మాట్లాడారు. అనంతరం శివాజీ స్టేడియం బస్టాప్ వద్ద ఆగి బస్సులు వేళకు వస్తున్నాయా? లేదా తెలుసుకున్నారు. దీంతోపాటు అక్కడ అందుబాటులో ఉన్న సౌకర్యాల గురించి ప్రయాణికులను ఆరా తీశారు. సులభ్ మరుగుదొడ్డి శుభ్రంగా లేకపోవడంతో మెరుగుపరచాలంటూ నిర్వాహకుడిని ఆదేశించారు. పహర్‌గంజ్ పోలీస్ స్టేషన్లో నిందితులను ఉంచే లాకప్ గదులు శుభ్రంగా ఉన్నదీ, లేనిదీ పరిశీలించారు. ఫిర్యాదుల స్థితిగతులపై ప్రశ్నించారు. మునిసిపల్ కార్పొరేషన్ సిటీ జోన్ కార్యాలయం అస్తవ్యస్తంగా ఉండడంపట్ల రాజ్‌నాథ్ ఆసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే పరిశుభ్రంగా మార్చాలని డిప్యూటీ కమిషనర్ హేమేంద్రకుమార్ను ఆదేశించారు. జయప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రిని కూడా సందర్శించి నిర్వహణ తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. కాగా, కొన్ని ప్రాంతాల్లో సేవలు సంతృప్తికరంగా ఉంటే, మరికొన్ని చోట్ల మెరుగుపడాల్సి ఉందని రాజ్‌నాథ్ విలేకరులతో అన్నారు. రాజ్‌నాథ్ వెంట లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్, పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సి కూడా ఉన్నారు. -
సత్వర సాయం అందించండి
కేంద్ర నిధులు వెంటనే విడుదల చేయండి రాజ్‌నాథ్‌సింగ్‌కు జగన్మోహన్రెడ్డి విజ్ఞప్తి న్యూఢిల్లీ: హుద్‌హుద్ తుపానుతో తీవ్రంగా నష్టపోయిన ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజ లను ఆదుకునేందుకు సత్వర సాయం అందించాలని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి విజ్ఞప్తి చేశారు. సహాయక చర్యలకు అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వం నుంచి వెంటనే విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తుపాను బాధితులకు కేంద్ర సాయం అర్థిస్తూ పార్టీ ఎంపీలతో కలిసి రెండు రోజుల పర్యటన కోసం శనివారం ఢిల్లీకి వచ్చిన జగన్మోహన్రెడ్డి రెండో రోజు ఆదివారం కేంద్ర హోంమంత్రితో భేటీ అయ్యారు. పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వై.వి.సుబ్బారెడ్డి, వై.ఎస్.అవినాష్‌రెడ్డి, పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్లతో కలిసి మధ్యాహ్నం 3.45 గంటలకు ఇక్కడి అశోకారోడ్డులోని రాజ్‌నాథ్ నివాసానికి చేరుకున్నారు. అరగంటకుపైగా ఆయనతో భేటీ అయ్యారు. తుపాను కారణంగా జరిగిన నష్టం, బాధితులకు సాయం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, కేంద్రం నుంచి రావాల్సిన సాయం తదితర అంశాలపై కూలంకశంగా చర్చించారు.అన్ని అంశాలను పేర్కొంటూ ప్రతినిధి బృందం తరఫున రాజ్‌నాథ్‌కు ఓ వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం రాజ్‌నాథ్ నివాసం వద్ద జగన్మోహన్రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘హుద్‌హుద్ తుపాను నష్టానికి సంబంధించిన సహాయ కార్యక్రమాల గురించి కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీకి ఇచ్చిన లేఖనే.. విపత్తు చర్యలకు సంబంధించిన మంత్రి కూడా అయిన రాజ్‌నాథ్‌సింగ్‌కూ అందించాం. ఉత్తరాంధ్రలోని చాలా గ్రామాల్లో ఈ రోజుకీ కరెంటు రాని పరిస్థితి ఉందని, సహాయ కార్యక్రమాలు పూర్తిస్థాయిలో సాగటం లేదని అన్ని విషయాలు వివరిస్తూ వినతిపత్రం ఇచ్చాం’’ అని తెలిపారు. పనిచేసే వారిపై బురదచల్లుతున్నారు.. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన పార్టీ నేతలకు మంత్రి పదవులు ఇప్పించుకోవడంపై చూపుతున్న శ్రద్ధ, తుపాను బాధితులను ఆదుకునే విషయంలో పెట్టడం లేదని జగన్మోహన్రెడ్డి విమర్శించారు. బాబు తన పార్టీ నాయకులకు పదవులు ఇప్పించుకోవడంపై ప్రధానమంత్రితో మాట్లాడుతున్నారే కానీ.. ప్రజా సమస్యలపై ప్రధానిని కలవడం లేదని ఎండగట్టారు. ‘‘ఆశ్చర్యం ఏమిటంటే చంద్రబాబునాయుడు ఇంతవరకు ప్రధానమంత్రిని కలిసి తుపాను సాయానికి సంబంధించి అభ్యర్థించింది లేదు. మంత్రివర్గంలోకి సుజనాచౌదరిని ఎలా తీసుకుపోవాలన్నదానిపైనే నరేంద్రమోదీతో ఫోన్లో మాట్లాడినట్టు చెప్పుకుంటున్నారు. ఆ ధ్యాస, ఆ శ్రద్ధ.. తుపాను బాధితులపై పెట్టి ఉంటే కనీసం రాష్ట్రానికి మంచి జరిగేది. బాబు, ఆయన మంత్రివర్గ సహచరులు చిత్తశుద్ధితో పనిచేయరు. పనిచేసే వారి మీద బురదజల్లడమే పనిగా పెట్టుకున్నారు’’ అని తూర్పారబట్టారు. బాధితులకు ప్రభుత్వ సాయం సున్నా... ‘గతంలో ఏ ప్రభుత్వం చేయనంత త్వరగా హుదుహుద్ బాధితులకు సహాయక చర్యలు అందించామని టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు కదా..?’ అని ప్రశ్నించగా.. ‘‘ఒక్కసారి ఉత్తరాంధ్రకు పోయి చూస్తే, ఎంత గొప్పగా చేశారో అర్థమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కేవలం మీడియాలో ప్రచారం తప్ప చేసిందేమీ లేదు. ఈ రోజుకి ఉత్తరాంధ్ర జిల్లాలకు వెళ్లి చూస్తే కనీసం విద్యుత్ అందించలేని పరిస్థితి ఉంది. తుపాను బాధిత గ్రామాల ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన సాయం సున్నా. మేం పది రోజులు ప్రతీ గ్రామాన్ని సందర్శించాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ సాయం అందడం లేదని గ్రామస్తులే చెప్పారు. రూపాయికి కిలో చొప్పున ఇచ్చే బియ్యం 25 కిలోలు ఇచ్చారు. అది కూడా అన్ని గ్రామాల్లో, అందరికీ ఇవ్వలేదు...’’ అని జగన్ విమర్శించారు. బాధితులకు సహాయం అందిం చడంలో కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని పేర్కొన్నారు. అక్రమ కేసులపై న్యాయస్థానాల్లో పోరాడుతాం... ‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతున్నదన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై మీరేమంటార’ని ఈ సందర్భంగా విలేకరులు ప్రశ్నించగా.. ‘‘ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తిగా విఫలమవుతున్నారు.. ప్రభుత్వ వ్యతిరేకత బలంగా కనిపిస్తోంది.. దీంతో ఆయన భయపడి అక్రమ కేసులు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఆ కేసులను మేం గట్టిగా ఎదుర్కొంటాం. న్యాయస్థానాలపై పూర్తి విశ్వాసం ఉంది. న్యాయస్థానాల్లో పోరాడి విజయం సాధిస్తాం’’ అని జగన్ బదులిచ్చారు. వినతిపత్రంలోని ముఖ్యాంశాలు... కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు జగన్మోహన్రెడ్డి అందించిన వినతిపత్రంలోని ముఖ్యాం శాలు ఇవీ... ఇటీవల సంభవించిన హుదుహుద్ తుపానుతో భారతదేశ తూర్పు తీర ప్రాంతం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మూడు కోస్తా జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి. ప్రత్యేకించి పారిశ్రామిక రాజధాని అయిన విశాఖపట్నంపై తుపాను ప్రభావం తీవ్రంగా పడింది. గత మూడేళ్లలో నీలం, లెహర్, పైలీన్ వరుస తుపాన్లతో పాటు ఇటీవల వచ్చిన హుద్‌హుద్ ప్రాణ, ఆస్తి, పశు నష్టాల్ని మిగిల్చాయి. పంటలతో పాటు ఉద్యానవనాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. తుపానును ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం చాలా స్వల్పంగా చర్యలు తీసుకుంది. నష్టపోయిన వారిలో 10 శాతం మంది రైతులకైనా నేటీకి ప్రభుత్వం ప్రకటించిన పరిహారం అంద లేదు. రుణాల రీషెడ్యూల్ కానీ, వడ్డీ మాఫీ కానీ చేయలేదు. నిర్వాసితులైన వారికి తిరిగి వసతులు కల్పించలేదు. హుద్‌హుద్ వచ్చిన వెంటనే స్పందించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ, మూడో రోజే తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడంతో పాటు ఎంతో ఉదారంగా రూ. వెయ్యి కోట్ల సాయం ప్రకటించారు. కోస్తా ఆంధ్రా జిల్లాలపై వరుసగా విరుచుకుపడిన నాలుగో తుపాను ఇది. గత రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రస్తుత ప్రభుత్వం సైతం తుపాన్లను ఎదుర్కోవడంలో పూర్తిగా విఫలమైంది. రైతులు, మత్స్యకారులు, గ్రామీణులంతా మీ సహాయం కోసం ఎంతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే యూపీఏ ప్రభుత్వం బలవంతంగా చేసిన రాష్ట్ర విభజనతో నష్టపోయి ఉన్నారు.మీరు సహాయం అందించకపోతే వారి జీవితాలు మరింత దయనీయంగా మారతాయి. తప్పుడు హామీలను ఇచ్చి టీడీపీ అధికారంలోకి వచ్చింది. అమలు సాధ్యం కాదని తెలిసి కూడా, అధికారంలోకి వచ్చిన వెంటనే మొత్తం రూ. 80 వేల కోట్ల వ్యవసాయ రుణాలు, రూ. 14 వేల కోట్ల స్వయం సహాయక సంఘాల రుణాలను మాఫీ చేస్తామని వారు హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచార సమయంలోనూ ఆ పార్టీ నాయకులు.. రుణాలు, వడ్డీలు కట్టొద్దని, అధికారంలోకి వచ్చిన తర్వాత తామే బ్యాంకులకు చెల్లిస్తామని ప్రతి రైతుకు, ప్రతి స్వయం సహాయక గ్రూపు సభ్యురాలికి చెప్తూ వచ్చారు. ఈ హామీలను చెప్పి టీడీపీ అధికారంలోకి వచ్చింది. వాళ్ల మాటలు నమ్మిన రైతులు ఇప్పుడు కొత్త రుణాలకు అనర్హులయ్యారు. వీటి పర్యవసానంగా, పంట బీమా సైతం రెన్యువల్ కాలేదు. ఇప్పుడు రైతులకు రుణాలు మాఫీ కాలేదు, పంటల బీమా అందే పరిస్థితి లేదు. ఈ తుపానుతో పంటనష్టపోయిన రైతులకు ఇప్పు డు పంటల బీమా సైతం అందని దయనీయమై న పరిస్థితి ఏర్పడింది. మీరు వీలైనంత త్వరగా రాష్ట్రానికి ఉదారంగా ఆర్థిక సాయం అందిస్తే, బాధితులకు కొంత ఊరట లభిస్తుంది. సాయంపై వైఎస్సార్సీపీ అభ్యర్థనలు.. ► పంటలు పూర్తిగా, పాక్షికంగా దెబ్బతిన్న రైతులకు పంట రుణాలను, వడ్డీలను పూర్తిగా రద్దు చేయాలి. నష్టపోయిన రైతులకు, కౌలు రైతులకు వచ్చే సీజన్‌కి అవసరమైన రుణాలు కొత్తగా మంజూరు చేయాలి. ►తుపాను బాధిత ప్రాంతాల్లోని స్వయం సహాయక గ్రూపులకు ఎలాంటి వడ్డీలు లేకుండా రుణాలు రీషెడ్యూల్ చేయాలి. ►వచ్చే రబీకి అవసరమైన విత్తనాలు ప్రభుత్వమే ఉచితంగా అందించాలి. ►రైతులందరికీ పంట బీమా వర్తించేలా చర్యలు తీసుకోవాలి. ►పాక్షికంగా దెబ్బతిన్న వరి, చెరకు, ఉద్యానవన ఉత్పత్తులు ప్రభుత్వమే సేకరించేం దుకు హామీ ఇవ్వాలి. ►హుద్‌హుద్ తుపాను సందర్భంగా 2014 అక్టోబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 9, 10, 11, 12, 13, 15 జీవోల్లో ఇచ్చిన ►మీలన్నీ నెరవేర్చేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలి. ►భూపీందర్‌సింగ్ హూడా కమిటీ ప్రతిపాదనల మేరకు ప్రకృతి వైపరీత్యాల సమయంలో కౌలు రైతులను కలుపుకొని ప్రతి రైతుకు ఎకరాకు రూ. 10 వేలకు తగ్గకుండా ప్రకృతి విపత్తు సహాయ నిధి నుంచి సాయం అందించాలి. ►చనిపోయిన వారి కుటుంబసభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రకారం రూ. 5 లక్షల పరిహారం వెంటనే అందేలా చర్యలు తీసుకోవాలి. ►ఇల్లు దెబ్బతిన్న ప్రతి కుటుంబానికి రూ. 50 వేల ఆర్థిక సహాయం అందించాలి. పూర్తిగా దెబ్బతిన్న వారికి పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలి. ►ఇప్పటికే ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్న ప్రకారం పశువులు చనిపోయినవారికి, కోళ్లు చనిపోయిన కోళ్ల ఫారాల వారికి నష్టపరిహారం అందజేయాలి. ►తుపాను బాధిత ప్రాంతాల్లోని వారికి రేషన్ ద్వారా అతి తక్కువ సహాయం చేసినందున ప్రతి ఇంటికీ రూ. 5,000 ఆర్థిక సాయం ఇవ్వాలి. ►బోట్లు, వలలు నష్టపోయిన మత్స్యకారులకు పూర్తి పరిహారాన్ని చెల్లించాలి. ►వరద బాధిత ప్రాంతాల్లో భూమికోతను అరికట్టేందుకు, పూడిక తీతకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి. -
హుదూద్‌పై పీఎం మోదీ అత్యవసర భేటీ
న్యూఢిల్లీ: హుదూద్ తుపాను ప్రభావంపై ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశించారు. సహాయ, పునరావాస కార్యక్రమాలు సాఫీగా జరిగేలా చూడాలన్నారు. తుపానును ఎదుర్కొనేందుకు సంసిద్ధతపై సమీక్షించేందుకు ప్రధాని శనివారం అత్యవసరంగా అత్యున్నతస్థారుు సమావేశం నిర్వహించారు. ఆయూ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఎప్పటికప్పుడు చర్చించాల్సిందిగా హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు సూచించినట్లు అధికారిక ప్రకటన ఒకటి వెల్లడించింది. తుపాను ప్రభావిత రాష్ట్రాల అధికారులతో నిరంతరం సంప్రదింపులు కొనసాగించాలని ప్రధాని కేంద్ర ప్రభుత్వ అధికారులను ఆదేశించినట్లు ప్రకటన తెలిపింది. ఎన్సీఎంసీ సమావేశం: తుపాను పరిస్థితులను సమీక్షిం చేందుకు జాతీయ విపత్తు నిర్వహణ కమిటీ (ఎన్సీఎంసీ) శని వారం ఢిల్లీలో మరోమారు సమావేశమైంది. కేబినెట్ కార్యద ర్శి అజిత్ సేథ్ భేటీకి అధ్యక్షత వహించారు. ఏపీ, ఒడిశాల్లో సహాయ, పునరావాస కార్యక్రమాలను ఆయన సమీక్షించారు. -
సూపర్ ఉమెన్ కాప్..
‘తలపైన మూడు సింహాల టోపీ.. ఖాకీ యూనిఫాం.. చేతిలో వైర్లెస్ సెట్.. నడుముకి అధునాతన ఆయుధం.. టూవీలర్‌పై రయ్‌న వచ్చిన ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ సెంటర్లో బండాపి చుట్టూ చూసి దగ్గరలో ఉన్న వారితో మాట్లాడి.. అక్కడ వారికి ఎటువంటి సమస్య లేదనగానే మరో ప్రాంతానికి దూసుకుపోవడమే..’ ఇదేదో సినిమా సీన్లా ఉంది కదూ.. అయితే త్వరలో ఢిల్లీ రోడ్లు ఇటువంటి దృశ్యాలకు వేదిక కానున్నాయి. న్యూఢిల్లీ: నగర రోడ్లపై త్వరలో అధునాతన ఆయుధాలతో ద్విచక్రవాహనాలపై మహిళా పోలీసులు పెట్రోలింగ్ డ్యూటీ చేస్తూ కనిపించనున్నారు. పోలీస్స్టేషన్లలో నమోదైన మహిళా సంబంధ కేసులను పరిష్కరించేందుకు, నగర ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు ఢిల్లీ పోలీస్ శాఖలో కొత్తగా మహిళా పోలీసులను నియమించనున్నారు. ప్రస్తుతం శాఖలో పనిచేస్తున్న మహిళా పోలీసుల్లో చాలా కొద్దిమందికే మోటార్ సైకిల్ నడపడం తెలుసు. అందువల్ల పెట్రోలింగ్ డ్యూటీ చేసే వారికి స్కూటీలను కొనిచ్చేందుకు నిర్ణయించింది. నగరంలో మహిళలపై పెరుగుతున్న అత్యాచారాలు, అకృత్యాలపై కేంద్ర హోం శాఖ దృష్టి సారించింది. ఏయే ప్రాంతాల్లో మహిళలపై ఎక్కువ దాడులు జరుగుతున్నాయో, ఏ పోలీస్స్టేషన్ల పరిధిలో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయో.. ఆయా ప్రాంతాల్లో పెట్రోలింగ్ డ్యూటీ నిర్వహించేందుకు మహిళా పోలీస్ కానిస్టేబుళ్లను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు నగర పోలీస్ శాఖలో మహిళా పోలీసుల సంఖ్య భారీగా పెరగనుంది. పోలీసు అధికారుల తెలిపిన వివరాల ప్రకారం ఈ మహిళా పోలీసులు నగరంలో రాత్రి పూట కూడా పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తారు. ఒక్కో బృందంలో ఇద్దరు కానిస్టేబుళ్లు ఉంటారు. ఈ బృందాలకు అందజేయడానికి ఎన్ని స్కూటీలు అవసరమవుతాయో పట్టిక తయారుచేయాలని ఢిల్లీ పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీని ఎంహెచ్ఏ కోరింది. ఈ బృందాలకు స్కూటీలతోపాటు వైర్లెస్ సెట్లు, అధునాతన ఆయుధాలు అందజేస్తారు. మామూలు బీట్ కానిస్టేబుళ్ల లాగే వీరికీ విధులు కేటాయించబడతాయి. అయితే వీరికి మహిళా కాలేజీలు, బాలికల పాఠశాలలు, మహిళా హాస్టళ్లు, మార్కెట్ల వద్దే ఎక్కువగా విధులున కేటాయిస్తారు. వీరికి స్కూటీలనే ఎందుకు అందజేస్తున్నారనే విషయమై ఒక ఉన్నత పోలీస్ అధికారి మాట్లాడుతూ..‘ చాలా తక్కువ మంది మహిళలే బైక్‌లను నడపుతారు. అవి ఎక్కువ బరువుండటంతో పాటు బ్యాలన్స్ చేయడం కూడా మహిళలకు కొంచెం ఇబ్బందికరంగానే ఉంటాయి.. అదే స్కూటీలైతే తేలిగ్గా ఉంటాయి. చాలామంది మహిళలు చాలా సులభంగా వీటిని నడపగలుగుతారు.. అందుకే మహిళా కానిస్టేబుళ్లకు స్కూటీలను అందజేయాలనే నిర్ణయించాం..’ అని ఆయన వివరించారు. నగరవ్యాప్తంగా ఎంతమంది మహిళా కానిస్టేబుళ్లు, స్కూటీలు అవసరమో నివేదిక వీలైనంతర త్వరగా అందజేయాలని ఆయా రేంజ్‌లకు సంబంధించిన జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (జేసీపీ)లకు సమాచారం అందించామని ఉన్నతాధికారులు తెలిపారు. నగరంలో మహిళలు, బాలికలపై జరుగుతున్న అత్యాచారాలు, వేధింపులను నిరోధించేందుకే ఎంహెచ్ఏ ఈ నిర్ణయం తీసుకుందని పోలీస్ వర్గాలు తెలిపాయి. కేంద్రంలో మోడీ సర్కార్ ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిసారి గత నెల 16వ తేదీన ఢిల్లీ పోలీస్ అధికారులతో కేంద్ర హోం మంత్రి సమావేశమైన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా జాతీయ రాజధానిలో మహిళా భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. దాని ఫలితమే సూపర్ పోలీస్ కాప్‌ల ఏర్పాటని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.