ఏవోబీలో మావోలదే పైచేయి
దండకారణ్యంలోకి అడుగుపెట్టని పోలీసులు
వెలుపల కూంబింగ్‌కే పరిమితమవుతున్న బలగాలు
అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన మావో అగ్రనేతలు
మావోయిస్టులపై ఉమ్మడి పోరు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఘంటాపథంగా చెబుతోంది. అవసరమైతే అదనపు బలగాలను దించేందుకు సిద్ధంగా ఉన్నామంటోంది. అయితే ప్రభుత్వ వ్యూహాల కంటే ముందుగానే మావోయిస్టులు ప్రతివ్యూహాలు రచిస్తున్నారు. హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జిల్లా పర్యటనకు వస్తున్న నేపథ్యంలో ముందుగానే సేఫ్‌జోన్‌లోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం విశాఖ మన్యంలో తమ కార్యకలాపాలను కూడా తగ్గించుకున్నారు. ఏవోబీలో వారి ప్రాబ ల్యానికి అడ్డుకట్ట వేయడం అంత సులువుకాదని నిపుణులు చెబుతున్నారు.
విశాఖపట్నం: కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు చేపడుతున్న ఉమ్మడి ఆపరేషన్‌ను ముందే పసిగట్టిన మావోయిస్టు అగ్రనేతలు ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆంధ్రా-ఒడిశా బో ర్డర్ (ఏవోబీ) ఇన్‌చార్జ్ చలపతి, మావోయిస్టు మొదటి కేంద్ర ప్రాంతీయ (సీఆర్‌సీ) కమాండర్ కుడుముల వెంకట్రావు అలియస్ రవి, మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు నంబల్ల కేశవరావు అలియస్ గంగన్నలతో పాటు దళం ముఖ్య సభ్యులు సరిత, ఆజాద్, ఆనంద్‌లతో సహా ఎవరి అలజడీ మన్యంలో కనిపించడం లేదు.
ఏవోబీని విడదీయలేరు
విశాఖలో కేంద్ర హోం మంత్రి సమావేశం ఉండటంతో రెండు నెలల ముందు నుంచే ప్రత్యేక బలగాలను దించి మన్యంలో కూంబింగ్ ప్రారంభించారు. అయితే అది మావోయిస్టులను పట్టుకునేందుకు మాత్రం కాదు.. వారిని అడవిలోకి పంపడమే దాని లక్ష్యం. ఏవోబీలో పోలీసులకే తెలియని ప్రాంతాల్లో మావోయిస్టులు తరదాచుకుంటున్నారు. ఇంతవరకు ఏ బలగాలూ ఆ ప్రదేశాల దరిదాపులకు వెళ్లింది లేదంటున్నారు. అలాంటి ప్రాంతాల నుంచి మావోయిస్టులను వెళ్లగొట్టాలంటే అది అసాధ్యమంటున్నారు. కాని ప్రభుత్వాలు మారినప్పుడల్లా మావోయిస్టులపై ఏదో విధంగా పోరాటం చేస్తున్నట్లు చూపించుకోవడానికే ప్రయత్నిస్తుంటాయని, రాజ్‌నాథ్ సమావేశం కూడా అలాంటిదేనని దళం భావిస్తున్నట్లు సమాచారం.
అమలు జరిగేలోగా పుంజుకోనున్న బలం
ఇటు రాష్ట్ర పోలీసు అధికారులు కూడా తాము కోరినట్లుగా అన్నీ సమకూర్చితే తప్ప మావోలను అణచివేయడం కష్టమని నివేదిక ఇచ్చారు. ఆర్థిక, మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన కేంద్రం ఈ నివేదికలోని అంశాలను ఎన్నింటిని ఆచరణలోకి తీసుకువస్తుందనే దానిపై పోలీసుల భవిష్యత్ ప్రణాళిక ఉండబోతోంది. ఇదంతా జరగడానికి ఏన్నేళ్లు పడుతుందో చెప్పలేం. ఈ లోగా సరిహద్దు రాష్ట్రాలైన ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి కేడర్‌ను రప్పించి ఉద్యమాన్ని బలోపేతం చేసుకోవాలని మావోయిస్టులు ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.
సేఫ్ జోన్!
Published Fri, Feb 19 2016 11:06 PM | Last Updated on Tue, Oct 9 2018 2:47 PM
Advertisement
Advertisement