combing
-
అరన్పూర్ పేలుళ్ల సూత్రధారి జగదీశ్
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దంతెవాడ జిల్లా అరన్పూర్ బ్లాస్ట్ వెనుక ఉన్న మాస్టర్ మైండ్‌ను ఛత్తీస్‌గఢ్ పోలీసులు గుర్తించారు. పది మంది డీఆర్జీ కానిస్టేబుళ్లు, ఒక డ్రైవరు మరణించిన ఈ ఘటనకు జాగరగుండా తూర్పు గ్రామానికి చెందిన జగదీశ్ ప్రధాన కారకుడిని తేల్చారు. ఈ మేరకు దర్భా కమిటీ సభ్యులపై కేసు నమోదు చేశారు. పోలీసుల విచారణలో వెల్లడైన వివరాలిలా ఉన్నాయి. ప్రతీకారం కోసమే ఏప్రిల్ 12న దంతెవాడ జిల్లాలోని గొండెరాస్ పంచాయతీ పరిధిలో పోలీసులు, ప్రత్యేక భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహించాయి. ఇదే సందర్భంలో అక్కడున్న స్థానికులను భద్రతా దళాలు గట్టిగా బెదిరించాయి. గ్రామస్తుల ఎదుటే గాల్లోకి కాల్పులు జరిపారు. 17 మంది వృద్ధులు, పిల్లలను సైతం విచక్షణారహితంగా కొట్టినట్టు మావోయిస్టు పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు సౌత్ సబ్ జోనల్ బ్యూరో ప్రతికా ప్రకటన సైతం జారీ చేసింది. అయితే ఈ ఘటనపై ఎటువంటి పోలీసు కేసు నమోదు కాలేదు. కానీ గొండెరాస్లో స్థానికులపై భద్రతా దళాలు ప్రవర్తించిన తీరుతో మావోలు రగిలిపోయారు. దీంతో ప్రతీకారం కోసం ఎదురు చూశారు. ఈ క్రమంలో అరన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సలేమీ అడవుల్లో కూంబింగ్ కోసం డి్రస్టిక్ట్ రిజర్వ్గార్డ్స్తో పాటు సీఆర్పీఎఫ్ దళాలు ఈనెల 25న మంగళవారం అడవుల్లోకి వెళ్లాయి. ఒకరోజంతా అడవిలో కూంబింగ్ జరిపి మరుసటి రోజు ఏప్రిల్ 26న తిరుగు ప్రయాణం అయ్యారు. దీనిపై పక్కా సమాచారం అందుకున్న మావోయిస్టులు ప్రతీకారం ప్లాన్‌ను అమల్లో పెట్టినట్టు తెలుస్తోంది. పక్కా ప్లాన్‌తో భద్రతా దళాలకు చెందిన సుమారు రెండు వందల మంది ఎనిమిది వాహనాల్లో సలేమీ అడవీ ప్రాంతం నుంచి దంతెవాడకు తిరుగు ప్రయాణం అయ్యారు. అయితే మావోయిస్టులు రోడ్డు కింద ముందుగానే ఐఈడీ అమర్చిన చోటులో రోడ్డుకు అడ్డంగా కర్రలు పెట్టారు. దీంతో ఆ కర్రల దగ్గరకు రాగానే భద్రతా దళాలకు చెందిన వాహనాలు నెమ్మదించాయి. ఇదే అదనుగా మావోలు సుమారు 40 కేజీల ఐఈడీని పేల్చారు. పేలుడు ధాటికి మినీ బస్సు తునాతునకలైంది. వెంటనే అడవుల్లో మాటువేసి ఉన్న మావోయిస్టులు భద్రతా దళాలపైకి కాల్పులు జరిపారు. ఇరువైపులా నుంచి సుమారు 20 నిమిషాల పాటు కాల్పులు కొనసాగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలోనే దాడికి పాల్పడిన ఇద్దరు మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత రెండు రోజులుగా వీరిని విచారించగా ఈ దాడికి పాల్పడింది జాగరగుండా తూర్పు గ్రామానికి చెందిన జగదీశ్‌గా వెల్లడైంది. జగదీశ్ తలపై రూ.5 లక్షలు జగదీష్ చాలా కాలంగా బస్తర్‌లో యాక్టివ్‌గా ఉంటున్నట్టు ఛత్తీస్‌గఢ్ పోలీసులు చెబుతున్నారు. పోలీసు రికార్డుల ప్రకారం గతంలో జగదీశ్ కాటేకల్యాణ్ ఏరియా కమిటీలో యాక్టివ్‌గా ఉండేవాడు. అయితే భారీ దాడులను విజయవంతంగా అమలు చేస్తుండటంతో ఇటీవల పార్టీలో జగదీశ్ కేడర్ పెరిగింది. అలా కీలకమైన దర్బా డివిజన్‌కు వెళ్లాడు. మావోయిస్టుల సైనిక దళంలో ఇప్పుడు జగదీశ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం జగదీష్‌పై ఐదు లక్షల రివార్డు ఉంది. అరన్పూర్ ఘటనలో జగదీశ్‌తో పాటు మరో 12 మందిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. దర్భా డివిజనల్ కమిటీలో చురుగ్గా ఉన్న జగదీష్, లఖే, లింగే, సోమడు, మహేష్, హిద్మా, ఉమేశ్, దేవే, నంద్ కుమార్, లఖ్మా, కోసా, ముకేశ్, చైతు, మంగ్తు, రాన్సాయి, జయలాల్, బమన్, సోమ, రాకే ష్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వీరందరిపై యూఏపీఏ చట్టాన్ని ప్రయోగించారు. -
అడవంతా జల్లెడ!
సాక్షి, హైదరాబాద్/ మల్హర్: తెలంగాణలో గెరిల్లా ఆర్మీ (మెరుపుదాడులకు దిగే ప్రత్యేక దళాలు)ని బలోపేతం చేయాలని మావోయిస్టులు నిర్ణయించా రనే సమాచారంతో రాష్ట్ర పోలీసులు అప్రమత్తమ య్యారు. దండకారణ్యం సరిహద్దుల్లో మావోల వేటను ముమ్మరం చేశారు. అణువణువూ జల్లెడ పడు తున్నారు. గతకొంత కాలంగా తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో మావోయిస్టుల కదలికలు క్రమంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. దానికి తోడు డిసెం బరు 2 నుంచి 8వ తేదీ వరకు పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్జీఏ) వారోత్సవాలు ఉండటంతో పోలీసులు మరింత అలర్ట్ అయ్యారు. అడవుల్లో మావోలు సభలు, సమావేశాలు నిర్వహించకుండా అడ్డుకోవాలని భావిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల సరిహద్దుల్లో విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఓవైపు ప్రతిష్టాత్మకమైన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల కోసం నగరంలో 52 వేల మంది పోలీసులను బందోబస్తులో ఉంచినప్పటికీ... మరోవైపు సరిహద్దులను డేగ కళ్లతో పర్యవేక్షిస్తూనే ఉన్నారు. ఇటీవల పోలీసుశాఖలో కొత్తగా చేరిన దాదాపు 10 వేల మంది పోలీసుల్లో మెరికల్లాంటి యువకులను మావోల వేటకు వినియోగిస్తున్నారు. మావోల అన్వేషణలో తలపండిన సీనియర్లు, రిటైర్డ్ పోలీసు ఆఫీసర్ల పర్యవేక్షణలో సరిహద్దుల్లో అణువణువూ గాలిస్తున్నారు. వీరికితోడుగా సీఆర్పీఎఫ్ బలగాలు కూడా కూంబింగ్‌లో పాల్గొంటున్నాయి. రాష్ట్రాల సరిహద్దులపై నిఘా.. పీఎల్జీఏ వారోత్సవాల నేపథ్యంలో మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ సరిహద్దులపై పోలీసులు నిఘా పెంచారు. ముఖ్యంగా ప్రాణహిత, గోదావరి నదులపై అత్యాధునిక డ్రోన్లతో పర్యవేక్షణ జరుపుతున్నారు. రాత్రిపూట మావోయిస్టులు నదులను దాటుకుని రాకపోకలు సాగించే అవకాశాలు ఉండటంతో ఆయా ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిసారించారు. ఇక సమస్య తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో పగలు, రాత్రి నిర్విరామంగా కూంబింగ్ కొనసాగిస్తున్నారు. ఏజెన్సీ మండలాలకు వెళ్లే అన్ని మార్గాల్లో తనిఖీలు విస్తృతం చేశారు. ఇదేవిధంగా మారుమూల గ్రామాల్లోని ప్రజాప్రతినిధులు మైదాన ప్రాంతాలకు వెళ్లాలని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. పీఎల్జీఏది ప్రత్యేకస్థానం మావోయిస్టు పార్టీలో పీఎల్జీఏకు ప్రత్యేకస్థానం ఉంది. ఈ ఏడాది ఘనంగా వారోత్సవాలు నిర్వహించాలని, తెలంగాణలో ఈ విభాగాన్ని పటిష్టం చేయాలని అగ్రనాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది. కాల్పులు, బాంబు పేలుళ్లు, ఆంబుష్ దాడులు నిర్వహించడంలో ఈ విభాగానికి ప్రావీణ్యం ఉంది. చత్తీస్‌గఢ్, ఒడిషా అరణ్యాలలో ఎంతో పటిష్టంగా ఉన్న పీఎల్జీఏ విభాగాన్ని తెలంగాణలో బలోపేతం చేయాలని, కొత్త యువకులను ఆకర్షించాలని మావోయిస్టు కేంద్ర కమిటీ ఇటీవల ఆదేశించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రా, ఒడిషా, చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని అడవుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు పీఎల్జీఏ వారోత్సవాల్లో పాల్గొంటారని, ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలో పార్టీ బలోపేతానికి సంబంధించి ఎలాంటి పంథా అనుసరిస్తారన్న విషయంలో పోలీసులు ఉత్కంఠతో ఉన్నారు. ఈ సమావేశాలకు సంబంధించి ఇంటిలిజెన్స్ విభాగం ఇప్పటికే సమాచార సేకరణలో నిమగ్నమైంది. తృటిలో తప్పించుకున్న కంకణాల తెలంగాణలో వేళ్లూనుకునేందుకు యత్నిస్తోన్న మావోయిస్టులు గోదావరి, ప్రాణహిత పరిసరాల్లోని కొన్ని ప్రాంతాల్లో పట్టు సాధించగలిగారు. ఆదివాసీల సాయంతో ఆశ్రయం పొందగలుగుతున్నారు. ఇలాంటి వారిలో మావోయిస్టు కొత్తగూడెం డివిజన్ కమిటీ సభ్యుడు కంకణాల రాజిరెడ్డి కూడా ఒకరు. ఇతని దళం గతవారం కూంబింగ్ చేస్తోన్న పోలీసుల నుంచి వెంట్రుకవాసిలో తప్పించుకుంది. పక్కా సమాచారంతో కూంబింగ్‌లోకి దిగిన పోలీసులకు కాటారం పోలీస్‌స్టేషన్ పరిధిలోని సింగారం రిజర్వ్‌ఫారెస్ట్‌లో రాజిరెడ్డి దళం ఎదురుపడింది. పోలీసులను చూస్తూనే వారు కాల్పులు జరిపి తప్పించుకున్నారు. ఈ ఎన్కౌంటర్లో ఇరుపక్షాల్లో ఎవరికీ గాయాలు కాలేదు. వీరు గోదావరి నది దాటి చత్తీస్‌గఢ్‌కు వెళ్లి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నల్లా, ఎర్రం, శీలంల... యాదిలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కొయ్యూర్ ఎన్‌కౌంటర్‌కు బుధవారంతో 21 ఏళ్లు నిండుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా మల్హర్ మండలం కొయ్యూర్ అటవీ ప్రాంతంలో 2 డిసెంబర్ 1999న జరిగిన ఎన్కౌంటర్లో అప్పటి పీపుల్స్‌వార్ కేంద్ర కమిటీ సభ్యులు నల్లా ఆదిరెడ్డి అలియాస్ శ్యాం, ఎర్రంరెడ్డి సంతోష్‌రెడ్డి అలియాస్ మహేష్, ఉత్తర తెలంగాణ కార్యదర్శి శీలం నరేష్ అలియాస్ మురళి నేలకొరిగారు. అప్పట్లో ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో నక్సల్స్ ప్రాబల్యం బలంగా ఉండేది. అలాంటి సమయంలో ముఖ్యనేతలు మరణించడం ఉద్యమానికి పెద్ద ఎదురుదెబ్బగా పరిగణిస్తారు. ఈ ముగ్గురు నేతలు మరణించాక సరిగ్గా ఏడాదికి డిసెంబరు 2, 2000న పీఎల్జీఏను ఏర్పాటు చేశారు. వారికి నివాళిగా ఏటా డిసెంబర్ 2 నుంచి మావోయిస్టులు పీఎల్జీఏ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. అలాగే మృతుల స్మారకంగా పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేట గ్రామంలో మావోయిస్ట్ నాయకులు 53 అడుగుల ఎత్తయిన స్థూపాన్ని నిర్మించారు. దీన్ని 2005 నవంబర్ 13న కుటుంబసభ్యులు, బంధుమిత్రులు ఆవిష్కరించారు. -
ఆపరేషన్ ఆర్కే పేరుతో గాలింపు చర్యలు
సాక్షి, మల్కన్‌గిరి: మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ (ఆర్కే) ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ పరిసరాల్లో ఉన్నట్లు సమాచారం అందడంతో ఒడిశా పోలీస్ యంత్రాంగం కూంబింగ్ ముమ్మరం చేసింది. ఆర్కేతోపాటు మరో ఇద్దరు మావోయిస్టు అగ్రనేతలు ఉదయ్, చలపతి కూడా ఇదే ప్రాంతంలో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో ఆపరేషన్ ఆర్కే పేరుతో గాలింపు మొదలుపెట్టారు. ఎస్‌వోజీ, డీబీఎఫ్‌లతో పాటు ఆంధ్ర గ్రేహౌండ్స్, తూర్పు గోదావరి జిల్లా పోలీసులతో కలిసి ఈ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఉనికి కోసం మావోయిస్టుల యత్నాలు గతంలో చిత్రకొండ కటాఫ్ ఏరియా మావోయిస్టులకు అడ్డాగా ఉండేది. కానీ ఇప్పుడు కటాఫ్ ఏరియాలో రహదారుల నిర్మాణం జరగడం, అలాగే ఎక్కడికక్కడ బీఎస్ఎఫ్ క్యాంపులు ఏర్పాటై జవాన్లు నిరంతరం కూంబింగ్ నిర్వహిస్తుండటంతో మావోయిస్టుల అలజడి తగ్గుముఖం పట్టింది. ఈ ప్రాంతంపై తిరిగి పట్టు సాధించేందుకు మావోయిస్టులు ఇక్కడ జరుగుతున్న రోడ్ల నిర్మాణాలను అడ్డుకోవడం, కాంట్రాక్టర్ల వాహనాలు కాల్చివేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. మావోయిస్టు అగ్రనేత ఆర్కే ఈ ఏరియాలోనే ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఈ నెల 15వ తేదీన చిత్రకొండ కటాఫ్ ఏరియాలో కూంబింగ్ చేపట్టగా ఎదురు కాల్పులు జరిగాయి. ఆ సమయంలో అగ్రనేతలు తప్పించుకున్నారు. అనంతరం మావోయిస్టు శిబిరం నుంచి పోలీసులు మావోల సామగ్రితో పాటు ఒక పెన్‌డ్రైవ్‌ను స్వాధీనం చేసుకున్నారు. పెన్‌డ్రైవ్‌లో ఉన్న వివరాలను మాత్రం బయటకు పొక్కనివ్వలేదు. -
దండకారణ్యంలో కూంబింగ్
చర్ల: ఆపరేషన్ సమాధాన్‌ను వ్యతిరేకించాలంటూ మావోయిస్టులు ఇచ్చిన పిలుపుతో దండకారణ్యంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌కు వ్యతిరేకంగా జనవరి 25 నుంచి 30 వరకు సభలు, సమావేశాలు నిర్వహించి ప్రజలను చైతన్యవంతులను చేయాలని, ఈ నెల 31న దేశవ్యాప్త బంద్ పాటించాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యం లో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. 5, 6 రోజులుగా సరిహద్దు అటవీ ప్రాం తంలో భారీగా మోహరించిన ప్రత్యేక పోలీసు బలగాలు ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, మిలిటెంట్లు, మిలీషియా సభ్యుల కోసం పోలీసు బలగాలు జల్లెడ పడుతుండటంతో సరిహద్దు ప్రాంతం రణరంగంగా మారింది. ఏ క్షణంలో ఏం ప్రమాదం ముం చుకొస్తుందోనని ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా, బీజాపూర్, దంతెవాడ, తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల గిరిజనులు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. దండకారణ్యలో మోహరించిన సీఆర్పీఎఫ్, స్పెషల్‌పార్టీ, కోబ్రా బలగాలు సరిహద్దుల్లో అనుమానితులుగా కనిపించే వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తూ వారి నుంచి మావోయిస్టుల సమాచారం రాబట్టే ప్రయత్నాలు చేసు ్తన్నట్లు తెలుస్తోంది. మావోయిస్టులు సభలు ఎక్కడ పెడుతున్నారు.. ఎవరైనా వెళ్తున్నారా? అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. -
కూంబింగ్ ముమ్మరం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యా ప్తంగా మూడు దఫాలుగా జరుగనున్న పంచాయతీ ఎన్నికలపై పోలీస్ శాఖ దృష్టి సారించింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా పలు జిల్లాల్లో భద్రతను కట్టుదిట్టం చేయడంతోపాటు అటవీ ప్రాంతాల్లో కూంబింగ్‌ను ముమ్మరం చేసింది. ఇటీవల జరి గిన అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకొని అలజడి సృష్టించేందుకు మావోయిస్టు ప్రయత్నాలు చేసినా, రాష్ట్ర స్పెషల్ ఇంటలిజెన్స్ బ్యూరో పోలీ సులు ఎప్పటికప్పుడు వారి చర్యలను పసిగట్టి వాటిని నిర్వీర్యం చేస్తూ వచ్చారు. తాజాగా జరుగనున్న పంచాయతీ ఎన్నికలను అడ్డుకునేందుకు మావోయిస్టు పార్టీ ప్రయత్నాలు చేస్తున్నట్టు నిఘా బృందాలు గుర్తించాయి. మంచి ర్యాల, భూపాలపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, మహ బూబాబాద్‌లోని కొన్ని గ్రామాల్లో స్థానిక దళాలు సంచరిస్తున్నట్టు తెలిసింది. దీనితో అక్కడ పోటీచేస్తున్న అభ్యర్థులు భయాందోళనకు గురైనట్టు సమాచారం. ఆయా జిల్లాల ఎస్పీలు గ్రేహౌండ్స్ బలగాలతో పాటు ప్రతీ పోలీస్‌స్టేషన్ పరిధిలో టీఎస్ఎస్పీ(స్పెషల్‌పోలీస్)బృందాలను రంగం లోకి దించారు. ఆయా గ్రామపంచాయతీలు పూర్తి స్థాయిలో అటవీ ప్రాంతంలో ఉండటంతో కూంబింగ్ విస్తృతంచేయాలని ఉన్నతాధికారులు సైతం ఆదేశించారు. దీనితో ప్రజలు అనుమానితులు కనిపిస్తే తమకు సమాచారం అందించాలని, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరి గేలా వ్యవహరించాలని సూచించార -
ప్రశాంతంగా ఓటు వేయండి...
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేశామని ఎన్నికల నోడల్ అధికారి, శాంతి భద్రతల అదనపు డీజీపీ జితేందర్ స్పష్టంచేశారు. ప్రశాంత వాతావరణంలో ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. శుక్రవారం జరగనున్న పోలింగుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేసినట్టు వెల్లడించారు. మొత్తంగా 6వేల సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించినట్టు తెలిపారు.సుమారు ఆరు జిల్లాల్లో ఈ తరహా ప్రాంతాలను గుర్తించామని, వీటిలో కొడంగల్ కూడా ఒకటని జితేందర్ తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా పోలీసు శాఖ, ఐటీ విభాగం సంయుక్తంగా రూ.125కోట్ల నగదు, ఎక్సైజ్ శాఖతో కలసి 4 లక్షల లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. రూ.6 కోట్ల విలువైన ప్లాటినం, బంగారం, వెండి, రూ. 60 లక్షల విలువ గల గంజా యి, రూ.1.6 కోట్ల విలువైన బహుమతులు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. 90,238 మందిని బైండోవర్ చేయగా, 8,482 లైసెన్స్డ్ ఆయుధాలు డిపాజిట్ చేసుకున్నట్టు తెలిపారు. 11,862 నాన్‌బెయిలబుల్ వారంట్లను అమలు చేసినట్టు తెలిపారు. కోడ్ ఉల్లం ఘన కింద 1,501 కేసులు నమోదు చేశామన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా ఉన్న 13నియోజకవర్గాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశామని, ముందస్తుగా సరిహద్దు ప్రాంతాల్లో కూంబింగ్ ముమ్మరం చేసినట్టు తెలిపారు. ఛత్తీస్గడ్, మహరాష్ట్ర అధికారులతో సమన్వయం చేసుకుంటున్నట్టు వివరించారు. నగదు పట్టుబడ్డ చోట్ల విచారణ జరిపి సంబంధిత నేతలపై కేసులు నమోదు చేసినట్టు జితేందర్ తెలిపారు. ఏపీ టీడీపీ నేత జూపూడి ప్రభాకర్‌రావు, పోటీలో ఉన్న అభ్యర్థులు సర్వే సత్యనారాయణ, మల్లారెడ్డి, జగ్గారెడ్డి, ఆనంద్‌ప్రసాద్ తదితరులపై సెక్షన్ 171 కింద కేసులు నమోదు చేసినట్టు తెలిపారు.వరంగల్, ఆదిలాబాద్, హైదరాబాద్‌లో పట్టుబడ్డ హవాలా నగదుపై ఐటీ, ఈడీ అధికారులు దర్యాప్తు జరుపుతారని జితేందర్ వెల్లడించారు. ఈ డబ్బు పొందేందుకు యత్నించిన పలువురి నేతలపై కూడా విచారణ జరిపే అవకాశం ఉందని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లోని నేతలు హైదరాబాద్‌లో ఉండాల్సి వస్తే సంబంధిత ప్రాంతంలోని రిటర్నింగ్ అధికారి నుంచి అనుమతి తీసుకోవాలని స్పష్టంచేశారు. నిబంధనలు ఉల్లంఘించి వివిధ ప్రాంతాల్లో ఎవరైనా ఉంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. పోలీస్ అధికారులపై పలు పార్టీలు, అభ్యర్థులు చేసిన ఫిర్యాదులు, ఆరోపణలపై విచారణ చేస్తున్నామని, రెండు కేసుల్లో అధికారులపై చర్యలు తీసుకున్నట్టు జితేందర్ స్పష్టంచేశారు. -
పద్మవ్యూహంలో మావోయిస్టు పార్టీ?
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు పార్టీ పద్మవ్యూహంలో చిక్కు కుందా? దండకారణ్యంగా పేరు గాంచిన 5 రాష్ట్రాల మధ్యన సేఫ్ జోన్ చేతులు దాటిపోతోందా? అంటే అవుననే అంటున్నాయి కేంద్ర నిఘా వర్గాలు. తెలంగాణ, ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర మధ్యలోని షెల్టర్ జోన్లో 4 నెలల నుంచి సీఆర్పీఎఫ్, స్పెషల్ టాస్క్‌ఫోర్స్, తెలంగాణ, ఏపీ గ్రేహౌండ్స్ చేస్తున్న కూంబింగ్ వల్ల వారికి కోలు కోలేని దెబ్బ తగిలిందని 5 రాష్ట్రాల పోలీసులు చెబుతున్నారు. తమ అధీనంలో ఉందని మావోయిస్టు పార్టీ చెప్పుకుంటున్న అబూజ్మడ్ ప్రాంతాన్నీ సీఆర్పీఎఫ్ అధీనంలోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు నిఘా వర్గాల ద్వారా తెలిసింది. మొత్తంగా నలువైపుల నుంచీ చుట్టుముడుతూ సీఆర్పీఎఫ్ పన్నిన పద్మవ్యూహం నుంచి మావోయిస్టు పార్టీ మనుగడ సాగించగలుగుతుందా అని చర్చ జరుగుతోంది. నలువైపులా క్యాంపులు ఛత్తీస్‌గఢ్, ఒడిశాలోని అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ చేసేందుకు అన్ని రాష్ట్రాల పోలీసు బలగాలు, కేంద్ర బలగాలు 60–70 కిలోమీటర్ల నడక దారిలో ప్రయాణించాల్సి వచ్చేది. కానీ 2016 నుంచి సీఆర్పీఎఫ్ తన బేస్ క్యాంపులను విస్తరిస్తూ వెళ్తోంది. అటు బీజాపూర్, ఇటు దంతెవాడ, మరోవైపు సుకుమా నుంచి ప్రతి 5 కిలోమీటర్లకు ఓ బేస్ క్యాంపు ఏర్పాటు చేస్తూ వస్తోంది. ఇలా ఇప్పటివరకు 24 బేస్ క్యాం పులు ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఒక్కో క్యాం పులో సుమారు 1,000 మంది బలగాలుండేలా ఏర్పాట్లు చేసింది. దక్షిణ ప్రాంతంగా ఉన్న బీజాపూర్, దంతెవాడ, సుకుమా నుంచి కూంబింగ్ పెంచిన సీఆర్పీఎఫ్.. అదే సమయంలో తూర్పుగా ఉన్న నారాయణ్‌పూర్, బస్తర్ నుంచీ కూంబింగ్ వేగవంతం చేసింది. ఇటు తెలంగాణ, ఏపీ ప్రాంతం నుంచి గ్రేహౌండ్స్ నిరంతం కూంబింగ్ చేస్తూనే ఉన్నాయి. దీంతో మావోయిస్టు పార్టీ కదలికలు నారాయణ్‌పూర్, బస్తర్, కాంకేర్ లోపలి ప్రాంతాలకు విస్తరించాయి. మావోయిస్టు పార్టీ చేతుల్లో ఉన్న ఈ మూడు జిల్లాల్లోని కేంద్రీకృత ప్రాంతంలోనే షెల్టర్ జోన్ ఉన్నట్లు తెలిసింది. ఇప్పుడు కేంద్ర బలగాల టార్గెట్ కూడా ఈ జోన్‌గానే సాగుతోందని తెలుస్తోంది. 4నెలలు 92 మంది.. మార్చి నుంచి ఇప్పటివరకు 5 రాష్ట్రాల కమిటీ లకు చెందిన 92 మంది మావోయిస్టులను సీఆర్పీఎఫ్ మట్టు బెట్టింది. తడపలగుట్టలో 10 మంది, గడ్చిరోలిలో 41 మంది, మరో ఎన్కౌంటర్లో 17 మంది చనిపోగా ఇతర చిన్న చిన్న ఘటనల్లో 24 మంది మృతి చెందినట్లు రాష్ట్ర నిఘా వర్గాలు తెలిపాయి. ఇందుకు ప్రతీకారంగా సీఆర్పీఎఫ్ జవాన్లు, ఇన్ఫార్మర్లు తదితరులు మొత్తం 31 మందిని మావోయిస్టు పార్టీ హతమార్చింది. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ కమిటీ, ఆంధ్రా ఒడిశా కమిటీ, దంతెవాడ కమిటీలే కార్యకలాపాలు సాగిస్తున్నాయి. అబూజ్‌మడ్‌లోనే ఉన్న తెలంగాణ, శబరి కమిటీల్లో పెద్దగా కదిలికలు లేవని నిఘా వర్గాలు తెలిపాయి. బయటపడతారా? మావోయిస్టు పార్టీకి సేఫ్ జోన్‌గా ఉన్న కాంకేర్, బస్తర్, నారాయణ్‌పూర్‌లో కేంద్ర బలగాల కార్యకలాపాలు విస్తరిస్తుండటంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. కానీ ఈ జోన్లోకి కేంద్ర బలగాలు వెళ్లడం అంత సులువైన పని కాదని నిఘా వర్గాలు అభి ప్రాయపడుతున్నాయి. ముప్పేట దాడి, వ్యూహాత్మక ఎత్తుగడ ద్వారా దఫాల వారీగా లోనికెళ్లడం సాధ్యమవుతుందని భావిస్తున్నాయి. ఏ వైపు నుంచి కూంబింగ్ చేసినా దానికి వ్యతిరేక దిశలో మావోయిస్టులు కదిలే అవకాశం లేదని, అక్కడక్కడ ఉంటూ ప్రతిదాడి చేసే అవకాశం ఎక్కువగా ఉందని అధికారులు భావిస్తున్నారు. వారి అధీ నంలోని ప్రాంతాల్లో కూంబింగ్‌కు పరిస్థితులు అనుకూలిస్తే గానీ చేయడం సులువు కాదంటున్నారు. మరోవైపు ముప్పేట దాడితో రెండు వైపులా నష్టం తీవ్రంగా ఉం టుందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. దీనిపై అన్ని రాష్ట్రాల నిఘా అధికారులు సమావేశమై చర్చించుకోవాల్సి ఉందన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల అధి కారులు సెప్టెంబర్‌లో సమావేశమై కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. -
మావోలు vs పోలీసులు
మహదేవపూర్: తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సరిహద్దు అడవుల్లో మళ్లీ పోలీసులు, మావోయిస్టుల మధ్య ఆదిపత్య పోరు మొదలైంది. వరుస ఎన్కౌంటర్లతో క్యాడర్‌ను కోల్పోతున్న మావోలు విధ్వంసాలు సృష్టించేందుకు ప్రత్యేకంగా ప్లాటూన్ దళాలను ఏర్పాటు చేసినట్లు సమాచారం. సీపీఐ మావోయిస్టు అమర వీరుల సంస్మరణ వారోత్సవాలు శనివారం నుంచి ప్రారంభమైన నేపథ్యంలో.. సాయుధులను గోదావరి దాటకుండా కట్టడి చేసేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. దీంతో 3 రాష్ట్రాల సరిహద్దు మహదేవపూర్ అడవుల్లో యుద్ధమేఘాలు అలుముకున్నాయి. జయశంకర్ భూపాలపల్లి, భద్రాది కొత్తగూడెం, ఖమ్మం, ఆదిలాబాద్, మంచిర్యాల, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలతో పాటు ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ, బీజాపూర్, సుక్మా, నారాయణపూర్, కాంకేర్, మహారాష్ట్రలోని గడ్చిరోలి, చంద్రాపూర్ జిల్లాలు గోదావరి నది తీర ప్రాంతాల్లో ఉన్నాయి. ఆయా జిల్లాల సరిహద్దుల్లో మెరుపుదాడులు చేసేందుకు 120 మంది సుశిక్షితులైన యువతీ యువకులతో సీపీఐ మావోయిస్టు పార్టీ ప్రత్యేకంగా ప్లాటూన్ దళాలను ఏర్పాటు చేసినట్లు సమాచారం. సరిహద్దు అడవులపైన పూర్తి పట్టు ఉన్న బడె చొక్కారావు అలియాస్ దామోదర్ ఆధ్వర్యంలో భారీ విధ్వంసాలు సృష్టించేందుకు వ్యూహ రచన జరిగినట్లు తెలిసింది. తెలంగాణలో పూర్వవైభవం కోసం.. తెలంగాణలో పూర్వవైభవం కోసం హరిభూషన్ నాయకత్వంలో పనిచేస్తున్న ప్రత్యేక కమిటీ ఇటీవల రాష్ట్ర సరిహద్దు అడవుల్లో 3 రాష్ట్రాల కమిటీలు, దండకారణ్యం ప్రత్యేక జోనల్ కమి టీ సమావేశం నిర్వహించినట్లు విశ్వసనీయం గా తెలిసింది. పల్లె ప్రజలతో మమేకమై పనిచేస్తూ సమస్యలపై ఎప్పటికప్పుడు వారిని చైతన్య పరిచి ఉద్యమించేందుకు ‘మిలీషియా’కమిటీలను వేసినట్లు సమాచారం. అడవుల విస్తీర్ణం అధికంగా ఉన్న జయశంకర్ భూపాలపల్లి జిల్లాను అన్నల జిల్లాగా మార్చేందుకు ఇక్కడ పెద్ద ఎత్తున విధ్వంసాలు సృష్టించి అటవీ గ్రామాల్లోని యువతీయువకుల్లో ఆత్మస్థైర్యం పెంపొందించాలని కేంద్ర కమిటీ ఆదే శాలు వచ్చినట్లు తెలిసింది. అందులో భాగంగానే జిల్లాలో అనేక చోట్ల వాల్‌పోస్టర్లు వేయడం, బ్యానర్లు కట్టడం, కరపత్రాలు పంచడం, మందుపాతరలు అమర్చడం, అక్రమార్కులకు హెచ్చరికలు జారీ చేయడం వంటి ఘటనలకు పాల్పడుతున్నారు. సరిహద్దుల్లోని ఛత్తీస్‌గఢ్‌లో రహదారులు నిర్మిస్తున్న కాంట్రాక్టర్ల వాహనాలు, యంత్రాలు, బస్సులను దహనం చేయడం, మందుపాతరలు పెట్టి పోలీసులను హతమార్చడం వంటి చర్యలకు దిగుతున్నారు. గత డిసెంబర్లో భూపాలపల్లి జిల్లాలోని పలిమెల మండలం ముకునూరు గ్రామంలో సుమారు 80 మంది సాయుధుల సంచారం, గతంలో గ్రామ బహిష్కరణ చేసిన దొరల గురించి ఆరా తీయడం, మంత్రులు వేసిన శిలాఫలకాలను ధ్వంసం చేయడం, రేగొండ మండలంలో వాల్‌పోస్టర్లు వేయడం, మహాముత్తారం మండలంలో అధికార పార్టీ నేతలను హెచ్చరిస్తూ పోస్టర్లు అంటించడం, వెంకటపూర్ మండలంలో మందుపాతరలు అమర్చడం వంటి చర్యలతో ఉనికిని చాటుతున్నారు. మావోయిస్టుల పేరిట కరపత్రాలు చర్ల: జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను నిర్వహించాలంటూ పిలుపునిచ్చిన మావోయిస్టు పార్టీ పేరుతో శనివారం మండల కేంద్రమైన చర్లలో కరపత్రాలు వెలిశాయి. పార్టీ రాష్ట్ర కమిటీ పేరిట ముద్రించిన ఈ కరపత్రాలను పూజారిగూడెంలోని ప్రధాన రహదారి వెంట వదలడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. సమరోత్సాహంతో అమరులను స్మరించుకోవాలని, అమరుల ఆశయ సాధనకు పాటుపడాలని మావోయిస్టులు ఈ కరపత్రాలలో కోరారు. నిరంతరం కూంబింగ్ ఇదిలా ఉండగా.. తెలంగాణలో మావోయిస్టులు లేరని ఒకవైపు ప్రకటనలు ఇస్తున్న పోలీసులు.. గోదావరి తీరంలో నిరంతరం కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. మావోయిస్టులు గోదావరి దాటకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టారు. తీవ్రవాద సమస్య పైన పూర్తి అవగాహన ఉన్న ఎస్పీ భాస్కరన్, డీఎస్పీ కేఆర్కే ప్రసాద్‌రావు నేతృత్వంలో పకడ్బందీ చర్యలు తీసుకుంటూ గోదావరి లోయలోని అటవీ గ్రామాల్లో అన్నలకు షెల్టర్ దొరకకుండా ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో అటు మావోయిస్టులు, ఇటు పోలీసుల మధ్య ఆధిపత్య పోరుతో అడవిబిడ్డలు నలిగిపోతున్నారు. -
ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి కాల్పుల మోత
-
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్
చర్ల/చింతూరు (రంపచోడవరం): ఛత్తీస్‌గఢ్ జిల్లా బీజాపూర్‌లో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఎనిమిది మంది నక్సలైట్లు మృతి చెందారు. మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నారు. కాల్పులు జరిగిన సమయంలో ఒకరిద్దరు నక్సలైట్లు పారిపోయినట్టు తెలుస్తోంది. వారికోసం భద్రతా దళాలు గాలిస్తున్నాయి. బైలాడిల్లా సమీపంలోని అటవీ ప్రాంతంలో దండకారణ్య సబ్ జోనల్ హెడ్ గణేష్ ఉయికే స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నాడనే సమాచారం మేరకు సుమారు 200 మంది డీఆర్జీ, ఎస్టీఎఫ్, డీఎఫ్ బలగాలకు చెందిన జవాన్లు రెండ్రోజుల క్రితం కూంబింగ్‌కు వెళ్లారు. ఈ క్రమంలో ఎనిమిది బృందాలుగా అటవీ ప్రాంతంలోకి వెళ్లిన జవాన్లకు దంతెవాడ, బీజాపూర్ సరిహద్దుల్లోని తీమ్‌నార్ ప్రాంతంలో గురువారం ఉదయం 6 గంటలకు మావోయిస్టులు ఎదురుపడ్డారు. ఈ సమయంలో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో నలుగురు మహిళలు సహా ఎనిమిది మంది నక్సలైట్లు మృతి చెందారని డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (యాంటీ నక్సల్స్ ఆపరేషన్) పి.సుందర్రాజ్ తెలిపారు. ఘటనాస్థలం నుంచి రెండు ఇన్సాస్ రైఫిళ్లు, రెండు .303 రైఫిళ్లతో సహా 12 బోర్ గన్స్, మరికొన్ని మజిల్ లోడింగ్ గన్స్ స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. కాగా ఈ సంఘటన నుంచి సబ్ జోనల్ హెడ్ గణేశ్ వుయికే తప్పించుకున్నట్లుగా తెలుస్తోందని బస్తర్ ఐజీ వివేకానంద్ సిన్హా తెలిపారు. మావోయిస్టుల మృతదేహాలను జిల్లా కేంద్రానికి తరలించి గుర్తించాల్సి ఉందని ఆయన తెలిపారు. ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నట్టు వెల్లడించారు. -
దక్షిణ కశ్మీర్లో సైన్యం కార్డన్ సెర్చ్
-
దక్షిణ కశ్మీర్లో సైన్యం కార్డన్ సెర్చ్
శ్రీనగర్: దక్షిణ కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో భద్రతా దళాలు కూంబింగ్ చేస్తుండగా మిలిటెంట్లు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఒక పౌరుడు మృతి చెందగా, ముగ్గురు సైనికులు గాయాలపాలయ్యారు. ఉగ్రవాదులు ఇళ్లలో నక్కి భద్రతా దళాలపై దాడులు చేస్తున్న నేపథ్యంలో ఆర్మీ, సీఆర్పీఎఫ్లతో కూడిన దళాలు షోపియాన్‌లోని 20కి పైగా గ్రామాల్లో గురువారం కార్డన్ సెర్చ్ ప్రారంభించాయి. హెలికాప్టర్లు, డ్రోన్లతో గగనతలం నుంచి గాలిస్తుండగా.. 4 వేల మందికి పైగా సైనికులు ప్రతి ఇంటినీ జల్లెడ పడుతున్నారు. ఈ నేపథ్యంలో షోపియాన్‌లోని చౌదరి గుండ్, కెల్లార్ ప్రాంతాల్లో రివర్స్ స్వీప్ (కూంబింగ్ అనంతరం మరోమారు అకస్మాత్తుగా సోదాలు చేపట్టడం) చేస్తుండగా.. నక్కి ఉన్న మిలిటెంట్లు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో ముగ్గురు జవాన్లు, ఓ పౌరుడికి గాయాలయ్యాయి. వెంటనే తేరుకున్న దళాలు చుట్టుపక్కల ఉన్న బృందాలకు సమాచారమిచ్చి.. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. గాయాలపాలైన పౌరుడు కొద్ది సేపటి తర్వాత మృతిచెందాడు. -
శేషాచలం అడవుల్లో కొనసాగుతున్న కూంబింగ్
తమిళ కూలీల స్థావరాలు గుర్తింపు చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల సరిహద్దులపై ప్రత్యేక నిఘా ఫారెస్టు, పోలీసు, టాస్క్‌ఫోర్స్ దాడులు ముమ్మరం భాకరాపేట: తిరుపతి టాస్క్‌ఫోర్స్ ఆధ్వర్యంలో శేషాచలం అడవుల్లో చేపట్టిన కూంబింగ్ కొనసాగుతోంది. తమిళ కూలీలు రాత్రిపూట ఉండే ప్రధాన స్థావరాలను టాస్క్‌ఫోర్స్ పోలీసులు గుర్తించారు. చిత్తూరు, వైఎస్సార్, నెల్లూరు జిల్లాలో పరిధిలో ఉన్న ఎర్రచందనం వనాలలోని 28 స్థావరాలను గుర్తించారు. రాత్రిపూట ఉండేందుకు ఈ స్థావరాలు అనువుగా ఉన్నాయని, సమీపంలో తాగునీటి వసతి ఉండడంతో కూలీలు వాటినే కుటీరాలుగా మలుచుకున్నారని టాస్క్‌ఫోర్స్ అధికారులు చెబుతు న్నారు. ఈ స్థావరాలపై దృష్టి పెట్టడంతోనే నాలుగు రోజుల క్రితం వందలాది మంది కూలీలను టాస్క్‌ఫోర్స్, ఫారెస్టు అధికారులు వైఎస్సార్ జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతంలో పట్టుకోగలిగారు. సరిహద్దులపై ప్రత్యేక నిఘా.. శేషాచలం అటవీ ప్రాంతంలోని చిత్తూరు, వైఎస్సార్ జిల్లా సరిహద్దులపై టాస్క్‌ఫోర్స్ నిఘా పెట్టింది. సరిహద్దులు దాటిపోతున్న అక్రమ వాహనాలు, అందుకు సహకరిస్తున్న వారిని కూడా గుర్తించినట్లు సమాచారం. ప్రధానంగా వైఎస్సార్ జిల్లా భాకరాపేట, చిత్తూరు జిల్లా భాకరాపేట కేంద్రాలపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మధ్య కాలంలో భాకరాపేట నుంచి టాస్క్‌ఫోర్స్, పోలీసు, ఫారెస్టు అధికారులకు సమాచారం వస్తోంది. అధికారులు అక్కడికి చేరుకునే లోపు దొంగలు తప్పించుకుంటున్నారు. ఈ క్రమంలో భాకరాపేటలో ప్రొటెక్షన్ వాచర్లు మరిన్ని ఏర్పాటు చేస్తున్నారు. దాడులు ముమ్మరం.. టాస్క్‌ఫోర్స్, పోలీసులు, అటవీ శాఖ అధికారులు దాడులు ముమ్మరం చేశారు. జిల్లా పోలీసు అధికారులు సైతం శేషాచలం అటవీ ప్రాంతంలో ఉన్న పీలేరు రూరల్ సర్కిల్ కార్యాలయం పరిధిలోని పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశారు. భాకరాపేట కేంద్రంగా నాలుగు రోడ్ల కూడలిలో సీసీ కెమెరాలు సైతం ఏర్పాటు చేసి వాహనాలను గమనిస్తున్నారు. వైఎస్సార్ జిల్లా భాకరాపేటలో నిఘా పెంచారు. -
శేషాచలంలో కట్టుదిట్టమైన భద్రత
తిరుపతి మంగళం(చంద్రగిరి): శేషాచల అటవీ ప్రాంతంలో అక్రమంగా ప్రవేశిస్తున్న కూలీలను నిలువరించేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరించి కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నట్లు డీసీసీఎఫ్ బీ.ఎన్.ఎన్. మూర్తి వెల్ల డించారు. బుధవారం ఆయన టాస్క్‌ఫోర్స్ అధికారులతో కలసి శేషాచలంలోని అన్నదమ్ముల బండ, మామిళ్లమంద, చామలరేంజ్ ప్రాంతాల్లో ఆయన కూంబింగ్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా కూలీలు ప్రవేశించే మార్గాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. బాలపల్లె రేంజ్‌ను నుంచి ఎక్కువగా ఎర్రదొంగలు అటవీ ప్రాంతంలోకి ప్రవేశిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అనంతరం కూలీలు అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసుకున్న స్థావరాలను ఆయన పరిశీలించారు. శేషాచలంలోకి అనేక మార్గాల ద్వారా కూలీలు అక్రమంగా చొరబడుతున్నట్లు ఆయన తెలిపారు. టాస్క్ ఫోర్స్, అటవీశాఖ అధికారులు ఎప్పటికప్పుడు సమన్వయం తో కూంబింగ్‌కు పూనుకుని కూలీలు ప్రవేశించకుండా చూడాలని ఆయన సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఐ భాస్కర్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
ఆర్కే లక్ష్యంగా ‘ఆపరేషన్ ఆలౌట్’
మల్కన్‌గిరి ప్రాంతంలో పోలీసుల కూంబింగ్ మల్కన్‌గిరి: మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ కోసం మళ్లీ పోలీసుల గాలింపు మొదలైంది. అక్టోబర్ నెలలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో 30 మంది మావోయిస్టులు మృత్యువాత పడగా, రామకృష్ణ అలియాస్ ఆర్కే తప్పించుకున్న విషయం విదితమే. ఈ ఘటనలో ఆర్కే గాయపడినట్లు సమాచారం. ప్రస్తుతం ఆర్కే లక్ష్యంగా ‘ఆపరేషన్ ఆలౌట్’కు పోలీసులు శ్రీకారం చుట్టారు. మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ జలాశయంలో శనివారం నుంచి బుల్లెట్ ప్రూఫ్ బోట్లతో కూంబింగ్ చేపట్టారు. చిత్రకొండ జలాశ యంలో కటాఫ్ ఏరియాలో గల జోడాం, రల్లేగడ్డ, పనసపుట్ తదితర పంచాయతీలు, పరిసర గ్రామాల్లో బీఎస్ఎఫ్, ఎస్ఓజీ బలగాలు గాలిస్తున్నాయి. ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు సంయుక్తంగా గాలింపు నిర్వహిస్తున్నాయి. 2008లో చిత్రకొండ జలాశయంలో కూంబింగ్ నిర్వహిస్తున్న 36 మంది పోలీసులు మృత్యు వాత పడ్డారు. అప్పటినుంచి అక్కడ కూంబింగ్ అంటే ఒడిశా, ఆంధ్ర పోలీసులు వెనుకాడుతున్నా రు. దీంతో ప్రస్తుతం కూంబింగ్ చర్యల కోసం బుల్లెట్‌ప్రూఫ్ బోట్లను ఏర్పాటు చేశా రు. మూడు రాష్ట్రాల సరిహద్దులో మూడు వేల మంది మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం. మూడు రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులు చర్చించి ‘ఆపరేషన్ ఆలౌట్’కు రూపకల్పన చేసినట్లు తెలిసింది. -
పక్కా సమాచారంతోనే కూంబింగ్!
► మొదట మావోలే మాపై కాల్పులు జరిపారు ► లొంగిపొమ్మని హెచ్చరించినా వినలేదు ► వారి కాల్పుల్లో కమాండో అబూ బాకర్ చనిపోయారు ► ఆత్మరక్షణ కోసమే ఎదురుకాల్పులు ► హైకోర్టులో విశాఖ ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ కౌంటర్ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్-ఒడిశా సరిహద్దుల్లో(ఏవోబీ) మావోయిస్టు అగ్రనేతల కదలికలపై విశ్వసనీయ సమాచారం అందుకున్న తరువాతనే గ్రేహౌండ్స్‌తో కలిసి కూంబింగ్ కార్యకలాపాలు చేపట్టామని విశాఖపట్నం ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ హైకోర్టుకు నివేదించారు. కూంబింగ్ సందర్భంగా తారసపడ్డ మావోయిస్టులు తమపై మొదట కాల్పులు జరిపారని, తమ గుర్తింపును తెలియచేసి లొంగిపోవాలని కోరినప్పటికీ వినిపించుకోకుండా కాల్పులు జరుపుతూనే ఉన్నారన్నారు. వారి కాల్పుల్లో మొదట పోలీసులే గాయపడ్డారని, ఈ పరిస్థితుల్లో ఆత్మరక్షణ కోసమే ఎదురు కాల్పులు జరపామన్నారు. ఈ ఘటనలో పోలీసులు ఎక్కడా చట్ట ఉల్లంఘనలకు పాల్పడలేదని శర్మ తెలిపారు. మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌పై ఏపీ పౌరహక్కుల సంఘం ప్రధాన కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మొత్తం వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు విశాఖ రూరల్ ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ బుధవారం కౌంటర్ దాఖలు చేశా రు. దీనికి సమాధానమిచ్చేందుకు గడువు కావాలని పిటిషనర్ తరఫు న్యాయవాది రఘునాథ్ ధర్మాసనాన్ని కోరారు. ధర్మాసనం అంగీకరిస్తూ తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. చట్టవ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్న మావోలు ‘విశాఖ జిల్లా ముంచింగ్‌పుట్ పోలీస్‌స్టేషన్ పరిధి నుంచి ఒడిశా రాష్ట్రంలోని మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో విస్తరించి ఉన్న అటవీ ప్రాంతంలో మావోయిస్టు అగ్రనేతలు సంచరిస్తూ స్థానికులను చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేలా రెచ్చగొడుతున్నట్లు మాకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో ఏపీ, ఒడిశా పోలీసులు, గ్రేహౌండ్ కమాండోస్ సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. మావోయిస్టులు తమ చట్ట వ్యతిరేక కార్యకలాపాలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌ఘడ్, జార్ఖండ్, బిహార్, మహారాష్ట్రలకు విస్తరించారు. ఆంధ్రప్రదేశ్‌లో పెండింగ్‌లో ఉన్న పలు కేసుల్లో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నారు. గత నెల 24న రామగుహ పరిధికి పోలీసులు చేరుకున్నారు. వారిని చూడగానే మావోయిస్టులు కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో గ్రేహౌండ్ కమోండో సతీష్ గాయపడగా, మరో కమోండో అబూబాకర్ మృతి చెందారు. తమ గుర్తింపును తెలియచేసి లొంగిపోవాలని హెచ్చరించినా మావోలు పట్టించుకోలేదు. దీంతో ఆత్మరక్షణ కోసం మేం కూడా ఎదురు కాల్పులు జరిపాం’ అని రాహుల్‌దేవ్ తన కౌంటర్లో పేర్కొన్నారు. ఒడిశా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ‘ఈ ఘటనపై చిత్రకొండ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కాల్పుల్లో మొత్తం 24 మంది చనిపోయినట్లు ఒడిశా పోలీసుల ద్వారా తెలిసింది. ఇందులో 13 మంది పురుషులు, 11 మంది మహిళలు ఉన్నారు. 11 మంది మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అందజేశాం. మిగిలిన మృతదేహాలను తీసుకునేందుకు ఎవరూ రాకపోవడంతో ఖననం చేశాం. ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కడా చట్ట ఉల్లంఘనలకు పాల్పడలేదు. ఘటన జరిగింది ఒడిశాలో. కేసు ఆ రాష్ట్ర పరిధిలోనే నమోదైంది. వాస్తవాలను వక్రీకరిస్తూ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. అందువల్ల వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ వ్యాజ్యాన్ని కొట్టేయండి.’ అని శర్మ తన కౌంటర్లో కోరారు. -
నల్లమలలో కూబింగ్‌కు ‘స్పెషల్’ బృందాలు
కర్నూలు: నల్లమల అటవీ ప్రాంతంలో కూంబింగ్ కోసం స్పెషల్ పార్టీ బృందాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ ఆకె రవికృష్ణ తెలిపారు. శుక్రవారం ఉదయం జిల్లా పోలీసు కార్యాలయంలోని పరేడ్ మైదానంలో సివిల్ , ఏఆర్ సిబ్బంది నిర్వహించిన కవాతును ఎస్పీ పరిశీలించారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న 2013 బ్యాచ్‌కు చెందిన పోలీస్ కానిస్టేబుళ్లను జిల్లా కేంద్రానికి పిలిపించి వారి వయస్సు, వ్యక్తిగత వివరాలను అడిగి తెలుసుకున్నారు. కూంబింగ్ ఆపరేషన్ కోసం స్పెషల్ పార్టీ బృందాలుగా వారిని ఏర్పరిచి.. ఫిట్నెస్ కోసం మూడు నెలల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని, అనుమతి లేకుండా ర్యాలీలు, ధర్నాలు చేస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగించే వారిపై చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరించాలన్నారు. ఎస్ఐలు వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకొని ఎప్పటికప్పుడు వీవీఐపీల కదలికల సమాచారాలను యూనిట్ ఆఫీసర్లకు అందించాలన్నారు. వీఐపీలకు రక్షణ కల్పించాలన్నారు. ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఒబేసిటీ తరగతులు ప్రారంభించాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు చంద్రశేఖర్‌రెడ్డి, ఐ.వెంకటేష్, డీఎస్పీలు డీవీ రమణమూర్తి, వెంకటాద్రి, సీఐలు నాగరాజురావు, మధుసూదన్‌రావు, ఆర్ఐలు జార్జ్, రంగముని, రామకృష్ణ, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
మావోల వేట
► కూంబింగ్ ముమ్మరం ►అటవీ గ్రామాల్లో ప్రత్యేక చెక్ పోస్టులు ► అజ్ఞాతంలో ఉన్న వారి ఫొటోలతో పోస్టర్లు సాక్షి, చెన్నై : రాష్ట్రంలో మావోయిస్టుల కోసం కూంబింగ్ ముమ్మరం చేశారు. చాపకింద నీరులా సాగుతున్న కార్యకలాపాల్ని తుంచి పడేసేందుకు తగ్గ అస్త్రాలతో ప్రత్యేక బలగాలు అడవుల్లో జల్లెడ పట్టే పనిలో పడ్డాయి. అటవీ గ్రామాల్లో ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటయ్యాయి. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టుల ఫొటోలతో కూడిన పోస్టర్లను జన సంచారం అత్యధికంగా ఉండే ప్రదేశాల్లో పోలీసులు ఏర్పాటు చేసే పనిలో పడ్డారు. రాష్ట్రంలో పశ్చిమ పర్వత శ్రేణుల్ని కేంద్రంగా చేసుకుని ఒకప్పుడు మావోయిస్టులు తమ కార్యకలాపాల్ని సాగించిన విషయం తెలిసిందే. కొడెకైనాల్లో జరిగిన ఎన్కౌంటర్లో తమ నాయకుడు నవీన్ ప్రసాద్ హతం కావడంతో రాష్ట్రంలో మావోయిస్టుల కదలికలు క్రమంగా తగ్గాయి. రాష్ట్రంలో మావోయిస్టులు అన్న పేరుకు ఆస్కారం లేని విధంగా, ఉక్కు పాదంతో అణచి వేశారు. ఈ పరిస్థితుల్లో కొన్నేళ్లుగా చత్తీస్గడ్, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో మావోయిస్టుల్ని అణచివేయడానికి సాగుతున్న ఎన్కౌంటర్ల పర్వంతో రాష్ట్రంలో మళ్లీ ఆ పేరు తెర మీదకు వచ్చింది. మళ్లీ పశ్చిమ పర్వత శ్రేణుల్ని కేంద్రంగా చేసుకుని మావోయిస్టుల కార్యకలాపాలు సాగుతున్నట్టుగా సంకేతాలు బయలు దేరాయి. దీంతో తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్‌లు ఉమ్మడి ఆపరేషన్‌కు చర్యలు చేపట్టడంతో పశ్చిమ పర్వత శ్రేణుల్లో మళ్లీ కూంబింగ్ మొదలెట్టారు. అదే సమయంలో గత ఏడాది అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు నాయకుడు రూబేష్, సైనాలతో పాటు ఐదుగురు పట్టుబడడం, ఈ ఘటనకు నిరసనగా కేరళ సరిహద్దుల్లో దాడులు సైతం చోటు చేసుకోవడంతో గాలింపు తీవ్రతరం అయిది. క్రమంగా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు ఒకరి తర్వాత మరొకరు పట్టుబడుతూ వచ్చారు. దీంతో పశ్చిమ పర్వత శ్రేణుల్ని అడ్డాగా చేసుకుని మరెందరు దాగి ఉన్నారో, జనం మధ్యలో ఇంకెందరు తిష్ట వేసి ఉన్నారో అన్న అనుమానాలు బయలు దేరాయి. ఈనేపథ్యంలో బుధవారం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏఓబీ లో ఎన్కౌంటర్ల పర్వం సాగుతుండడం, మావోయిస్టుల మృతుల సంఖ్య పెరగడం, మరెందరో తప్పించుకుని ఉడాయిస్తుండడంతో రాష్ట్రంలోని పశ్చిమ పర్వత శ్రేణులపై అధికార వర్గాలు నిఘా పెంచారు. అక్కడి నుంచి తప్పించుకు వచ్చే వారికి ఇక్కడ నక్కి ఉన్న వాళ్లెవరైనా ఆశ్రయం కల్పించేందుకు అవకాశాలు ఉన్నాయని, మా వోయిస్టుల మధ్య సమాచార సంబంధాలు ఉన్న నేపథ్యంలో ముం దు జాగ్రత్త చర్యగా వేటను ముమ్మరం చేసే పనిలో క్యూబ్రాంచ్, ప్రత్యేక బలగాలు సిద్ధమయ్యాయి. గురువారం ఉదయం నుంచి అడవుల్లోకి ఈ బలగాలు చొచ్చుకు వెళ్లే పనిలో పడ్డాయి. జల్లెడ పట్టే రీతిలో గాలింపు తీవ్రతరం చేశారు. ఇక, అటవీ గ్రామాల్లో అనేక చోట్ల ప్రత్యేక చెక్ పోస్టుల్ని ఏర్పాటు చేసి, అటు వైపు వచ్చే వాహనాలను, అందులో ఉన్న వాళ్లను తనిఖీల అనంతరం అనుమతించే పనిలో పడ్డారు. ప్రధానంగా నీలగిరి, ఈరోడ్, కోయంబత్తూరుల మీదుగా కేరళ-తమిళనాడు సరిహద్దుల్లో విస్తరించి ఉన్న అటవీగ్రామాల్లో అనుమానితుల సంచారంపై ఆరా తీస్తున్నారు. ఎవరైనా సంచరిస్తుంటే, తమకు సమాచారం ఇవ్వాలని సూచిస్తూ ఫోన్ నం బర్లను ఇచ్చే పనిలో పడ్డారు. అలాగే, జన సంచారం అత్యధికంగా ఉండే అటవీ గ్రామాల సరిహద్దుల్లోని పట్టణాల్లో అజ్ఞాతంలో ఉన్న ముప్పైకు పైగా మావోయిస్టుల ఫొటోలతో కూడిన పోస్టర్లను ఏర్పాటు చేసే పనిలో పడ్డారు. వీరి ఆచూకీ తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించి ఉన్నారు. ఇక, నీలగిరి జిల్లాల్లో అయితే, కోరంకుత్తు, హ్యారింగ్ టన్, వెల్లింగ్ టన్, అప్పర్, లోయర్ భవానీ, కీన్న కొలవై, ఇలియ సిగై, ముత్తులి తదితర కేరళ సరిహద్దు చెక్ పోస్టుల్లో భద్రతను మరింతగా కట్టు దిట్టం చేశారు. అనుమానితులను విచారించి, వారి వివరాల సేకరణ అనంతరం వదలిపెడుతున్నారు. -
ఆర్కే ఎక్కడ?
►క్షేమంగానే ఉన్నారా.. ఉంటే ఎక్కడ ఉన్నట్లు! ► కొడుకు, గన్మెన్లు ఎన్కౌంటర్లో మృత్యువాత ►ఆర్కేపోలీసుల అదుపులోనే ఉన్నారంటున్న వరవరరావు సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: దేశ చరిత్రలోనే అతిపెద్ద ఎన్కౌంటర్.. రోజురోజుకీ పెరుగుతున్న మావోల మృతుల సంఖ్య.. ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ అలియాస్ ఆర్కే ఆచూకీపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఆర్కే పోలీసుల అదుపులో ఉన్నారా?.. తప్పించుకుని అజ్ఞాతంలోకి వెళ్లారా?.. అన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఏవోబీలో వరుసగా ఐదురోజుల్లో మూడు ఎన్కౌంటర్లు జరిగినట్లు పోలీసులు చెప్పడం, ఇంకా కూంబింగ్ కొనసాగుతోందని ప్రకటిస్తుండటంతో ఖాకీ వ్యూహం ఏమిటన్నది అంతుచిక్కడం లేదు. వందలు దాటి ఇప్పుడు వేలాదిమంది పోలీసులు ఏవోబీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. ఆర్కే లక్ష్యంగానే పోలీసులు భారీగా కూంబింగ్ చేస్తున్నారన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి. సోమవారం జరిగిన ఎన్కౌంటర్ ఘటన నుంచి ఆర్కే తప్పించుకున్నారని గత నాలుగు రోజులుగా వినిపిస్తున్న వాదనలకు భిన్నంగా విరసం నేత వరవరరావు ప్రకటన చేయడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఆర్కే పోలీసుల అదుపులోనే ఉన్నారని, వెంటనే ఆయన్ని కోర్టులో హాజరుపరచాలని వరవరరావు గురువారం హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు. ఘటన జరిగి ఐదురోజులైనా ఆర్కే క్షేమంగా ఉన్నట్టు ఎక్కడి నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడం ఆందోళన రేకిత్తిస్తోంది. హెలికాప్టర్లతో జల్లెడ... మరో పక్క పోలీసు అధికారులు మాత్రం ఆర్కే తమ అదుపులో లేరని చెబుతున్నారు. గాలింపు చర్యలు మాత్రం తీవ్రతరం చేశామని అంగీకరిస్తున్నారు. సోమవారం భారీ ఎన్కౌంటర్ జరిగినప్పుడు కూడా హెలికాప్టర్లను వినియోగించని పోలీసులు.. గత రెండు రోజులుగా హెలికాప్టర్లతో ఏరియల్ సర్వే చేస్తున్నారు. బలిమెల బ్యాక్ వాటర్ ప్రాంతంలో కూడా నిఘా పెంచారు. గాయాలపాలైన ఆర్కేకు ఆర్ఎంపీ లేదా ఇతర ప్రైవేటు వైద్యుల సేవలు అందకుండా చర్య లు తీసుకుంటున్నారు. ఈ మేరకు ఏజెన్సీలోని వైద్యులపై ఆంక్షలు విధిస్తున్నారు. ఏవోబీలో మావోయిస్టు పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న ఆర్కేను అంతమొందిస్తే పార్టీ పూర్తిగా నిర్వీర్యమవుతుందన్న అంచనాతోనే పోలీసులు మరింత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్కే అడవిలోనే సురక్షితంగా ఉన్నాడా, తీవ్రగాయాలతో ఇబ్బందులు పడుతున్నాడా, పౌరహక్కుల సంఘాల నేతలు ఆరోపిస్తున్నట్టు పోలీసుల చెరలో ఉన్నాడా అనేది అంతుబట్టకుండా ఉంది. ఆ మందులు అతనికేనా! గురువారం విశాఖ జిల్లా సిర్లిమెట్ట వద్ద జరిగిన కాల్పుల్లో ఇద్దరు మావోలు మృతి చెందగా, వారి నుంచి కొన్ని మందులు(ఇంజక్షన్లు, మాత్రలను) స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చూపించారు. ఆ మందులు అనారోగ్యంతో ఉన్న ఆర్కే కోసమేనా.. అన్న వాదనలు తెరపైకి వచ్చాయి. సోమవారం పోలీసుల కాల్పుల్లో ఆర్కేకి కూడా తీవ్రగాయాలు అయ్యాయని, దీంతో ఆయన్ను కొందరు దళ సభ్యులు సంఘటన ప్రాంతం నుంచి మోసుకువెళ్లి సురక్షిత ప్రాంతానికి తరలించినట్టు చెబుతున్నారు. ఈ క్రమంలో గురువారం సిర్లిమెట్ట వద్ద మావోలు పోలీసులకు చిక్కి ఉంటారన్న ప్రచారం సాగుతోంది. ఈ కోణంలోనే పౌరహక్కుల సంఘాల నేతలు, విరసం నేత వరవరరావు తదితరులు ఆర్కే కూడా పోలీసుల అదుపులో ఉన్నట్టు అనుమానిస్తున్నారని అంటున్నారు. -
ఏఓబీలో భారీగా కూంబింగ్
వై.రామవరం: ఆంధ్రా– ఒడిశా సరిహద్దు (ఏఓబీ) అయిన తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల అటవీ ప్రాంతంలో పోలీసులు భారీ ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నారు. వై.రామవరం మండలం నుంచి భారీగా పోలీసు బలగాలు అటవీ ప్రాంతంలోకి వెళ్లాయి. తూర్పు గోదావరి జిల్లా సరిహద్దు ప్రాంతమైన ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర అటవీ ప్రాంతంలో బుధవారం పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టుల మృతి చెందిన సంగతి తెలిసిందే. వై.రామవరం మండల సరిహద్దు ప్రాంతమైన చింతూరు మండలంలో పోలీసు ఇన్ఫార్మర్లు అనే నెపంతో మంగళవారం నలుగురు గిరిజనులను మావోయిస్టులు కిడ్నాప్ చేయడం పాఠకులకు గుర్తుండే ఉంటుంది. గత నెలలో అదే మండలంలో పాస్టర్ మారయ్యను హతమార్చడం, రెండు నెలల క్రితం వై.రామవరం మండల సరిహద్దు ప్రాంతమైన విశాఖ జిల్లా ,కొయ్యూరు మండలం మర్రిపాకల గ్రామ సమీప అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టునేతలు ఆజాద్, ఆనంద్లతోపాటు ఒక మహిళ మృతి చెందారు. ఈ వరుస సంఘటనలతో తూర్పు గోదావరి జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తం అయ్యింది. చింతూరు మండలంలో కిడ్నాప్ చేసిన నలుగురు గిరిజనులను తీసుకుని మావోయిస్టులు ఏఓబీలోకి ప్రవేశించారన్న సమాచారంతో ఒక పక్క తూర్పు, మరోపక్క విశాఖ జిల్లాల పోలీసులు అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. ప్రధాన రహదారుల్లోను, అనుమానాస్పద ప్రదేశాల్లోను తనిఖీలు నిర్వహిస్తూ అపరిచితులు,అనుమానాస్పద వ్యక్తులపై గట్టి నిఘా ఉంచారు. ఏఎన్ఎస్, గ్రే హౌండ్స్, సీఆర్పీఎఫ్ పోలీసులు కూంబింగు నిర్వహిస్తున్నారు. -
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్ : మావోయిస్టులు మృతి
ఖమ్మం: ఛత్తీస్‌గఢ్ దంతేవాడ జిల్లాలో శుక్రవారం ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మరణించారు. దంతేవాడ - బీజాపూర్ జిల్లాల సరిహద్దు ప్రాంతమైన సర్సఫాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఆ విషయాన్ని పసిగట్టిన మావోయిస్టులు... పోలీసులపై కాల్పులకు దిగారు. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమై ఎదురు కాల్పులకు దిగారు. దీంతో ఇరు పక్షాల మధ్య హోరాహోరీ కాల్పులు జరిగాయి. అనంతరం మావోయిస్టులు పరారైయ్యారు. పోలీసులకు సంఘటన స్థలంలో ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలను గుర్తించారు. మృతుల్లో ఓ మహిళ కూడా ఉందని పోలీసులు తెలిపారు. మావోయిస్టుల కోసం పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. -
దండ కారణ్యంలో దడ
ఖమ్మం జిల్లా సరిహద్దు దండకారణ్యంలో యుద్ధమేఘాలు అలముకున్నాయి. ఈనెల 28నుంచి వచ్చేనెల 3వ తేదీ వరకు మావోయిస్టు పార్టీ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలకు రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. వారోత్సవాలకు ముందే జిల్లా సరిహద్దు ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులు వరుస సంఘటనలకు పాల్పడుతున్నారు. సరిహద్దు మండలాల్లో పోలీస్ బలగాలు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. మావోయిస్టు పార్టీకి పురుడు పోసిన చారు మజుందార్ 1972 జూలై 28న మరణించారు. ఆయన సంస్మరణార్థం ఏటా దేశవ్యాప్తంగా మావోయిస్టు పార్టీ ప్రభావం ఉన్న రాష్ట్రాల్లో వారంరోజులపాటు సంస్మరణ వారోత్సవాలు నిర్వహిస్తుంది. అయితే ఖమ్మం జిల్లా సరిహద్దున ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో ఏటా జిల్లా కమిటీ, కేకేడబ్ల్యూ (కరీంనగర్, ఖమ్మం, వరంగల్), శబరి ఏరియా (చర్ల, వెంకటాపురం, చింతూరు) కమిటీల ఆధ్వర్యంలో వారోత్సవాలు నిర్వహించేవారు. ఇటీవల సరిహద్దులో మావోయిస్టు కార్యకలాపాలు చాలా వరకు తగ్గాయి. అయితే సంస్మరణ వారోత్సవాలు సమీపించడంతో ఏకంగా రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ, కేకేడబ్ల్యూ కమిటీల పేరుతో చర్ల, వెంకటాపురం మండలాల్లో పోస్టర్లు, కరపత్రాలు వెలిశాయి. వారోత్సవాలను ఆదివాసీలు, గిరిజన ప్రజలు విజయవంతం చేయాలని ఈ మూడు కమిటీలు పిలుపునిచ్చాయి. రాష్ట్ర కమిటీ పేరుతో పోస్టర్లు రావడం, వెంకటాపురం-భద్రాచలం రోడ్డులో మూడురోజుల క్రితం టిఫిన్బాంబు పెట్టి మావోయిస్టులు హల్చల్ చేయడంతో.. జిల్లా సరిహద్దుల్లోనే రాష్ట్ర కమిటీ మకాం వేసిందనే ప్రచారం జరుగుతోంది. ఆదివాసీ సంతల్లో తనిఖీలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బలగాలు ఆదివాసీ సంతల్లో తనిఖీలు ముమ్మరం చేశాయి. చర్ల, వెంకటాపురం, వాజేడు, దుమ్ముగూడెం మండలాలు ఛత్తీస్‌గఢ్‌కు సరిహద్దున ఉండటంతో ఇక్కడ జరిగే వారాంతపు సంతలకు వచ్చే వారిపై నిఘాపెట్టారు. అలాగే, భద్రాచలం నుంచి చర్ల, వెంకటాపురం, వాజేడు వరకు వెళ్లే వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. అనుమానితుల వివరాలను సేకరిస్తున్నారు. ఈ పరిస్థితులతో దండకారణ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆదివాసీలు ఆందోళనలో ఉన్నారు. -
రూటు మార్చిన ఎర్ర కూలీలు
- కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు - గాల్లోకి రెండు రౌండ్ల కాల్పులు - ఇద్దరు కూలీల అరెస్టు భాకరాపేట(చిత్తూరు జిల్లా) శేషాచలం అడవుల్లోకి చొరబడిన ఎర్రకూలీలు టాస్క్‌ఫోర్స్, పోలీసులపై గొడ్డళ్లు, రాళ్లతో దాడికి తెగబడ్డారు. దీంతో కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. పోలీసులు గాలిలోకి రెండు రౌండ్ల కాల్పులు జరపడంతో పారిపోయారు. ఈ క్రమంలో ఇద్దరు కూలీలను అరెస్టు చేశారు. ఈ వివరాలను పీలేరు రూరల్ సీఐ మహేశ్వర్ గురువారం భాకరాపేట సీఐ కార్యాలయం ఆవరణలో విలేకరులకు వివరించారు. తమిళనాడు జువాదిహిల్స్కు చెందిన పలువురు శేషాచలం అడవుల్లోకి వెళ్లినట్లు సమాచారం అందడంతో బుధవారం రాత్రి నుంచి భాకరాపేట ఘాట్ రోడ్డు నుంచి పుట్టగడ్డ అటవీ ప్రాంతం వైపు కూంబింగ్ చేపట్టామన్నారు. రాళ్లు, గొడ్డళ్లతో దాడి గురువారం తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో కూలీలను గుర్తించి పట్టుకునేందుకు ప్రయుత్నించామన్నారు. తమిళ కూలీలు రాళ్లు, గొడ్డళ్లతో దాడికి దిగారని తెలిపారు. దీంతో టాస్క్‌ఫోర్స్ కానిస్టేబుల్ దిలీప్‌కుమార్‌కు తీవ్ర గాయాలు అయ్యాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో వారిని చెదరగొట్టేందుకు గాల్లోకి రెండు రౌండ్ల కాల్పులు జరిపామని వివరించారు. కూలీలు దుంగలను వదిలి అడవిలోకి పారిపోతుండగా జువాదిహిల్స్కు చెందిన సంపత్, స్వామినాథన్‌ను అదుపులోకి తీసుకున్నామన్నారు. విచారణలో 20 మంది ఉన్నారని పట్టుబడ్డ కూలీలు చెప్పారని పేర్కొన్నారు. వారి నుంచి 300 కేజీల 9 దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.7 లక్షలు ఉంటుంది. గాయుపడ్డ కానిస్టేబుల్‌ను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించామని పేర్కొన్నారు. రూటు మార్చిన తమిళ కూలీలు తమిళ కూలీలు రైళ్లు, బస్సుల్లో వచ్చి పాకాల, నేండ్రగుంట, కొటాల రైల్వే స్టేషన్లలో దిగుతున్నారని, అలాగే చిత్తూరు నుంచి పులిచెర్ల వుండలం మంగళంపేట చేరుకుని భీమవరం అడవుల గుండా భాకరాపేట ఘాట్ రోడ్డు దాటి అడవిలోకి ప్రవేశిస్తున్నట్టు గుర్తించామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పుట్టగడ్డ అటవీ ప్రాంతానికి కూడా రోడ్డు దాటి అడవిలోకి జారుకున్నట్లు పేర్కొన్నారు. దాడుల్లో టాస్క్‌ఫోర్స్ ఎస్ఐ అశోక్‌కుమార్, ఆర్ఎస్ఐ భాస్కర్, భాకరాపేట ఎస్ఐ చంద్రమోహన్, ఎఫ్ఎస్వో వెంకటసుబ్బయ్యు, ఎఫ్‌బీవో శ్రీరాములు, టాస్క్‌ఫోర్స్ పోలీసులు పాల్గొన్నట్లు చెప్పారు. -
పోలీసుల కూంబింగ్ : ఎర్రచందనం కూలీలు అరెస్ట్
తిరుపతి : తిరుపతి సమీపంలోని కరకంబాడీ వద్ద టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంగళవారం కూంబింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా 9 మంది ఎర్రచందనం కూలీలను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి భారీగా ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఎర్రచందనం దుంగల విలువ రూ. 30 లక్షలు ఉంటుందని టాస్క్‌ఫోర్స్ పోలీసులు వెల్లడించారు. అలాగే శ్రీనివాసమంగాపురం సమీపంలో టాస్క్‌ఫోర్స్ పోలీసుల కూంబింగ్ కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఓ ఎర్రచందనం కూలీని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి బియ్యం, పప్పు దినుసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పట్టుబడిన వారంతా తమిళనాడు వాసులను పోలీసులు చెప్పారు. -
ఎన్కౌంటర్లో మహిళా మావోయిస్టు మృతి
సరిహద్దు ఛత్తీస్‌గఢ్‌లో సోమవారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో ఒక మహిళా మావోయిస్టు చనిపోయింది. కుంట పోలీస్‌స్టేషన్ పరిధిలోని గోర్ఖ అట వీప్రాంతంలో స్పెషల్ పార్టీ పోలీసులు కూంబింగ్ చేపట్టారు. అదేసమయంలో వారికి మావోయిస్టులు తారసపడ్డారు. ఈ సందర్భంగాజరిగిన ఎదురుకాల్పుల్లో మడకం హిడ్మె అనే మావోయిస్టు చనిపోగా మిగతా వారు పరారయ్యారు. మృతురాలి వద్ద ఉన్న బర్మార్ తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
మారిన పోలీస్ వ్యూహం!
మావోయిస్టు ఉద్యమాన్ని దెబ్బతీసే ప్రయత్నం నేరుగా ఎదుర్కోవడం కంటే నైతికంగా కుంగ దీయడంపైనే దృష్టి దళ సభ్యులనే పావులుగా వాడుకుంటున్న ఖాకీలు మావోయిస్టులను దెబ్బతీయడంలో పోలీసులు తమ వ్యూహాన్ని మార్చారు. కూంబింగ్ ద్వారా నేరుగా అన్నలను ఎదుర్కోవడం కంటే ఉద్యమాన్ని నైతికంగా దెబ్బతీసే ప్రయత్నాలు మొదలు పెట్టారు. దీంట్లో భాగంగా ఇప్పటికే ముఖ్యనేతలు లొంగిపోయేలా చేయడంతో పాటు మిగిలి ఉన్న నాయకులపై దళ సభ్యుల్లో వ్యతిరేకత వచ్చేలా ప్రచారం చేస్తున్నారు. దీని కోసం లొంగిపోతున్న దళ సభ్యులనే పావులుగా వాడుకుంటున్నారు. విశాఖపట్నం: ఇటీవల మావోయిస్టు అగ్ర నేతలు అనారోగ్యం, ఎన్కౌంటర్ల వల్ల వరుసగా కన్నుమూశారు. ఆజాద్, కుడుముల రవి వంటి అత్యంత ముఖ్య నాయకత్వాన్ని దళం కోల్పోయింది. దీంతో ఏవోబీలో మావోయిస్టు ఉద్యమానికి నాయకత్వ లోపం ఏర్పడింది. దీనిని తమకు అనులంగా మార్చుకోవాలనుకున్న పోలీసులు వేగంగా పావులు కదిపారు. కొత్త ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ రాగానే మన్యంలో రహస్యంగా పర్యటించారు. మావోయిస్టు ఏరియా కమిటీ మెంబర్ వంతల వసంతను ఈ నెల 23న పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా మావోయిస్టు మహిళ కంపెనీ తొలి కమాండర్ సరితతో పాటు కోరుకొండ ఏరియా కమిటీ కమాండర్ బోనంగి రాములమ్మ, దళ సభ్యురాలు విజయలను లొంగిపోయేలా చేశారు. గత నెల 19నే దళం నుంచి తమకు తాముగా బయటకు వచ్చామని సరిత, రాములమ్మ చెబుతున్నారు. కాని వారి కుటుంబ సభ్యుల సహకారంతో పోలీసులే బయటకు తీసుకువచ్చినట్లు సమాచారం. వీరిని తమ అదుపులో ఉంచి ఉద్యమానికి సంబంధించి కీలక సమాచారం తెలుసుకున్నారు. వీరి ద్వారా కేడర్‌లో కొందరిని సంప్రదించి, వారూ లొంగిపోయేలా ప్రభావితం చేశారు. త్వరలోనే మరి కొందరు తమకు లొంగిపోయేలా సన్నాహాలు పూర్తిచేశారు. ఉద్యమాన్ని పునఃనిర్మించాలని కేంద్ర నాయకత్వం భావిస్తున్న తరుణంలో అసలు ఉద్యమమే అనవసం అనే సంకేతాలను దళంలో బలంగా చొప్పించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దానిలో భాగంగానే తమకు లొంగిపోయిన మావోయిస్టుల చేతే చలపతిపై ఆరోపణలు చేయిస్తున్నారని తెలిసింది. అదీ మహిళల చేత చెప్పించడం ద్వారా ఉద్యమంలోకి కొత్తగా వెళ్లాలనుకునే వారికి హెచ్చరికలు జారీ చేసినట్లయింది. దీంతో కేడర్‌ను పెంచుకోవాలనుకుంటున్న కేంద్ర కమిటీకి దెబ్బకొట్టినట్లయింది. చలపతి పద్ధతి బాగోలేదు మావోయిస్టు నేతలు కుడుముల రవి, గణేష్ వంటి వారు మా సమస్యలను అర్థం చేసుకునేవారు. ఇప్పుడున్న చలపతి కేడర్‌తో మంచిగా ఉండటం లేదు. ఏమీ పట్టించుకోవడం లేదు. ఏదైనా అతను చెప్పే విధానం సరిగ్గా ఉండదు. కేంద్ర కమిటీకి కూడా అతనిపై చాలా సార్లు ఫిర్యాదు చేశాం. ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో ఆజాద్ చనిపోయిన తర్వాత నాయకత్వ లోపం కనిపించింది. నాలాగే చాలా మంది చలపతితో విభేదించి లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే మావోయిస్టులు కిశోర్, నాగేశ్వరావు ఉద్యమం నుంచి బయటకు వచ్చి తమ ఇళ్లల్లో ఉంటున్నారు. - కుడబాల లక్ష్మి ఎలియాస్ సరిత, మావోయిస్టు డిప్యూటీ కమాండర్ సరైన నాయకత్వం లేదు మావోయిస్టు ఉద్యమానికి సరైన నాయకత్వం లేదు. కనీసం దళ సభ్యుల బాగోగులు చూసేవారు లేరు.అనారోగ్యం వస్తే వైద్యం కూడా చేయించడం లేదు. ప్రజలు కూడా వారికి సహకరించడం లేదు. పోరాటం చేయడానికి బాక్సైట్ తప్ప మరో సమస్య వారికి కనిపించడం లేదు. అంతేకాకుండా ఉన్న నాయకుల నుంచి ఆదరణ కరువైంది. నిర్బంధం ఎక్కువైంది. మా నుంచి కూడా వారికి ప్రమాదం పొంచి ఉంటోంది. ఈ నేపధ్యంలో లొంగిపోవడం తప్ప దళంలో ఉన్నవారికి మరో మార్గం కనిపించడం లేదు. అందుకే మా సిబ్బంది సహకారంతో లొంగిపోతున్నారు. - రాహుల్‌దేవ్ శర్మ, జిల్లా ఎస్పీ -
మన్యంలో మారణహోమం
► ఎన్కౌంటర్లో ముగ్గురు మావోలు హతం ► మృతుల్లో అగ్రనేత ఆజాద్? ► ఉద్యమానికివరుస దెబ్బలు సాక్షి, విశాఖపట్నం/కొయ్యూరు : మన్యం మరోసారి రక్తసిక్తమయింది. కొయ్యూరు మండలంలో బుధవారం రాత్రి తుపాకుల మోత మోగింది. భారీ ఎన్‌కౌంటర్‌తో మావో ఉద్యమానికి కోలుకోలేని దెబ్బ తగిలింది. అగ్రనేత ఆజాద్ సహా ఇద్దరు మహిళా మావోయిస్టులు పోలీసుల ఎన్కౌంటర్లో ప్రాణాలు విడిచారు. అదే నిజమైతే విశాఖ మన్యంలో మావోయిస్టులకు తీరని నష్టం వాటిల్లినట్లే. ఇటీవల మావోయిస్టులకు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. తాజా ఎన్కౌంటర్లో గాలికొండ ఏరియా కమిటీ కమాండర్ గోపాల్ అలియాస్ ఆజాద్ హతమైనట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. సంఘట స్థలంలో ఏకే 47 తుపాకీని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెబుతున్న దాన్ని బట్టి ఈ విషయం నిర్ధారణవుతోంది. మిగిలిన ఇద్దరు మహిళా మావోయిస్టులు ఎవరన్నది తెలియాల్సి ఉంది. కొయ్యూరు మండలం మర్రిపాక, జెర్రికొండ గ్రామాల మధ్య జరిగిన ఈ ఎన్కౌంటర్లో ఆజాద్ చనిపోయాడనే వార్త కలకలకం రేపుతోంది. అసలు ఆ ప్రాంతంలో అగ్ర నేతతోపాటు 15 మంది మావోయిస్టులు ఎందుకు ఉన్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి ఆజాద్ స్థాయి నేతలు దండకారణ్యంలో ఉంటారు. వారున్న ప్రాంతానికి కూంబింగ్ దళాలు వెళ్లడం దాదాపు అసాధ్యం. వారికి వారుగా మన్యం వెలుపలకు వస్తే తప్ప పట్టుకోవడానికి కూడా పోలీసులు సాహసించరు. కానీ ఆజాద్ కూంబింగ్ పోలీసులు వెళ్లగలిగే ప్రాంతంలోనే ఉండటం పోలీసులకు కలిసివచ్చిందని చెప్పవచ్చు. ఆజాద్ కుటుంబం మొత్తం మావోయిస్టు ఉద్యమానికే అంకితమైంది. విశాఖపట్నం జిల్లాకు చెందిన గోపాల్ అలియాస్ ఆజాద్ తల్లిదండ్రులు లక్ష్మణరావు, అర్జునమ్మ కూడా మాజీ మావోయిస్టులే. కొంతకాలం క్రితం పోలీసులకు లొంగిపోయి విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం కరకవానిపాలెంలో నివాసం ఉంటున్నారు. ఆయన సోదరి అరుణ కూడా ఒడిశాలో మావోయిస్టు పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. మిగిలింది ఇద్దరే: ఆజాద్ చనిపోవడం మవోయిస్టులు జీర్ణించుకోలేరు. ఎందుకంటే వారికి ఇటీవల వరుసగా ఇలాంటి సంఘటనలే ఎదురవుతున్నాయి. అగ్రనేతలను, కేడర్‌ను కోల్పోతున్నారు. ఉద్యమంలో కీలకంగా, కార్యకలాపాల్లో అత్యంత చురుగ్గా ఉండే ఏవోబీ ఎస్ఆర్సీ (సెంట్రల్ రీజన్ కమిటీ) కమాండర్ కుడుముల వెంకటరమణ అలియాస్ రవి గత నెల 9న అనారోగ్యంతో మృతి చెందారు. రవి మరణం ఈస్టు డివిజన్‌పై ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం ఈస్టు డివిజన్‌కు చలపతి, ఆజాద్‌లు నేతృత్వం వహిస్తున్నారు. వీరిద్దరూ మైదాన ప్రాంతం నుంచి వచ్చిన వారు. ఇప్పుడు ఆజాద్ మరణిస్తే మైదాన నాయకుల్లో ఇక మిగిలింది చలపతి ఒక్కరే. రవి మరణం తరువాతగిరిజన మావోయిస్టు నేతగా బాకూరి వెంకటరమణ అలియస్ గణేష్ మాత్రమే మిగిలారు. 2010లో జరిగిన చెరువూరు ఎన్కౌంటర్లో గణేష్‌కు గాయాలు కావడంతో కంటివ్యాధులొచ్చాయని చెబుతున్నారు. కేంద్ర కమిటీ సభ్యులు మినహా విశాఖ ఏజెన్సీలో ఉద్యమాన్ని నడిపించేందుకంటూ చివరికి మిగిలింది చలపతి, గణేష్‌లు మాత్రమే. గడిచిన ఏడాదిలో పంగి భాస్కరరావు అలియాస్ సూర్యం, పంగి అప్పన్న అలియాస్ రామన్న, కొర్రా శ్రీరాములుతోపాటు 64 మంది మిలీషియా సభ్యులు, 18మంది సానుభూతి పరులను పోలీసులు అరెస్ట్ చేశారు. లొంగుబాట్లను ప్రోత్సహిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం మన్యంలో జరిగిన ఎన్కౌంటర్లో ఒడిశాకు చెందిన గిరిజనులను హతమార్చారు. వారు ఆర్మ్డ్ మిలీషియా సభ్యులుగా చెప్పుకొచ్చారు. ఓ వైపు ఎన్కౌంటర్లు చేస్తూ, మరోవైపు లొంగుబాట్లకు ఉసిగొల్పుతూ పోలీసులు పన్నుతున్న వ్యూహాలకు మావో ఉద్యమం మసకబారుతోంది. -
వేట ముమ్మరం
ఏవోబీని జల్లెడ పడుతున్న బలగాలు ఒడిశా నుంచి బీఎస్ఎఫ్ ఏపీ నుంచి గ్రేహౌండ్స్ మోహరింపు కొయ్యూరు: ఆంధ్ర-ఓడిశా సరిహద్దు(ఏవోబీ)ని బలగాలు జల్లెడపడుతున్నాయి. ఓడిశాలో బీఎస్ఎఫ్ బలగాలు కూంబింగ్ ప్రారంభిస్తే.. ఆంధ్ర నుంచి గ్రేహౌండ్స్ బలగాలు గాలింపు చేపడుతున్నాయి. తూర్పు కనుమల్లో ఆకు రాల్చే చెట్లు అధికం. ప్రస్తుతం చెట్లన్నీ ఆకురాల్చి మోడుగా కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితి కూంబింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. అడవిలో ఎవరున్నది దూరం నుంచే తెలిసిపోతుంది. దీంతో వేటను పోలీసులు ముమ్మరం చేశారు. ఒడిశాను ఆనుకుని ఉన్న జిల్లాలోని మూడు మండలాలల్లో నలువైపుల నుంచి కూంబింగ్ ఉధృతం చేశారు. చింతపల్లి, గూడెంకొత్తవీధి,జి.మాడుగుల మండలాలు సరిహద్దులో ఉన్నాయి. మావోయిస్టుల స్థావరాలుగా భావించే ఈ ప్రాంతాల్లో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. కొద్ది రోజులుగా మావోయిస్టులు మౌనంగా ఉన్నారు. అంటే కేడర్‌ను బలోపేతం చేసుకుంటున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో కూంబింగ్ చేపట్టారు. ఇదే రోజుల్లో గతేడాది పెదలంక కొత్తూరు ప్రాంతంలో మావోయిస్టు అగ్రనేత ఒకరు శిక్షణ నిర్వహించారు. కేంద్ర కమిటీ సభ్యులు లేదా ఏవోబీకి చెందిన అగ్రనేతలు ఎక్కువగా మార్చి లేదా ఏప్రిల్‌లో ఇటువైపుగా వస్తుంటారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని పోలీసులు అప్రమత్తమయ్యాయి. గతేడాది కేంద్ర మిలటరీ కమిషన్ నేత నంబళ్ల కేశవరావు ఏవోబీలో సంచరించారు. అతని రాకను తెలసుకున్న బలగాలు అప్పట్లో పెద్ద ఎత్తున కూంబింగ్ చేపట్టాయి. తాజాగా పెదలంక కొత్తూరు ప్రాంతంపై నిఘా పెంచినట్టు తెలుస్తోంది.మల్కన్‌గిరి ప్రాంతంలో కూడా బీఎస్ఎఫ్ బలగాలు అటువైపుగా కూంబింగ్ చేపట్టాయి. రెండు రాష్ట్రాల బలగాలు సంయుక్తంగా వేట కొనసాగించడం సులువుగా ఉంటోంది. మరోవైపు జిల్లా పోలీసు యంత్రాంగం ఏర్పాటు చేసిన ఔట్ పోస్టులు కూడా రెండు రాష్ట్రాల మధ్య దళసభ్యుల రాకపోకలను నియంత్రిస్తున్నాయి. ఇదంతా మావోయిస్టుల కార్యకలాపాలను తగ్గించేందుకు వీలుగా ఉంటుందని పోలీసు అధికారులు భావిస్తున్నారు. -
పోలీసుల వేధింపులతో ఆత్మహత్యాయత్నం..!
► మావోయిస్టులకు సహకరిస్తున్నారని..! ► ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ► విచారణ పేరిట చిత్రహింసలు? ► క్రిమిసంహారక మందు తాగి ఒకరు ఆత్మహత్యాయత్నం ► మంచిర్యాల ఆస్పత్రిలో చికిత్స దహెగాం :మావోయిస్టులకు సానుభూతిపరులుగా పని చేస్తూ.. వారికి సహకరిస్తున్నారనే అనుమానంతో పోలీసులు ఇద్దరు గిరిజనులను అదుపులోకి తీసుకోని వారిని విచారణ చేపట్టారు. దీంతో ఖాకీల దెబ్బలు తట్టుకోలేక ఒకరు ఆత్మహత్యాయత్నంచేసుకున్న సంఘటన శనివారం మండలంలో కలకలం రేపింది. వివరాలిలా ఉన్నాయి. మండల పరిధిలోని రావులపల్లి గ్రామానికి చెందిన సిడాం శ్రీనివాస్, పేపర్గాం గ్రామానికి చెందిన కుడ్మెత సుగుణయ్య రైతులు. వీరు మావోయిస్టులకు సహకరిస్తున్నారనే అనుమానంతో శుక్రవారం రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో దహెగాం పోలీసులు తీసుకొచ్చారని విశ్వసనీయ సమాచారం. అదుపులో తీసుకున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు మావోయిస్టులు ఎక్కడ ఉన్నారు..? వారికి మీరు సహకరిస్తున్నారా? వారి డంప్ ఎక్కడ ఉందని చితక బాదడంతో దెబ్బలను భ రించలేక సిడాం శ్రీనివాస్ ఫలాన చోట మావోయిస్టుల డంప్ ఉందని పోలీసులకు వివరించినట్లు తెలిసింది. శనివారం రావులపల్లికి సమీపంలోని వ్యవసాయ పొలంలోకి పోలీసులను తీసుకెళ్లి.. పొలంలోని చేనులో ఉన్న మంచం ఎక్కి పురుగుల మందు తాగినట్లు గ్రామస్తుడొకరు చెప్పాడు. మందు తాగిన వ్యక్తిని పోలీసులే చికిత్స నిమిత్తం.. బెల్లంపల్లి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా పరిస్థితి విషమించడంతో అతన్ని మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. పోలీసుల అదుపులో ఉన్న కుడ్మెత సుగుణయ్య స్థానిక పోలీస్టేషన్లో ఉండగా అతన్ని పోలీసులు ఎక్కడికి తీసుకెళ్లారో తెలియరాలేదు. అనుమానాస్పదంగా కనిపించాడు.. మేం కూంబింగ్ కోసం వెళ్లి వస్తుంటే శ్రీనివాస్ అనుమానాస్పదంగా కన్పించాడు. అతన్ని విచారిస్తుండగానే పురుగుల మందు తాగాడు. చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించాం. - దీకొండ రమేశ్, ఎస్ఐ, దహెగాం -
వనమంత గంజాయ్
అందాలకు నిలయమైన మన్యం అక్రమాలకు వేదిక అవుతోంది. ఏటేటా పంట విస్తీర్ణం పెరగడంతో పాటు ఏజెన్సీ అంతటా గంజాయి వాసనలు గుప్పుమంటున్నాయి. ఆంధ్ర-ఒడిశా సరిహద్దు(ఏవోబీ) దాటి ఇతర రాష్ట్రాలకు ఈ మత్తు గమ్మత్తుగా రవాణా అవుతోంది. ఎక్సైజ్, పోలీసు అధికారులు దాడులు జరుపుతున్నా..నెలకు రూ.వంద కోట్లు వంతున ఏటా రూ.వేలాది కోట్లు పైనే ఈ వ్యాపార లావాదేవీలు జరుగుతున్నట్టు అంచనా. ఖాకీలు దూరని కారడవుల్లో పెద్ద ఎత్తున గంజాయి పండిస్తున్నారు. ఏటా ఆగస్టు నెలాఖరు నుంచి గంజాయి కోతలు ముమ్మరంగా సాగుతాయి. అనంతరం ఆరబెట్టిన ఎండు గంజాయిని వివిధ మార్గాల్లో రవాణా చేస్తున్నారు. ఎక్కువగా కర్నాటక, గోవా, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ రాష్ట్రలకు తరలిస్తున్నారు. ఏవోబీతో పాటు ఒడిశాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలవైపు ఎక్సైజ్, సివిల్ పోలీసులు కన్నెత్తి చూడడం లేదు. కూంబింగ్ బృందాలు తిరుగుతున్నా.. వాటి ధ్యాసంతా దళసభ్యులపైనే ఉంటోంది. దీనిని ఆసరాగా చేసుకుని తూర్పుగోదావరి, విశాఖ, విజయనగరం జిల్లాల మీదుగా అక్రమంగా దీనిని తరలిస్తున్నారు. ఏటా రూ. వేల కోట్ల టర్నోవర్ గంజాయికి అంతర్జాతీయ మార్కెట్లో భారీ గిరాకీ. కిలో రూ.7 వేల నుంచి రూ.10 వేల వరకు అమ్ముడుపోతోంది. ముఖ్యంగా శీలావతి రకం కాసులు కురిపిస్తోంది. దీంతో సంప్రదాయ పద్ధతులను వీడి ఆధునిక విధానాల్లో దీని పెంచుతున్నారు. రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడుతున్నారు. ఎత్తయిన కొండలు, అడవుల్లో ఊటగెడ్డలు, పారుగెడ్డలు నుంచి రెండు మూడు కిలోమీటర్ల వరకు చిన్నసైజు పైపులు ఏర్పాటు చేసి దీని సాగుకు అవసరమైన నీటిని మళ్లించడం గమనార్హం. -
ముష్కరులు హతం
కశ్మీర్లో ముగిసిన ఎన్కౌంటర్.. 48 గంటల పాటు కాల్పులు ఈడీఐ భవనంలో కొనసాగుతున్న కూంబింగ్ ♦ భారీ స్థాయిలో ఆయుధాలు, మందుగుండు లభ్యం ♦ ఈ ఉగ్రవాదులు విదేశీయులు కావచ్చు: సైన్యం శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లా పాంపోర్‌లో మూడు రోజులుగా ఉగ్రవాదులతో కొనసాగిన భద్రతాదళాల ఎదురుకాల్పులు సోమవారం ముగిశాయి. సైన్యానికి చెందిన ప్రత్యేక దళాలు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. హతులు పాక్‌లోని లష్కరే తోయిబా ఉగ్రవాదులుగా అనుమానిస్తున్నారు. ఈ ఎదురు కాల్పుల్లో ఐదుగురు భద్రతా సిబ్బంది, ఒక పౌరుడు ప్రాణాలు కోల్పోయారు. ఆత్మాహుతి బృందంగా భావిస్తున్న ఉగ్రవాదులు భారీ ఆయుధ సామగ్రితో శనివారం మధ్యాహ్నం శ్రీనగర్ - జమ్మూ జాతీయ రహదారిపై సీఆర్పీఎఫ్ కాన్వాయ్ మీద దాడి చేసి.. సమీపంలోని ప్రభుత్వ బహుళ అంతస్తుల భవనం ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్లోకి చొరబడిన విషయం విదితమే. అందులో నక్కిన ఉగ్రవాదులతో శనివారం సాయంత్రం మొదలైన భద్రతా బలగాల ఎదురు కాల్పులు సోమవారం మూడో రోజూ కొనసాగాయి. భద్రతా బలగాల సంఖ్యను పెంచి.. భవనంలో దాక్కున్న ఉగ్రవాదులను ఏరివేసేందుకు మోర్టార్ షెల్స్‌ను ప్రయోగించారు. ‘‘భవనంలో నక్కిన ముగ్గురు ఉగ్రవాదులను మేం హతమార్చాం. వారు విదేశీయులుగా కనిపిస్తున్నారు.’’ అని ఆపరేషన్ పూర్తయిన తర్వాత విక్టర్ ఫోర్స్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేజర్ జనరల్ అరవింద్దత్తా మీడియాకు తెలిపారు. భారీ మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 44 గదులు, లాబీలు, వాష్‌రూమ్‌లు, పై అంతస్తులో రెస్టారెంట్లున్న ఆ భవనాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టినట్లు వివరించారు. ఉగ్రవాదులు చొరబడిన భవన సముదాయంలో వారు దాక్కునేందుకు చాలా ప్రదేశాలు ఉండటం, నక్కి ఉండి దాడులు చేస్తుండటం వల్ల.. వారిని ఎదుర్కొనేందుకు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్లాల్సి ఉందని.. అందుకే ఆపరేషన్ పూర్తవటానికి ఇంత సమయం పట్టిందని ఒక ప్రశ్నకు సమాధానంగా వివరించారు. ఉగ్రవాదులు భవనంలోకి చొరబడిన వెంటనే బలగాలు వేటాడేందుకు వెంటనే ప్రయత్నించగా.. ఉగ్రవాదులు గ్రెనేడ్లు విసిరారని దీంతో బలగాలు వెనక్కు తగ్గాల్సి వచ్చిందన్నారు. సైన్యం రంగ ప్రవేశం చేసి ఆపరేషన్‌ను కొనసాగించిందని చెప్పారు. ఈ దాడి లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ దాడిగా కనిపిస్తోందని సీఆర్పీఎఫ్ డెరైక్టర్ జనరల్ ప్రకాశ్‌మిశ్రా ఢిల్లీలో విలేకరులతో పేర్కొన్నారు. ఇటీవల కశ్మీర్‌లోని ఉదంపూర్, పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లలో భద్రతా బలగాలు లక్ష్యంగా జరిగిన దాడుల తరహాలోనే తాజా దాడులు ఉన్నాయని వివరించారు. కెప్టెన్ పవన్‌కు అశ్రునయనాలతో వీడ్కోలు జింద్ (హరియాణా): కశ్మీర్లో ఉగ్రవాదులతో పోరాడుతూ ఆదివారం అమరుడైన కెప్టెన్ పవన్‌కుమార్ (23) భౌతికకాయానికి హరియాణాలోని ఆయన స్వగ్రామంలో పూర్తి సైనిక లాంఛనాల మధ్య అశ్రునయనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. రాష్ట్రంలో రిజర్వేషన్ కోసం ఆందోళన చేస్తున్న జాట్ నిరసనకారులు.. సైన్యం, ప్రభుత్వ విజ్ఞప్తితో అమరుడి గ్రామానికి వెళ్లే మార్గాల్లో అవరోధాలను తొలగించి దారి ఇచ్చారు. అంతకుముందు.. త్రివర్ణ పతాకం కప్పిన కెప్టెన్ పవన్‌కుమార్ భౌతికకాయానికి పఠాన్‌కోట్‌లో పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించాక.. ప్రత్యేక హెలికాప్టర్లో జింద్ జిల్లాలోని ఆయన స్వగ్రామం బధానాకు తీసుకువచ్చారు. జాట్ల ఆందోళనతో ఈ జిల్లా కూడా ప్రభావితమైనప్పటికీ.. భారీ సంఖ్యలో ప్రజలు అమరుడికి నివాళులర్పించేందుకు తరలివచ్చారు. కెప్టెన్ పవన్‌కుమార్ కజిన్ సోదరుడు సందీప్ చితికి నిప్పంటించగా.. సైన్యం తుపాకి వందనం సమర్పించింది. తన ఏకైక కుమారుడిని జాతికి అందించానని, అది తనకు ఎంతో గర్వకారణమని కెప్టెన్ పవన్‌కుమార్ తండ్రి రాజ్బీర్ ఆదివారం నాడు పేర్కొన్న విషయం తెలిసిందే. సైన్యం నుంచి సీనియర్ అధికారులు, కెప్టెన్ అభిమన్యు, ఓంప్రకాశ్ ధాన్కర్ సహా రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ మంత్రులు తదితరులు అమరుడికి తుది నివాళులర్పించారు. అమర జవాన్లకు ఘన నివాళులు శ్రీనగర్/జమ్మూ: అమరులైన మరో ఇద్దరు జవాన్లు లాన్స్ నాయక్ ఓంప్రకాశ్, కెప్టెన్ తుషార్ మహాజన్‌ల భౌతిక కాయాలకు.. శ్రీనగర్‌లోని బాదామి బాగ్ సైనిక కేంద్రంలో ఘనంగా నివాళులర్పించారు. తర్వాత తుషార్ మహాజన్ మృతదేహాన్ని సొంతూరు ఉదంపూర్‌కు తరలించారు. సైనిక స్థావరానికి తుషార్ మృతదేహం చేరుకోగానే.. అతడి తల్లి కన్నీటి పర్యంతమయ్యారు. సైన్యంలో చేరటమే లక్ష్యంగా పెట్టుకున్న తన కుమారుడు పదహారేళ్లకే ఎన్డీఏకు ఎంపికయ్యాడని తుషార్ తండ్రి, మాజీ ప్రిన్సిపల్ దేవ్‌రాజ్ అశ్రునయనాలతో తెలిపారు. అతడి స్వప్నం అదే కావటంతో తాము ఎన్నడూ అభ్యంతరం చెప్పలేదన్నారు. -
సేఫ్ జోన్!
ఏవోబీలో మావోలదే పైచేయి దండకారణ్యంలోకి అడుగుపెట్టని పోలీసులు వెలుపల కూంబింగ్కే పరిమితమవుతున్న బలగాలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన మావో అగ్రనేతలు మావోయిస్టులపై ఉమ్మడి పోరు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఘంటాపథంగా చెబుతోంది. అవసరమైతే అదనపు బలగాలను దించేందుకు సిద్ధంగా ఉన్నామంటోంది. అయితే ప్రభుత్వ వ్యూహాల కంటే ముందుగానే మావోయిస్టులు ప్రతివ్యూహాలు రచిస్తున్నారు. హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జిల్లా పర్యటనకు వస్తున్న నేపథ్యంలో ముందుగానే సేఫ్‌జోన్‌లోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం విశాఖ మన్యంలో తమ కార్యకలాపాలను కూడా తగ్గించుకున్నారు. ఏవోబీలో వారి ప్రాబ ల్యానికి అడ్డుకట్ట వేయడం అంత సులువుకాదని నిపుణులు చెబుతున్నారు. విశాఖపట్నం: కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు చేపడుతున్న ఉమ్మడి ఆపరేషన్‌ను ముందే పసిగట్టిన మావోయిస్టు అగ్రనేతలు ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆంధ్రా-ఒడిశా బో ర్డర్ (ఏవోబీ) ఇన్చార్జ్ చలపతి, మావోయిస్టు మొదటి కేంద్ర ప్రాంతీయ (సీఆర్సీ) కమాండర్ కుడుముల వెంకట్రావు అలియస్ రవి, మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు నంబల్ల కేశవరావు అలియస్ గంగన్నలతో పాటు దళం ముఖ్య సభ్యులు సరిత, ఆజాద్, ఆనంద్‌లతో సహా ఎవరి అలజడీ మన్యంలో కనిపించడం లేదు. ఏవోబీని విడదీయలేరు విశాఖలో కేంద్ర హోం మంత్రి సమావేశం ఉండటంతో రెండు నెలల ముందు నుంచే ప్రత్యేక బలగాలను దించి మన్యంలో కూంబింగ్ ప్రారంభించారు. అయితే అది మావోయిస్టులను పట్టుకునేందుకు మాత్రం కాదు.. వారిని అడవిలోకి పంపడమే దాని లక్ష్యం. ఏవోబీలో పోలీసులకే తెలియని ప్రాంతాల్లో మావోయిస్టులు తరదాచుకుంటున్నారు. ఇంతవరకు ఏ బలగాలూ ఆ ప్రదేశాల దరిదాపులకు వెళ్లింది లేదంటున్నారు. అలాంటి ప్రాంతాల నుంచి మావోయిస్టులను వెళ్లగొట్టాలంటే అది అసాధ్యమంటున్నారు. కాని ప్రభుత్వాలు మారినప్పుడల్లా మావోయిస్టులపై ఏదో విధంగా పోరాటం చేస్తున్నట్లు చూపించుకోవడానికే ప్రయత్నిస్తుంటాయని, రాజ్‌నాథ్ సమావేశం కూడా అలాంటిదేనని దళం భావిస్తున్నట్లు సమాచారం. అమలు జరిగేలోగా పుంజుకోనున్న బలం ఇటు రాష్ట్ర పోలీసు అధికారులు కూడా తాము కోరినట్లుగా అన్నీ సమకూర్చితే తప్ప మావోలను అణచివేయడం కష్టమని నివేదిక ఇచ్చారు. ఆర్థిక, మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన కేంద్రం ఈ నివేదికలోని అంశాలను ఎన్నింటిని ఆచరణలోకి తీసుకువస్తుందనే దానిపై పోలీసుల భవిష్యత్ ప్రణాళిక ఉండబోతోంది. ఇదంతా జరగడానికి ఏన్నేళ్లు పడుతుందో చెప్పలేం. ఈ లోగా సరిహద్దు రాష్ట్రాలైన ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి కేడర్‌ను రప్పించి ఉద్యమాన్ని బలోపేతం చేసుకోవాలని మావోయిస్టులు ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. -
రూ.60 లక్షల ఎర్రచందనం స్వాధీనం
ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు అటవీ అధికరులు జరుపుతున్న కూంబింగ్‌లో ఇప్పటివరకు రూ. 60 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు జిల్లా చంద్రిగిరి మండలంలోని నాగయ్యగారి పల్లెలో మంగళవారం కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులు అక్రమంగా ఎర్ర చందనం తరలించడానికి ప్రయత్నిస్తున్న 11 మంది ‘ఎర్ర’ కూలీలను గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ. 60 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలతో పాటు 2టాటా సుమోలను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అధికారులు కూంబింగ్‌ను కొనసాగిస్తున్నారు. -
పఠాన్‌కోట్ దాడికి పాకిస్థాన్‌లోనే పథక రచన..!
-
భారీ గా ఎర్రచందనం పట్టివేత
బుధవారం అర్థరాత్రి టాస్క్‌ఫోర్స్ పోలీసులు రూ.50 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను పట్టుకున్నారు. వివరాలివీ.. తిరుపతి రూరల్ మండలం మంగళంలోని రిక్షా కాలనీ, జూపార్క్ వద్ద అర్థరాత్రి టాస్క్‌ఫోర్స్ పోలీసులు కూంబింగ్ చేస్తుండగా ఎర్రచందనం కూలీలు తారసపడ్డారు. వారు రాళ్లతో దాడికి దిగగా పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో కూలీలు పలాయనం చిత్తగించారు. ఆ ప్రదేశంలో గాలించగా రూ.50 లక్షల విలువ చేసే ఎర్రచందనం దుంగలను పోలీసులు గుర్తించారు. ఈ సందర్భంగా తమిళనాడుకు చెందిన ఒక కూలీని పట్టుకున్నారు. మిగిలిన వారి కోసం గాలింపు ముమ్మరం చేశారు. -
హంట్ ఫర్ 'రెడ్' స్మగ్లర్స్
-
ఏజెన్సీలో రెండు మందుపాతర్లు స్వాధీనం
ప్రజావిముక్తి గెరిల్లా సైన్యం (పీఎల్జీఏ) వారోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో పోలీసులు రెండు మందుపాతర్లను స్వాధీనం చేసుకున్నారు. విశాఖ జిల్లా కొయ్యూరు మండలం బూదరాళ్ల పంచాయతీ చల్దిగెడ్డ అటవీ ప్రాంతంలో కొయ్యూరు ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా.. భూమిలో పాతిపెట్టిన రెండు మందుపాతర్లను పసిగట్టి తొలగించారు. ఈ ప్రాంతంలో కూబింగ్ నిర్వహిస్తున్న విషయం తెలిసి తమపై దాడి చేయడానికే మావోయిస్టులు వీటిని అమర్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. -
ఆదిలబాద్ జిల్లాలో కూంబింగ్ చేస్తున్న పోలీసులు
-
తేనెటీగల దాడి : 15 మంది పోలీసులకు గాయాలు
విశాఖపట్నం : విశాఖపట్నం జిల్లా చింతపల్లి మండలం బలపం అటవీ ప్రాంతంలో గురువారం కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులపై తేనెటీగలు ఆకస్మాత్తుగా దాడి చేశాయి. ఈ దాడిలో 15 మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సహచర పోలీసులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. స్థానిక వైద్యులు వారికి ప్రాథమిక చికిత్స అందించారు. ఈ దాడి కారణంగా కూంబింగ్‌ను పోలీసులు తాత్కాలికంగా నిలిపివేశారు. -
భారీగా ఎర్రచందనం స్వాధీనం
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న అటవీ అధికారులు భారీగా ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకన్నారు. మండల పరిధిలోని కళ్యాణి డ్యాం సమీపంలోని పెద్దగుండు వద్ద రెండున్నర టన్నుల ఎర్ర చందనం దుంగలను తరలించడానికి ప్రయత్నిస్తున్న ఇద్దరు వ్యక్తులతో పాటు స్కార్పియో, స్విఫ్ట్, ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న 90 దుంగల విలువ సుమారూ రూ. 2 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనావేశారు. -
భారీగా ఎర్రచందనం డంప్ స్వాధీనం
వెలుగొండ అడవుల్లో భారీఎత్తున నిల్వ ఉంచిన ఎర్రచందనం దుంగల డంప్‌ను స్పెషల్ పార్టీ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. ఈ దుంగలను నెల్లూరు జిల్లాకు తరలించినట్లు తెలిసింది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా రాపూరు సమీప వెలుగొండ అడవుల్లో గత రెండురోజులుగా స్పెషల్ పార్టీ పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ కూంబింగ్‌లో సుమారు రూ.50 లక్షల విలువ చేసే 50 ఎర్రచందనం దుంగలు దొరికినట్లు సమాచారం. గతంలో ఇక్కడ పనిచేసిన ఓ పోలీసు అధికారి పర్యవేక్షణలో డంప్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. అయితే ఎర్రచందనం దుంగలు స్వాధీనం విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. వెలుగొండల్లో ఇంకా ఎర్రచందనం దుంగలు ఉన్నాయనే విశ్వసనీయ సమాచారంతో ముమ్మరంగా గాలింపుచర్యలు చేపడుతున్నారు. -
నెల్లూరు అడవుల్లో పోలీసుల కూంబింగ్
-
మావోయిస్టు అగ్రనేత సవ్యసాచి పండా అరెస్టు
రాయగడ : మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. మావోయిస్టు అగ్రనేత సవ్యసాచి పండాను బరంపురం పోలీసులు అరెస్ట్ చేశారు. ఒడిశాలోని గంజాం జిల్లాలో సవ్యసాచి పండాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సవ్యసాచిపై రూ.17 లక్షల రివార్డు ఉంది. మరోవైపు ఒడిశాలో కూంబింగ్ నిర్వహిస్తున్న జవాన్ల నుంచి సీపీఐ మావోయిస్టు అగ్రనేతలు ఆర్కే, దయ తప్పించుకున్నట్లు తెలిసింది. రాయగడ, కొరాపుట్ జిల్లాల సరిహద్దులో నారాయణపట్న, కొప్పడంగి ప్రాంతంలో గల బ్రిడ్జిగుడ గ్రామ సమీపంలోని అడవుల్లో సహీద్ వారోత్సవాలు నిర్వహించేందుకు మావోయిస్టులు సన్నాహాలు చేస్తున్నారు. ఇక్కడికి మావోయిస్టు పార్టీ కేంద్ర, రాష్ట్ర స్థాయి నాయకులు వచ్చారు. ఈ సమాచారం తెలుసుకున్న వీహెచ్ఎఫ్ 118, 28వ బెటాలియన్ బలగాలు బుధవారం రాత్రి ఆ ప్రాంతంలో కూంబింగ్ ప్రారంభించాయి. సాయుధ బలగాల కదలికలను గమనించిన మావోయిస్టు నేతలు పరారయ్యారని తెలిసింది. తప్పించుకున్న వారిలో మావోయిస్టు నేతలు దయ, ఆర్కే, జంబు తదితరులున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. వీరు రఫ్‌కోన మీదుగా లులుపొదర్ కలహండి ప్రాంతానికి వెళ్లారని భావిస్తున్నారు. అక్కడున్న మావోయిస్టు శిబిరం నుంచి 4 టిఫిన్ క్యారియర్ బాంబులు, మందుపాతరకు వినియోగించే 50 మీటర్ల వైరు, ఎనిమిది ఎలక్ట్రానిక్ డిటొనేటర్లు, ఇతర సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఇక్కడ పోలీసులు కూంబింగ్ ముమ్మరం చేశారు. -
తప్పించుకున్నమావోయిస్టు అగ్రనేతలు?
రాయగడ: ఒడిశాలో కూంబింగ్ నిర్వహిస్తున్న జవాన్ల నుంచి సీపీఐ మావోయిస్టు అగ్రనేతలు ఆర్కే, దయ తప్పించుకున్నట్లు తెలిసింది. రాయగడ, కొరాపుట్ జిల్లాల సరిహద్దులో నారాయణపట్న, కొప్పడంగి ప్రాంతంలో గల బ్రిడ్జిగుడ గ్రామ సమీపంలోని అడవుల్లో సహీద్ వారోత్సవాలు నిర్వహించేందుకు మావోయిస్టులు సన్నాహాలు చేస్తున్నారు. ఇక్కడికి మావోయిస్టు పార్టీ కేంద్ర, రాష్ట్ర స్థాయి నాయకులు వచ్చారు. ఈ సమాచారం తెలుసుకున్న వీహెచ్ఎఫ్ 118, 28వ బెటాలియన్ బలగాలు బుధవారం రాత్రి ఆ ప్రాంతంలో కూంబింగ్ ప్రారంభించాయి. సాయుధ బలగాల కదలికలను గమనించిన మావోయిస్టు నేతలు పరారయ్యారని తెలిసింది. తప్పించుకున్న వారిలో మావోయిస్టు నేతలు దయ, ఆర్కే, జంబు తదితరులున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. వీరు రఫ్‌కోన మీదుగా లులుపొదర్ కలహండి ప్రాంతానికి వెళ్లారని భావిస్తున్నారు. అక్కడున్న మావోయిస్టు శిబిరం నుంచి 4 టిఫిన్ క్యారియర్ బాంబులు, మందుపాతరకు వినియోగించే 50 మీటర్ల వైరు, ఎనిమిది ఎలక్ట్రానిక్ డిటొనేటర్లు, ఇతర సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఇక్కడ పోలీసులు కూంబింగ్ ముమ్మరం చేశారు. -
'అధికారంలోకి రాగానే కొమ్ములొచ్చాయా?'
-
శేషాచలం అడవుల్లో కూంబింగ్!
-
తమిళనాట మావోయిస్టుల వేట
తమిళనాడులోని ఊటీ అడవుల్లో మావోయిస్టుల కోసం వేట ముమ్మరమైంది. గిరిజన ప్రాంతాల్లో తమ కార్యకలాపాలకు అధికారులు అడ్డం పడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారంటూ ఇటీవలే నలుగురు సాయుధుల బృందం ఒకటి ఓ కానిస్టేబుల్‌ను బెదిరించింది. దీంతో ఈ ప్రాంతాల్లో మావోయిస్టులు ఉన్నారని భావించిన పోలీసు అధికారులు.. ఊటీ కొండలు సహా తమిళనాడులోని పలు అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ ఆపరేషన్లను ముమ్మరం చేశారు. కేరళలోని మనంతవాడి ప్రాంతంలో ప్రమోద్ అనే ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇంట్లోకి ఓ మహిళ సహా నలుగురు మావోయిస్టులు దూసుకెళ్లి, చంపుతామని బెదిరించారని పోలీసువర్గాలు అంటున్నాయి. అతడి మోటారు సైకిల్‌ను మావోయిస్టులు తగలబెట్టారు. దీంతో స్పెషల్ టాస్క్‌ఫోర్స్ బృందం అటవీశాఖాధికారులతో కలిసి తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో మావోయిస్టుల వేట ముమ్మరంగా సాగిస్తోంది.