- కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు
- గాల్లోకి రెండు రౌండ్ల కాల్పులు
- ఇద్దరు కూలీల అరెస్టు
భాకరాపేట(చిత్తూరు జిల్లా)
శేషాచలం అడవుల్లోకి చొరబడిన ఎర్రకూలీలు టాస్క్‌ఫోర్స్, పోలీసులపై గొడ్డళ్లు, రాళ్లతో దాడికి తెగబడ్డారు. దీంతో కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. పోలీసులు గాలిలోకి రెండు రౌండ్ల కాల్పులు జరపడంతో పారిపోయారు. ఈ క్రమంలో ఇద్దరు కూలీలను అరెస్టు చేశారు. ఈ వివరాలను పీలేరు రూరల్ సీఐ మహేశ్వర్ గురువారం భాకరాపేట సీఐ కార్యాలయం ఆవరణలో విలేకరులకు వివరించారు. తమిళనాడు జువాదిహిల్స్‌కు చెందిన పలువురు శేషాచలం అడవుల్లోకి వెళ్లినట్లు సమాచారం అందడంతో బుధవారం రాత్రి నుంచి భాకరాపేట ఘాట్ రోడ్డు నుంచి పుట్టగడ్డ అటవీ ప్రాంతం వైపు కూంబింగ్ చేపట్టామన్నారు.
రాళ్లు, గొడ్డళ్లతో దాడి
గురువారం తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో కూలీలను గుర్తించి పట్టుకునేందుకు ప్రయుత్నించామన్నారు. తమిళ కూలీలు రాళ్లు, గొడ్డళ్లతో దాడికి దిగారని తెలిపారు. దీంతో టాస్క్‌ఫోర్స్ కానిస్టేబుల్ దిలీప్‌కుమార్‌కు తీవ్ర గాయాలు అయ్యాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో వారిని చెదరగొట్టేందుకు గాల్లోకి రెండు రౌండ్ల కాల్పులు జరిపామని వివరించారు. కూలీలు దుంగలను వదిలి అడవిలోకి పారిపోతుండగా జువాదిహిల్స్‌కు చెందిన సంపత్, స్వామినాథన్‌ను అదుపులోకి తీసుకున్నామన్నారు. విచారణలో 20 మంది ఉన్నారని పట్టుబడ్డ కూలీలు చెప్పారని పేర్కొన్నారు. వారి నుంచి 300 కేజీల 9 దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.7 లక్షలు ఉంటుంది. గాయుపడ్డ కానిస్టేబుల్‌ను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించామని పేర్కొన్నారు.
రూటు మార్చిన తమిళ కూలీలు
తమిళ కూలీలు రైళ్లు, బస్సుల్లో వచ్చి పాకాల, నేండ్రగుంట, కొటాల రైల్వే స్టేషన్లలో దిగుతున్నారని, అలాగే చిత్తూరు నుంచి పులిచెర్ల వుండలం మంగళంపేట చేరుకుని భీమవరం అడవుల గుండా భాకరాపేట ఘాట్ రోడ్డు దాటి అడవిలోకి ప్రవేశిస్తున్నట్టు గుర్తించామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పుట్టగడ్డ అటవీ ప్రాంతానికి కూడా రోడ్డు దాటి అడవిలోకి జారుకున్నట్లు పేర్కొన్నారు. దాడుల్లో టాస్క్‌ఫోర్స్ ఎస్‌ఐ అశోక్‌కుమార్, ఆర్‌ఎస్‌ఐ భాస్కర్, భాకరాపేట ఎస్‌ఐ చంద్రమోహన్, ఎఫ్‌ఎస్‌వో వెంకటసుబ్బయ్యు, ఎఫ్‌బీవో శ్రీరాములు, టాస్క్‌ఫోర్స్ పోలీసులు పాల్గొన్నట్లు చెప్పారు.
రూటు మార్చిన ఎర్ర కూలీలు
Published Thu, Jul 21 2016 7:08 PM | Last Updated on Mon, Sep 17 2018 6:20 PM
Advertisement