Tamil laborers
-
ఏడుగురు ఆర్టీసీ డ్రైవర్లు అరెస్ట్
ఖాజీపేట: తమిళ కూలీలు బెంగళూరు నుంచి వైఎస్సార్ జిల్లా రావడానికి సహకరించిన ఏడుగురు ఆర్టీసీ డ్రైవర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొంతకాలంగా ఖాజీపేట, మైదుకూరు, దువ్వూరు ప్రాంతాల్లోని లంకమల కొండల్లోకి తమిళకూలీలు అధికంగా వస్తున్నారని మైదుకూరు డీఎస్పీ బీఆర్. శ్రీనివాసులు, తెలిపారు. శుక్రవారం విలేకరుల తో మాట్లాడుతూ శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కావలి, ఆత్మకూరు, ఉదయగిరి డిపోలకు చెందిన డ్రైవర్లు తమిళకూలీలు ఇక్కడికి వచ్చేందుకు సహకరిస్తున్నట్లు తేలిందన్నారు. వారిలో కావలి డిపోకు చెందిన నోటి మాలకొండారెడ్డి, పెట్లూరి ప్రభాకర్‌రావు, షేక్ మహబూబ్ సుభాని, సెనగల వెంకటేశ్వర్లు, సాన సుధాకర్, కట్ట సురేష్, ఆత్మకూరు డిపోకు చెందిన షేక్ సర్ధార్ బాషాలను అదుపులోకి తీసుకుని విచారించామని చెప్పారు. తమిళ కూలీలు వచ్చేందుకు వారు సహకరించినట్టు తేలడంతో అరెస్ట్ చేశామని తెలిపారు. -
అటవీప్రాంతంలో ముమ్మరంగా కూంబింగ్
మైదుకూరు: మైదుకూరు సమీపంలో నల్లమల, లంకమల అభయారణ్యంలో తమిళ కూలీలు చొరబడటంతో మైదుకూరు అర్బన్, రూరల్ పోలీసు సిబ్బంది ఫారెస్ట్‌లో కూంబింగ్ ముమ్మరం చేశారు. బుధవారం, గురువారం మైదుకూరు సీఐ వెంకటేశ్వర్లు తన సిబ్బందితో కలిసి నల్లమల భైరవకోన, సానీబావి, బోరకొండ, దూదెమ్మ కోన ప్రాంతంలో కూబింగ్ నిర్వహించారు. ఇప్పటికే అటవీ ప్రాంతంలో దాదాపు 100 మందికి పైన ఎర్రస్మగ్లింగ్ చేస్తున్న కూలీలను పట్టుకున్నారు. ఇంకా కొందరు అటవీ ప్రాంతంలో తమిళ కూలీల ఉనికి ఉన్నట్లు సమాచారం ఉండటంతో ఈ కూంబింగ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ గుర్తు తెలియని వ్యక్తులు అటవీప్రాంతం సమీపంలోని గ్రామాల్లోకి వస్తే వారికి సహకరించినా, వారితో సంబంధాలు పెట్టుకున్నా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఖాజీపేట నుంచి వరకు దువ్వూరు వరకు సాయంత్రం 6గంటల నుంచి ఉదయం 6గంటల వరకు జాతీయ రహదారిపై తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్మగ్లింగ్ పాల్పడే వ్యక్తులు ఎలాంటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు. ప్రజలకు గుర్తు తెలియని వ్యక్తులు కనపడితే పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలన్నారు. -
14 మంది తమిళ కూలీలు అరెస్టు
వైఎస్సార్ జిల్లా గోపవరం మండలం లక్కవారిపల్లె గ్రామ సమీపంలోని నక్కదోన అటవీ ప్రాంతంలో గురువారం పోలీసులు 14 మంది తమిళ కూలీలను అరెస్టు చేసి, 15 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. మైదుకూరు డీఎస్పీ ఎం.వి.రామకృష్ణయ్య తెలిపిన వివరాలివీ.. ముందస్తు సమాచారం మేరకు బద్వేలు సీఐ రామాంజినాయక్ , రూరల్ ఎస్ఐ నరసింహారెడ్డిలు అటవీ సిబ్బంది, ఇతర పోలీసు సిబ్బందితో కలిసి నక్కదోన అటవీ ప్రాంతంలో గాలిస్తుండగా కొంతమంది వ్యక్తులు ఎర్రచందనం దుంగలను తరలిస్తున్నారు. వారు పోలీసులను చూడగానే గట్టిగా కేకలు వేస్తూ పోలీసులపైకి రాళ్లు, గొడ్డళ్లు విసురుతూ పారిపోయేందుకు ప్రయత్నించారు. సిబ్బంది వెంటపడి 14 మందిని అరెస్టు చేయగా మరికొంతమంది పారిపోయారు. వారి వద్ద నుంచి 334 కేజీల బరువు గల 15 ఎర్రచందనం దుంగలు, 15 గొడ్డళ్లు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారంతా తమిళనాడు రాష్ట్రం ధర్మపురి జిల్లా హరూన్, పాపిరెట్టపట్టి తాలూకాలకు చెందిన వారు. -
శేషాచలంలో టాస్క్ ఫోర్స్ పోలీసుల కూంబింగ్
శేషాచలం అటవీ ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు కూంబింగ్ గురువారం నిర్వహించారు. ఎర్రచందనం అక్రమ రవాణా కోసం కూలీలు ప్రవేశించారనే సమాచారంతో అటవీ ప్రాంతమంతా జల్లెడ పట్టారు. ఈ సందర్భంగా పోలీసులను చూసిన ఎర్ర చందనం కూలీలు పరారయ్యారు. పరారైన కూలీలు 30 మందికి పైగా ఉంటారని అధికారులు తెలిపారు. పరారైన కూలీలు తమ వద్ద ఉన్న ఎర్ర చందనం దుంగలను వదిలేసి వెళ్లారని వివరించారు. వీటి విలువ మార్కెట్ లో రూ.30 లక్షలు ఉంటుందని వివరించారు. -
ముగ్గురు తమిళ కూలీల అరెస్ట్
-58 ఎర్రచందనం దుంగలు స్వాధీనం రైల్వేకోడూరు రూరల్ అక్రమ రవాణాకు సిద్ధం చేసిన 58 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని ముగ్గురు తమిళ కూలీలను అరె స్టు చేసినట్లు టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరులోని టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులకు వివరాలు వెల్లడించారు. బాలుపల్లె అటవీశాఖ పరిధిలో పుల్లగూరపెంట వద్ద సుమారు 50 మంది కూలీలు ఎర్రచందనం దుంగలతో టాస్క్‌ఫోర్స్ సిబ్బందికి తారసపడ్డారని చెప్పారు. వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా కొందరు పారిపోగా తమిళనాడు రాష్ట్రం తిరువ ణ్ణామలై ప్రాంతానికి చెందిన పొన్నుస్వామి, తిరుమలై, ధర్మపురికి చెందిన కుమార్‌లను పట్టుకున్నామన్నారు. కాగా, బుధవారం మధ్యాహ్నం రైల్వేకోడూరుకు చేరుకున్న టాస్క్‌ఫోర్స్ డీఐజీ కాంతారావు నిందితులను పోలీసు స్టేషన్లో అప్పగించేందుకు ప్రయత్నించగా స్థానిక పోలీసులు వివిధ కేసుల దర్యాప్తు నిమిత్తమై బిజీగా ఉండటంతో నిందితులు, దుంగలతో సహా తిరుపతికి వెళ్లారు. తమిళ కూలీలపై తిరుపతిలో కేసు నమోదు చేస్తామని ఆయన తెలిపారు. -
రూటు మార్చిన ఎర్ర కూలీలు
- కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు - గాల్లోకి రెండు రౌండ్ల కాల్పులు - ఇద్దరు కూలీల అరెస్టు భాకరాపేట(చిత్తూరు జిల్లా) శేషాచలం అడవుల్లోకి చొరబడిన ఎర్రకూలీలు టాస్క్‌ఫోర్స్, పోలీసులపై గొడ్డళ్లు, రాళ్లతో దాడికి తెగబడ్డారు. దీంతో కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. పోలీసులు గాలిలోకి రెండు రౌండ్ల కాల్పులు జరపడంతో పారిపోయారు. ఈ క్రమంలో ఇద్దరు కూలీలను అరెస్టు చేశారు. ఈ వివరాలను పీలేరు రూరల్ సీఐ మహేశ్వర్ గురువారం భాకరాపేట సీఐ కార్యాలయం ఆవరణలో విలేకరులకు వివరించారు. తమిళనాడు జువాదిహిల్స్కు చెందిన పలువురు శేషాచలం అడవుల్లోకి వెళ్లినట్లు సమాచారం అందడంతో బుధవారం రాత్రి నుంచి భాకరాపేట ఘాట్ రోడ్డు నుంచి పుట్టగడ్డ అటవీ ప్రాంతం వైపు కూంబింగ్ చేపట్టామన్నారు. రాళ్లు, గొడ్డళ్లతో దాడి గురువారం తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో కూలీలను గుర్తించి పట్టుకునేందుకు ప్రయుత్నించామన్నారు. తమిళ కూలీలు రాళ్లు, గొడ్డళ్లతో దాడికి దిగారని తెలిపారు. దీంతో టాస్క్‌ఫోర్స్ కానిస్టేబుల్ దిలీప్‌కుమార్‌కు తీవ్ర గాయాలు అయ్యాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో వారిని చెదరగొట్టేందుకు గాల్లోకి రెండు రౌండ్ల కాల్పులు జరిపామని వివరించారు. కూలీలు దుంగలను వదిలి అడవిలోకి పారిపోతుండగా జువాదిహిల్స్కు చెందిన సంపత్, స్వామినాథన్‌ను అదుపులోకి తీసుకున్నామన్నారు. విచారణలో 20 మంది ఉన్నారని పట్టుబడ్డ కూలీలు చెప్పారని పేర్కొన్నారు. వారి నుంచి 300 కేజీల 9 దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.7 లక్షలు ఉంటుంది. గాయుపడ్డ కానిస్టేబుల్‌ను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించామని పేర్కొన్నారు. రూటు మార్చిన తమిళ కూలీలు తమిళ కూలీలు రైళ్లు, బస్సుల్లో వచ్చి పాకాల, నేండ్రగుంట, కొటాల రైల్వే స్టేషన్లలో దిగుతున్నారని, అలాగే చిత్తూరు నుంచి పులిచెర్ల వుండలం మంగళంపేట చేరుకుని భీమవరం అడవుల గుండా భాకరాపేట ఘాట్ రోడ్డు దాటి అడవిలోకి ప్రవేశిస్తున్నట్టు గుర్తించామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పుట్టగడ్డ అటవీ ప్రాంతానికి కూడా రోడ్డు దాటి అడవిలోకి జారుకున్నట్లు పేర్కొన్నారు. దాడుల్లో టాస్క్‌ఫోర్స్ ఎస్ఐ అశోక్‌కుమార్, ఆర్ఎస్ఐ భాస్కర్, భాకరాపేట ఎస్ఐ చంద్రమోహన్, ఎఫ్ఎస్వో వెంకటసుబ్బయ్యు, ఎఫ్‌బీవో శ్రీరాములు, టాస్క్‌ఫోర్స్ పోలీసులు పాల్గొన్నట్లు చెప్పారు. -
భారీగా ఎర్ర చందనం దుంగలు స్వాధీనం
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం నాగయ్యగారిపల్లి గ్రామ సమీపంలో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు లారీలో తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అటవీ ప్రాంతం నుంచి అక్రమంగా లారీలో తీసుకొస్తున్న 26 దుంగలను గుర్తించిన టాస్క్‌ఫోర్స్, అటవీ శాఖ అధికారులు దుంగలను తరలిస్తున్న తమిళ కూలీతో పాటు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాటి విలువ రూ. కోటి(లారీతో సహా) వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. -
భారీగా ఎర్ర చందనం దుంగలు స్వాధీనం
అక్రమంగా వాహనంలో తరలిస్తున్న 109 ఎర్ర చందనం దుంగులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న దుంగల విలువ సుమరు రూ. 1.5 కోట్ల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ సంఘటన వైఎస్సార్ కడప జిల్లా రైల్వే కోడూరులో గురువారం వెలుగుచూసింది. తెల్లవారుజామున ఓ వాహనంలో ఎర్ర చందనం దుంగలు నిర్వహిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 109 దుంగలు గుర్తించారు. పోలీసులను గుర్తించిన డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అటవీలో కూంబింగ్.. 100 మంది తమళి కూలీలు ఎర్ర చందనం దుంగులను నరకడానికి అడవిలోకి వెళ్లారనే సమాచారంతో.. పోలీసులు గురువారం ఉదయం నుంచి బాల్పల్లి అటవీ ప్రాంతంలో కూంబిగ్ నిర్వహిస్తున్నారు. సుమారు 200 మంది పోలీసుల సాయంతో తిరుపతి కొండ లు, తలకోన, బాల్పల్లి ప్రాంతాల నుంచి పోలీసులు అటవీ శాఖ అధికారులతో కలిసి అడవిని జల్లెడపడుతున్నాడు. -
భారీ గా ఎర్రచందనం పట్టివేత
బుధవారం అర్థరాత్రి టాస్క్‌ఫోర్స్ పోలీసులు రూ.50 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను పట్టుకున్నారు. వివరాలివీ.. తిరుపతి రూరల్ మండలం మంగళంలోని రిక్షా కాలనీ, జూపార్క్ వద్ద అర్థరాత్రి టాస్క్‌ఫోర్స్ పోలీసులు కూంబింగ్ చేస్తుండగా ఎర్రచందనం కూలీలు తారసపడ్డారు. వారు రాళ్లతో దాడికి దిగగా పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో కూలీలు పలాయనం చిత్తగించారు. ఆ ప్రదేశంలో గాలించగా రూ.50 లక్షల విలువ చేసే ఎర్రచందనం దుంగలను పోలీసులు గుర్తించారు. ఈ సందర్భంగా తమిళనాడుకు చెందిన ఒక కూలీని పట్టుకున్నారు. మిగిలిన వారి కోసం గాలింపు ముమ్మరం చేశారు. -
చంద్రబాబుకు 'అమ్మ' లేఖ
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చంద్రబాబు నాయుడుకి లేఖరాశారు. ఆంధ్ర ప్రదేశ్ జైళ్లలో మగ్గుతున్న తమిళ కూలీలను విడుదల చేయాలని ఆమె కోరారు. ఏపీ జైళ్లలో 516 మంది తమిళ కూలీలు ఉన్నారని పేర్కొన్నారు. -
20 మంది ఎర్ర కూలీల పట్టివేత
ఎర్రచందనం తరలించేందుకు ప్రయత్నించిన తమిళ కూలీలను ఏపీ పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి భారీగా ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడుకు చెందిన 25 మంది కూలీలు వైఎస్సార్ జిల్లా రైల్వే కోడూరు జయశెట్టి పల్లె అటవీ ప్రాంతంలో ఎర్రచందనం దుంగలను తరలించేందుకు సిద్దంగా ఉన్నారన్న సమాచారంతో మంగళవారం పోలీసులు, టాస్క్ ఫోర్స్, అటవీ అధికారులు సంయుక్తంగా గాలింపు చేపట్టారు. పోలీసులను చూసి కొంత మంది కూలీలు పరారు కాగా.. 20 మంది కూలీలు పోలీసులకు దొరికారు. వీరితో పాటు.. 23 దుంగలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 390 కిలోల బరువైన ఈ దుంగల విలువ 7 లక్షలకు పైగా ఉంటుందని డీఎస్పీ అరవింద్‌బాబు తెలిపారు. -
తమిళ కూలీ... తూటాలకు బలి
-
పొట్టకూటి కోసం ప్రాణాలు పణం
తమిళ గిరిజనుల దయనీయ పరిస్థితిని అవకాశంగా మలచుకుంటున్న స్మగ్లర్లు రోజుకు రూ.5 వేల కూలి, ప్యాకేజీలతో వల భారీ సంఖ్యలో శేషాచలంలోకి చొరబడుతున్న కూలీలు హైదరాబాద్: ఎర్రచందనం కూలీలపై తుపాకీని గురిపెట్టి భయపెట్టాలనుకుంటే.. స్మగ్లర్లు ధనాస్త్రాన్ని ఎక్కుపెడుతున్నారు. రోజుకు రూ.5 వేలు కూలీ ఇస్తామంటూ తమిళ కూలీలకు, గిరిజనులు, దళితులకు స్మగ్లర్లు వల వేస్తుంటే... కూటి కోసం వారు శేషాచలం అడవుల్లోకి వస్తున్నారు. పోలీసుల ఎన్కౌంటర్లలో కన్నుమూస్తున్నారు. తమిళనాడులోని తిరువణ్ణామలై, తిరునల్వేలి, సేలం, వేలూరు, తిరువళ్లూరు జిల్లాల్లోని పశ్చిమ కనుమల్లో అమాయక గిరిజనులకు అడవే జీవనాధారం. రెక్కాడితేగానీ డొక్కాడని ఆ బడుగులు కష్టజీవులు. రోజంతా చెమటోడ్చితే రూ.100 కూలీ గిట్టుబాటయ్యేది కూడా అక్కడ అనుమానమే. ఎర్రచందనం స్మగ్లర్ల దృష్టి గిరిజనులపై పడేందుకు వారి దయనీయ పరిస్థితే కారణం. వారిని ఎర్రచందనం కూలీలుగా మార్చిన స్మగ్లర్లు ప్రత్యేక వాహనాల్లో శేషాచలం అడవులకు తెస్తున్నారు. అత్యంత విలువైన ఎర్రచందనం చెట్లను నరికించి దొడ్డిదారిన సరిహద్దులు దాటిస్తూరూ.కోట్లకు పడగలెత్తుతున్నారు. ఏడాదిన్నర క్రితం శేషాచలం అడవుల్లో తనిఖీలకు వెళ్లిన ఇద్దరు అటవీ అధికారులపై తమిళ కూలీలు దాడి చేసి, చంపేయడం కలకలం రేపింది. ఆ తర్వాత తొమ్మిది మంది తమిళ కూలీలను వివిధ ఎన్కౌంటర్లలో పోలీసులు కాల్చి చంపారు. ఇదే క్రమంలో తమిళ కూలీలను చైతన్యవంతం చేయడం ద్వారా ఎర్రచందనం చెట్ల నరికివేతకు అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం భావించింది. గిరిజన గ్రామాల్లో చైతన్య జాతాలు నిర్వహించడానికి పలు సందర్భాల్లో తమిళనాడుకు వెళ్లినట్లు పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. కానీ ఎర్రచందనం చెట్లు నరికివేసి, స్మగ్లర్లకు సహకరిస్తే కాల్చి వేస్తామన్న అంశాన్ని పోలీసులు ఎక్కడా ప్రచారం చేసిన దాఖలాలు లేవు. మరోవైపు పోలీసుల వ్యూహానికి స్మగ్లర్లు ప్రతి వ్యూహాన్ని రచించారు. కూలీలకు పరిహారం ప్యాకేజీ ప్రకటించి ఆకట్టుకున్నారు. ఫలితంగా ఏడాది కాలంగా తమిళ కూలీలు భారీ ఎత్తున శేషాచలం అడవుల్లోకి చొరబడుతున్నారు. పది నెలల్లో చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లాల పోలీసులు 1100 మందికిపైగా తమిళ కూలీలను అరెస్టు చేసి కోర్టుల్లో హాజరు పరిచారు. వీరంతా చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లోని జైళ్లలో మగ్గుతున్నారు. దీనిపై తమిళనాడుకు చెందిన ప్రజా సంఘాలు జాతీయ మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేశాయి. పెద్ద సంఖ్యలో కూలీలు ఎలా వచ్చారు? తమిళనాడుకు చెందిన ఎర్రచందనం కూలీలు పెద్ద సంఖ్యలో రాష్ట్రంలోకి ఎలా ప్రవేశించారన్నది అంతు చిక్కట్లేదు. ఇది పోలీసుల వైఫల్యమా? లేక కూలీలు వస్తున్న సంగతి గుర్తించి కూడా శేషాచలంలో అడుగుపెట్టే వరకు వేచి చూశారా? అనే సందేహాలు కలుగుతున్నాయి. కూలీలను స్మగ్లర్లు ఏఏ మార్గాల్లో, ఎలా శేషాచలంలోకి పంపుతున్నారనేది పోలీసులకు స్పష్టంగా తెలుసు. రైలులో రావాలంటే తమిళనాడులోని కాట్పాడు, రాష్ట్రంలోని రేణిగుంట, పాకాల చేరుకోవాలి. అక్కడ నుంచి బస్సు లేదా లారీలో కృష్ణగిరి, కుప్పం, పలమనేరు, చిత్తూరు, చినగొట్టికల్లు ప్రాంతాల మీదుగా శేషాచలం అడువుల్లోకి అడుగుపెట్టాలి. మరికొందరు తమిళనాడు నుంచి నెల్లూరు జిల్లా తడ వరకు పడవల్లో వచ్చి అక్కడినుంచి శ్రీకాళహస్తి, రేణిగుంట, మామండూరు వరకు రోడ్డు మార్గంలో ప్రయాణించి శేషాచలం అడువుల్లో అడుగపెట్టాల్సి ఉంటుంది. చెక్‌పోస్టులు, పికెట్లు ఏం చేస్తున్నట్లు? స్మగ్లర్లు కూలీలను ఎప్పుడూ ఒక్కరొక్కరుగా తీసుకురారు. ఒకేసారి ఓ బృందాన్ని రప్పించడంతో వారంతా కలిసే ప్రయాణించాల్సి ఉంటుంది. తమిళనాడు నుంచి కూలీలు ఏ మార్గంలో ప్రయాణించినా ఒక అంతర్రాష్ట చెక్‌పోస్టుతో పాటు పలు జిల్లా చెక్‌పోస్టులు, పోలీసు పికెట్లు దాటాల్సిందే. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ఉగ్రవాదుల హిట్‌లిస్ట్‌లో తిరుపతి ఉందన్న హెచ్చరికలను పరిగణనలోకి తీసుకున్నా.. పోలీసులు డేగ కంటి నిఘా వేసి ఉంచాలి. అలాంటి చర్యలు తీసుకుంటే ఇంత పెద్ద సంఖ్యలో కూలీలు రెండుమూడు రోజుల క్రితం రాష్ట్రంలోకి ఎలా ప్రవేశించారనేది అంతు చిక్కని అంశంగా మారింది. వారి చొరబాటును నిరోధించడంలో విఫలమైన నేపథ్యంలో.. కూలీలను ‘భయభ్రాంతులకు’ గురి చేసే లక్ష్యంతో అధికారులు అడుగులు వేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నకిలీ పర్మిట్లతో మోసం! ఎర్రచందనం చెట్ల నరికివేతకు ఏపీ ప్రభుత్వం తమకు అనుమతులు ఇచ్చిందని మభ్యపెట్టి కొందరు కూలీలను తీసుకెళ్లినట్లు తమిళనాడులోని బాధిత గ్రామాల ప్రజలు చెబుతున్నారు. ఎర్రచందనం పనులకు వెళితే అరెస్ట్ కావడమో, కేసుల్లో చిక్కుకోవడమో తప్పదని భయపడిన కూలీలు చాలావరకు అందుకు నిరాకరిస్తున్నారు. అయితే ఏపీకి చెందిన కొందరు నేతలు ప్రభుత్వ అనుమతితోనే ఎర్రచందనం వ్యాపారం చేస్తున్నట్లుగా చెబుతూ నకిలీ ఉత్తర్వులను కూలీలకు చూపుతున్నట్లు సమాచారం. వీరి మాటలు నమ్మి శేషాచ లంలో ప్రవేశించిన కూలీలు ప్రాణాలను పోగొట్టుకున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌కు వందలాది కూలీలను దింపడం వెనుక ఏపీలో రాజకీయ దందా ప్రధానపాత్ర పోషించిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
తమిళ కూలీ... తూటాలకు బలి
కరువు కాలంలో అధిక కూలిపై ఆశ సాధారణ చెట్లు నరకాలంటూ కాంట్రాక్టర్ల మోసం ఏపీ పోలీసుల కాల్పులతో మృత్యువాత కరువు కాలంలో పనుల్లేక పస్తులుండే అటవీ ప్రాంతపు కూలీలకు కాంట్రాక్టర్లు అధిక కూలిని ఎరగా వేశారు. దీనికి ఆశపడిన తమిళ కూలీలు పొరుగు రాష్ట్రానికి వెళ్లి ఎర్రచందనం చెట్లను నరికేవారు. ఈ క్రమంలో మంగళవారం వేకువజామున అక్కడి పోలీసులు జరిపిన కాల్పుల్లో 20 మంది మృత్యువాత పడ్డారు. - వివరాలు 2లోఠ చెన్నై, సాక్షి ప్రతినిధి/వేలూరు :ఆంధ్ర రాష్ట్రంలోని శేషాచలం అడువుల్లో ఎర్రచందనం చెట్లు నరికేందుకు వెళ్లిన ఎర్ర కూలీలు 20 మంది అక్కడిక్కడే మృతి చెందారు. మృతులంతా తమిళనాడుకు చెందిన వారు కావడం మరింత కలకలానికి కారణమైంది. మృతుల్లో తిరువణ్ణామలై జిల్లా జవ్యాదికొండ సమీపం జమునామరత్తూరుకు చెందిన 9 మంది, వేలూరు జిల్లాకు చెందిన ముగ్గురుగా తెలుస్తోంది. మిగిలినవారు విళుపురం జిల్లాకు చెందిన వారుగా భావిస్తున్నారు. తమిళనాడులోని వేలూరు, తిరువణ్ణామలై, క్రిష్ణగిరి జిల్లాల సరిహద్దు ప్రాంతంలో జవ్యాది కొండ ఉంది. ఇక్కడ చెట్లు నరకడంలో నిపుణులు ఉన్నారు. ఈ జవ్యాది కొండ సమీపంలో అమిర్థి, ఊట్టాన్మలై, వీరప్పనూర్, జమునామరత్తూరు, ఆలంగాయం, సెంబగతోప్పు వంటి కుగ్రామాలు అటవీ ప్రాంతంలోనే ఉన్నాయి. ఈ గ్రామాల్లో అధికంగా ప్రజలు వ్యవసాయ కూలీలుగా జీవించే వారు. ప్రస్తుతం వర్షాలు లేక పోవడంతో ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారు. అదే విధంగా చెట్లు నరకడంలో నిపుణులు కావడంతో వేలూరు, తిరువణ్ణామలై జిల్లాల్లో ఎక్కడ చెట్లు నరకాలన్నా ఈ ప్రాంతానికి చెందిన కూలీలనే కాంట్రాక్టర్లు తీసుకెళ్లడం పరిపాటి. ప్రస్తుతం వర్షాలు లేక పోవడం వల్ల కూలీ పనులు లేక అల్లాడుతున్నారు. కూలీల దీనపరిస్థితిని ఆసరాగా చేసుకొన్న ఎర్రచందనం స్మగ్లర్లు భారీగా సొమ్ముచేసుకోవడం ప్రారంభించారు. సాధారణ కూలీ పనులకు నాలుగింతలు రెట్టింపు కూలీ దొరకడంతో కూలీ లు సైతం ఆకర్షితులవుతున్నారు. కొంత మంది చెట్లు నరికే కాంట్రాక్టర్లు గ్రామాల్లోని కూలీలను రోజుకు రూ.500 నుంచి 750 వరకు కూలీ ఇప్పిస్తామని చెప్పి చెట్లు నరికేందుకు తీసుకెళతారు. కాంట్రాక్టర్లు తీసుకెళ్లే సమయంలో ఉండేందుకు వసతి, భోజనం వంటి సదుపాయాలను కూడా తామే భరిస్తామని చెప్పడంతో మరింత ఆకర్షణకు గురవుతున్నారు. ఏం పనో ముందుగా చెప్పరు చెట్లు నరికేటందుకు అని చెప్పి తీసుకెళతారు కానీ ఎక్కడ ఏ చెట్లు అని ముందుగా చెప్పరు. ఆంధ్ర సరిహద్దు దాటేంత వరకు ఎర్రచందనం చెట్లన నరికే పనులకు వెళుతున్నట్లు కూలీలు తెలుసుకోలేరు. తీరా అడవుల్లోకి వెళ్లిన తరువాత తెలిసినా వెనుదిరగలేక పనుల్లో దిగుతామని వీరప్పనూర్ గ్రామస్తులు చెబుతున్నారు. అత్యాధునిక యంత్రాలతో నరుకుతాం తమ వద్ద చెట్లు నరికేందుకు అత్యాధునిక యం త్రాలు, రంపాలు, కత్తులున్నాయని వీటి ద్వారా చెట్లు కింద పడినా శబ్దం రాకుండా ఉండేలా బ్యాటరీ ద్వారా తయారు చేసిన రంపాలతో చెట్ల పైకి ఎక్కి కొమ్మలను ముందుగా కోసి అనంతరం తాడు కట్టి అతి జాగ్రత్తగా కిందకు దించుతామన్నారు. ఈ యంత్రాలతో కోస్తే పక్కన ఉన్న వ్యక్తికి కూడా శబ్దం వినిపించదన్నారు. తాము ఒక ముఠాగా ఏర్పడి చెట్లు నరికేందుకు వెళుతున్నట్లు చెప్పారు. జవ్యాది కొండ నుంచి కూలీలను కాంట్రాక్టర్లు కారులో తీసుకెళతారు. వేలూరు బస్టాండ్‌కు వెళ్లిన అనంతరం ఒకే బస్సులో ప్రయాణించే విధంగా కాంట్రాక్టర్లు తమను ప్రభుత్వ, ప్రవేటు బస్సుల్లో ఎక్కిస్తారు. ఎవరికీ అనుమానం రాకుండా చెట్లను నరికే యంత్రాలను పసుపు బ్యాగు, లేక కవరులో వేసి తిరుమల స్వామి వారి దర్శనానికి వెళ్లే విధంగా అడవుల్లోకి చేరుకుంటారు. వేలూరు నుంచి వెళితే అనుమానం వస్తుందని క్రిష్ణగిరి జిల్లా నుంచి ప్రభుత్వ బస్సులో గమ్యానికి చేరుస్తారు. కూలి పోతుందని... తాము చెట్లు నరికేందుకు మాత్రమే గతంలో వెళ్లేవారమని, అది తెలుసుకున్న కొంత మంది కాంట్రాక్టర్లు తమను ఇటుకల సూలకు చెట్లు నరకాలని తీసుకెళ్లి తిరుపతి దగ్గరలోని అడవిలో వదిలి చెట్లు నరకాలని చెపుతారని బాధితులు చెబుతున్నారు. ఆ సమయంలో తాము కూడా చేసేది లేక కూలి పోతుందని ఇంత దూరం వచ్చిన తరువాత తిరిగి ఎక్కడికీ వెళ్లలేక ఎర్రచందనం నరికేందుకు సమ్మతిస్తున్నట్లు చెప్పారు. చెట్లు నరికేందుకు రోజుకు కూలి రూ.500 నుంచి రూ.750 వరకు ఇస్తారు. అదికాకుండా ఆంధ్ర రాష్ట్ర అటవీ ప్రాంతం నుంచి రోడ్డుకు తీసుకొచ్చేందుకు అదనపు కూలిని ఇవ్వడంతో ఆశపడుతున్నారు. జవ్యాది కొండపైనున్న గ్రామాల్లో అధిక శాతం ఆదివాసులు నివాసం ఉంటున్నారు. అదే విధంగా దళితులు, గౌండర్లు కూడా అధికంగా ఉండటంతో జీవనం సాగించడం, కుటుంబాన్ని పోషించడం కష్టతరంగా మారడంతోనే ఆ పనికి వెళుతున్నారు. సహజంగా వీరంతా వర్షాధార పంటలను అమ్ముకుని జీవిస్తారు. అడవిలో కాసే నేరేడు పండ్లు, జామ పండ్లు, నెల్లి పండ్లు వంటి వాటిని తీసుకొచ్చి పట్టణంలోని ప్రజలకు విక్రయించే వారు. ప్రస్తుతం అడవిలోను పండ్లు లేక, వర్షపు ఆధార పంటల్లేక, అటవీ ప్రాంతంలో కూలీలు అందక పోవడంతోనే ఎర్ర కూలీలుగా మారుతున్నట్లు గ్రామస్తులు తెలుపుతున్నారు. కరువు పీడితులుగా మిగల్లేక కొందరు నాటుసారా తయారీలో పాలుపంచుకునేవారు. ఏళ్ల క్రితం పోలీసులు వీరిపై గూండా చట్టం ప్రయోగించడంతో ప్రత్యామ్నాయంగా ఎర్రచందన కూలీలుగా మారి ప్రాణాలు పోగొట్టుకున్నారు.