
తమిళ కూలీ... తూటాలకు బలి
కరువు కాలంలో అధిక కూలిపై ఆశ
సాధారణ చెట్లు నరకాలంటూ కాంట్రాక్టర్ల మోసం
ఏపీ పోలీసుల కాల్పులతో మృత్యువాత
కరువు కాలంలో పనుల్లేక పస్తులుండే అటవీ ప్రాంతపు కూలీలకు కాంట్రాక్టర్లు అధిక కూలిని ఎరగా వేశారు. దీనికి ఆశపడిన తమిళ కూలీలు పొరుగు రాష్ట్రానికి వెళ్లి ఎర్రచందనం చెట్లను నరికేవారు. ఈ క్రమంలో మంగళవారం వేకువజామున అక్కడి పోలీసులు జరిపిన కాల్పుల్లో 20 మంది మృత్యువాత పడ్డారు. - వివరాలు 2లోఠ
చెన్నై, సాక్షి ప్రతినిధి/వేలూరు :ఆంధ్ర రాష్ట్రంలోని శేషాచలం అడువుల్లో ఎర్రచందనం చెట్లు నరికేందుకు వెళ్లిన ఎర్ర కూలీలు 20 మంది అక్కడిక్కడే మృతి చెందారు. మృతులంతా తమిళనాడుకు చెందిన వారు కావడం మరింత కలకలానికి కారణమైంది. మృతుల్లో తిరువణ్ణామలై జిల్లా జవ్యాదికొండ సమీపం జమునామరత్తూరుకు చెందిన 9 మంది, వేలూరు జిల్లాకు చెందిన ముగ్గురుగా తెలుస్తోంది. మిగిలినవారు విళుపురం జిల్లాకు చెందిన వారుగా భావిస్తున్నారు. తమిళనాడులోని వేలూరు, తిరువణ్ణామలై, క్రిష్ణగిరి జిల్లాల సరిహద్దు ప్రాంతంలో జవ్యాది కొండ ఉంది. ఇక్కడ చెట్లు నరకడంలో నిపుణులు ఉన్నారు. ఈ జవ్యాది కొండ సమీపంలో అమిర్థి, ఊట్టాన్‌మలై, వీరప్పనూర్, జమునామరత్తూరు, ఆలంగాయం, సెంబగతోప్పు వంటి కుగ్రామాలు అటవీ ప్రాంతంలోనే ఉన్నాయి. ఈ గ్రామాల్లో అధికంగా ప్రజలు వ్యవసాయ కూలీలుగా జీవించే వారు. ప్రస్తుతం వర్షాలు లేక పోవడంతో ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారు.
అదే విధంగా చెట్లు నరకడంలో నిపుణులు కావడంతో వేలూరు, తిరువణ్ణామలై జిల్లాల్లో ఎక్కడ చెట్లు నరకాలన్నా ఈ ప్రాంతానికి చెందిన కూలీలనే కాంట్రాక్టర్లు తీసుకెళ్లడం పరిపాటి. ప్రస్తుతం వర్షాలు లేక పోవడం వల్ల కూలీ పనులు లేక అల్లాడుతున్నారు. కూలీల దీనపరిస్థితిని ఆసరాగా చేసుకొన్న ఎర్రచందనం స్మగ్లర్లు భారీగా సొమ్ముచేసుకోవడం ప్రారంభించారు. సాధారణ కూలీ పనులకు నాలుగింతలు రెట్టింపు కూలీ దొరకడంతో కూలీ లు సైతం ఆకర్షితులవుతున్నారు. కొంత మంది చెట్లు నరికే కాంట్రాక్టర్లు గ్రామాల్లోని కూలీలను రోజుకు రూ.500 నుంచి 750 వరకు కూలీ ఇప్పిస్తామని చెప్పి చెట్లు నరికేందుకు తీసుకెళతారు. కాంట్రాక్టర్లు తీసుకెళ్లే సమయంలో ఉండేందుకు వసతి, భోజనం వంటి సదుపాయాలను కూడా తామే భరిస్తామని చెప్పడంతో మరింత ఆకర్షణకు గురవుతున్నారు.
ఏం పనో ముందుగా చెప్పరు
చెట్లు నరికేటందుకు అని చెప్పి తీసుకెళతారు కానీ ఎక్కడ ఏ చెట్లు అని ముందుగా చెప్పరు. ఆంధ్ర సరిహద్దు దాటేంత వరకు ఎర్రచందనం చెట్లన నరికే పనులకు వెళుతున్నట్లు కూలీలు తెలుసుకోలేరు. తీరా అడవుల్లోకి వెళ్లిన తరువాత తెలిసినా వెనుదిరగలేక పనుల్లో దిగుతామని వీరప్పనూర్ గ్రామస్తులు చెబుతున్నారు.
అత్యాధునిక యంత్రాలతో నరుకుతాం
తమ వద్ద చెట్లు నరికేందుకు అత్యాధునిక యం త్రాలు, రంపాలు, కత్తులున్నాయని వీటి ద్వారా చెట్లు కింద పడినా శబ్దం రాకుండా ఉండేలా బ్యాటరీ ద్వారా తయారు చేసిన రంపాలతో చెట్ల పైకి ఎక్కి కొమ్మలను ముందుగా కోసి అనంతరం తాడు కట్టి అతి జాగ్రత్తగా కిందకు దించుతామన్నారు. ఈ యంత్రాలతో కోస్తే పక్కన ఉన్న వ్యక్తికి కూడా శబ్దం వినిపించదన్నారు. తాము ఒక ముఠాగా ఏర్పడి చెట్లు నరికేందుకు వెళుతున్నట్లు చెప్పారు. జవ్యాది కొండ నుంచి కూలీలను కాంట్రాక్టర్లు కారులో తీసుకెళతారు. వేలూరు బస్టాండ్‌కు వెళ్లిన అనంతరం ఒకే బస్సులో ప్రయాణించే విధంగా కాంట్రాక్టర్లు తమను ప్రభుత్వ, ప్రవేటు బస్సుల్లో ఎక్కిస్తారు. ఎవరికీ అనుమానం రాకుండా చెట్లను నరికే యంత్రాలను పసుపు బ్యాగు, లేక కవరులో వేసి తిరుమల స్వామి వారి దర్శనానికి వెళ్లే విధంగా అడవుల్లోకి చేరుకుంటారు. వేలూరు నుంచి వెళితే అనుమానం వస్తుందని క్రిష్ణగిరి జిల్లా నుంచి ప్రభుత్వ బస్సులో గమ్యానికి చేరుస్తారు.
కూలి పోతుందని...
తాము చెట్లు నరికేందుకు మాత్రమే గతంలో వెళ్లేవారమని, అది తెలుసుకున్న కొంత మంది కాంట్రాక్టర్లు తమను ఇటుకల సూలకు చెట్లు నరకాలని తీసుకెళ్లి తిరుపతి దగ్గరలోని అడవిలో వదిలి చెట్లు నరకాలని చెపుతారని బాధితులు చెబుతున్నారు. ఆ సమయంలో తాము కూడా చేసేది లేక కూలి పోతుందని ఇంత దూరం వచ్చిన తరువాత తిరిగి ఎక్కడికీ వెళ్లలేక ఎర్రచందనం నరికేందుకు సమ్మతిస్తున్నట్లు చెప్పారు. చెట్లు నరికేందుకు రోజుకు కూలి రూ.500 నుంచి రూ.750 వరకు ఇస్తారు. అదికాకుండా ఆంధ్ర రాష్ట్ర అటవీ ప్రాంతం నుంచి రోడ్డుకు తీసుకొచ్చేందుకు అదనపు కూలిని ఇవ్వడంతో ఆశపడుతున్నారు. జవ్యాది కొండపైనున్న గ్రామాల్లో అధిక శాతం ఆదివాసులు నివాసం ఉంటున్నారు.
అదే విధంగా దళితులు, గౌండర్‌లు కూడా అధికంగా ఉండటంతో జీవనం సాగించడం, కుటుంబాన్ని పోషించడం కష్టతరంగా మారడంతోనే ఆ పనికి వెళుతున్నారు. సహజంగా వీరంతా వర్షాధార పంటలను అమ్ముకుని జీవిస్తారు. అడవిలో కాసే నేరేడు పండ్లు, జామ పండ్లు, నెల్లి పండ్లు వంటి వాటిని తీసుకొచ్చి పట్టణంలోని ప్రజలకు విక్రయించే వారు. ప్రస్తుతం అడవిలోను పండ్లు లేక, వర్షపు ఆధార పంటల్లేక, అటవీ ప్రాంతంలో కూలీలు అందక పోవడంతోనే ఎర్ర కూలీలుగా మారుతున్నట్లు గ్రామస్తులు తెలుపుతున్నారు. కరువు పీడితులుగా మిగల్లేక కొందరు నాటుసారా తయారీలో పాలుపంచుకునేవారు. ఏళ్ల క్రితం పోలీసులు వీరిపై గూండా చట్టం ప్రయోగించడంతో ప్రత్యామ్నాయంగా ఎర్రచందన కూలీలుగా మారి ప్రాణాలు పోగొట్టుకున్నారు.