-58 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
రైల్వేకోడూరు రూరల్
అక్రమ రవాణాకు సిద్ధం చేసిన 58 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని ముగ్గురు తమిళ కూలీలను అరె స్టు చేసినట్లు టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరులోని టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులకు వివరాలు వెల్లడించారు. బాలుపల్లె అటవీశాఖ పరిధిలో పుల్లగూరపెంట వద్ద సుమారు 50 మంది కూలీలు ఎర్రచందనం దుంగలతో టాస్క్‌ఫోర్స్ సిబ్బందికి తారసపడ్డారని చెప్పారు. వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా కొందరు పారిపోగా తమిళనాడు రాష్ట్రం తిరువ ణ్ణామలై ప్రాంతానికి చెందిన పొన్నుస్వామి, తిరుమలై, ధర్మపురికి చెందిన కుమార్‌లను పట్టుకున్నామన్నారు. కాగా, బుధవారం మధ్యాహ్నం రైల్వేకోడూరుకు చేరుకున్న టాస్క్‌ఫోర్స్ డీఐజీ కాంతారావు నిందితులను పోలీసు స్టేషన్‌లో అప్పగించేందుకు ప్రయత్నించగా స్థానిక పోలీసులు వివిధ కేసుల దర్యాప్తు నిమిత్తమై బిజీగా ఉండటంతో నిందితులు, దుంగలతో సహా తిరుపతికి వెళ్లారు. తమిళ కూలీలపై తిరుపతిలో కేసు నమోదు చేస్తామని ఆయన తెలిపారు.