పొట్టకూటి కోసం ప్రాణాలు పణం | 20 woodcutters from State gunned by A.P. police | Sakshi
Sakshi News home page

పొట్టకూటి కోసం ప్రాణాలు పణం

Published Wed, Apr 8 2015 3:00 AM | Last Updated on Sat, Sep 2 2017 11:59 PM

పొట్టకూటి కోసం ప్రాణాలు పణం

పొట్టకూటి కోసం ప్రాణాలు పణం

తమిళ గిరిజనుల దయనీయ పరిస్థితిని అవకాశంగా మలచుకుంటున్న స్మగ్లర్లు
రోజుకు రూ.5 వేల కూలి, ప్యాకేజీలతో వల
భారీ సంఖ్యలో శేషాచలంలోకి చొరబడుతున్న కూలీలు
 

హైదరాబాద్: ఎర్రచందనం కూలీలపై తుపాకీని గురిపెట్టి భయపెట్టాలనుకుంటే.. స్మగ్లర్లు ధనాస్త్రాన్ని ఎక్కుపెడుతున్నారు. రోజుకు రూ.5 వేలు కూలీ ఇస్తామంటూ తమిళ కూలీలకు, గిరిజనులు, దళితులకు స్మగ్లర్లు వల వేస్తుంటే... కూటి కోసం వారు  శేషాచలం అడవుల్లోకి వస్తున్నారు. పోలీసుల ఎన్‌కౌంటర్‌లలో కన్నుమూస్తున్నారు. తమిళనాడులోని తిరువణ్ణామలై, తిరునల్వేలి, సేలం, వేలూరు, తిరువళ్లూరు జిల్లాల్లోని పశ్చిమ కనుమల్లో అమాయక గిరిజనులకు అడవే జీవనాధారం. రెక్కాడితేగానీ డొక్కాడని ఆ బడుగులు కష్టజీవులు. రోజంతా చెమటోడ్చితే రూ.100 కూలీ గిట్టుబాటయ్యేది కూడా అక్కడ అనుమానమే.

ఎర్రచందనం స్మగ్లర్ల దృష్టి గిరిజనులపై పడేందుకు వారి దయనీయ పరిస్థితే కారణం. వారిని ఎర్రచందనం కూలీలుగా మార్చిన స్మగ్లర్లు ప్రత్యేక వాహనాల్లో శేషాచలం అడవులకు తెస్తున్నారు. అత్యంత విలువైన ఎర్రచందనం చెట్లను నరికించి దొడ్డిదారిన సరిహద్దులు దాటిస్తూరూ.కోట్లకు పడగలెత్తుతున్నారు. ఏడాదిన్నర క్రితం శేషాచలం అడవుల్లో తనిఖీలకు వెళ్లిన ఇద్దరు అటవీ అధికారులపై తమిళ కూలీలు దాడి చేసి, చంపేయడం కలకలం రేపింది. ఆ తర్వాత తొమ్మిది మంది తమిళ కూలీలను వివిధ ఎన్‌కౌంటర్‌లలో పోలీసులు కాల్చి చంపారు. ఇదే క్రమంలో తమిళ కూలీలను చైతన్యవంతం చేయడం ద్వారా ఎర్రచందనం చెట్ల నరికివేతకు అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం భావించింది. గిరిజన గ్రామాల్లో చైతన్య జాతాలు నిర్వహించడానికి పలు సందర్భాల్లో తమిళనాడుకు వెళ్లినట్లు పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. కానీ ఎర్రచందనం చెట్లు నరికివేసి, స్మగ్లర్లకు సహకరిస్తే కాల్చి వేస్తామన్న అంశాన్ని పోలీసులు ఎక్కడా ప్రచారం చేసిన దాఖలాలు లేవు. మరోవైపు పోలీసుల వ్యూహానికి స్మగ్లర్లు ప్రతి వ్యూహాన్ని రచించారు. కూలీలకు పరిహారం ప్యాకేజీ ప్రకటించి ఆకట్టుకున్నారు. ఫలితంగా ఏడాది కాలంగా తమిళ కూలీలు భారీ ఎత్తున శేషాచలం అడవుల్లోకి చొరబడుతున్నారు. పది నెలల్లో చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లాల పోలీసులు 1100 మందికిపైగా తమిళ కూలీలను అరెస్టు చేసి కోర్టుల్లో హాజరు పరిచారు. వీరంతా చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లోని జైళ్లలో మగ్గుతున్నారు. దీనిపై తమిళనాడుకు చెందిన ప్రజా సంఘాలు జాతీయ మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేశాయి.

పెద్ద సంఖ్యలో కూలీలు ఎలా వచ్చారు?

తమిళనాడుకు చెందిన ఎర్రచందనం కూలీలు పెద్ద సంఖ్యలో రాష్ట్రంలోకి ఎలా ప్రవేశించారన్నది అంతు చిక్కట్లేదు. ఇది పోలీసుల వైఫల్యమా? లేక కూలీలు వస్తున్న సంగతి గుర్తించి కూడా శేషాచలంలో అడుగుపెట్టే వరకు వేచి చూశారా? అనే సందేహాలు కలుగుతున్నాయి. కూలీలను స్మగ్లర్లు ఏఏ మార్గాల్లో, ఎలా శేషాచలంలోకి పంపుతున్నారనేది పోలీసులకు స్పష్టంగా తెలుసు. రైలులో రావాలంటే తమిళనాడులోని కాట్పాడు, రాష్ట్రంలోని రేణిగుంట, పాకాల చేరుకోవాలి. అక్కడ నుంచి బస్సు లేదా లారీలో కృష్ణగిరి, కుప్పం, పలమనేరు, చిత్తూరు, చినగొట్టికల్లు ప్రాంతాల మీదుగా శేషాచలం అడువుల్లోకి అడుగుపెట్టాలి. మరికొందరు తమిళనాడు నుంచి నెల్లూరు జిల్లా తడ వరకు పడవల్లో వచ్చి అక్కడినుంచి శ్రీకాళహస్తి, రేణిగుంట, మామండూరు వరకు రోడ్డు మార్గంలో ప్రయాణించి శేషాచలం అడువుల్లో అడుగపెట్టాల్సి ఉంటుంది.
 
చెక్‌పోస్టులు, పికెట్లు ఏం చేస్తున్నట్లు?


స్మగ్లర్లు కూలీలను ఎప్పుడూ ఒక్కరొక్కరుగా తీసుకురారు. ఒకేసారి ఓ బృందాన్ని రప్పించడంతో వారంతా కలిసే ప్రయాణించాల్సి ఉంటుంది. తమిళనాడు నుంచి కూలీలు ఏ మార్గంలో ప్రయాణించినా ఒక అంతర్రాష్ట చెక్‌పోస్టుతో పాటు పలు జిల్లా చెక్‌పోస్టులు, పోలీసు పికెట్లు దాటాల్సిందే. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ఉగ్రవాదుల హిట్‌లిస్ట్‌లో తిరుపతి ఉందన్న హెచ్చరికలను పరిగణనలోకి తీసుకున్నా.. పోలీసులు డేగ కంటి నిఘా వేసి ఉంచాలి. అలాంటి చర్యలు తీసుకుంటే ఇంత పెద్ద సంఖ్యలో కూలీలు రెండుమూడు రోజుల క్రితం రాష్ట్రంలోకి ఎలా ప్రవేశించారనేది అంతు చిక్కని అంశంగా మారింది. వారి చొరబాటును నిరోధించడంలో విఫలమైన నేపథ్యంలో.. కూలీలను ‘భయభ్రాంతులకు’ గురి చేసే లక్ష్యంతో అధికారులు అడుగులు వేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
 
 నకిలీ పర్మిట్లతో మోసం!


ఎర్రచందనం చెట్ల నరికివేతకు ఏపీ ప్రభుత్వం తమకు అనుమతులు ఇచ్చిందని మభ్యపెట్టి కొందరు కూలీలను తీసుకెళ్లినట్లు తమిళనాడులోని బాధిత గ్రామాల ప్రజలు చెబుతున్నారు. ఎర్రచందనం పనులకు వెళితే  అరెస్ట్ కావడమో, కేసుల్లో చిక్కుకోవడమో తప్పదని భయపడిన కూలీలు చాలావరకు అందుకు నిరాకరిస్తున్నారు. అయితే ఏపీకి చెందిన కొందరు నేతలు ప్రభుత్వ అనుమతితోనే ఎర్రచందనం వ్యాపారం చేస్తున్నట్లుగా చెబుతూ నకిలీ ఉత్తర్వులను కూలీలకు చూపుతున్నట్లు సమాచారం. వీరి మాటలు నమ్మి శేషాచ లంలో ప్రవేశించిన కూలీలు ప్రాణాలను పోగొట్టుకున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌కు వందలాది కూలీలను దింపడం వెనుక ఏపీలో రాజకీయ దందా ప్రధానపాత్ర పోషించిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement