పక్కా సమాచారంతోనే కూంబింగ్! | No violation of law: AP police on encounter | Sakshi
Sakshi News home page

పక్కా సమాచారంతోనే కూంబింగ్!

Published Thu, Nov 3 2016 1:23 AM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM

పక్కా సమాచారంతోనే కూంబింగ్! - Sakshi

పక్కా సమాచారంతోనే కూంబింగ్!

మొదట మావోలే మాపై కాల్పులు జరిపారు
లొంగిపొమ్మని హెచ్చరించినా వినలేదు
వారి కాల్పుల్లో కమాండో అబూ బాకర్ చనిపోయారు
ఆత్మరక్షణ కోసమే ఎదురుకాల్పులు
హైకోర్టులో విశాఖ ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ కౌంటర్

 
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్-ఒడిశా సరిహద్దుల్లో(ఏవోబీ) మావోయిస్టు అగ్రనేతల కదలికలపై విశ్వసనీయ సమాచారం అందుకున్న తరువాతనే గ్రేహౌండ్స్‌తో కలిసి కూంబింగ్ కార్యకలాపాలు చేపట్టామని విశాఖపట్నం ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ హైకోర్టుకు నివేదించారు. కూంబింగ్ సందర్భంగా తారసపడ్డ మావోయిస్టులు తమపై మొదట కాల్పులు జరిపారని, తమ గుర్తింపును తెలియచేసి లొంగిపోవాలని కోరినప్పటికీ వినిపించుకోకుండా కాల్పులు జరుపుతూనే ఉన్నారన్నారు. వారి కాల్పుల్లో మొదట పోలీసులే గాయపడ్డారని, ఈ పరిస్థితుల్లో ఆత్మరక్షణ కోసమే ఎదురు కాల్పులు జరపామన్నారు.

ఈ ఘటనలో పోలీసులు ఎక్కడా చట్ట ఉల్లంఘనలకు పాల్పడలేదని శర్మ తెలిపారు. మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌పై ఏపీ పౌరహక్కుల సంఘం ప్రధాన కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మొత్తం వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు విశాఖ రూరల్ ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ బుధవారం కౌంటర్ దాఖలు చేశా రు. దీనికి సమాధానమిచ్చేందుకు గడువు కావాలని పిటిషనర్ తరఫు న్యాయవాది రఘునాథ్ ధర్మాసనాన్ని కోరారు. ధర్మాసనం అంగీకరిస్తూ తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.

చట్టవ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్న మావోలు
‘విశాఖ జిల్లా ముంచింగ్‌పుట్ పోలీస్‌స్టేషన్ పరిధి నుంచి ఒడిశా రాష్ట్రంలోని మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో విస్తరించి ఉన్న అటవీ ప్రాంతంలో మావోయిస్టు అగ్రనేతలు సంచరిస్తూ స్థానికులను చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేలా రెచ్చగొడుతున్నట్లు మాకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో ఏపీ, ఒడిశా పోలీసులు, గ్రేహౌండ్ కమాండోస్ సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. మావోయిస్టులు తమ చట్ట వ్యతిరేక కార్యకలాపాలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌ఘడ్, జార్ఖండ్, బిహార్, మహారాష్ట్రలకు విస్తరించారు.

ఆంధ్రప్రదేశ్‌లో పెండింగ్‌లో ఉన్న పలు కేసుల్లో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నారు. గత నెల 24న రామగుహ పరిధికి పోలీసులు చేరుకున్నారు. వారిని చూడగానే మావోయిస్టులు కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో గ్రేహౌండ్ కమోండో సతీష్ గాయపడగా, మరో కమోండో అబూబాకర్ మృతి చెందారు. తమ గుర్తింపును తెలియచేసి లొంగిపోవాలని హెచ్చరించినా మావోలు పట్టించుకోలేదు. దీంతో ఆత్మరక్షణ కోసం మేం కూడా ఎదురు కాల్పులు జరిపాం’ అని రాహుల్‌దేవ్ తన కౌంటర్‌లో పేర్కొన్నారు.
 
ఒడిశా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

‘ఈ ఘటనపై చిత్రకొండ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కాల్పుల్లో మొత్తం 24 మంది చనిపోయినట్లు ఒడిశా పోలీసుల ద్వారా తెలిసింది. ఇందులో 13 మంది పురుషులు, 11 మంది మహిళలు ఉన్నారు. 11 మంది మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అందజేశాం. మిగిలిన మృతదేహాలను తీసుకునేందుకు ఎవరూ రాకపోవడంతో ఖననం చేశాం. ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కడా చట్ట ఉల్లంఘనలకు పాల్పడలేదు. ఘటన జరిగింది ఒడిశాలో. కేసు ఆ రాష్ట్ర పరిధిలోనే నమోదైంది. వాస్తవాలను వక్రీకరిస్తూ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. అందువల్ల వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ వ్యాజ్యాన్ని కొట్టేయండి.’ అని శర్మ తన కౌంటర్‌లో కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement