సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దంతెవాడ జిల్లా అరన్‌పూర్ బ్లాస్ట్ వెనుక ఉన్న మాస్టర్ మైండ్‌ను ఛత్తీస్‌గఢ్ పోలీసులు గుర్తించారు. పది మంది డీఆర్‌జీ కానిస్టేబుళ్లు, ఒక డ్రైవరు మరణించిన ఈ ఘటనకు జాగరగుండా తూర్పు గ్రామానికి చెందిన జగదీశ్ ప్రధాన కారకుడిని తేల్చారు. ఈ మేరకు దర్భా కమిటీ సభ్యులపై కేసు నమోదు చేశారు. పోలీసుల విచారణలో వెల్లడైన వివరాలిలా ఉన్నాయి.
ప్రతీకారం కోసమే
ఏప్రిల్ 12న దంతెవాడ జిల్లాలోని గొండెరాస్ పంచాయతీ పరిధిలో పోలీసులు, ప్రత్యేక భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహించాయి. ఇదే సందర్భంలో అక్కడున్న స్థానికులను భద్రతా దళాలు గట్టిగా బెదిరించాయి. గ్రామస్తుల ఎదుటే గాల్లోకి కాల్పులు జరిపారు. 17 మంది వృద్ధులు, పిల్లలను సైతం విచక్షణారహితంగా కొట్టినట్టు మావోయిస్టు పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఈ మేరకు సౌత్ సబ్ జోనల్ బ్యూరో ప్రతికా ప్రకటన సైతం జారీ చేసింది. అయితే ఈ ఘటనపై ఎటువంటి పోలీసు కేసు నమోదు కాలేదు. కానీ గొండెరాస్‌లో స్థానికులపై భద్రతా దళాలు ప్రవర్తించిన తీరుతో మావోలు రగిలిపోయారు. దీంతో ప్రతీకారం కోసం ఎదురు చూశారు.
ఈ క్రమంలో అరన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సలేమీ అడవుల్లో కూంబింగ్ కోసం డి్రస్టిక్ట్ రిజర్వ్‌గార్డ్స్‌తో పాటు సీఆర్‌పీఎఫ్ దళాలు ఈనెల 25న మంగళవారం అడవుల్లోకి వెళ్లాయి. ఒకరోజంతా అడవిలో కూంబింగ్ జరిపి మరుసటి రోజు ఏప్రిల్ 26న తిరుగు ప్రయాణం అయ్యారు. దీనిపై పక్కా సమాచారం అందుకున్న మావోయిస్టులు ప్రతీకారం ప్లాన్‌ను అమల్లో పెట్టినట్టు తెలుస్తోంది.
పక్కా ప్లాన్‌తో
భద్రతా దళాలకు చెందిన సుమారు రెండు వందల మంది ఎనిమిది వాహనాల్లో సలేమీ అడవీ ప్రాంతం నుంచి దంతెవాడకు తిరుగు ప్రయాణం అయ్యారు. అయితే మావోయిస్టులు రోడ్డు కింద ముందుగానే ఐఈడీ అమర్చిన చోటులో రోడ్డుకు అడ్డంగా కర్రలు పెట్టారు. దీంతో ఆ కర్రల దగ్గరకు రాగానే భద్రతా దళాలకు చెందిన వాహనాలు నెమ్మదించాయి. ఇదే అదనుగా మావోలు సుమారు 40 కేజీల ఐఈడీని పేల్చారు.
పేలుడు ధాటికి మినీ బస్సు తునాతునకలైంది. వెంటనే అడవుల్లో మాటువేసి ఉన్న మావోయిస్టులు భద్రతా దళాలపైకి కాల్పులు జరిపారు. ఇరువైపులా నుంచి సుమారు 20 నిమిషాల పాటు కాల్పులు కొనసాగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలోనే దాడికి పాల్పడిన ఇద్దరు మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత రెండు రోజులుగా వీరిని విచారించగా ఈ దాడికి పాల్పడింది జాగరగుండా తూర్పు గ్రామానికి చెందిన జగదీశ్‌గా వెల్లడైంది.
జగదీశ్ తలపై రూ.5 లక్షలు
జగదీష్ చాలా కాలంగా బస్తర్‌లో యాక్టివ్‌గా ఉంటున్నట్టు ఛత్తీస్‌గఢ్ పోలీసులు చెబుతున్నారు. పోలీసు రికార్డుల ప్రకారం గతంలో జగదీశ్ కాటేకల్యాణ్ ఏరియా కమిటీలో యాక్టివ్‌గా ఉండేవాడు. అయితే భారీ దాడులను విజయవంతంగా అమలు చేస్తుండటంతో ఇటీవల పార్టీలో జగదీశ్ కేడర్ పెరిగింది. అలా కీలకమైన దర్బా డివిజన్‌కు వెళ్లాడు. మావోయిస్టుల సైనిక దళంలో ఇప్పుడు జగదీశ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.
ప్రస్తుతం జగదీష్‌పై ఐదు లక్షల రివార్డు ఉంది. అరన్‌పూర్ ఘటనలో జగదీశ్‌తో పాటు మరో 12 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. దర్భా డివిజనల్ కమిటీలో చురుగ్గా ఉన్న జగదీష్, లఖే, లింగే, సోమడు, మహేష్, హిద్మా, ఉమేశ్, దేవే, నంద్ కుమార్, లఖ్మా, కోసా, ముకేశ్, చైతు, మంగ్తు, రాన్సాయి, జయలాల్, బమన్, సోమ, రాకే ష్పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. వీరందరిపై యూఏపీఏ చట్టాన్ని ప్రయోగించారు.
Comments
Please login to add a commentAdd a comment