దండ కారణ్యంలో దడ
ఖమ్మం జిల్లా సరిహద్దు దండకారణ్యంలో యుద్ధమేఘాలు అలముకున్నాయి. ఈనెల 28నుంచి వచ్చేనెల 3వ తేదీ వరకు మావోయిస్టు పార్టీ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలకు రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. వారోత్సవాలకు ముందే జిల్లా సరిహద్దు ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులు వరుస సంఘటనలకు పాల్పడుతున్నారు.
సరిహద్దు మండలాల్లో పోలీస్ బలగాలు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. మావోయిస్టు పార్టీకి పురుడు పోసిన చారు మజుందార్ 1972 జూలై 28న మరణించారు. ఆయన సంస్మరణార్థం ఏటా దేశవ్యాప్తంగా మావోయిస్టు పార్టీ ప్రభావం ఉన్న రాష్ట్రాల్లో వారంరోజులపాటు సంస్మరణ వారోత్సవాలు నిర్వహిస్తుంది. అయితే ఖమ్మం జిల్లా సరిహద్దున ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో ఏటా జిల్లా కమిటీ, కేకేడబ్ల్యూ (కరీంనగర్, ఖమ్మం, వరంగల్), శబరి ఏరియా (చర్ల, వెంకటాపురం, చింతూరు) కమిటీల ఆధ్వర్యంలో వారోత్సవాలు నిర్వహించేవారు. ఇటీవల సరిహద్దులో మావోయిస్టు కార్యకలాపాలు చాలా వరకు తగ్గాయి.
అయితే సంస్మరణ వారోత్సవాలు సమీపించడంతో ఏకంగా రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ, కేకేడబ్ల్యూ కమిటీల పేరుతో చర్ల, వెంకటాపురం మండలాల్లో పోస్టర్లు, కరపత్రాలు వెలిశాయి. వారోత్సవాలను ఆదివాసీలు, గిరిజన ప్రజలు విజయవంతం చేయాలని ఈ మూడు కమిటీలు పిలుపునిచ్చాయి. రాష్ట్ర కమిటీ పేరుతో పోస్టర్లు రావడం, వెంకటాపురం-భద్రాచలం రోడ్డులో మూడురోజుల క్రితం టిఫిన్‌బాంబు పెట్టి మావోయిస్టులు హల్‌చల్ చేయడంతో.. జిల్లా సరిహద్దుల్లోనే రాష్ట్ర కమిటీ మకాం వేసిందనే ప్రచారం జరుగుతోంది.
ఆదివాసీ సంతల్లో తనిఖీలు
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బలగాలు ఆదివాసీ సంతల్లో తనిఖీలు ముమ్మరం చేశాయి. చర్ల, వెంకటాపురం, వాజేడు, దుమ్ముగూడెం మండలాలు ఛత్తీస్‌గఢ్‌కు సరిహద్దున ఉండటంతో ఇక్కడ జరిగే వారాంతపు సంతలకు వచ్చే వారిపై నిఘాపెట్టారు. అలాగే, భద్రాచలం నుంచి చర్ల, వెంకటాపురం, వాజేడు వరకు వెళ్లే వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. అనుమానితుల వివరాలను సేకరిస్తున్నారు. ఈ పరిస్థితులతో దండకారణ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆదివాసీలు ఆందోళనలో ఉన్నారు.