మహదేవపూర్: తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సరిహద్దు అడవుల్లో మళ్లీ పోలీసులు, మావోయిస్టుల మధ్య ఆదిపత్య పోరు మొదలైంది. వరుస ఎన్‌కౌంటర్లతో క్యాడర్‌ను కోల్పోతున్న మావోలు విధ్వంసాలు సృష్టించేందుకు ప్రత్యేకంగా ప్లాటూన్ దళాలను ఏర్పాటు చేసినట్లు సమాచారం. సీపీఐ మావోయిస్టు అమర వీరుల సంస్మరణ వారోత్సవాలు శనివారం నుంచి ప్రారంభమైన నేపథ్యంలో.. సాయుధులను గోదావరి దాటకుండా కట్టడి చేసేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. దీంతో 3 రాష్ట్రాల సరిహద్దు మహదేవపూర్ అడవుల్లో యుద్ధమేఘాలు అలుముకున్నాయి.
జయశంకర్ భూపాలపల్లి, భద్రాది కొత్తగూడెం, ఖమ్మం, ఆదిలాబాద్, మంచిర్యాల, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలతో పాటు ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ, బీజాపూర్, సుక్మా, నారాయణపూర్, కాంకేర్, మహారాష్ట్రలోని గడ్చిరోలి, చంద్రాపూర్ జిల్లాలు గోదావరి నది తీర ప్రాంతాల్లో ఉన్నాయి. ఆయా జిల్లాల సరిహద్దుల్లో మెరుపుదాడులు చేసేందుకు 120 మంది సుశిక్షితులైన యువతీ యువకులతో సీపీఐ మావోయిస్టు పార్టీ ప్రత్యేకంగా ప్లాటూన్ దళాలను ఏర్పాటు చేసినట్లు సమాచారం. సరిహద్దు అడవులపైన పూర్తి పట్టు ఉన్న బడె చొక్కారావు అలియాస్ దామోదర్ ఆధ్వర్యంలో భారీ విధ్వంసాలు సృష్టించేందుకు వ్యూహ రచన జరిగినట్లు తెలిసింది.
తెలంగాణలో పూర్వవైభవం కోసం..
తెలంగాణలో పూర్వవైభవం కోసం హరిభూషన్ నాయకత్వంలో పనిచేస్తున్న ప్రత్యేక కమిటీ ఇటీవల రాష్ట్ర సరిహద్దు అడవుల్లో 3 రాష్ట్రాల కమిటీలు, దండకారణ్యం ప్రత్యేక జోనల్ కమి టీ సమావేశం నిర్వహించినట్లు విశ్వసనీయం గా తెలిసింది. పల్లె ప్రజలతో మమేకమై పనిచేస్తూ సమస్యలపై ఎప్పటికప్పుడు వారిని చైతన్య పరిచి ఉద్యమించేందుకు ‘మిలీషియా’కమిటీలను వేసినట్లు సమాచారం. అడవుల విస్తీర్ణం అధికంగా ఉన్న జయశంకర్ భూపాలపల్లి జిల్లాను అన్నల జిల్లాగా మార్చేందుకు ఇక్కడ పెద్ద ఎత్తున విధ్వంసాలు సృష్టించి అటవీ గ్రామాల్లోని యువతీయువకుల్లో ఆత్మస్థైర్యం పెంపొందించాలని కేంద్ర కమిటీ ఆదే శాలు వచ్చినట్లు తెలిసింది.
అందులో భాగంగానే జిల్లాలో అనేక చోట్ల వాల్‌పోస్టర్లు వేయడం, బ్యానర్లు కట్టడం, కరపత్రాలు పంచడం, మందుపాతరలు అమర్చడం, అక్రమార్కులకు హెచ్చరికలు జారీ చేయడం వంటి ఘటనలకు పాల్పడుతున్నారు. సరిహద్దుల్లోని ఛత్తీస్‌గఢ్‌లో రహదారులు నిర్మిస్తున్న కాంట్రాక్టర్‌ల వాహనాలు, యంత్రాలు, బస్సులను దహనం చేయడం, మందుపాతరలు పెట్టి పోలీసులను హతమార్చడం వంటి చర్యలకు దిగుతున్నారు.
గత డిసెంబర్‌లో భూపాలపల్లి జిల్లాలోని పలిమెల మండలం ముకునూరు గ్రామంలో సుమారు 80 మంది సాయుధుల సంచారం, గతంలో గ్రామ బహిష్కరణ చేసిన దొరల గురించి ఆరా తీయడం, మంత్రులు వేసిన శిలాఫలకాలను ధ్వంసం చేయడం, రేగొండ మండలంలో వాల్‌పోస్టర్లు వేయడం, మహాముత్తారం మండలంలో అధికార పార్టీ నేతలను హెచ్చరిస్తూ పోస్టర్లు అంటించడం, వెంకటపూర్ మండలంలో మందుపాతరలు అమర్చడం వంటి చర్యలతో ఉనికిని చాటుతున్నారు.
మావోయిస్టుల పేరిట కరపత్రాలు
చర్ల: జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను నిర్వహించాలంటూ పిలుపునిచ్చిన మావోయిస్టు పార్టీ పేరుతో శనివారం మండల కేంద్రమైన చర్లలో కరపత్రాలు వెలిశాయి. పార్టీ రాష్ట్ర కమిటీ పేరిట ముద్రించిన ఈ కరపత్రాలను పూజారిగూడెంలోని ప్రధాన రహదారి వెంట వదలడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. సమరోత్సాహంతో అమరులను స్మరించుకోవాలని, అమరుల ఆశయ సాధనకు పాటుపడాలని మావోయిస్టులు ఈ కరపత్రాలలో కోరారు.
నిరంతరం కూంబింగ్
ఇదిలా ఉండగా.. తెలంగాణలో మావోయిస్టులు లేరని ఒకవైపు ప్రకటనలు ఇస్తున్న పోలీసులు.. గోదావరి తీరంలో నిరంతరం కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. మావోయిస్టులు గోదావరి దాటకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టారు. తీవ్రవాద సమస్య పైన పూర్తి అవగాహన ఉన్న ఎస్పీ భాస్కరన్, డీఎస్‌పీ కేఆర్‌కే ప్రసాద్‌రావు నేతృత్వంలో పకడ్బందీ చర్యలు తీసుకుంటూ గోదావరి లోయలోని అటవీ గ్రామాల్లో అన్నలకు షెల్టర్ దొరకకుండా ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో అటు మావోయిస్టులు, ఇటు పోలీసుల మధ్య ఆధిపత్య పోరుతో అడవిబిడ్డలు నలిగిపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment