
మన్యంలో మారణహోమం
మన్యం మరోసారి రక్తసిక్తమయింది. కొయ్యూరు మండలంలో బుధవారం రాత్రి తుపాకుల మోత ...
► ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోలు హతం
► మృతుల్లో అగ్రనేత ఆజాద్?
► ఉద్యమానికివరుస దెబ్బలు
సాక్షి, విశాఖపట్నం/కొయ్యూరు : మన్యం మరోసారి రక్తసిక్తమయింది. కొయ్యూరు మండలంలో బుధవారం రాత్రి తుపాకుల మోత మోగింది. భారీ ఎన్‌కౌంటర్‌తో మావో ఉద్యమానికి కోలుకోలేని దెబ్బ తగిలింది. అగ్రనేత ఆజాద్ సహా ఇద్దరు మహిళా మావోయిస్టులు పోలీసుల ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు విడిచారు. అదే నిజమైతే విశాఖ మన్యంలో మావోయిస్టులకు తీరని నష్టం వాటిల్లినట్లే. ఇటీవల మావోయిస్టులకు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. తాజా ఎన్‌కౌంటర్లో గాలికొండ ఏరియా కమిటీ కమాండర్ గోపాల్ అలియాస్ ఆజాద్ హతమైనట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. సంఘట స్థలంలో ఏకే 47 తుపాకీని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెబుతున్న దాన్ని బట్టి ఈ విషయం నిర్ధారణవుతోంది.
మిగిలిన ఇద్దరు మహిళా మావోయిస్టులు ఎవరన్నది తెలియాల్సి ఉంది. కొయ్యూరు మండలం మర్రిపాక, జెర్రికొండ గ్రామాల మధ్య జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ఆజాద్ చనిపోయాడనే వార్త కలకలకం రేపుతోంది. అసలు ఆ ప్రాంతంలో అగ్ర నేతతోపాటు 15 మంది మావోయిస్టులు ఎందుకు ఉన్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి ఆజాద్ స్థాయి నేతలు దండకారణ్యంలో ఉంటారు. వారున్న ప్రాంతానికి కూంబింగ్ దళాలు వెళ్లడం దాదాపు అసాధ్యం. వారికి వారుగా మన్యం వెలుపలకు వస్తే తప్ప పట్టుకోవడానికి కూడా పోలీసులు సాహసించరు. కానీ ఆజాద్ కూంబింగ్ పోలీసులు వెళ్లగలిగే ప్రాంతంలోనే ఉండటం పోలీసులకు కలిసివచ్చిందని చెప్పవచ్చు. ఆజాద్ కుటుంబం మొత్తం మావోయిస్టు ఉద్యమానికే అంకితమైంది. విశాఖపట్నం జిల్లాకు చెందిన గోపాల్ అలియాస్ ఆజాద్ తల్లిదండ్రులు లక్ష్మణరావు, అర్జునమ్మ కూడా మాజీ మావోయిస్టులే. కొంతకాలం క్రితం పోలీసులకు లొంగిపోయి విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం కరకవానిపాలెంలో నివాసం ఉంటున్నారు. ఆయన సోదరి అరుణ కూడా ఒడిశాలో మావోయిస్టు పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు.
మిగిలింది ఇద్దరే: ఆజాద్ చనిపోవడం మవోయిస్టులు జీర్ణించుకోలేరు. ఎందుకంటే వారికి ఇటీవల వరుసగా ఇలాంటి సంఘటనలే ఎదురవుతున్నాయి. అగ్రనేతలను, కేడర్‌ను కోల్పోతున్నారు. ఉద్యమంలో కీలకంగా, కార్యకలాపాల్లో అత్యంత చురుగ్గా ఉండే ఏవోబీ ఎస్‌ఆర్‌సీ (సెంట్రల్ రీజన్ కమిటీ) కమాండర్ కుడుముల వెంకటరమణ అలియాస్ రవి గత నెల 9న అనారోగ్యంతో మృతి చెందారు. రవి మరణం ఈస్టు డివిజన్‌పై ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం ఈస్టు డివిజన్‌కు చలపతి, ఆజాద్‌లు నేతృత్వం వహిస్తున్నారు. వీరిద్దరూ మైదాన ప్రాంతం నుంచి వచ్చిన వారు. ఇప్పుడు ఆజాద్ మరణిస్తే మైదాన నాయకుల్లో ఇక మిగిలింది చలపతి ఒక్కరే. రవి మరణం తరువాతగిరిజన మావోయిస్టు నేతగా బాకూరి వెంకటరమణ అలియస్ గణేష్ మాత్రమే మిగిలారు. 2010లో జరిగిన చెరువూరు ఎన్‌కౌంటర్లో గణేష్‌కు గాయాలు కావడంతో కంటివ్యాధులొచ్చాయని చెబుతున్నారు.
కేంద్ర కమిటీ సభ్యులు మినహా విశాఖ ఏజెన్సీలో ఉద్యమాన్ని నడిపించేందుకంటూ చివరికి మిగిలింది చలపతి, గణేష్‌లు మాత్రమే. గడిచిన ఏడాదిలో పంగి భాస్కరరావు అలియాస్ సూర్యం, పంగి అప్పన్న అలియాస్ రామన్న, కొర్రా శ్రీరాములుతోపాటు 64 మంది మిలీషియా సభ్యులు, 18మంది సానుభూతి పరులను పోలీసులు అరెస్ట్ చేశారు. లొంగుబాట్లను ప్రోత్సహిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం మన్యంలో జరిగిన ఎన్‌కౌంటర్లో ఒడిశాకు చెందిన గిరిజనులను హతమార్చారు. వారు ఆర్మ్‌డ్ మిలీషియా సభ్యులుగా చెప్పుకొచ్చారు. ఓ వైపు ఎన్‌కౌంటర్లు చేస్తూ, మరోవైపు లొంగుబాట్లకు ఉసిగొల్పుతూ పోలీసులు పన్నుతున్న వ్యూహాలకు మావో ఉద్యమం మసకబారుతోంది.