ముష్కరులు హతం
కశ్మీర్‌లో ముగిసిన ఎన్‌కౌంటర్.. 48 గంటల పాటు కాల్పులు
ఈడీఐ భవనంలో కొనసాగుతున్న కూంబింగ్
♦ భారీ స్థాయిలో ఆయుధాలు, మందుగుండు లభ్యం
♦ ఈ ఉగ్రవాదులు విదేశీయులు కావచ్చు: సైన్యం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లా పాంపోర్‌లో మూడు రోజులుగా ఉగ్రవాదులతో కొనసాగిన భద్రతాదళాల ఎదురుకాల్పులు సోమవారం ముగిశాయి. సైన్యానికి చెందిన ప్రత్యేక దళాలు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. హతులు పాక్‌లోని లష్కరే తోయిబా ఉగ్రవాదులుగా అనుమానిస్తున్నారు. ఈ ఎదురు కాల్పుల్లో ఐదుగురు భద్రతా సిబ్బంది, ఒక పౌరుడు ప్రాణాలు కోల్పోయారు. ఆత్మాహుతి బృందంగా భావిస్తున్న ఉగ్రవాదులు భారీ ఆయుధ సామగ్రితో శనివారం మధ్యాహ్నం శ్రీనగర్ - జమ్మూ జాతీయ రహదారిపై సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్ మీద దాడి చేసి.. సమీపంలోని ప్రభుత్వ బహుళ అంతస్తుల భవనం ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లోకి చొరబడిన విషయం విదితమే.
అందులో నక్కిన ఉగ్రవాదులతో శనివారం సాయంత్రం మొదలైన భద్రతా బలగాల ఎదురు కాల్పులు సోమవారం మూడో రోజూ కొనసాగాయి. భద్రతా బలగాల సంఖ్యను పెంచి.. భవనంలో దాక్కున్న ఉగ్రవాదులను ఏరివేసేందుకు మోర్టార్ షెల్స్‌ను ప్రయోగించారు. ‘‘భవనంలో నక్కిన ముగ్గురు ఉగ్రవాదులను మేం హతమార్చాం. వారు విదేశీయులుగా కనిపిస్తున్నారు.’’ అని ఆపరేషన్ పూర్తయిన తర్వాత విక్టర్ ఫోర్స్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేజర్ జనరల్ అరవింద్‌దత్తా మీడియాకు తెలిపారు. భారీ మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
మొత్తం 44 గదులు, లాబీలు, వాష్‌రూమ్‌లు, పై అంతస్తులో రెస్టారెంట్‌లున్న ఆ భవనాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టినట్లు వివరించారు. ఉగ్రవాదులు చొరబడిన భవన సముదాయంలో వారు దాక్కునేందుకు చాలా ప్రదేశాలు ఉండటం, నక్కి ఉండి దాడులు చేస్తుండటం వల్ల.. వారిని ఎదుర్కొనేందుకు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్లాల్సి ఉందని.. అందుకే ఆపరేషన్ పూర్తవటానికి ఇంత సమయం పట్టిందని ఒక ప్రశ్నకు సమాధానంగా వివరించారు. ఉగ్రవాదులు భవనంలోకి చొరబడిన వెంటనే బలగాలు వేటాడేందుకు వెంటనే ప్రయత్నించగా.. ఉగ్రవాదులు గ్రెనేడ్లు విసిరారని దీంతో బలగాలు వెనక్కు తగ్గాల్సి వచ్చిందన్నారు. సైన్యం రంగ ప్రవేశం చేసి ఆపరేషన్‌ను కొనసాగించిందని చెప్పారు. ఈ దాడి లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ దాడిగా కనిపిస్తోందని సీఆర్‌పీఎఫ్ డెరైక్టర్ జనరల్ ప్రకాశ్‌మిశ్రా ఢిల్లీలో విలేకరులతో పేర్కొన్నారు. ఇటీవల కశ్మీర్‌లోని ఉదంపూర్, పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లలో భద్రతా బలగాలు లక్ష్యంగా జరిగిన దాడుల తరహాలోనే తాజా దాడులు ఉన్నాయని వివరించారు.
కెప్టెన్ పవన్‌కు అశ్రునయనాలతో వీడ్కోలు
జింద్ (హరియాణా): కశ్మీర్‌లో ఉగ్రవాదులతో పోరాడుతూ ఆదివారం అమరుడైన కెప్టెన్ పవన్‌కుమార్ (23) భౌతికకాయానికి హరియాణాలోని ఆయన స్వగ్రామంలో పూర్తి సైనిక లాంఛనాల మధ్య అశ్రునయనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. రాష్ట్రంలో రిజర్వేషన్ కోసం ఆందోళన చేస్తున్న జాట్ నిరసనకారులు.. సైన్యం, ప్రభుత్వ విజ్ఞప్తితో అమరుడి గ్రామానికి వెళ్లే మార్గాల్లో అవరోధాలను తొలగించి దారి ఇచ్చారు. అంతకుముందు.. త్రివర్ణ పతాకం కప్పిన కెప్టెన్ పవన్‌కుమార్ భౌతికకాయానికి పఠాన్‌కోట్‌లో పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించాక.. ప్రత్యేక హెలికాప్టర్‌లో జింద్ జిల్లాలోని ఆయన స్వగ్రామం బధానాకు తీసుకువచ్చారు. జాట్ల ఆందోళనతో ఈ జిల్లా కూడా ప్రభావితమైనప్పటికీ.. భారీ సంఖ్యలో ప్రజలు అమరుడికి నివాళులర్పించేందుకు తరలివచ్చారు. కెప్టెన్ పవన్‌కుమార్ కజిన్ సోదరుడు సందీప్ చితికి నిప్పంటించగా.. సైన్యం తుపాకి వందనం సమర్పించింది. తన ఏకైక కుమారుడిని జాతికి అందించానని, అది తనకు ఎంతో గర్వకారణమని కెప్టెన్ పవన్‌కుమార్ తండ్రి రాజ్‌బీర్ ఆదివారం నాడు పేర్కొన్న విషయం తెలిసిందే. సైన్యం నుంచి సీనియర్ అధికారులు, కెప్టెన్ అభిమన్యు, ఓంప్రకాశ్ ధాన్కర్ సహా రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ మంత్రులు తదితరులు అమరుడికి తుది నివాళులర్పించారు.
అమర జవాన్లకు ఘన నివాళులు
శ్రీనగర్/జమ్మూ: అమరులైన మరో ఇద్దరు జవాన్లు లాన్స్ నాయక్ ఓంప్రకాశ్, కెప్టెన్ తుషార్ మహాజన్‌ల భౌతిక కాయాలకు.. శ్రీనగర్‌లోని బాదామి బాగ్ సైనిక కేంద్రంలో ఘనంగా నివాళులర్పించారు. తర్వాత తుషార్ మహాజన్ మృతదేహాన్ని సొంతూరు ఉదంపూర్‌కు తరలించారు. సైనిక స్థావరానికి తుషార్ మృతదేహం చేరుకోగానే.. అతడి తల్లి కన్నీటి పర్యంతమయ్యారు. సైన్యంలో చేరటమే లక్ష్యంగా పెట్టుకున్న తన కుమారుడు పదహారేళ్లకే ఎన్‌డీఏకు ఎంపికయ్యాడని తుషార్ తండ్రి, మాజీ ప్రిన్సిపల్ దేవ్‌రాజ్ అశ్రునయనాలతో తెలిపారు. అతడి స్వప్నం అదే కావటంతో తాము ఎన్నడూ అభ్యంతరం చెప్పలేదన్నారు.