సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేశామని ఎన్నికల నోడల్ అధికారి, శాంతి భద్రతల అదనపు డీజీపీ జితేందర్ స్పష్టంచేశారు. ప్రశాంత వాతావరణంలో ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. శుక్రవారం జరగనున్న పోలింగుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేసినట్టు వెల్లడించారు. మొత్తంగా 6వేల సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించినట్టు తెలిపారు.సుమారు ఆరు జిల్లాల్లో ఈ తరహా ప్రాంతాలను గుర్తించామని, వీటిలో కొడంగల్ కూడా ఒకటని జితేందర్ తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా పోలీసు శాఖ, ఐటీ విభాగం సంయుక్తంగా రూ.125కోట్ల నగదు, ఎక్సైజ్ శాఖతో కలసి 4 లక్షల లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. రూ.6 కోట్ల విలువైన ప్లాటినం, బంగారం, వెండి, రూ. 60 లక్షల విలువ గల గంజా యి, రూ.1.6 కోట్ల విలువైన బహుమతులు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. 90,238 మందిని బైండోవర్ చేయగా, 8,482 లైసెన్స్‌డ్ ఆయుధాలు డిపాజిట్ చేసుకున్నట్టు తెలిపారు. 11,862 నాన్‌బెయిలబుల్ వారంట్లను అమలు చేసినట్టు తెలిపారు. కోడ్ ఉల్లం ఘన కింద 1,501 కేసులు నమోదు చేశామన్నారు.
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా ఉన్న 13నియోజకవర్గాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశామని, ముందస్తుగా సరిహద్దు ప్రాంతాల్లో కూంబింగ్ ముమ్మరం చేసినట్టు తెలిపారు. ఛత్తీస్‌గడ్, మహరాష్ట్ర అధికారులతో సమన్వయం చేసుకుంటున్నట్టు వివరించారు. నగదు పట్టుబడ్డ చోట్ల విచారణ జరిపి సంబంధిత నేతలపై కేసులు నమోదు చేసినట్టు జితేందర్ తెలిపారు. ఏపీ టీడీపీ నేత జూపూడి ప్రభాకర్‌రావు, పోటీలో ఉన్న అభ్యర్థులు సర్వే సత్యనారాయణ, మల్లారెడ్డి, జగ్గారెడ్డి, ఆనంద్‌ప్రసాద్ తదితరులపై సెక్షన్ 171 కింద కేసులు నమోదు చేసినట్టు తెలిపారు.వరంగల్, ఆదిలాబాద్, హైదరాబాద్‌లో పట్టుబడ్డ హవాలా నగదుపై ఐటీ, ఈడీ అధికారులు దర్యాప్తు జరుపుతారని జితేందర్ వెల్లడించారు. ఈ డబ్బు పొందేందుకు యత్నించిన పలువురి నేతలపై కూడా విచారణ జరిపే అవకాశం ఉందని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లోని నేతలు హైదరాబాద్‌లో ఉండాల్సి వస్తే సంబంధిత ప్రాంతంలోని రిటర్నింగ్ అధికారి నుంచి అనుమతి తీసుకోవాలని స్పష్టంచేశారు. నిబంధనలు ఉల్లంఘించి వివిధ ప్రాంతాల్లో ఎవరైనా ఉంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. పోలీస్ అధికారులపై పలు పార్టీలు, అభ్యర్థులు చేసిన ఫిర్యాదులు, ఆరోపణలపై విచారణ చేస్తున్నామని, రెండు కేసుల్లో అధికారులపై చర్యలు తీసుకున్నట్టు జితేందర్ స్పష్టంచేశారు.
ప్రశాంతంగా ఓటు వేయండి...
Published Fri, Dec 7 2018 1:17 AM | Last Updated on Fri, Dec 7 2018 1:17 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment