చింతపల్లి పోలీస్ స్టేషన్‌ను పరిశీలిస్తున్న డీజీపీ ఠాకూర్
విశాఖ క్రైం: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమల హత్యోదంతంపై డీజీపీ ఆర్పీ ఠాకూర్ గురువారం ఉదయం ఎస్పీ కార్యాలయంలో కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, సీపీ మహేష్‌చంద్ర లడ్డా, డీఐజీ శ్రీకాంత్‌తో పాటు మరి కొంతమంది పోలీసుఅధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ కీలకసమావేశంలో జరిగిన చర్చల సారాంశం కొంత బయటకు వచ్చింది. కిడారి, సోమ ఆ రోజు ఎందుకు వెళ్లారు అన్నదానిపై ప్రధానంగా చర్చించినట్టు తెలిసింది. గతంలో జరిగిన దాడులు, సరిహద్దుల్లో ప్రస్తుత పరిస్థితులపై చర్చించినట్టు సమాచారం. సిబ్బంది పనితీరు, అధికారుల పర్యవేక్షణపై సమీక్షించారు. హత్య చేయడానికి ముందు మావోయిస్టులు ఏరూటులో వచ్చారు, ఎక్కడ ఉన్నారు, వారికి ఎవరు ఆశ్రయమిచ్చారు అన్న విషయాలపై పోలీసులు సేకరించిన సమాచారంపై చర్చినట్టు భోగట్టా. ఈ చర్చ మధ్యాహ్నం వరకు సాగింది. మధ్యాహ్నం 2.30 గంటలకు ఎస్పీ కార్యాలయం నుంచి కలెక్టర్ బయటకు వచ్చారు. తరువాత పోలీసు అధికారులతో డీజీపీ సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రిచంద్రబాబునాయుడు వస్తున్న సందర్భంగా భద్రతాపరంగా తీసుకోవలసిన ఏర్పాట్లపై చర్చించినట్టు తెలిసింది. ఈ సమావేశంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. అనంతరం డీజీపీ ఠాకూర్ బక్కన్నపాలెంలోగల గ్రేహౌండ్స్‌నుసందర్శించారు.
అప్రమత్తంగా ఉండాలి
చింతపల్లి(పాడేరు): మన్యంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులు అప్రమత్తంగా ఉండాలని డీజీపీ ఠాకూర్ అన్నారు. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతమైన చింతపల్లి పోలీస్‌స్టేషన్‌ను గురువారం రాత్రి ఆయన సందర్శిం చారు. మావోయిస్టుల కదలికలకు సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవాలని ఆయన స్థానిక పోలీసు అధికారులను సూచించారు. కమ్యూనిటీ పోలీసింగ్ అమలుతీరుపై ఆయన సంతృప్తి వ్యక్తం చేసి, స్థానిక పోలీసు అధికారులను ప్రశంసించారు. చింతపల్లి,గూడెంకొత్తవీధి మండలాల్లో పరిస్థితులను అడిగితెలుసుకున్నారు.
పోలీస్‌స్టేషన్లకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలన్నారు. మావోయిస్టులతో ప్రమాదం పొంచిఉన్న ఈ ప్రాంత ప్రజాప్రతినిధులను అప్రమత్తం చేయాలన్నారు. కార్యక్రమంలో విశాఖరేంజ్ డీఐజీ సీహెచ్ శ్రీకాంత్, చింతపల్లి డీఎస్పీ అనిల్ పులిపాటి, సీఆర్‌పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ అనంత్ బన్సీ, సీఐ చంద్రశేఖర్, ఎస్‌ఐ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
బోసిపోయిన పర్యాటక ప్రాంతాలు
అరకులోయ: అరకు ఎమ్మెల్యే,మాజీ ఎమ్మెల్యేల హత్య తరువాత అరకులోయలో పర్యాటప్రాంతాలు బోసిపోయాయి. నేతల హత్య సంఘటన వార్తలు విస్తృతంగా ప్రసారం జరగడంతో పర్యాటకులు అరకులోయ ప్రాంత సందర్శనను వాయిదా వేసుకున్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా అనంతగిరి,అరకులోయ,డుంబ్రిగుడ మండలాల్లోని పర్యాటక ప్రాంతాల్లో గురువారం పర్యాటకశాఖ కూడా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించలేదు. పర్యాటకుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. కిరండూల్ రైలులో కూడా పర్యాటకులు స్వల్ప సంఖ్యలో అరకులోయకు వచ్చారు. బొర్రాగుహలు,కటికి జలపాతం,ఘాట్‌లో కాఫీతోటలు,డముకు,గాలికొండ వ్యూపాయింట్ ప్రాంతాలతో పాటు,పద్మాపురం గార్డెన్,గిరిజన మ్యూజియం,రణజిల్లెడ,చాపరాయి,కొల్లాపుట్టు జలపాతాల ప్రాంతాలన్నీ సందర్శకులు లేక బోసిపోయాయి.అరకులోయ ప్రాంతంలోని అన్ని ప్రభుత్వ,ప్రైవేట్ అతిధి గృహాలు,రిసార్ట్స్.హోటళ్లు కూడా ఖాళీగానే దర్శనమిచ్చాయి.
మంత్రి లోకేష్ పర్యటన రద్దు
సాక్షి, విశాఖపట్నం: మంత్రి నారా లోకేష్ జిల్లా పర్యటన రద్దయ్యింది. హత్యకు గురైన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు షెడ్యూల్ ప్రకారం శుక్రవారం ఏజెన్సీలో పర్యటించాల్సి ఉంది. మంత్రి వస్తున్నట్టు కలెక్టరేట్‌తో పాటు పోలీస్‌శాఖకు మంత్రి కార్యాలయం నుంచి గురువారం మధ్యాహ్నం వర్తమానం అందింది. మీడియాకు కూడా టూర్ షెడ్యూల్ విడుదలైంది. ఇంతలో ఏమైందో ఏమో మంత్రి లోకేష్ పర్యటన రద్దయినట్టు మంత్రి కార్యాలయం నుంచి సింగిల్ లైన్ వర్తమానం అందింది. దీంతో అధికారులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయితే లోకేష్ తన పర్యటనను ఎందుకు రద్దు చేసుకున్నారంటూ అధికారులే కాదు..అధికార పార్టీ నేతలు కూడా చర్చించు కుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment