jitendra
-
బెయిల్ ఇప్పించి చంపేశాడు
బరేలీ: ప్రతీకారంతో రగిలే వ్యక్తి ఎంతకైనా తెగిస్తాడంటారు. ఉత్తరప్రదేశ్‌లోని ఖేరి జిల్లా మితౌలీ గ్రామంలో కాశీ కాశ్యప్(50) అనే వ్యక్తి అదే చేశాడు. తన కొడుకును చంపి జైల్లో ఉన్న వ్యక్తిని బెయిల్‌పై బయటకు తీసుకొచ్చి మరీ హత్య చేశాడు. కాశీ దంపతులకు జితేంద్ర(14) అనే కొడుకున్నాడు. 2020లో ఓ హత్య కేసులో కాశీ జైలుకెళ్లాడు. తర్వాత అతని భార్యకు సమీప బంధువైన శత్రుధన్ లాలా (47)తో అక్రమ సంబంధం ఏర్పడింది. వారిద్దరూ తమకు అడ్డుగా ఉన్న జితేంద్రను చంపేశారు. ఈ కేసులో ఇద్దరూ జైలుపాలయ్యారు. గతేడాది కాశీ జైలు నుంచి బయటికొచ్చాడు. కొడుకును పొట్టనపెట్టుకున్న లాలాపై ప్రతీకారంతో రగిలిపోయాడు. సొంత ఖర్చుతో లాయర్‌ను ఏర్పాటు చేసి మరీ లాలాను బెయిల్‌పై బయటకు తీసుకొచ్చాడు. శుక్రవారం రాత్రి అతన్ని తుపాకీతో కాల్చి చంపాడు. పోలీసులు కాశీని అదుపులోకి తీసుకున్నారు. -
తీవ్ర విషాదం.. మీర్జాపూర్ నటుడు మృతి
సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు జితేంద్ర శాస్త్రి మృతి చెందారు. ఆయన మరణించినట్లు ప్రముఖ నటుడు సంజయ్ మిశ్రా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ సందర్భంగా జితేంద్ర శాస్త్రితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఆయన భావోద్వేగానికి గురయ్యారు. అయితే ఆయన మృతికి గల కారణాలను ఆయన వెల్లడించలేదు. వృద్ధాప్య సమస్యలతో ఆయన మరణించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సంజయ్ మిశ్రా ట్వీట్ చేస్తూ.. ‘‘జీతూ భాయ్ మీరు నాతో ఓ మాట చెప్పారు. ‘సంజయ్ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఫోన్ వ్యక్తి పేరు ఉంటుంది. చదవండి: సొంతవాళ్లే మోసం చేశారు, నటి వల్ల రూ. 6 కోట్లు నష్టపోయా: గీతా సింగ్ కానీ, ఆ మనిషి నెట్వర్క్ పరిధిలో ఉండడు’ అన్నారు. చెప్పినట్టుగానే మీరు ఈ ప్రపంచాన్ని(నెట్వర్క్) వీడారు. కానీ మా మనసుల్లో, ఆలోచనలో ఎప్పుడు ఉంటారు. ఓం శాంతి’’ అంటూ ఆయనతో ఉన్న ఫొటోను షేర్ చేశారు. ఇక ఆయన మరణావార్తమ తెలిసి బాలీవుడ్ సినీ, టీవీ నటులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ సంతాపం ప్రకటిస్తున్నారు. కాగా జితేంద్ర శాస్త్రి బ్లాక్ ఫ్రైడే, ఇండియాస్ మోస్ట్ వాంటెడ్, రాజ్మా చావ్లా వంటి చిత్రాల్లో నటించి గుర్తింపు పొందారు. అలాగే ఓటీటీలో అంత్యంత ఆదరణ పొందిన మీర్జాపూర్ వెబ్ సిరీస్‌లో కూడా ఆయన నటించారు. ఇందులో ఆయన ఉస్మాన్ అనే ప్రధాన పాత్ర పోషించారు. View this post on Instagram A post shared by Sanjay Mishra (@imsanjaimishra) -
కోర్టులో కాల్పుల మోత
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో న్యాయస్థానంలో కాల్పులు జరగడం, ముగ్గురు మరణించడం కలకలం సృష్టించింది. విచారణ కోసం తీసుకొచి్చన వ్యక్తిని అతడి ప్రత్యర్థులు కోర్టు గదిలో కాల్చి చంపారు. పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు దుండుగులు హతమయ్యారు. ప్రత్యక్ష సాక్షులు, పోలీసుల కథనం ప్రకారం 30 ఏళ్ల జితేంద్ర గోగి ఢిల్లీలో పేరుమోసిన గ్యాంగ్‌స్టర్. పలు కేసుల్లో ప్రధాన నిందితుడు. దుబాయ్‌కి చెందిన ఓ వ్యాపారవేత్తను రూ.5 కోట్లు ఇవ్వాలని బెదిరించిన వ్యవహారంలో అరెస్టయి తీహార్ జైల్లో ఉన్నాడు. ఈ కేసు విచారణలో భాగంగా జడ్జి ఎదుట ప్రవేశపెట్టడానికి శుక్రవారం మధ్యాహ్నం పోలీసులు రోహిణి కోర్టులోని 207నంబర్ గదికి తీసుకొచ్చారు. ఇద్దరు దుండగులు న్యాయవాదుల దుస్తుల్లో లోపలికొచ్చి పిస్టోళ్లతో గోగిపై కాల్పులు జరిపారు. దాదాపు ఆరు తూటాలు శరీరంలోకి దూసుకెళ్లడంతో గోగికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు అప్రమత్తమై ఎదురు కాల్పులు జరపడంతో ఆ ఇద్దరు దుండుగులు హతమయ్యారు. చికిత్స కోసం గోగిని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దుండగుల కాల్పుల్లో కోర్టు గదిలో ఉన్న ఓ మహిళా న్యాయవాది కాలులోకి తూటా దూసుకెళ్లింది. రోహిణి కోర్టులో జరిగిన కాల్పులపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరపాలని ఢిల్లీ బార్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. భద్రతను పెంచేదాకా తాము కోర్టులకు హాజరు కాబోమని న్యాయవాదులు తేల్చిచెప్పారు. గోగిపై కాల్పులు జరిపిన ఇద్దరు వ్యక్తులు అతడి ప్రత్యర్థి టిల్లూ తాజ్పూరియా వర్గానికి చెందినవారేనని, వారిలో ఒకడిపై రూ.50 వేల రివార్డు ఉందని పోలీసులు తెలిపారు. వారిద్దరిని ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పట్‌కు చెందిన రాహుల్, బక్కర్వాలా గ్రామానికి చెందిన మోరిస్‌గా గుర్తించారు. జితేంద్ర గోగి, టిల్లూ తాజ్పూరియా అలియాస్ సునీల్ అలీపూర్, సోనిపట్ పట్టణాల్లో దోపిడీ రాకెట్లు నడిపేవారు. ఇరు వర్గాల మధ్య పలుమార్లు ఘర్షణలు జరిగాయి. కాల్పులు చోటుచేసుకున్నాయి. గత ఆరేళ్లలో ఇరు వర్గాలకు చెందిన వారు పది మందికిపైగా మృతి చెందారు. కళాశాల నుంచే కక్షలు జితేంద్ర గోగి, టిల్లూ తాజ్పూరియా మధ్య కళాశాల స్థాయి నుంచే వైరం ఉందని పోలీసులు చెబుతున్నారు. ఇద్దరూ ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు విద్యార్థి రాజకీయాల్లో చేరారు. తరచూ గొడవలకు దిగేవారు. శత్రుత్వం పెరిగిపోయింది. 2012లో టిల్లూ స్నేహితుడు వికాస్‌ను గోగి వర్గం కాల్చి చంపేసింది. 2015లో సోనిపట్ పోలీసులు టిల్లూను అరెస్టు చేశారు. ప్రస్తుతం సోనిపట్ జైల్లోనే ఉన్నాడు. టిల్లూను ఎలాగైనా అంతం చేయాలని గోగి ఎప్పటి నుంచో యత్నిస్తున్నాడు. 2016లో పోలీసు కస్టడీ నుంచి తప్పించుకున్న గోగి తదనంతరం టిల్లూ వర్గంలో చాలామందిని హతమార్చాడు. సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ ఆందోళన రోహిణి కోర్టులో కాల్పుల ఘటనపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ ఎన్.వి.రమణ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీ హైకోర్టు సీజే జస్టిస్ పటేల్‌తో మాట్లాడారు. కోర్టు గదిలో కాల్పులు, దుండగుల మృతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీసులతో, బార్ అసోసియేషన్‌తో చర్చించి, న్యాయస్థానం కార్యకలాపాలకు విఘాతం కలుగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. న్యాయస్థానాలతోపాటు న్యాయవాదులు, న్యాయమూర్తుల రక్షణకు సుప్రీంకోర్టు అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని అధికారులు తెలిపారు. ఈ అంశం వచ్చేవారం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. -
ఒంటరినైపోయినట్లు అనిపించింది
సుమారు నాలుగు దశాబ్దాలు (1960 నుంచి 2000వరకూ) సినిమాలు చేస్తూ బిజీబిజీగా జీవితాన్ని గడిపారు ప్రఖ్యాత బాలీవుడ్ నటుడు జితేంద్ర. ఆ తర్వాత సినిమాలు తగ్గించారు. సినిమాలు తగ్గించాక ‘ఒంటరినైపోయినట్లు అనిపించింది’ అన్నారు. 2013 నుంచి ఆయన సినిమాల్లో నటించలేదు. చాలా గ్యాప్ తర్వాత ఓ వెబ్ సిరీస్ (బారిష్ 2) చేశారు. ఈ సిరీస్‌తోనే వెబ్ వరల్డ్‌లోకి అడుగుపెడుతున్నారు. ఈ సిరీస్‌ను జితేంద్ర కుమార్తె ఏక్తా కపూర్ నిర్మించారు. నటుడిగా ఇన్నేళ్లు గ్యాప్ తీసుకోవడం గురించి, సినిమాలు చేయకపోవడం గురించి జితేంద్ర మాట్లాడుతూ – ‘‘సినిమాలు తగ్గించాక నటించడాన్ని పెద్దగా మిస్ అయినట్టు అనిపించలేదు కానీ, షూటింగ్ వాతావరణాన్ని బాగా మిస్ అయ్యాను. . ఒకేసారి రెండుమూడు సినిమాలు చేస్తుండేవాళ్లం. ఉదయం నుంచి రాత్రి వరకూ స్టూడియోలోనే ఉండేవాళ్లం. సెట్లో ఎప్పుడూ సందడి ఉండేది. లొకేషన్లోకి అడుగుపెట్టగానే చాలా మంది కనిపించేవారు. అందరితో మాట్లాడటం, అనుభవాలు పంచుకోవడం.. అలా చుట్టూ మనుషులతో టైమ్ ఎలా గడిచిపోయేదో తెలిసేది కాదు. ఆ వాతావరణాన్ని బాగా మిస్ అయ్యాను. ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెట్టడం ఓ కొత్త అనుభవం ’’ అన్నారు. -
కరోనా.. ఎయిమ్స్ సీనియర్ డాక్టర్ మృతి
న్యూఢిల్లీ : ప్రముఖ పల్మనాలజిస్ట్, ఢిల్లీ ఎయిమ్స్ సీనియర్ డాక్టర్ జితేంద్రనాథ్ పాండే కరోనాతో మృతిచెందారు. కరోనా సోకడంతో తన నివాసంలోనే ఐసోలేషన్‌లో ఉన్న 78 ఏళ్ల జితేంద్ర శనివారం తుదిశ్వాస విడిచారని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రత్నదీప్ గులేరియా తెలిపారు. ‘కొద్దిపాటి లక్షణాలు ఉండటంతో పరీక్షలు నిర్వహించగా డాక్టర్ జితేంద్ర, ఆయన భార్యకు కరోనా సోకినట్టుగా తేలింది. దీంతో మంగళవారం నుంచి వారు హోం ఐసోలేషన్‌లోనే ఉన్నారు. వారి ఆరోగ్య పరిస్థితిని మేము నిరంతరం సమీక్షించాం. అతను కోలుకుంటున్నట్టుగానే కనిపించారు. నిన్న రాత్రి భోజనం చేసి పడుకున్నాక ఆయన మృతి చెందారు. నిద్రపోతున్న సమయంలో తీవ్రమైన గుండెపోటు రావడంతో ఆయన మరణించి ఉంటారు’ అని చెప్పారు. జితేంద్ర మృతిపై ప్రముఖ వైద్యురాలు సంగీత రెడ్డి విచారం వ్యక్తం చేశారు. పల్మనాలజిస్ట్‌గా ఆయన అందించిన సేవలు.. ఎంతో మంది ఆరోగ్యంగా ఉండేలా చేశాయని అన్నారు. వైద్య ప్రపంచం ఓ ధ్రువతారను కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అతని కుటుంబ సభ్యులు ప్రగాఢ సానుభూతి తెలిపారు.(చదవండి : భారత్‌లో లక్షా ముప్పైవేలు దాటిన కరోనా కేసులు) -
జేఈఈలో జాతీయ టాపర్‌గా జితేంద్ర
గుర్ల (చీపురుపల్లి): బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ (జేఈఈ) – మెయిన్స్ పరీక్షలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థి లండ జితేంద్ర జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించి సత్తా చాటాడు. విజయనగరం జిల్లా గుర్ల మండలం లవిడాం గ్రామానికి చెందిన జితేంద్ర జేఈఈ మెయిన్స్‌లో 100 శాతం పర్సంటైల్ సాధించి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. మొదటి ర్యాంకు సాధించగలనని ముందు నుంచి ఆశతో ఉన్నానని, ఊహించినట్టే ఫలితాలు వచ్చాయని తన సంతోషాన్ని ‘సాక్షి’తో పంచుకున్నాడు. తమది రైతు కుటుంబమని, ఈ విజయానికి తన తల్లిదండ్రులు వెంకటరమణ, మంగమ్మ, చిన్నాన్న కామునాయుడు, పిన్ని ఆదిలక్ష్మి, ఉపాధ్యాయులే కారణమని తెలిపాడు. ఉదయం 6 నుంచి 8 గంటల వరకు, రాత్రి 10 గంటల వరకు కష్టపడి చదవడం వల్ల పరీక్షల్లో రాణించగలిగానని వివరించాడు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు సాధించి బాంబే ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చేయాలన్నదే తన లక్ష్యమన్నాడు. బీటెక్ పూర్తి చేశాక మంచి ఉద్యోగం సాధిస్తానని ఆత్మవిశ్వాసంతో చెబుతున్నాడు. కాగా, జితేంద్ర 1 నుంచి 5వ తరగతి వరకు చీపురుపల్లిలో, 6 నుంచి 10వ తరగతి వరకు రాజమండ్రిలో, ఇంటర్మీడియెట్ విజయవాడలో చదివాడు. పదో తరగతిలో 10 జీపీఏ సాధించడంతో ఇంటర్లో ఉచితంగా సీటు వచ్చింది. జేఈఈ మెయిన్స్‌కు కూడా ఉచితంగానే శిక్షణ లభించింది. కాగా, జితేంద్ర సోదరి హేమ ఐఐటీ మద్రాస్‌లో ఇంజనీరింగ్ చదువుతోంది. -
ప్రశాంతంగా ఓటు వేయండి...
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేశామని ఎన్నికల నోడల్ అధికారి, శాంతి భద్రతల అదనపు డీజీపీ జితేందర్ స్పష్టంచేశారు. ప్రశాంత వాతావరణంలో ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. శుక్రవారం జరగనున్న పోలింగుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేసినట్టు వెల్లడించారు. మొత్తంగా 6వేల సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించినట్టు తెలిపారు.సుమారు ఆరు జిల్లాల్లో ఈ తరహా ప్రాంతాలను గుర్తించామని, వీటిలో కొడంగల్ కూడా ఒకటని జితేందర్ తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా పోలీసు శాఖ, ఐటీ విభాగం సంయుక్తంగా రూ.125కోట్ల నగదు, ఎక్సైజ్ శాఖతో కలసి 4 లక్షల లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. రూ.6 కోట్ల విలువైన ప్లాటినం, బంగారం, వెండి, రూ. 60 లక్షల విలువ గల గంజా యి, రూ.1.6 కోట్ల విలువైన బహుమతులు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. 90,238 మందిని బైండోవర్ చేయగా, 8,482 లైసెన్స్డ్ ఆయుధాలు డిపాజిట్ చేసుకున్నట్టు తెలిపారు. 11,862 నాన్‌బెయిలబుల్ వారంట్లను అమలు చేసినట్టు తెలిపారు. కోడ్ ఉల్లం ఘన కింద 1,501 కేసులు నమోదు చేశామన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా ఉన్న 13నియోజకవర్గాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశామని, ముందస్తుగా సరిహద్దు ప్రాంతాల్లో కూంబింగ్ ముమ్మరం చేసినట్టు తెలిపారు. ఛత్తీస్గడ్, మహరాష్ట్ర అధికారులతో సమన్వయం చేసుకుంటున్నట్టు వివరించారు. నగదు పట్టుబడ్డ చోట్ల విచారణ జరిపి సంబంధిత నేతలపై కేసులు నమోదు చేసినట్టు జితేందర్ తెలిపారు. ఏపీ టీడీపీ నేత జూపూడి ప్రభాకర్‌రావు, పోటీలో ఉన్న అభ్యర్థులు సర్వే సత్యనారాయణ, మల్లారెడ్డి, జగ్గారెడ్డి, ఆనంద్‌ప్రసాద్ తదితరులపై సెక్షన్ 171 కింద కేసులు నమోదు చేసినట్టు తెలిపారు.వరంగల్, ఆదిలాబాద్, హైదరాబాద్‌లో పట్టుబడ్డ హవాలా నగదుపై ఐటీ, ఈడీ అధికారులు దర్యాప్తు జరుపుతారని జితేందర్ వెల్లడించారు. ఈ డబ్బు పొందేందుకు యత్నించిన పలువురి నేతలపై కూడా విచారణ జరిపే అవకాశం ఉందని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లోని నేతలు హైదరాబాద్‌లో ఉండాల్సి వస్తే సంబంధిత ప్రాంతంలోని రిటర్నింగ్ అధికారి నుంచి అనుమతి తీసుకోవాలని స్పష్టంచేశారు. నిబంధనలు ఉల్లంఘించి వివిధ ప్రాంతాల్లో ఎవరైనా ఉంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. పోలీస్ అధికారులపై పలు పార్టీలు, అభ్యర్థులు చేసిన ఫిర్యాదులు, ఆరోపణలపై విచారణ చేస్తున్నామని, రెండు కేసుల్లో అధికారులపై చర్యలు తీసుకున్నట్టు జితేందర్ స్పష్టంచేశారు. -
కొడుకును చంపిన తండ్రి
కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి కన్న కొడుకునే బండరాయితో మోది కిరాతకంగా హతమార్చాడు. ఈ సంఘటన అనంతపురంలోని చంద్రబాబుకొట్టాలలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న రిటైర్డ్ ఏఎస్సై ఇరిగప్ప కుమారుడు జితేంద్ర(30) ఇటీవల ఎంబీబీఎస్ పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటున్నాడు. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా ఆర్థిక విషయాల్లో తండ్రీ కొడుకుల మధ్య గొడవలు జరుగుగున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి తండ్రీ కొడుకుల మధ్య వాగ్వాదం జరగడంతో కోపోద్రిక్తుడైన ఇరిగప్ప కొడుకు తలపై బండరాయితో మోది హతమార్చాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, కుమార్తె ఉంది. -
సరైన రీతిలో స్పందిస్తాయని ఆశీస్తున్నా
-
గుంతకల్లు ఎమ్మెల్యేకు తీవ్ర అనారోగ్యం
హైదరాబాద్: అనంతపురం జిల్లా గుంతకల్లు ఎమ్మెల్యే జితేంద్రగౌడ్ బుధవారం తీవ్ర అనారోగ్యానికి గురైయ్యారు. దాంతో ఆయన వ్యక్తిగత సిబ్బంది, కుటుంబ సభ్యులు జితేంద్రను హుటాహుటిన కర్నూలు నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వైద్యులు జితేంద్రకు వైద్య పరీక్షలు నిర్వహించారు. జితేంద్రకు డెంగీ వ్యాధి లక్షణాలు ఉన్నట్లు వైద్య పరీక్షలలో నిర్థారణ అయినట్లు వైద్యులు వెల్లడించారు. -
కోర్టుకు హాజరైన దర్శకుడు జితేంద్ర
ఎమ్మిగనూరు టౌన్: ‘యమహో యమ’ చిత్ర దర్శకుడు జితేంద్ర సోమవారం ఎమ్మిగనూరు కోర్టుకు హాజరయ్యారు. చిత్రం వాల్‌పోస్టర్‌లో హీరోయిన్ పార్వతి మిల్టన్ పొట్టి దుస్తులతో అశ్లీలంగా కనిపించడంపై ఎమ్మిగనూరుకు చెందిన మాజీ కౌన్సిలర్ కోనేరు నాగేంద్రప్రసాద్ గత ఏడాది చిత్ర దర్శకుడు జితేంద్ర, నిర్మాత విజయకుమార్‌గౌడ్, సమర్పకుడు సాధక్‌కుమార్, హీరోయిన్ పార్వతిమిల్టన్లపై స్థానిక పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అప్పటి ఎస్ఐ చంద్రబాబునాయుడు వీరందరిపై కేసు(క్రైమ్‌నెంబర్ 41/13) నమోదు చేశారు. కేసుకు సంబంధించి వాయిదా ఉండటంతో వీరంతా సోమవారం కోర్టుకు హాజరయ్యారు. తదుపరి విచారణను జూనియర్ సివిల్ జడ్జి రవిశంకర్ ఆగస్ట్ 20వ తేదీకి వాయిదా వేశారు. ఆగస్టులో సెట్స్‌పైకి కొత్త చిత్రం వచ్చే ఆగస్టు నెలలో కొత్త చిత్రం సెట్స్‌పైకి తీసుకురానున్నట్లు దర్శకుడు జితేంద్ర తెలిపారు. కోర్టు వాయిదా నిమిత్తం ఎమ్మిగనూరుకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి ఈ చిత్రం తెరకెక్కుతుందన్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన కథకు తుది మెరుగులు దిద్దుతున్నట్లు చెప్పారు. త్వరలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తామన్నారు. -
ఏసీబీ వలలో అవినీతి చేప
కడప అర్బన్ : కడప నగరంలోని కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న జితేంద్ర శనివారం రూ. 1500 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. ఈ సంఘటన వివరాలను ఏసీబీ డీఎస్పీ శంకర్‌రెడ్డి వివరించారు. సివిల్ కాంట్ట్రార్ అయిన మల్లేశ్వరరెడ్డి వ్యాట్ క్లియరెన్స్ కోసం ఈనెల 16వ తేదీ దరఖాస్తు చేసుకున్నాడు. కార్యాలయానికి రెండు మూడు సార్లు తిరిగినా ఫలితం లేకపోయింది. రూ. 2000 డబ్బులు ఇస్తేగానీ వ్యాట్ క్లియరెన్స్ ఇవ్వనని సీనియర్ అసిస్టెంట్ జితేంద్ర తేల్చిచెప్పాడు. దీంతో మల్లేశ్వరరెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. శనివారం ఉదయం మల్లేశ్వరరెడ్డి రూ. 1500 జితేంద్రకు లంచంగా ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ సంఘటనలో ఏసీబీ డీఎస్పీ శంకరరెడ్డితో పాటు సీఐలు రామకిశోర్, పార్థసారథిరెడ్డి, చంద్రశేఖర్, సుధాకర్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. జితేంద్రను పూర్తిగా విచారించిన అనంతరం అరెస్టు చేసి నెల్లూరు ఏసీబీ కోర్టుకు తీసుకు వెళతామని ఏసీబీ డీఎస్పీ శంకరరెడ్డి తెలిపారు.