
ఏసీబీ వలలో అవినీతి చేప
కడప అర్బన్ : కడప నగరంలోని కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న జితేంద్ర శనివారం రూ. 1500 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. ఈ సంఘటన వివరాలను ఏసీబీ డీఎస్పీ శంకర్‌రెడ్డి వివరించారు. సివిల్ కాంట్ట్రార్ అయిన మల్లేశ్వరరెడ్డి వ్యాట్ క్లియరెన్స్ కోసం ఈనెల 16వ తేదీ దరఖాస్తు చేసుకున్నాడు. కార్యాలయానికి రెండు మూడు సార్లు తిరిగినా ఫలితం లేకపోయింది. రూ. 2000 డబ్బులు ఇస్తేగానీ వ్యాట్ క్లియరెన్స్ ఇవ్వనని సీనియర్ అసిస్టెంట్ జితేంద్ర తేల్చిచెప్పాడు. దీంతో మల్లేశ్వరరెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
శనివారం ఉదయం మల్లేశ్వరరెడ్డి రూ. 1500 జితేంద్రకు లంచంగా ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ సంఘటనలో ఏసీబీ డీఎస్పీ శంకరరెడ్డితో పాటు సీఐలు రామకిశోర్, పార్థసారథిరెడ్డి, చంద్రశేఖర్, సుధాకర్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. జితేంద్రను పూర్తిగా విచారించిన అనంతరం అరెస్టు చేసి నెల్లూరు ఏసీబీ కోర్టుకు తీసుకు వెళతామని ఏసీబీ డీఎస్పీ శంకరరెడ్డి తెలిపారు.