పద్మవ్యూహంలో మావోయిస్టు పార్టీ? | 92 Maoists encounter in 4 months | Sakshi
Sakshi News home page

పద్మవ్యూహం పన్నారు..

Published Mon, Aug 20 2018 2:24 AM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM

92 Maoists encounter in 4 months - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మావోయిస్టు పార్టీ పద్మవ్యూహంలో చిక్కు కుందా? దండకారణ్యంగా పేరు గాంచిన 5 రాష్ట్రాల మధ్యన సేఫ్‌ జోన్‌ చేతులు దాటిపోతోందా? అంటే అవుననే అంటున్నాయి కేంద్ర నిఘా వర్గాలు. తెలంగాణ, ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర మధ్యలోని షెల్టర్‌ జోన్‌లో 4 నెలల నుంచి సీఆర్‌పీఎఫ్, స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్, తెలంగాణ, ఏపీ గ్రేహౌండ్స్‌ చేస్తున్న కూంబింగ్‌ వల్ల వారికి కోలు కోలేని దెబ్బ తగిలిందని 5 రాష్ట్రాల పోలీసులు చెబుతున్నారు. తమ అధీనంలో ఉందని మావోయిస్టు పార్టీ చెప్పుకుంటున్న అబూజ్‌మడ్‌ ప్రాంతాన్నీ సీఆర్‌పీఎఫ్‌ అధీనంలోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు నిఘా వర్గాల ద్వారా తెలిసింది. మొత్తంగా నలువైపుల నుంచీ చుట్టుముడుతూ సీఆర్‌పీఎఫ్‌ పన్నిన పద్మవ్యూహం నుంచి మావోయిస్టు పార్టీ మనుగడ సాగించగలుగుతుందా అని చర్చ జరుగుతోంది. 

నలువైపులా క్యాంపులు
ఛత్తీస్‌గఢ్, ఒడిశాలోని అటవీ ప్రాంతాల్లో కూంబింగ్‌ చేసేందుకు అన్ని రాష్ట్రాల పోలీసు బలగాలు, కేంద్ర బలగాలు 60–70 కిలోమీటర్ల నడక దారిలో ప్రయాణించాల్సి వచ్చేది. కానీ 2016 నుంచి సీఆర్‌పీఎఫ్‌ తన బేస్‌ క్యాంపులను విస్తరిస్తూ వెళ్తోంది. అటు బీజాపూర్, ఇటు దంతెవాడ, మరోవైపు సుకుమా నుంచి ప్రతి 5 కిలోమీటర్లకు ఓ బేస్‌ క్యాంపు ఏర్పాటు చేస్తూ వస్తోంది. ఇలా ఇప్పటివరకు 24 బేస్‌ క్యాం పులు ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఒక్కో క్యాం పులో సుమారు 1,000 మంది బలగాలుండేలా ఏర్పాట్లు చేసింది. దక్షిణ ప్రాంతంగా ఉన్న బీజాపూర్, దంతెవాడ, సుకుమా నుంచి కూంబింగ్‌ పెంచిన సీఆర్‌పీఎఫ్‌.. అదే సమయంలో తూర్పుగా ఉన్న నారాయణ్‌పూర్, బస్తర్‌ నుంచీ కూంబింగ్‌ వేగవంతం చేసింది. ఇటు తెలంగాణ, ఏపీ ప్రాంతం నుంచి గ్రేహౌండ్స్‌ నిరంతం కూంబింగ్‌ చేస్తూనే ఉన్నాయి. దీంతో మావోయిస్టు పార్టీ కదలికలు నారాయణ్‌పూర్, బస్తర్, కాంకేర్‌ లోపలి ప్రాంతాలకు విస్తరించాయి. మావోయిస్టు పార్టీ చేతుల్లో ఉన్న ఈ మూడు జిల్లాల్లోని కేంద్రీకృత ప్రాంతంలోనే షెల్టర్‌ జోన్‌ ఉన్నట్లు తెలిసింది. ఇప్పుడు కేంద్ర బలగాల టార్గెట్‌ కూడా ఈ జోన్‌గానే సాగుతోందని తెలుస్తోంది. 

4నెలలు 92 మంది..
మార్చి నుంచి ఇప్పటివరకు 5 రాష్ట్రాల కమిటీ లకు చెందిన 92 మంది మావోయిస్టులను సీఆర్‌పీఎఫ్‌ మట్టు బెట్టింది. తడపలగుట్టలో 10 మంది, గడ్చిరోలిలో 41 మంది, మరో ఎన్‌కౌంటర్‌లో 17 మంది చనిపోగా ఇతర చిన్న చిన్న ఘటనల్లో 24 మంది మృతి చెందినట్లు రాష్ట్ర నిఘా వర్గాలు తెలిపాయి. ఇందుకు ప్రతీకారంగా సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు, ఇన్‌ఫార్మర్లు తదితరులు మొత్తం 31 మందిని మావోయిస్టు పార్టీ హతమార్చింది. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌ కమిటీ, ఆంధ్రా ఒడిశా కమిటీ, దంతెవాడ కమిటీలే కార్యకలాపాలు సాగిస్తున్నాయి. అబూజ్‌మడ్‌లోనే ఉన్న తెలంగాణ, శబరి కమిటీల్లో పెద్దగా కదిలికలు లేవని నిఘా వర్గాలు తెలిపాయి. 

బయటపడతారా?
మావోయిస్టు పార్టీకి సేఫ్‌ జోన్‌గా ఉన్న కాంకేర్, బస్తర్, నారాయణ్‌పూర్‌లో కేంద్ర బలగాల కార్యకలాపాలు విస్తరిస్తుండటంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. కానీ ఈ జోన్‌లోకి కేంద్ర బలగాలు వెళ్లడం అంత సులువైన పని కాదని నిఘా వర్గాలు అభి ప్రాయపడుతున్నాయి. ముప్పేట దాడి, వ్యూహాత్మక ఎత్తుగడ ద్వారా దఫాల వారీగా లోనికెళ్లడం సాధ్యమవుతుందని భావిస్తున్నాయి. ఏ వైపు నుంచి కూంబింగ్‌ చేసినా దానికి వ్యతిరేక దిశలో మావోయిస్టులు కదిలే అవకాశం లేదని, అక్కడక్కడ ఉంటూ ప్రతిదాడి చేసే అవకాశం ఎక్కువగా ఉందని అధికారులు భావిస్తున్నారు. వారి అధీ నంలోని ప్రాంతాల్లో కూంబింగ్‌కు పరిస్థితులు అనుకూలిస్తే గానీ చేయడం సులువు కాదంటున్నారు. మరోవైపు ముప్పేట దాడితో రెండు వైపులా నష్టం తీవ్రంగా ఉం టుందని ఓ సీనియర్‌ అధికారి తెలిపారు. దీనిపై అన్ని రాష్ట్రాల నిఘా అధికారులు సమావేశమై చర్చించుకోవాల్సి ఉందన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల అధి కారులు సెప్టెంబర్‌లో సమావేశమై కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement