Central intelligence sources
-
అప్రమత్తంగా ఉండండి
సాక్షి, అమరావతి/గుంటూరు: శ్రీలంక నుంచి సముద్ర మార్గంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ వంటి తీర ప్రాంత రాష్ట్రాలకు తీవ్రవాదులు వచ్చే అవకాశం ఉందని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించడంతో రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇటీవల శ్రీలంకలో బాంబు పేలుళ్ల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని డీజీపీ ఆర్పీ ఠాకూర్ పలు జిల్లాల పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు డీజీపీ ఠాకూర్ బుధవారం ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ప్రధానంగా విమానాశ్రయాలు, ఓడ రేవులు, బస్స్టాండ్లు, రైల్వేస్టేషన్లు, సముద్రతీరాల్లో అనుమానిత వ్యక్తులు, వాహనాలపై నిఘా ఉంచాలని మార్గనిర్దేశం చేశారు. విదేశీ పర్యాటకులు వచ్చే ప్రాంతాలు, హోటల్స్, జనం ఎక్కువగా చేరే స్థలాల వద్ద బాంబు స్క్వాడ్లు, జాగిలాలతో విస్తృత తనిఖీలు నిర్వహించాలన్నారు. ప్రముఖ మసీదులు, చర్చిలు, ఆలయాల వద్ద భద్రతా ఏర్పాట్లు చేయడంతోపాటు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ ఉంచాలని ఆదేశించారు. కీలక ప్రాంతాలు, కేంద్ర సంస్థలు, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ వద్ద స్థానిక పోలీసులు కూడా అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. ఏఏ ప్రాంతాల్లో అలజడులు, అసాంఘిక శక్తుల కదలికలు ఉండే అవకాశం ఉందో గుర్తించాలని సూచించారు. ఆర్మ్డ్ కౌంటర్ యాక్షన్ పోలీస్ టీమ్స్, ఆక్టోపస్ టీమ్స్ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలన్నారు. అవాంఛనీయ ఘటనలు, శాంతిభద్రతల సమస్యలు ఉత్పన్నమైనప్పుడు చాలా కేసుల్లో సీసీ కెమెరా ఫుటేజీలు కీలకంగా ఉపయోగపడతాయని, దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉన్న అన్ని సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. బందోబస్తు పరంగా పలు ప్రాంతాల్లో ఉన్న వైఫల్యాలను గుర్తించి వాటిని నెల రోజుల్లో చక్కదిద్దుకోవాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు సమాచారం అందేలా ప్రజలతో పోలీసులు మంచి సంబంధాలు పెంచుకోవాలని సూచించారు. భద్రతా చర్యలపై నెల రోజుల్లో సమీక్ష: డీజీపీ వీడియో కాన్ఫరెన్సు అనంతరం డీజీపీ ఠాకుర్ మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకునేందుకే ఈ సమావేశం నిర్వహించినట్టు చెప్పారు. జిల్లాల ఎస్పీలు, నగర పోలీస్ కమిషనర్లకు పలు ఆదేశాలు ఇచ్చినట్టు చెప్పారు. మరో నెల రోజులు తర్వాత భద్రతాపరమైన చర్యలు ఏమేరకు తీసుకున్నారో అనే విషయాలను సమీక్షిస్తామని డీజీపీ చెప్పారు. సమావేశంలో డీజీపీతోపాటు శాంతిభద్రతల ఏడీజీ రవిశంకర్ అయ్యన్నార్, ఇంటెలిజెన్స్ ఏడీజీ కుమార్ విశ్వజిత్, సీఐడీ ఏడీజీ అమిత్‌గార్గ్, పీఅండ్ఎల్ ఏడీజీ హరీష్‌కుమార్ గుప్త పాల్గొన్నారు. రాజధానిలో హై అలర్ట్ ఉగ్రదాడుల హెచ్చరికల నేపథ్యంలో రాజధాని ప్రాంతంపై పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. తాత్కాలిక సచివాలయంతోపాటు, హైకోర్టు, ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాసం, పార్టీ రాష్ట్ర కార్యాలయాల వద్ద భద్రతను పెంచారు. అక్కడకు వెళ్లే అన్ని రహదారుల్లోని ప్రధాన కూడళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో కొత్త వ్యక్తుల సంచారంపై ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటున్నారు. అనుకోని సంఘటన జరిగితే ఏవిధంగా ఎదుర్కోవాలనే దానిపై మాక్‌డ్రిల్‌ను నిర్వహిస్తున్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని సముద్రతీర ప్రాంతాల్లో నిఘా పెంచారు. ఎయిర్‌ఫోర్స్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ భద్రతను కట్టుదిట్టం చేశారు. కేంద్ర అధికారులతో మాట్లాడుతూ ఉగ్రవాద కదలికలపై ఆరా తీస్తున్నారు. మత పెద్దలతో ఇప్పటికే సమావేశాలు నిర్వహించిన గుంటూరు అర్బన్ పోలీసులు మసీదులు, చర్చిలు, దేవాలయాల వద్ద అనుమానిత వ్యక్తుల కదలికలను ఎప్పటికప్పుడు చేరవేసేందుకు వలంటీర్లను ఏర్పాటు చేసేలా మత పెద్దలకు సూచిస్తున్నారు. లాడ్జిలు, హోటళ్లపై ఆకస్మికంగా దాడులు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. -
పద్మవ్యూహంలో మావోయిస్టు పార్టీ?
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు పార్టీ పద్మవ్యూహంలో చిక్కు కుందా? దండకారణ్యంగా పేరు గాంచిన 5 రాష్ట్రాల మధ్యన సేఫ్ జోన్ చేతులు దాటిపోతోందా? అంటే అవుననే అంటున్నాయి కేంద్ర నిఘా వర్గాలు. తెలంగాణ, ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర మధ్యలోని షెల్టర్ జోన్లో 4 నెలల నుంచి సీఆర్పీఎఫ్, స్పెషల్ టాస్క్‌ఫోర్స్, తెలంగాణ, ఏపీ గ్రేహౌండ్స్ చేస్తున్న కూంబింగ్ వల్ల వారికి కోలు కోలేని దెబ్బ తగిలిందని 5 రాష్ట్రాల పోలీసులు చెబుతున్నారు. తమ అధీనంలో ఉందని మావోయిస్టు పార్టీ చెప్పుకుంటున్న అబూజ్మడ్ ప్రాంతాన్నీ సీఆర్పీఎఫ్ అధీనంలోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు నిఘా వర్గాల ద్వారా తెలిసింది. మొత్తంగా నలువైపుల నుంచీ చుట్టుముడుతూ సీఆర్పీఎఫ్ పన్నిన పద్మవ్యూహం నుంచి మావోయిస్టు పార్టీ మనుగడ సాగించగలుగుతుందా అని చర్చ జరుగుతోంది. నలువైపులా క్యాంపులు ఛత్తీస్‌గఢ్, ఒడిశాలోని అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ చేసేందుకు అన్ని రాష్ట్రాల పోలీసు బలగాలు, కేంద్ర బలగాలు 60–70 కిలోమీటర్ల నడక దారిలో ప్రయాణించాల్సి వచ్చేది. కానీ 2016 నుంచి సీఆర్పీఎఫ్ తన బేస్ క్యాంపులను విస్తరిస్తూ వెళ్తోంది. అటు బీజాపూర్, ఇటు దంతెవాడ, మరోవైపు సుకుమా నుంచి ప్రతి 5 కిలోమీటర్లకు ఓ బేస్ క్యాంపు ఏర్పాటు చేస్తూ వస్తోంది. ఇలా ఇప్పటివరకు 24 బేస్ క్యాం పులు ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఒక్కో క్యాం పులో సుమారు 1,000 మంది బలగాలుండేలా ఏర్పాట్లు చేసింది. దక్షిణ ప్రాంతంగా ఉన్న బీజాపూర్, దంతెవాడ, సుకుమా నుంచి కూంబింగ్ పెంచిన సీఆర్పీఎఫ్.. అదే సమయంలో తూర్పుగా ఉన్న నారాయణ్‌పూర్, బస్తర్ నుంచీ కూంబింగ్ వేగవంతం చేసింది. ఇటు తెలంగాణ, ఏపీ ప్రాంతం నుంచి గ్రేహౌండ్స్ నిరంతం కూంబింగ్ చేస్తూనే ఉన్నాయి. దీంతో మావోయిస్టు పార్టీ కదలికలు నారాయణ్‌పూర్, బస్తర్, కాంకేర్ లోపలి ప్రాంతాలకు విస్తరించాయి. మావోయిస్టు పార్టీ చేతుల్లో ఉన్న ఈ మూడు జిల్లాల్లోని కేంద్రీకృత ప్రాంతంలోనే షెల్టర్ జోన్ ఉన్నట్లు తెలిసింది. ఇప్పుడు కేంద్ర బలగాల టార్గెట్ కూడా ఈ జోన్‌గానే సాగుతోందని తెలుస్తోంది. 4నెలలు 92 మంది.. మార్చి నుంచి ఇప్పటివరకు 5 రాష్ట్రాల కమిటీ లకు చెందిన 92 మంది మావోయిస్టులను సీఆర్పీఎఫ్ మట్టు బెట్టింది. తడపలగుట్టలో 10 మంది, గడ్చిరోలిలో 41 మంది, మరో ఎన్కౌంటర్లో 17 మంది చనిపోగా ఇతర చిన్న చిన్న ఘటనల్లో 24 మంది మృతి చెందినట్లు రాష్ట్ర నిఘా వర్గాలు తెలిపాయి. ఇందుకు ప్రతీకారంగా సీఆర్పీఎఫ్ జవాన్లు, ఇన్ఫార్మర్లు తదితరులు మొత్తం 31 మందిని మావోయిస్టు పార్టీ హతమార్చింది. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ కమిటీ, ఆంధ్రా ఒడిశా కమిటీ, దంతెవాడ కమిటీలే కార్యకలాపాలు సాగిస్తున్నాయి. అబూజ్‌మడ్‌లోనే ఉన్న తెలంగాణ, శబరి కమిటీల్లో పెద్దగా కదిలికలు లేవని నిఘా వర్గాలు తెలిపాయి. బయటపడతారా? మావోయిస్టు పార్టీకి సేఫ్ జోన్‌గా ఉన్న కాంకేర్, బస్తర్, నారాయణ్‌పూర్‌లో కేంద్ర బలగాల కార్యకలాపాలు విస్తరిస్తుండటంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. కానీ ఈ జోన్లోకి కేంద్ర బలగాలు వెళ్లడం అంత సులువైన పని కాదని నిఘా వర్గాలు అభి ప్రాయపడుతున్నాయి. ముప్పేట దాడి, వ్యూహాత్మక ఎత్తుగడ ద్వారా దఫాల వారీగా లోనికెళ్లడం సాధ్యమవుతుందని భావిస్తున్నాయి. ఏ వైపు నుంచి కూంబింగ్ చేసినా దానికి వ్యతిరేక దిశలో మావోయిస్టులు కదిలే అవకాశం లేదని, అక్కడక్కడ ఉంటూ ప్రతిదాడి చేసే అవకాశం ఎక్కువగా ఉందని అధికారులు భావిస్తున్నారు. వారి అధీ నంలోని ప్రాంతాల్లో కూంబింగ్‌కు పరిస్థితులు అనుకూలిస్తే గానీ చేయడం సులువు కాదంటున్నారు. మరోవైపు ముప్పేట దాడితో రెండు వైపులా నష్టం తీవ్రంగా ఉం టుందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. దీనిపై అన్ని రాష్ట్రాల నిఘా అధికారులు సమావేశమై చర్చించుకోవాల్సి ఉందన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల అధి కారులు సెప్టెంబర్‌లో సమావేశమై కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. -
జర భద్రం..!
- ఉగ్రవాదుల హిట్‌లిస్ట్‌లో నగరంలోని సాఫ్ట్వేర్ కంపెనీలు, మాల్స్ - అప్రమత్తత ప్రకటించిన కేంద్ర నిఘా సంస్థ - ఈ నెలాఖరు వరకు జాగ్రత్తగా ఉండాలని సూచనలు సాక్షి, హైదరాబాద్: ముష్కరమూకలు బెంగ ళూరుతో పాటు హైదరాబాద్ నగరాన్నీ టార్గె ట్ చేశారా? ఔననే అంటున్నాయి కేంద్ర నిఘా వర్గాలు. ఈ మేరకు రాష్ట్ర పోలీసు విభాగాన్ని అప్రమత్తం చేశాయి. ఈ నెలాఖరు వరకు అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిందిగా సూచించాయి. ఉగ్రవాదుల హిట్‌లిస్ట్‌లో సాఫ్ట్వేర్ కంపెనీలతో పాటు ప్రముఖ మాల్స్ ఉన్నట్లు వెల్లడైంది. ఈ హెచ్చరికల్ని పరిగణన లోకి తీసుకున్న పోలీసులు నిఘా ముమ్మరం చేయడంతో పాటు తనిఖీలు, సోదాలు చేపడుతున్నారు. రషీద్ విచారణలో వెలుగులోకి... గత నెల 7న జమ్మూకశ్మీర్ టాంట ప్రాంతం లోని పోలీసు పికెట్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ఆ రాష్ట్ర పోలీసులు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)... గత నెల 13న కశ్మీర్లో ఐదుగురు ఉగ్రవాదుల్ని అరెస్టు చేశారు. పాక్ ఉగ్ర సంస్థ లష్కరే తోయిబా ఆదేశాల మేరకు పనిచేసిన ఈ మాడ్యూల్‌కు అబ్దుల్ రషీద్ హర్గా నేతృత్వం వహించాడు. రషీద్ విచారణలో ఆందోళనకర అంశాలు బయటపడ్డాయి. లష్కరే తోయిబా బెంగళూరు, హైదరాబాద్‌లను టార్గెట్ చేసిందని, ఐటీ సంస్థలతో పాటు మాల్స్‌లోనూ విధ్వంసం సృష్టించడా నికి పథక రచన చేసినట్లు అతడు తెలిపాడు. ఈ క్రమంలో కేంద్ర నిఘా సంస్థ ఇంటలిజెన్స్ బ్యూరో (ఐబీ) రాష్ట్ర పోలీసు విభాగాన్ని అప్రమత్తం చేసింది. ఈ నెలాఖరు వరకు... ప్రధానంగా వారాంతాల్లో నిఘా, తనిఖీలు, సోదాలు ముమ్మరం చేయాలని సూచించింది. ఇనార్బిట్ మాల్లో తనిఖీలు... మాదాపూర్‌లోని ఇనార్బిట్ మాల్లో పోలీసు లు శుక్రవారం ఉదయం 9 నుంచి మధ్యా హ్నం 12 గంటల వరకు విస్తృత తనిఖీలు చేశారు. సైబరాబాద్ సెక్యూరిటీ వింగ్, మాదాపూర్ పోలీసులతో పాటు బాంబు స్క్వాడ్ ఈ సోదాలు చేశారు. మాల్ సెక్యూ రిటీ సిబ్బంది మెటల్ డిటెక్టివ్‌తో తనిఖీలు చేశారు. ఐడీ కార్డులు లేనివారిని లోపలికి అనుమతించలేదు. -
‘ఉగ్ర’ కలకలం..!
ముష్కరులు జిల్లాను షెల్టర్‌జోన్‌గా ఎంచుకున్నారా..? ఇక్కడినుంచే గుట్టుచప్పుడు కాకుండా తమ కార్యకలాపాలు సాగిస్తున్నారా..? నకిరేకల్‌లో పోలీసులకు తపాకీ గురిపెట్టి తప్పించుకుపోయిన దుండగులు ఉగ్రవాదులేనా..? అన్న ప్రశ్నలకు కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. జిల్లాలో ఇంకెతమంది ముష్కరులు తలదాచుకున్నారు...? ఏ విధ్వంసానికి పాల్పడేందుకు వ్యూహరచన చేస్తున్నారు...? ఇలాంటి ప్రశ్నలు జిల్లావాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నల్లగొండ ఉగ్రనీడలో ఉన్నట్టు వస్తున్న అనుమానాలకు తాజా పరిణామాలు బలం చేకూరుస్తున్నాయి. - నకిరేకల్ నల్లగొండ జిల్లా మరోమారు వార్తల్లోకి ఎక్కింది. ఇటీవల నకిరేకల్ పట్టణంలో పోలీసులపై తుపాకీ గురిపెట్టి తప్పించుకుపోయిన దుం డగులు ఉగ్రవాదులేనని అనుమానాలు బలపడుతున్నాయి. జిల్లా కేంద్రంలో మహిళ మెడలో బంగారు గొలుసు చోరీ చేసి నకిరేకల్ నుంచి తప్పించుకున్న దండగులను ఉగ్రవాదులుగా గుర్తించారు. వారి ఉహాచిత్రాలను జిల్లా పోలీసు లు విడుదల చేసిన విషయం విధితమే. తాజాగా కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారులు ఆ ఉహాచిత్రాల ఆధారంగా ముష్కరులు నిజామాబాద్,వరంగల్ జిల్లాలో సంచరిస్తున్నట్లు సెల్ఫోన్ల సిగ్నల్స్ ఆధారంగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ యంత్రంగానికి సమాచారం అందించారు. దీంతో నల్లగొండ,నిజామాబాద్ జిల్లాలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉగ్రవాదులు ఆ జిల్లాలో సంచరిస్తున్నట్టు శుక్రవారం పలు టీవీ చానల్స్‌లో ప్రసారం కావడంతో జిల్లా పోలీసులు మరోసారి ఉలిక్కిపడ్డారు. ఇటీవల సూర్యాపేట, నకిరేకల్‌లో పోలీ సులపై తూపాకులు ఎక్కు పెట్టిన సంఘటనలు, తాజాగా టీవీల్లో నకిరేకల్‌లో తప్పించుకుపోయిన దుండగులు .. దొంగలు కాదు ఉగ్రవాదులేనని, వారి ఉహా చిత్రాలతో మీడియాలో టెలికాస్ట్ కావడంతో జిల్లా ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా నకిరేకల్ ఘటనే చర్చించుకుం టున్నారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న ఆ దుండగుల ఆచూకీ కోసం నిజామాబాద్, వరంగల్, నల్లగొండ జిల్లాల పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నట్టు సమాచారం. జిల్లాలో ఇంకా ఉన్నారా..? సూర్యాపేట, నకిరేకల్‌లో పోలీసులపై తూపాకులు ఎక్కుపెట్టిన సంఘటనలతో పరిశీలిస్తే జిల్లాలో ఇంకా ఎంత మంది ఉగ్రవాదులు ఉన్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వారి కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపడుతున్నా ఎప్పుడు.. ఏక్షణాన.. ఎక్కడ ఉగ్రవాదులు తెగబడతారా అనే ఆందోళన కూడా అటు పోలీసువర్గాలను, జిల్లా ప్రజలను వెంటాడుతోంది. మీడియా కథనాలను కొట్టిపారేస్తున్న పోలీసులు కేంద్ర ఇంటెలిజెన్స్ పోలీస్ అధికారులు సమాచారంతో అప్రమత్తమైన రాష్ట్ర, జిల్లా పోలీసులు మాత్రం తాజా మీడియా కథనాలను కొట్టి పారేస్తున్నారు. ఇదంతా మీడియా కట్టు కథ అంటున్నారు.ఆకథనంతో తమకు ఎలాంటి సంబంధం లేదని, నకిరేకల్‌లో తప్పించుకుపోయిన దుండగులు అంతర్రాష్ట్ర దొంగలేనంటున్నారు. ఇటీవల సంఘటనలతో ఉగ్రవాదులుగా అనుమానాలు జిల్లాలో ఉగ్రవాదులు సంచరిస్తున్నట్లు వస్తున్న అనుమానాలకు నకిరేకల్ సంఘటన బలం చేకూరుస్తోంది. గడిచిన రెండు మాసాల క్రితమే పోలీసుల ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. సూర్యాపేటలోని ఆర్టీసీ బస్టాండ్‌లో తనిఖీల సమయంలో ఇద్దరు ఉగ్రవాదులను గుర్తించగా వారి ముఠాలో ఇంకొందరు కూడా ఉండొచ్చని ప్రచారం జరిగింది. నకిరేకల్‌లో గత నెల 26 వతేదీన పోలీసులపైకి తుపాకీ గురిపెట్టి పరారైన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఘటన స్థలాన్ని హైదరాబాద్ డీఐజీ కార్యాలయం నుంచి ఇంటెలిజెన్స్ అధికారులు కూడా సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారి కోసం రాష్ట్రంలోని అన్ని జిల్లాలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.. గతంలో సూర్యాపేట, మోత్కూర్ మండలం జానకీపురంలో జరిగిన ఎన్కౌంటర్లో ఉగ్రవాదుల కాల్పులలో ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు, హోంగార్డ్లు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం ఆ ఇద్దరు ఉగ్రవాదులను పోలీసులు మట్టుపెట్టిన విషయం మర్చిపోక ముందే తాజాగా జిల్లాలోని నకిరేకల్ నడిబొడ్డున మరోసారి ఇద్దరు దుండగులు పిస్టల్‌తో వచ్చి కలకలం రేపారు. సూర్యాపేట ఘటన విషయంలో కూడా ఉగ్రవాదుల ముఠాలో ఇద్దరు మాత్రమే ఎన్కౌంటర్ అయ్యారు. ఇంకా మిగతా వారి కోసం కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టిన వారి ఆచూకీ లభించలేదు. నకిరేకల్‌లో పిస్టల్‌తో పోలీసులపైకి గురి పెట్టడంపై ఆ ముఠాకు చెందిన వారే ఇంకా జిల్లాలో పర్యటిస్తున్నారనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. -
అల్కాయిదాలోకి ఐఎం కీలక క్యాడర్
హైదరాబాద్: హైదరాబాద్ సహా దేశ వ్యాప్తంగా విధ్వంసం సృష్టించిన ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్(ఐఎం)లో విభేదాలు వచ్చినట్లు కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి. దీని మాస్టర్‌మైండ్ ఇక్బాల్ భత్కల్‌తో తలెత్తిన వివాదాల నేపథ్యంలో మరో కీలక ఉగ్రవాది మీర్జా సాజిద్ బేగ్ అలియాస్ బడా సాజిద్ అల్‌కాయిదాలో చేరినట్లు కీలక ఆధారాలు సేకరించాయి. భారత్‌తో పాటు మయన్మార్, బంగ్లాదేశ్‌లలో తమ కార్యకలాపాలు విస్తరించేందుకు ‘ఖైదత్-అల్-జిహాద్’ పేరుతో విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు అల్‌కాయిదా చీఫ్ అల్ జవహరి ప్రకటించిన కొన్ని రోజుల్లోనే ఈ పరిణామం చోటు చేసుకోవడంపై నిఘా వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 2007లో హైదరాబాద్‌లో చోటు చేసుకున్న బాంబు పేలుళ్ల కేసులో నిందితుడిగా ఉన్న ఇక్బాల్ భత్కల్ సైబర్ టైరిజంతో వ్యవస్థల్ని అతలాకుతలం చేయాలని యత్నించాడు. ప్రస్తుతం ఇతనితో పాటు ఉత్తరప్రదేశ్‌లోని అజామ్ఘడ్కు చెందిన బడా సాజిద్ సైతం పాకిస్థాన్‌లోనే తలదాచుకున్నాడు. ఇక్బాల్‌తో తలెత్తిన విభేదాల నేపథ్యంలో ఐఎం నుంచి బయటకు వచ్చిన సాజిద్ ప్రత్యేకంగా మరో గ్రూప్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నించాడు. ‘ఖైదత్-అల్-జిహాద్’ ఏర్పాటుపై అల్‌జవహరి చేసిన ప్రకటనతో అల్‌కాయిదాలో చేరినట్లు కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి. ఇతని వెంట అజామ్‌ఘడ్ మాడ్యుల్‌కు చెందిన మరికొందరు ఉగ్రవాదులు అల్‌కాయిదా వైపు వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. అల్‌కాయిదా కన్ను భారత్‌పై ఉండడం, ఐఎంకు ఇక్కడ పట్టు ఉండటంతో ఈ పరిణామం ఆందోళనకరమని నిఘా వర్గాలు భావిస్తున్నాయి.